నిజామాబాద్

హరితహారం పనులు పరిశీలించిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డిరూరల్, మార్చి 1: హరితహారంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఇల్చిపూర్ గ్రామ సరిహద్దులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ పరిశీలించారు. ఈసందర్భంగా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్న కూలీలతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరము అక్కడ నాటిన మొక్కలకు కలెక్టర్ నీరు వాటర్‌డేను పురస్కరించుకుని నీరు పోశారు. కలెక్టర్‌తో పాటు డిఆర్‌డిఎ పీడి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఇతర సంబందిత శాఖల అధికారులు ఉన్నారు.

కలవరపెడుతున్న కలుషిత నీరు

బాన్సువాడ రూరల్, మార్చి 1: బాన్సువాడ డివిజన్ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కలుషిత నీటి సరఫరాతో ప్రజారోగ్యం గాడితప్పుతోంది. అధికారులు తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వ్యాధులు మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న వారికంటే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. నియోజకవర్గంలోని బీర్కూర్, కోటగిరి, వర్ని, రుద్రూర్ మండలాలతో పాటు జుక్కల్ సెగ్మెంట్‌లోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం తదితర మండలాల్లో సీజనల్ వ్యాధులు ప్రజలను కోలుకోనివ్వడం లేదు. ప్రతీ నివాస ప్రాంతంలో కనీసం కుటుంబానికొకరు చొప్పున మంచానపడి కనిపిస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వారు వైద్యం చేయించుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, పేద కుటుంబాల వారు సర్కారీ దవాఖానాలనే నమ్ముకుంటూ బాన్సువాడలోని ఏరియా ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రతిరోజు కనీసం 300మందికి పైగా ఔట్ పేషెంట్లు ఈ ఆసుపత్రిని సందర్శిస్తున్నారంటే ఈ డివిజన్‌లో పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రజలకు తాగునీటిని అందించే పైపులైన్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు కలుషితమై వ్యాధులు ప్రబలుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. పల్లెల్లో ఈ పరంపర కొనసాగుతూనే ఉండగా, వ్యాధుల తీవ్రతను అదుపు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. అతిసార వ్యాధి ప్రబలేందుకు కలుషిత తాగునీరే కారణమని గుర్తించినప్పటికీ, ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన బాన్సువాడలోని పలు కాలనీల్లో సైతం ఇంకనూ మిషన్ భగీరథ కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో పాత పైప్‌లైన్ల ద్వారానే మంచినీరు సరఫరా అవుతోంది. అయితే అక్కడక్కడా పైప్‌లైన్ల లీకేజీలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా యంత్రాంగం తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేస్తున్నా ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. ప్రధానంగా పలు పంచాయతీల కార్యదర్శులు తాగునీటి సరఫరా విషయంలో తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సీజన్ ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి ఉండగా, ఎండలు తీవ్రతరం అయిన మీదట సీజనల్ వ్యాధులు మరింతగా ముప్పిరిగొనే ప్రమాదం ఉంటుందని గ్రామీణ ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. వాస్తవంగానే మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పల్లె వాసులకు తాగునీటి సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండడంతో బోరుబావులు, చేతిపంపుల నుండి విడుదలవుతున్న నీటినే సేవిస్తున్నారు. సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామ పంచాయతీ శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
బాన్సువాడ నియోజకవర్గంలో తాగునీటి సదుపాయాల కల్పనపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేయడం జరిగింది. సమస్యలను నిర్లక్ష్యం చేయరాదని, ప్రజలకు కావల్సిన వౌలిక సదుపాయాల కల్పనలో అశ్రద్ధ కనబరిస్తే బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారుల పనితీరులో మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి తమ ఆరోగ్యాలను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

రైతుల రక్తం పీల్చే రాబందు కేసీఆర్

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, మార్చి 1: రైతు బాంధవుడిగా గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు, రైతుల రక్తం పీల్చే రాబందువులా మారారని ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎం.పీ మధుయాష్కీ ఆక్షేపించారు. మద్దతు ధర కోరుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా పసుపు, ఎర్రజొన్న రైతులు నిరసన కార్యక్రమాలు చేపడితే, అధికారంలో ఉన్నామనే అహంకారంతో కేసీఆర్ సర్కార్ అన్నదాతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ జైళ్లలో నిర్బంధిస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లా కాంగ్రెస్ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతాంగ సమస్యలను పెడచెవిన పెడుతున్న అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను తిరగనివ్వకూడదని, మద్దతు ధరపై ప్రశ్నిస్తూ ఎక్కడికక్కడ నిలదీయాలని మధుయాష్కీ రైతులకు పిలుపునిచ్చారు. బాధ్యత గల ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తుందని, కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతామని భరోసా కల్పించారు. దేశంలోనే అత్యధికంగా ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల రైతులు పసుపు పంటను సాగు చేస్తారని, వారికి వెన్నుదన్నుగా నిలువాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తూ మద్దతు ధర కోసం రోడ్డెక్కితే పోలీసులచే నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు. రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా, జిల్లాకు చెందిన తెరాస ఎం.పీ కవిత, ఇతర ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతేడాది ఎర్రజొన్న పంటను కొనుగోలు చేసిన టీఆర్‌ఎస్ సర్కార్, ఈసారి రైతుల డిమాండ్‌ను అసలేమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, దీంతో అధికార పార్టీ నేతలు మధ్య దళారులతో కుమ్మక్కయ్యారనే అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. అదేవిధంగా పసుపు రైతులకు కనీసం పది వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించడంలోనూ తెరాస ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో పసుపు పార్కును సాధిస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన ఎం.పీ కవిత కేవలం మాటలకే పరిమితం అయ్యారని, పతంజలి పరిశ్రమల పేరుతో హంగామా చేసి చేతులు దులుపుకోవడం, 30కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయదల్చిన స్పైస్ పార్క్ పనులు గోడలకే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని యాష్కీ ఎద్దేవా చేశారు. కనీసం పెట్టుబడులు సైతం రాబట్టుకోలేని స్థితిలో కడుపు మండిన రైతులు మద్దతు ధర కోసం రోడ్డెక్కితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ తెరాస సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని యాష్కీ దుయ్యబట్టారు. తక్షణమే ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వపరంగానే పంటను కొనుగోలు చేయాలని, పసుపు పంటకు క్వింటాలుకు కనీసం 10వేల రూపాయల మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది స్థానాల్లో తెరాసను గెలిపించినందుకైనా ఈ ప్రాంత రైతుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని యాష్కీ పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నాయకులు మీసాల సుధాకర్, కరీముద్దీన్ కమాల్, రాంభూపాల్, మోతీలాల్, దయాకర్, బొబ్బిలి రామకృష్ణ, బబ్బూ తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని
రోడ్డెక్కిన తండావాసులు

ఎల్లారెడ్డి, మార్చి 1: డివిజన్ పరిధిలోని హాజీపూర్ తాండకు చెందిన, బానోత్ సవాయిసింగ్, బూలిబాయి నీటిమునిగి మృతి చెందడానికి, కారణమైన సడక్‌తాండ ఆయిల్ కుంటలో, మొరం త్రవ్వడంతోఏర్పడిన గుంతల కారణంగా మృతి చెందిన కుటుంబానికి, న్యాయం చేయాలంటూ, శుక్రవారం హాజీపూర్ తాండా వాసులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తాండావాసులు మాట్లాడుతూ, కట్టకింద తాండ సమీపంలోవంతెన నిర్మాణం కోసం కావల్సిన మొరం కొరకు సదరు కాంట్రాక్టర్ ఆయిల్ కుంటలో జేసీబీతో ఇష్టం వచ్చని విధంగా త్రవ్వడంతోనే, ఇట్టి గుంతలోనీరు (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
నిల్చిందని, గెదెలకు నీటిని త్రాగించే క్రమంలోప్రమాద వశాత్తుగా ఇద్దరి నిండుప్రాణాలు బలిగొందని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక నాయకులు తాండవాసుల వద్దకు చేరుకుని వారితోమాట్లాడి సమస్య పరిష్కరించేలా సముదాయించడంతోతాండావాసులు ఆందోళన విరమించారు.

కామారెడ్డి
పరీక్షా కేంద్రాల్లో
కలెక్టర్ తనిఖీ
కామారెడ్డి, మార్చి 1: జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీకళాశాలలో జరుగతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ శుక్రవారం ఆకస్మీక తనిఖీ చేశారు. సైలెంట్‌గా పరీక్ష కేంద్రానికి వెళ్లిన ఆయన ముందుగా దూరం నుండి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరము పరీక్ష కేంద్రంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజర్ అయ్యింది రిజిస్టర్‌లను పరిశీలించారు. అనంతరము కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల మూడవ రోజు 9,263మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
337మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజర్ కాగా 8,926మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. అలాగే వోకేషనల్ కోర్సుల్లో 862మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 87మంది గైర్హాజర్ కాగా 775మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని వెల్లడించారు. పరీక్షల్లో కాపియింగ్‌కు చోటు లేకుండా పగడ్భంది ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సిట్టింగ్‌స్వ్కాడ్స్, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్నారని అన్నారు.