నిజామాబాద్

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఫిబ్రవరి 22: మండల కేంద్రమైన బాల్కొండలో శుక్రవారం అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ సునీత నరహరి, తహశీల్దార్ వెంకటయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేష్‌లు 19మందికి కల్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంజూరీ చేయించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ వాహబ్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు విద్యాసాగర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు లింగాగౌడ్, కోఆప్షన్ సభ్యుడు షహీద్, తెరాస నాయకులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

బడ్జెట్ కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు

నిజామాబాద్, ఫిబ్రవరి 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ బడ్జెట్‌లోనూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనమంటూ ఏదీ కనిపించడం లేదని ప్రతిపక్షాలు పెదవి విరుస్తుండగా, సాగు, సంక్షేమ రంగాలకు ఇతోధికంగా ఊతమందించిన బడ్జెట్‌గా తెరాస శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకటి తరహాలోనే ఆయా రంగాలకు ఈసారి కూడా భారీగానే కేటాయింపులు జరిపినప్పటికీ, ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చే అంశాలు ప్రస్తావనకు నోచుకోకపోవడం పలువురిని నిరుత్సాహపర్చింది. ఉమ్మడి జిల్లా నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తెరాస తరఫునే ప్రాతినిథ్యం వహిస్తున్నందున బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు పెద్దఎత్తున నిధులు దక్కుతాయని ప్రజలు ఆశించగా, అలాంటిదేమీ లేకుండాపోయిందని విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. అయితే ఇది ముమ్మాటికీ ప్రజామోద బడ్జెట్ అని అధికార తెరాస పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సాగునీటి రంగంతో పాటు వ్యవసాయం, తాగునీరు, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులను కేటాయించారని చెబుతున్నారు. అన్ని వర్గాల వారికి ఊతమందించేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని కొనియాడుతున్నారు. కాగా, నీటిపారుదల రంగానికి 22,500 కోట్ల రూపాయలను కేటాయించినప్పటికీ, అందులో నిజామాబాద్ జిల్లాకు ఎంతమేర వాటాను సమకూరుస్తారనేది తేలాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత-చేవేళ్ల పథకంలోని 20, 21, 22వ ప్యాకేజీ పనులకు పెద్దఎత్తున నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మేర నిధులు ఖర్చు చేయాలని ఇప్పటికే నిర్ణయించడంతో ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాకే సత్వర లబ్ధి చేకూరుతుందని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, వ్యవసాయ శాఖకు భారీగా 20,107 కోట్లు కేటాయించారు. రైతు బీమాకు 650 కోట్లు, రైతుబంధు ముందస్తు పెట్టుబడి అందించేందుకు 12వేల కోట్ల రూపాయలను, రైతు రుణ మాఫీ కోసం 6వేల కోట్లను బడ్జెట్‌లో పొందుపర్చారు. ఇవి వ్యవసాయాధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఆశిస్తున్నారు. రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరానికి పది వేల రూపాయలకు పెంచనుండడం అన్నదాతకు మరింత చేయూతను అందించనుంది. అయితే ఈసారి కూడా రైతుల రుణ మాఫీని ఒకే విడతలో చేపట్టకుండా విడతల వారీగానే మాఫీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున రైతులకు ఒనగూరే ప్రయోజనం శూన్యంగానే మారుతుందని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఇది మినహా సేద్యానికి నిరంతరాయంగా 24గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించడం తదితర అంశాలు అన్నదాతకు ఊరటనందించనున్నాయి. ఇదిలాఉండగా, జిల్లాలోని తెలంగాణ యూనివర్శిటీకి మరిన్ని హంగులు సమకూరాలంటే కనీసం మరో వంద కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉండగా, అన్ని విశ్వవిద్యాలయాలకు కలుపుకుని వౌలిక సదుపాయాల కల్పన కోసం అరకొరగానే నిధులను కేటాయించారు. ఇందులో తెలంగాణ వర్శిటీ వాటా 30కోట్ల రూపాయలకు మించి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల పరంగా నిజామాబాద్ జిల్లా ఎంతో వెనుకబడి ఉన్న తరుణంలో ఈ రంగానికి అరకొర నిధులు కేటాయించడంతో ఈసారి కూడా జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కనున్నాయని నిరుద్యోగులు నిట్టూర్పు విడుస్తున్నారు. కాగా, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే పెద్దఎత్తున నిధులు ఖర్చు చేసిన దరిమిలా, ఏప్రిల్ నెలాఖరు నాటికి ఇంటింటికి శుద్ధి జలాలు అందిస్తామని చేసిన ప్రకటన నిర్దిష్ట గడువులోగా కార్యరూపం దాలిస్తే లక్షలాది కుటుంబాలకు ఎంతో ఊరట లభించనుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి కూడా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు వీలుగా బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఊరటనందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి సముచిత ప్రాధాన్యత కల్పించడంతో పాటు గతేడాది తరహాలోనే ఈసారి కూడా ఎంబీసీ కార్పొరేషన్‌కు వేయి కోట్లను కేటాయించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓ టాన్ అకౌంట్ బడ్జెట్ అధికార పక్షాన్ని ఆకట్టుకోగా, ప్రతిపక్షాలు మాత్రం నిరాశాజనకమైన బడ్జెట్‌గా అభివర్ణించాయి.

ఛలో హైదరాబాద్
పోస్టర్ల ఆవిష్కరణ
ఇందూర్, ఫిబ్రవరి 22: గత సంవత్సరం గ్రామపంచాయతీ కార్మికులు 33రోజుల పాటు చేపట్టిన సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 25న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని సీఐటీయు కార్యాలయంలో జీపీ కార్మికుల సమావేశాన్ని నిర్వహించగా, ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాల అమలుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 33రోజుల పాటు సమ్మె చేయడం జరిగిందన్నారు. కార్మికుల సమ్మెతో దిగివచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, నెలకు 8500రూపాయలకు తగ్గకుండా వేతనం చెల్లిస్తామని ప్రకటించడం జరిగిందని, దానిని ఆధారంగా జిల్లా కలెక్టర్లు, డీపీఓలు సీఎం ప్రకటించిన వేతనాల చెల్లింపునకు తాము బాధ్యత తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సీఎం ప్రకటించిన వేతనాలు గత సంవత్సరం సెప్టెంబర్ నుండే చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతన పెంపుదల జీవోను విడుదల చేయాలని, సమ్మెకాలపు వేతనాలతో పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలనే తదితర డిమాండ్లతో ఫిబ్రవరి 25న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఫిబ్రవరి 25న ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుందని, అందువల్ల జీపీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి సూర రవి, మదర్, దుర్గయ్య, సాయిలు, భూమయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

దైవభక్తిలేని మానవ జన్మ వృధా

మాక్లూర్, ఫిబ్రవరి 22: దైవభక్తి లేని మానవ జన్మ వృధా అని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామిజీ అన్నారు. ప్రాణకోటిలో మానవజన్మ అత్యున్నతమైందని, ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరు దైవభక్తితో పాటు సామాజిక సేవ వంటి మంచి సద్గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. శుక్రవారం మాక్లూర్ మండలం మామిడిపల్లి శివారులోని అపురూప వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపకురాలు అమృతలత ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షిక బ్రాహ్మహోత్సవాలకు స్వామిజీ హాజరై విఘ్నాలు తొలగించారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం, గరుడ సేవ వంటి భక్త కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చినజీయర్‌స్వామిజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో అశాంతి, ఉగ్రవాదం పెరిగిపోవడానికి కారణం ప్రజల్లో దైవభక్తి కొరవడటమేనని అన్నారు. కులం, మతం అనే భేదాభీప్రాయాలు పెరిగిపోయి అశాంతి నెలకొంటుందని, వీటన్నింటిని రూపుమాపలంటే దైవభక్తి ఏకైక మార్గమన్నారు. అందుకు తల్లిదండ్రులు వారివారి పిల్లలను దైవచింతనతో పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు పెంట బాబు, రాజ్, రమణారెడ్డి, సురేందర్‌రెడ్డితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.