నిజామాబాద్

అంబరమంత సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 2: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిఫలింజేశాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలు మొదలుకుని ర్యాలీ, ఇతరాత్ర అన్ని అంశాల్లోనూ తెలంగాణ ప్రాంత విశిష్టతలను చాటిచెప్పేలా కార్యక్రమాలు జరిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ముఖ్య కూడళ్లను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం 8గంటల నుండి మొదలైన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందడి రాత్రి 11గంటల వరకు కొనసాగింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానం, పోలీస్ పరేడ్ గ్రౌండ్, రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేద్కర్ భవన్‌లు ఈ సంబరాలకు వేదికలుగా నిలిచాయి. సాయంత్రం సమయంలో మానిక్‌భవన్ పాఠశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, కళాకారులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలు ఇస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా, ఆయనతో పాటు జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జె.సి ఇతర అధికారులు, అన్ని సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. చిందు, ఒగ్గు, బుర్రకథ, జానపద, హరిదాసు, పోతరాజులు, యక్షగానం, హరిదాసులు, డప్పు, వాద్య కళాకారులు తదితర విభాగాలకు చెందిన వారంతా ఆటపాటలతో హోరెత్తించారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో నెహ్రూపార్క్ నుండి గాంధీచౌక్, ఆర్‌పి.రోడ్, బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్‌ల మీదుగా కలెక్టరేట్ వరకు కళాకారుల ర్యాలీ కొనసాగింది. నెహ్రూపార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని సర్వమత ప్రార్థనలు చేయించారు. ర్యాలీలో సుమారు వంద మంది వరకు కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ డప్పు వాయిద్యాల నడుమ వాటి చప్పుళ్లకు అనుగుణంగా ఎంతో లయబద్ధంగా పాదాలు కదుపుతూ, వివిధ హావభావాలను పలికిస్తూ గుండెల నిండా తెలంగాణవాదాన్ని నింపుకుని ప్రదర్శనగా ముందుకు సాగగా, కళాకారుల ర్యాలీ, ప్రదర్శనను తిలకించిన ప్రజలు తన్మయత్వానికి లోనయ్యారు. కళాకారుల వెంట ఉద్యోగ జెఎసి నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు సైతం ర్యాలీలో పాల్గొన్నారు. అదనపు జెసి రాజారాం, ఆర్డీఓ యాదిరెడ్డి, తహశీల్దార్ రాజేందర్‌తో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలాఉండగా, సాయంత్రం 7గంటల నుండి రాత్రి 10.30గంటల వరకు కలెక్టరేట్ గ్రౌండ్‌తో పాటు రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణ జయభేరి, పేరణి తెలంగాణ శాస్ర్తియ నృత్యం, తెలంగాణ ధూంధాం, నమస్తే ఇండియా, తెలంగాణ అవతరణ నృత్యరూపకం, తెలంగాణ సుద్దులు, పంజాబి భాంగ్రా నృత్యం, తెలంగాణ ధూంధాం, చిందు యక్షగానం, బుర్రకథ, జానపద విభావరి, పేరడి గేయాలు, చిరుతల రామాయణం, మహిషాసుర మర్థిని నాటక ప్రదర్శన, నవతెలంగాణ - బంగారు తెలంగాణ అనే అంశంపై నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముస్లిం మైనార్టీల కోసం ముషాయిరా, ఖవ్వాలి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల సందర్భంగా నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థలు విద్యుద్దీపాల కాంతులతో నగరానికి కొత్త శోభను చేకూర్చాయి. సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభానికి సంకేతంగా కలెక్టరేట్ గ్రౌండ్ వద్ద సాయంత్రం 7.30గంటల సమయంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. కాగా, ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరంతరం తనిఖీలు కొనసాగించారు.