నిజామాబాద్

ప్రధాన మంత్రి అవార్డులకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జనవరి 4: ఇ-నామ్, మిషన్ ఇంద్ర ధనూష్ కింద ప్రధాన మంత్రి అవార్డులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ నుండి అడ్మినిస్ట్రేటీవ్ రిఫార్మ్స్ శాఖ అండర్ సెక్రటరీ రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన మంత్రి అవార్డులకు సంబంధించి పలు అంశాలపై ఆయన కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు వివరిస్తూ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇ-నామ్ ద్వారా జిల్లాలో ఆన్‌లైన్ ట్రేడింగ్ కొనసాగుతోందని, అదే విధంగా రైతులకు సంబంధించిన చెల్లింపులను సైతం ఆన్‌లైన్ ద్వారానే అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మిషన్ ఇంధ్ర ధనుష్ టీకాల కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు. పై రెండు విభాగాల్లో ప్రధాన మంత్రి అవార్డులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్‌తో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి క్రీడాకారులకు అభినందన
మోర్తాడ్, జనవరి 4: రోప్ స్కిప్పింగ్ పోటీల్లో జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ పాఠశాలకు చెందిన విద్యార్థులలను ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి, పాఠశాల విద్యా కమిటీలు శుక్రవారం అభినందించాయి. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులకు శాలువాలు కప్పి మెమోంటోలతో పాటుగా నిర్వాహకులు జారీ చేసిన ప్రశంసా పత్రాలను అందజేశారు. 64వ జాతీయ రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పాఠశాలకు చెందిన కే.వైష్ణవి, బీ.ఆకాష్, ఎం.పౌనికలు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ పోటీలు జరిగాయని పాఠశాల పీఈటీ నరేందర్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన తమ విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు రాములతో పాటు గ్రామ కమిటీ సభ్యులు ప్రకాష్‌రెడ్డి, రాజు, ఉపాధ్యాయులు ప్రవీణ్‌శర్మ, శ్రీనివాస్, గంగాధర్, సునీత, సుజాత, స్వప్న తదితరులు అభినందించారు.
నిమిశాంబ ఆలయంలో అన్నదానం
బాల్కొండ, జనవరి 4: మండల కేంద్రమైన బాల్కొండలోని నిమిశాంభ ఆలయంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రతినెల మొదటి శుక్రవారం నిర్వహించే అన్నదానంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన నకాష్ సంఘం, దుర్గాదేవి సేవా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారికి అర్చనలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకాష్ సంఘం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే
డాక్టర్లకు వ్యతిరేకం

కంఠేశ్వర్, జనవరి 4: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 4న ఆలిండియా ప్రొటెస్ట్ డేను నిర్వహిస్తోందని, ఇది ముమ్మాటికీ డాక్టర్లకు వ్యతిరేకమని ఆలిండియా మెడికల్ అసొసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం ఆలిండియా ప్రొటెస్ట్ డేను నిర్వహిస్తుండటంతో ఐఎంఏ , టీఏఎన్‌ఏ సమిష్టిగా ఈ రోజున తమతమ ఆసుపత్రులలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ప్రొటెస్ట్ డే వల్ల మూడు అంశాలలో డాక్టర్లకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఈ బిల్లులు ప్రజలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, దీనివల్ల రోగులకు ఖర్చులు అధికమవుతాయన్నారు. అనంతరం ఐఎంఏ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సవిత, రామ్మోహన్‌రావు, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహోన్నతమైన వ్యక్తి
లూయిస్ బ్రెయిలీ

కంఠేశ్వర్, జనవరి 4: తనతో పాటు ఇతరులకూ బ్రెయిలీ లిపిలో చదువడం, రాయడం నేర్పిన లూయిస్ బ్రెయిలీ మహోన్నతమైన వ్యక్తి అని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని స్నేహ సొసైటీలో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలను అంధ విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 5సంవత్సరాల వయసులోనే రెండు కళ్ల చూపు కోల్పోయిన బ్రెయిలీ అధైర్యపడకుండా అంధులు చదివేలా, రాసేలా చుక్కలతో కూడిన బ్రెయిలీ లిపిని సృష్టించాడని కలెక్టర్ కొనియాడారు. తద్వారా ప్రపంచంలోని అంధులకు ఆయన ఆదర్శంగా నిలిచారని , అయితే శతాబ్దం తర్వాత అంటే 1950లో యునెస్కో దానిని గుర్తించిందని, తద్వారా లూరుూస్ బ్రెయిలీ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. దివ్యాంగుల్లో కూడా నేర్పరితనం ప్రతిభా, సామర్థ్యాలకు కొదువ లేదని, ఇతరులకంటే వారు ఎందులోనూ తీసిపోరనే విషయాన్ని ఇప్పటికే చాలామంది నిరూపించుకోవడం జరిగిందన్నారు. అంధుల పట్ల జాలి, దయకు బదులు, చేయూతనిచ్చి ప్రోత్సహిస్తూ వారిలోని సామర్థ్యాన్ని వెలికితీయడానికి సహాయ, సహకారాలు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని గుర్తు చేశారు. అంధ విద్యార్థుల కొరకు పట్టణంలో రిసోర్స్ సెంటర్‌ను స్నేహ సొసైటీతో ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేస్తున్నామని, ఈ సెంటర్‌లో బ్రెరుూలీ లిపితో ప్రింట్, కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నామనన్నారు. గత నెలలో మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన సదుపాయాల వల్ల ఎక్కువ మంది దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, అంతేకాకుండా మామూలు ఓటర్ల కంటే ఎక్కువ శాతం ఓటింగు నమోదైందని ఆయన అభినందించారు. దివ్యాంగులకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రత్యేకంగా కంప్యూటర్లు, వినికిడి లోపం గల వారికి ప్రత్యేకంగా ఫోన్‌లను సమకూరుస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు లూరుూస్ బ్రెయిలీ చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని అంధ, మానసిక వికలాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే అంధ ఉపాధ్యాయుడైన రాజేశ్వర్, అంధ, మానసిక విద్యార్థులను స్నేహ సొసైటీ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీయస్ పీడీ స్రవంతి, డీఈఓ దుర్గాప్రసాద్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, విద్యార్థినీ , విద్యార్థులు, కుటుంబ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ సమరంలో
మహిళా ఓటర్లే నిర్ణయాత్మకం

నిజామాబాద్, జనవరి 4: నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళా ఓటర్లదే క్రియాశీలక పాత్రగా నిలువనుంది. రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ పదవుల్లోనూ అతివల ప్రాతినిథ్యం సగానికి పైగా పెరుగనుండగా, అభ్యర్థుల జయాపజయాలను కూడా వారే నిర్దేశించనున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 530గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 7,32,920మంది ఓటర్లు ఉన్నట్టు తుది జాబితాను ఖరారు చేశారు. వీరిలో పురుషులు 3,43,430మంది ఉండగా, మహిళా ఓటర్లు 3,89,473మంది ఉండడం విశేషం. రిజర్వేషన్ల వారీగా చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. జిల్లాలో పురుషులతో పోలిస్తే 46,043మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే బీసీ ఓటర్ల సంఖ్య మొత్తం 4,44,772 కాగా, వీరిలో మహిళలు 2,36,864మంది, పురుషులు 2,07,903మంది మాత్రమే ఉన్నట్టు లెక్క తేలింది. ఎస్సీ కేటగిరీలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,24,990కు గాను, మహిళలు 68,158, పురుషులు 56,828మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 69,717మంది ఉండగా, వీరిలో మహిళలు 36,564, పురుష ఓటర్లు 33,152మంది ఉన్నట్టు ఓటరు జాబితా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ.సీ కేటగిరీలో మొత్తం 93,441మంది ఓటర్లలో మహిళా ఓటర్ల సంఖ్య 47,887 ఉండగా, పురుష ఓటర్లు 45,547మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఏ కేటగిరీలోనైనా అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంలో మహిళా ఓటర్లే కీలక పాత్ర పోషించడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్న ఆశావహులు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. మూడు విడతలుగా జరుగనున్న పంచాయతీ పోరులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం విదితమే. దీనిని అనుసరిస్తూ తొలివిడత ఎన్నికలకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. నేపథ్యంలో రిజర్వేషన్లు అనుకూలించిన చోట ఔత్సాహికులంతా ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లా యంత్రాంగం భారీ కసరత్తులు చేపడుతూ ఇప్పటికే రిజర్వేషన్ల జాబితాను ఖరారు చేసింది. మొత్తం 530 సర్పంచ్ స్థానాలతో పాటు 4932వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, వీటిలో సగానికి పైగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. వీటికితోడు జనరల్ స్థానాల నుండి కూడా మహిళలు పోటీకి దిగేందుకు అవకాశం కల్పించడంతో ఔత్సాహికులు బరిలోకి నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఈ లెక్కన పంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా మహిళా ప్రజాప్రతినిధులదే ప్రాతినిథ్యంగా నిలువనుందని స్పష్టమవుతోంది.
మరోవైపు తాము కోరుకున్న స్థానంలో రిజర్వేషన్లు అనుకూలించలేకపోయిన ఆయా పార్టీల నాయకులు, మద్దతుదారులు కూడా మహిళలకు కేటాయించబడిన చోట తమ కుటుంబీకులను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల కోలాహలం ఊపందుకోగా, ఆశావహులు విందు రాజకీయాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటోంది.

భక్తులకు ఏర్పాట్లు పూర్తి
ఇందూర్, జనవరి 4: దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పుర్కసరించి అష్టముఖి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి రవీందర్, తాజామాజీ చైర్మన్ విజయ్‌కుమార్‌గౌడ్‌లు తెలిపారు. శనివారం అమావాస్య రోజున ఇక్కడి అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి, పుష్కరిణి చుట్టు నవధాన్యాలు వేస్తూ ప్రదక్షిణలు చేసి శ్రీ లక్ష్మినర్సింహాస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగిపోయి, అష్టఐశ్వర్యాలు సమకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మ దగ్ధం
కంఠేశ్వర్, జనవరి 4: అనాదిగా వస్తున్న అయ్యప్ప దేవాలయ సాంప్రదాయాన్ని కేరళ సీఎం విజయన్ కాలరాస్తున్నారని ఆరోపిస్తూ హిందూ వాహిణి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిందూ వాహిణి అధ్యక్షుడు ఖమ్మం లక్ష్మణ్ మాట్లాడుతూ, భారతదేశంలో 25లక్షల దేవాలయాలు ఉన్నాయని, ఆరు దేవాలయాల్లో మగవారికి ప్రవేశం లేకపోగా, ఐదు దేవాలయాల్లో ఆడవారికి ప్రవేశం లేదన్నారు. కానీ, కొంతమంది అభ్యుదయవాదులకి మూడు లక్షల మసీదులలో ఒక్క మహిళకు కూడా ప్రవేశం కల్పించకపోయినా వారికి కన్పించకపోవడం దురదృష్టకరమన్నారు. అనాదిగా వస్తున్న అయ్యప్ప దేవాలయ సాంప్రదాయాన్ని భంగపరుస్తూ, హిందువులా మనోభావాలను దెబ్బతీసే విధంగా కేరళ ముఖ్యమంత్రి విజెయన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే కేరళ సీఎం విజయన్ అయ్యప్ప భక్తుల మనోభావాలను గుర్తించాలనీ, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిణి నాయకులు అనీష్‌రాజ్, రాజశేఖర్, వినయ్, అయ్యప్ప మాలాధారులు పాల్గొన్నారు.