నిజామాబాద్

గులాబీ నేతల్లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 19: ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం అన్న చందంగా ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న అధికార పార్టీ నేతలకు తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులోనూ రికార్డు స్థాయి మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం మరింత ఉత్సాహాన్ని అందించింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం అధికార పక్షంగా అవతరించిన తెరాస పార్టీ, తదనంతరం జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ వరుస విజయాలను నమోదు చేస్తుండడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ చతికిలపడగా, గడిచిన 22మాసాల నుండి తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలోనూ తెరాసదే ఆధిపత్యంగా కొనసాగుతూ వస్తుండడం తెరాస జోరును చాటుతోంది. తాజాగా, అసలేమాత్రం బలం లేని ఖమ్మం జిల్లాలో తుమ్మల చేరికతో బలీయమైన శక్తిగా అవతరించి పాలేరు ఉప ఎన్నికలో ఘన విజయాన్ని నమోదు చేయడాన్ని తెరాస శ్రేణులు ఎంతో ప్రత్యేకతగా ప్రస్తావిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటలా నిలిచే ఖమ్మం జిల్లాలో తెరాస ఎంతో సునాయసంగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఆ పార్టీ ప్రాబల్యాన్ని చాటినట్లయ్యింది. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలే అయినప్పటికీ, అక్కడ నమోదవుతున్న విజయాల పరంపరతో నిజామాబాద్ జిల్లాలోని తెరాస శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. జిల్లాలో నెలకొని ఉన్న సమీకరణాలు బట్టి చూస్తే, ఇప్పటికే అందనంత ఎత్తులో ఉన్న అధికార పక్షాన్ని నిలువరించే పరిస్థితి లేక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు సహా ప్రతిపక్షాలన్నీ డీలాపడిపోతున్నాయి. టిడిపి, బిజెపి పార్టీల్లోనైతే పూర్తిగా నైరాశ్యం అలుముకుని కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలను వలసల పర్వం మరింత డీలాపడేలా చేస్తోంది. వలసల కారణంగానే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన హేమాహేమీలుగా చెలామణి అయిన నేతలంతా పరిస్థితులు అనుకూలించక స్తబ్ధంగా వ్యవహరిస్తుండగా, పాలకపక్షమైన తెరాస నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు అడపాదడపా తెరాస ప్రభుత్వ పాలనా తీరును ఎండగట్టేందుకు విమర్శల పర్వానికి దిగుతున్నప్పటికీ, పాలక పక్ష నేతలు వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ ప్రజాప్రతినిధులదే పూర్తిస్థాయిలో ఆధిపత్యం కొనసాగుతోంది. కాంగ్రెస్, టిడిపిల తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రాజేశ్వర్‌రావు, వి.గంగాధర్‌గౌడ్‌లతో పాటు దాదాపు పాతికేళ్ల పాటు కాంగ్రెస్‌లో ప్రస్థానం కొనసాగించి కీలక పదవులు నిర్వర్తించిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ కూడా గులాబీ గూటికి చేరడంతో ఈ జిల్లాలో తెరాస తిరుగులేని బలాన్ని సొంతం చేసుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌ల పరంగా చూసినా అధికార పార్టీదే పై చేయిగా ఉంది. 22నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాన్ని పక్కనబెడితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటూ తెరాస నేతలు ప్రజల నమ్మకాన్ని మరింతగా చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు రుణాల మాఫీ, పెన్షన్ల పంపిణీ, బీడీ కార్మికులకు జీవన భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు వంటి కార్యక్రమాలను జిల్లాకు అన్వయించుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించిన తెరాస అధికారంలో కొనసాగుతుండడంతో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ముఖ్య నేతలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, వలసల పర్వం ఇంకా కొన‘సాగు’తూనే ఉంది.