నిజామాబాద్

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై సందేహాలు లేకుండా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఫిబ్రవరి 15: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై ఎలాంటి సందేహాలు, అపోహలు ఉండకుండా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ నిర్వహించిందని కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జనహిత భవన్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించే వివిప్యాట్, ఈవిఎంలపై ఫస్ట్ లెవల్ చెకప్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగిందన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా 5 శాతం ఓట్లను రెండు శాతం పనె్నండు వందల ఓట్లతో రెండు స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చనున్నట్లు వెల్లడించారు. ఈనెల 16, 17 తేదీల్లో ఈవీఎం యంత్రాలపై స్థానిక శాసనసభ్యులు, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల సమక్షంలో 10 శాతం పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 786 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో మాక్ పోల్‌ను నియోజక వర్గాల వారిగా ఎన్నికల రోజు మొదటి గంటలో ప్రజాప్రతినిధులు సమక్షంలో పారదర్శంగా ఎన్నికల నిర్వహణ చేస్తామని అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ 2019 (ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా) ప్రకారం తేది 1-1-2019 నాటికి కొత్తగా 53,152 మంది ఓటర్ల నమోదు చేయబడ్డారని అన్నారు. శాసనసభ ఎన్నికల తేది 10-11-2018 నాటికి 5లక్షల 77 వేల 736 మంది ఓటర్లు నమోదు కాబడ్డారని అన్నారు. కొత్త ఓటర్ల జాబితాను కలుపుకుని జిల్లాలో 22-01-2019 నాటికి 6 లక్షల 27 వేల 967 మంది ఓటర్లు ఉన్నారని, సప్లమెంటరీ నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తామని అన్నారు. జుక్కల్ సెగ్మెంట్‌లో 12,780, ఎల్లారెడ్డిలో 15,109, కామారెడ్డిలో 25,203 మంది కొత్త ఓటర్ల నమోదు జరిగిందన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం నామినేషన్ చివరి తేది వరకు కూడా స్వీకరిస్తామని అన్నారు. జనవరి 22, 2019 అనంతరుం ఓటర్ యొక్క పేరును తొలగించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగాచర్యలు తీసుకుంటారని అన్నారు. ఓటర్ల యొక్క తొలగింపు 0.9 శాతం కంటే ఎక్కువ ఉంటే ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశానుసారం తొలగించడం జరుగుతుందని అన్నారు. తుది జాబితాలో నియోజక వర్గాల వారిగా జుక్కల్‌లో ఒక లక్ష 77 వేల, 58 మంది ఓటర్లు, 84 సర్వీస్ ఓటర్లు, ఎల్లారెడ్డిలో 1లక్షల 95 వేల 49 మంది ఒటర్లు, 134 సర్వీస్ ఓటర్లు, కామారెడ్డిలో 2 లక్షల 5 వేల 686 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ఓటర్లకు ఎటువంటి సందేహాలు కల్గిన 08468-1950కు డయల్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జేసీ యాదిరెడ్డి, ట్రైనీ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఉన్నారు.

ఉత్తర తిరుమల క్షేత్రం ప్రతిష్ఠాపన
కంఠేశ్వర్, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేజ్-2లో గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో అనఘా దత్తజ్ఞాన బోధ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉత్తర తిరుమల క్షేత్రాన్ని వేదమంత్రోచ్ఛరణలతో గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య కరకమలములచే ప్రతిష్ఠించడం జరిగింది. విగ్రహాన్ని ప్రతిష్టించగానే భక్తులు ఏడు కొండలవాడ వెంకటరమణ - ఆపద మొక్కుల వాడ గోవిందా, గోవిందా అనే నినాదాలు ఆలయంలో మారుమ్రోగింది. విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు తెల్లవారుజామున 5.30గంటలకు ఆలయంలో విష్వక్సేనపూజ, పుణ్యహవాచనం, 6.30గంటలకు రత్నవాస, యంత్ర ప్రతిష్ట, 7.30గంటలకు బింబస్థాపనకు సన్నద్ధం, 8.10నిమిషాలకు బింబస్థాపన, 10.00గంటలకు యాగశాలలో హోమం, పూర్ణాహుతి, 11.30గంటలకు జీవకళాన్యాసము, కుంభాభిషేకం, 12.30 ప్రథమార్చన, నివేదన, గోదర్శనము, నీరాజనము, 1గంటకు కుంభంతో ఆలయ ప్రదక్షిణ, ప్రవేశము, భక్తులకు మహాదర్శనము కల్పించారు. 1.30గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 6గంటలకు స్వామీజి ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. రాత్రి 8గంటలకు స్వామిజీ భక్తులతో మాట్లాడుతూ, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల కష్టాలు తీర్చడానికి అవతరించాడని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్నాడని, పంటలు సమృద్ధిగా పండేటట్లు చూస్తున్నాడని అన్నారు. కాబట్టి ప్రజలు వింత పోకడలకు పోకుండా నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లైతే మోక్షం లభిస్తుందన్నారు. రాత్రి 9గంటలకు ఆశ్రమంలో అన్నప్రసాదాలను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సంపత్‌కుమార్, డైరెక్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పుల్వామా అమరవీరులకు
కొవ్వొత్తుల నివాళి
ఇందూర్, ఫిబ్రవరి 15: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీల ఆధ్వర్యంలో నగరంలోని గాంధీచౌక్‌లో గల అమరవీరుల స్థూపం నుండి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో త్రివర్ణ పతాకాలను, కొవ్వొత్తులను చేతబూనిన యువకులు, జై జవాన్, జోహార్లు కశ్మీర్ అమరవీరులకు, పాకిస్తాన్ ముర్ధాబాద్ అంటూ యువకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా మాట్లాడుతూ, భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం ఉగ్రవాదులు, సీపీఆర్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత్ సర్కార్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు బంటు రాముతో పాటు వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నాయకులు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలో...
ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలో శుక్రవారం రాత్రి 6గంటలకు యువకులు, గ్రామస్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కశ్మీర్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జానకంపేట్ గ్రామంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద రెండు నిమిషాలు వౌనం పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో...
ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘన నివాళులు అర్పించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దకూరి సాయిబాబ తెలిపారు. నగరంలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి కౌశల్ యోజన కేంద్రంలో ఇందూర్ యువత అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఏర్పాటు చేయగా, 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ, సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలగం తిరుపతిరావు, పీఎంకేవైసీ ఈవో వాసుదేవ్‌తో పాటు ఇందూర్ యువత కార్యదర్శి ప్రసాద్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండలో...
బాల్కొండ: కాశ్మీర్‌లో వీరజవాన్లపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. మెండోర మండలం పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ల ఆత్మ శాంతించాలని కోరుతూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అమరులైన జవాన్ల కోసం నివాళులర్పించారు. ముప్కాల్ మండల కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రెండు నిమిషాలు వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
నిజాంసాగర్ మండలంలో...
నిజాంసాగర్: మండలంలోని అచ్చంపేట్, నర్వ గ్రామాలలో, శుక్రవారం రాత్రి, ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలోమృతి చెందిన 44 మంది వీర జవాన్ల ఆత్మ శాంతి కోసం, యువకులు,ప్రజలు క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. అంతకు మందు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. క్రొవ్వత్తులు తీసుకుని వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, దాడులకు పాల్పడిన జైషే మాహ్మద్ సంస్థలతోపాటు ఇతర సంస్థలను కూకటి వేళ్లతోతుద ముట్టించాలని నినాదాలు చేశారు. ఈర్యాలీలో నర్వ , అచ్చంపేట్ గ్రామాల సర్పంచ్‌లు సంగవ్వ రాములు, అనసూయ సత్యనారయణలు, పురోహితులు సంజీవ్‌శర్మ, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్, సుభాష్‌గౌడ్, ఎల్లయ్య, రమేష్, రాములు, శ్రీనివాస్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులను పరిగెత్తించిన కారుమబ్బులు
మోర్తాడ్, ఫిబ్రవరి 15: పంట చేతికి అందినా, అమ్ముకునే అవకాశం లేకపోవడంతో పంట పొలాల్లోనే నిల్వ ఉంచిన ఎర్రజొన్నలను కాపాడుకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి విపరీతమైన వేగంతో గాలులు వీస్తూ కారుమబ్బులు కమ్ముకు రావడంతో రైతులు పంట పొలాల వైపు పరుగులు తీస్తూ కనిపించారు. ఎక్కడికక్కడ ఎర్రజొన్నలను నూర్పిడి చేసి ఉంచారు. కొందరు పంట పొలాల్లోనే అరబెట్టుకోగా మరికొందరు ఎండిన ఎర్రజొన్నలను బ్యాగుల్లో నింపుకొని అక్కడే నిల్వ చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కారుమబ్బులు వచ్చి చినుకులు ప్రారంభం కావడంతో పరుగులు పెట్టిన రైతులు వాటిపై తార్పాలిన్ కవర్లు కప్పారు. ఎటుచూసిన కవర్లు కప్పిన కుప్పలే దర్శనమిచ్చాయి. ఎర్రజొన్నలు పూర్తిగా ఎండిపోయాయని, వర్షం కురిస్తే పండిన పంట నీళ్ల పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటసేపు అటు ఈదురుగాలులు, ఇటు తేలికపాటు చినుకులు కురియడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తర్వాత మబ్బులు మాయమై ఎండకాయడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు ధాన్యాన్ని మాత్రం కవర్ల క్రింద భద్రపర్చుకున్నారు.

సమస్యలు త్వరగా పరిష్కారమై ఎర్రజొన్నలు అమ్ముడుపోతే ఈ ఆందోళన ఉండదని రైతులు అంటున్నారు. ఎర్రజొన్నలతో పాటు పసుపు పంట పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. ఎర్రజొన్నలను ప్లాస్టిక్ కవర్లలో ఆరబెట్టినప్పటికీ ఉడకబెట్టిన పసుపును మాత్రం శుభ్రం చేసి నేలపైనే ఆరబెట్టుకున్నారు. పసుపును కూడా కవర్ల క్రింద నిల్వ ఉంచడానికి రైతులు పడ్డ శ్రమ అంతాయింత కాదు.

మహిళా సంఘాలు
ఆర్థిక అభివృద్ధి సాధించాలి
భీమ్‌గల్, ఫిబ్రవరి 15: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళ సంఘాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని భీమ్‌గల్ ఐకేపీ ఏపీఎం పద్మయ్య సూచించారు. భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్ గ్రామంలో శుక్రవారం గ్రామ మహిళ సంఘాలకు స్ర్తినిధి రుణాలు 40లక్షలు, బ్యాంక్ రుణాలు 2కోట్ల రూపాయలు మహిళ సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం పద్మయ్య మాట్లాడుతూ, భీమ్‌గల్ మండలంలో పురాణిపేట్ గ్రామ మహిళ సంఘాలు రుణాలు చెల్లించడంలో ఏ గ్రేడ్‌లో ఉన్నాయని, ఇతర మహిళ సంఘాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్ర్తినిధి రుణాలు రాని గ్రూపులకు త్వరలో రుణాలు వచ్చే విధంగా చూస్తామన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు సైతం గ్రామంలోని మరిన్ని గ్రూపులకు త్వరలో పంపిణీ చేయనున్నామని అన్నారు. రుణాలు పొందిన మహిళ సంఘాలు ఆర్థికంగా ఎదిగి, తిరిగి రుణాలను చెల్లించి ఇతర సంఘాలకు రుణాలు వచ్చే విధంగా సహకరించాలని ఆయన కోరారు.