నిజామాబాద్

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 18: జిల్లాలో అనుమతి కలిగిన క్వారీల నుండి సైతం ఇసుకను తరలించే విషయంలో నిబంధనలు పక్కాగా అమలయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి మండలాల్లోని పట్టా భూములు కలిగి ఉన్న తొమ్మిది క్వారీల నుండి ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అయితే ఈ అనుమతుల మాటున యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నిర్ణీత సామర్థ్యానికి మించి ఎక్కువగా ఇసుకను వాహనాల్లో లోడ్ చేయడం, ఒకే పర్మిట్‌పై ఎక్కువ ట్రిప్పులు చేయడం, ప్రభుత్వ పనుల పేరుతో పక్కదారి పట్టించడం, అనుమతులు పొందిన ప్రదేశానికి బదులుగా మరో ప్రాంతంలో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తుండడం వంటి వ్యవహారాలు జరుగుతున్నట్టు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చింది. అన్నింటికి మించి సాయంత్రం ఆరు గంటల్లోపే ఇసుక తవ్వకాలు జరపాలని నిబంధనలు సూచిస్తున్నప్పటికీ, వాటికి తిలోదకాలిస్తూ రేయింబవళ్లు బాహాటంగానే ఇసుకను తోడుతూ వందలాది వాహనాల్లో హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువ ట్రిప్పులు చేయాలనే ఆదుర్దాతో వాహనాలను అతివేగంగా నడిపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. రెండు రోజుల క్రితమే వర్ని మండలం అక్బర్‌నగర్ వద్ద ఇసుక లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ యోగితారాణా శనివారం తన చాంబర్‌లో ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అనుమతి పొందిన క్వారీలలోనూ పరిమితికి లోబడే ఇసుక తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు తేలితే, ఎంతమాత్రం ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘన వల్ల నిర్ణీత పరిమాణానికి మించి ఇసుకను తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తుచ తప్పకుండా నిబంధనలు పాటించేలా చూడాలని, నిర్ణీత వేళల్లోనే ఇసుక తవ్వకాలు జరిపేలా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామర్థ్యానికి మించి ఇసుక రవాణా జరుగకుండా నిఘాను కొనసాగించాలన్నారు. ప్రతి పక్షం రోజులకు ఓసారి జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీలు నిర్వహించాలని, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని పరిస్థితులను కూలంకశంగా చర్చించిన మీదటే ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ఏ చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా పక్కాగా నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఈ సమావేశంలో జెసి రవీందర్‌రెడ్డితో పాటు జిల్లా కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్న ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇంటింటికీ తాగునీరు
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్, జూన్ 18: రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా అమీనాపూర్ గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన మహిళా భవన నిర్మాణానికి, కుకునూర్, కోమన్‌పల్లి, అక్లూర్ గ్రామాల్లో 5 లక్షలతో నిర్మించనున్న భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అక్లూర్‌లో సర్పంచ్ లింబాగౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధి పనులను టిఆర్‌ఎస్ రెండేళ్లలోనే చేసి చూపించిందని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా సలహాలు ఇస్తే మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి వెల్మల విమల, ఎంపిపి పాలెపు రజిత, వైస్ ఎంపిపి రేగుల్ల రాములు, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్ట లలిత, వైస్ చైర్మన్ నల్ల రమేష్, టిఆర్‌ఎస్ నాయకులు దేగాం రాములు, మిట్టపల్లి మహిపాల్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

జైలులో ఖైదీ మృతిపై
మెజిస్టీరియల్ విచారణ
వినాయక్‌నగర్, జూన్ 18: నిజామాబాద్ జిల్లా జైలులో ఈ నెల 8వ తేదీన ప్రమాదవశాత్తు చనిపోయిన శేక్ రఫీక్(31) అనే ఖైదీ మృతి పట్ల మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ యోగితారాణా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన శేక్ రఫీక్‌కు న్యాయస్థానం 2010 డిసెంబర్ 2వ తేదీన యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుండి ఆయన నిజామాబాద్ జిల్లా జైలులో కారాగారవాసం అనుభవిస్తున్నారు. రఫీక్ సత్ప్రవర్తనను గమనించి అతనిని ఓపెన్ ఎయిర్ జైలులోకి మార్చారు. ఈ నెల 8వ తేదీన జిల్లా జైలులోని వాటర్ సంప్‌ను రఫీక్ శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తు కిందపడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు కలెక్టర్ ఆదేశిస్తూ, విచారణ అధికారిగా నిజామాబాద్ ఆర్డీఓ యాదిరెడ్డిని నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని విచారణ అధికారిని ఆదేశించారు.

పైప్‌లైన్ల నిర్మాణాలకు రూ. 128కోట్లు
కలెక్టర్ యోగితా రాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జూన్ 18: ఇంటింటికి శుద్ధి జలాలను సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం ఇంటర్నల్ పైప్‌లైన్ల నిర్మాణాల కోసం జిల్లాకు 128కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వెల్లడించారు. శనివారం తన చాంబర్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, మిషన్ భగీరథ విభాగం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో తొలివిడతలో 210 గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం 128కోట్లను మంజూరు చేసిందన్నారు. నిధులు అందుబాటులోకి వచ్చినందున ఈ నెల 22వ తేదీ నుండి ఇంటర్నల్ పైప్‌లైన్ నిర్మాణాల పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో బాల్కొండ మండలంలోని 29గ్రామాలు, ఆర్మూర్‌లోని 21, జక్రాన్‌పల్లిలో 29, సదాశివనగర్‌లో 34, కామారెడ్డిలో 27, మాచారెడ్డి మండలంలోని 70గ్రామాల్లో గల 93,202 నివాస గృహాలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి జలాలు సరఫరా చేయాల్సి ఉందన్నారు. సకాలంలో ఈ లక్ష్యం నెరవేరేందుకు గాను యుద్ధ ప్రాతిపదికన ఇంటర్నల్ పైప్‌లైన్ నిర్మాణ పనులు జరిపించాలని అధికారులకు సూచించారు. ఈ పనులకు మరో రెండు రోజుల్లో సాంకేతిక అనుమతులు కూడా లభించనున్నాయని తెలిపారు. ఈ నెల 20న ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ అందించి, 22వ తేదీ నుండి అంతర్గత పైప్‌లైన్ల పనులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలతో అంతర్గత పైప్‌లైన్ల పనులను చేపట్టి వారికి చెల్లింపులు జరుపుతామన్నారు. జూలై నుండి హరితహారం కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టనున్న దృష్ట్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోపే ఇంటర్నల్ పైప్‌లైన్ల నిర్మాణం పనులను పూర్తి చేయించాలని సూచించారు. హరితహారం పనులు ప్రారంభమైతే ఉపాధి హామీ కూలీలంతా గుంతలు తవ్వే పనుల్లోనే నిమగ్నమవుతారని అన్నారు. ఈ సందర్భంగా అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను కూడా వాటర్ గ్రిడ్ ఎస్.ఇగా వ్యవహరిస్తున్న ప్రసాద్‌రెడ్డికి అప్పగించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఇంచార్జ్ ఎస్.ఇ వెంకటేశ్వర్లు ఈ నెల 3వ తేదీ నుండి విధులకు హాజరుకావడం లేదు. దీంతో వాటర్ గ్రిడ్ ఎస్‌ఇకి బాధ్యతలు అప్పగిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కాగా, జిల్లాలో మిషన్ కాకతీయకు సంబంధించి ఇన్‌టెక్ వెల్ నుండి ఇప్పటివరకు 167 కిలోమీటర్ల పొడవున ప్రధాన పైప్‌లైన్లను నిర్మించామన్నారు. ఇంకనూ 1213కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు జరగాల్సి ఉందన్నారు. ఎక్కువ సంఖ్యలో జెసిబిలను సమకూరుస్తూ, ఒక్కో జెసిబి ద్వారా ప్రతిరోజు పది కిలోమీటర్ల మేర పైప్‌లైన్లను నిర్మింపజేయాలని కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. సమీక్షా సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, ఐహెచ్‌పి కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రావత్, మెగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ హరి శ్రీనివాస్, ఇన్‌టెక్ వెల్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ యువరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ ఇ.ఇలు రమేష్, ఎస్.రాములు పాల్గొన్నారు.

రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే
కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి
కంఠేశ్వర్, జూన్ 18: నిజామాబాద్ జిల్లాలో 765కెవి టవర్లు నిర్మిస్తున్నందున, వాటి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కిసాన్ కేత్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రజలతో పాటు ఎస్పీ విశ్వప్రసాద్‌కు కూడా ట్రాఫిక్ సెగ తగిలింది. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు నాయకుల రాస్తారోకోను విరమింపజేశారు. అంతకు ముందు ధర్నాచౌక్‌లో కోదండరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు నష్టాలను చవి చూస్తున్నారని ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు ఎండిపోయాయని, దాంతో రైతులు దిక్కుతోచని స్థితి చేరుకున్నారని అన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, మోర్తాడ్, బిక్కనూర్ తదితర ప్రాంతాల్లో పవర్‌గ్రిడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 765కెవి టవర్ల నిర్మాణంలో రైతులు భూములను కోల్పోతున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే రైతులను భయపెట్టి, వారి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో ఇదే మాదిరిగా ప్రవర్తించారని, దాంతో తాను పవర్ ఎనర్జిక్ అధికారికి ఉత్తరాంచల్ రాష్ట్రంలో ప్రతి పోల్‌కి ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారో వివరించడం జరిగిందని, దాంతో నెల రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 765కెవి టవర్ల నిర్మాణంలో రైతులు నష్టపోతున్నారని భావించి పోరాటానికి కిసాన్‌కేత్ సిద్ధమైందన్నారు. రెండు మాసాల క్రితం తాను నిజామాబాద్‌కు వచ్చినప్పుడు ఈ టవర్ల నిర్మాణంపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వగా, స్పందించిన కలెక్టర్ ఒక కమిటీ వేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. కానీ, ప్రభుత్వ ఒత్తిడి వల్ల 765కెవి టవర్ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదన్నారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే ఉంది, మరి నిజామాబాద్ జిల్లా తెలంగాణలో లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన దుయ్యబట్టారు. అలాగే 37లక్షల మంది రైతులకు సంబంధించిన పట్టపాస్ పుస్తకాలు బ్యాంకులలో ఉన్నాయని, వీరికి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. నిజామాబాద్‌లో ఎప్పుడు లేని విధంగా కరవు వచ్చిందని, దీంతో 900కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇదేమని అడిగితే సిఎం కెసిఆర్ ఇప్పుడే ఇవ్వద్దని చెప్పారని అధికారులు సమాధానం ఇస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి, అనిల్ ఈరవత్రి, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, గంగారెడ్డి, తాహెర్‌బిన్ హందాన్, తదితరులు పాల్గొన్నారు.

మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడం
సమంజసం కాదు
బిచ్కుంద, జూన్ 18: రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 50టిఎంసిల సామర్థ్యంలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్, టిడిపి, జెఎసిలకు చెందిన నాయకులు నానా రాద్ధాంతం చేయడం సమంజసం కాదని బిచ్కుంద టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావ్‌దేశాయి, ఎంపిపి లలిత అశోక్‌పటేల్, జడ్పీటిసి సంధి సాయిరాం, ఎన్‌ఎం.బాల్‌రాజ్ తదితరులు పేర్కొన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించి ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అపరభగీరథుడిలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి సంక్షేమ ఫలాలు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్లు, అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్లరేషన్ కార్డు అందించి, ఒక్కోక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికి కిలోబియ్యం, పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, మిషన్ కాకతీయ, ఇంటింటికి రక్షిత మంచినీటి అందించాలనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ తదితర పథకాలను టిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తుంటే, భవిష్యత్ కానరాని కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన నాయకులు స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు చేస్తూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం బాధిత రైతులతో చర్చించడం జరిగిందని, అందుకు భూములు కోల్పోతున్న రైతులు అంగీకారం తెలిపినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి కుట్రలకు పాల్పడటం శోచనీయమన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించాలని రైతులు కోరితే అప్పటి టిడిపి ప్రభుత్వం రబ్బరు బులెట్ల వర్షం కురిపించి ముగ్గురు యువ రైతులను బలి తీసుకోవడం జరిగిందన్నారు. అదే విధంగా రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిని తుంగలో తొక్కిందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రులు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలుస్తారని, ప్రతిపక్షాల కుట్రలను రైతులు, ప్రజలు తిప్పికొడ్తారని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన నాయకులు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేయడం మానుకుని, రైతుల శ్రేయస్సు కోసం చేపడుతున్న నిర్మాణాలకు అండగా నిలవాలని హితవు పలికారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు, రైతులే కాంగ్రెస్, టిడిపిలకు తగిన బుద్ధి చెబుతారన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కోటగిరి, జూన్ 18: కోటగిరి మండల రాణంపల్లి ఎక్స్‌రోడ్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ బషీర్‌హైమద్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాయ్‌కూర్ గ్రామానికి చెందిన మెట్ల శ్రీనివాస్(26), కాంతం గంగారాం(40)తో పాటు శేక్ ఘనీలు హెచ్‌ఎఫ్ డిలక్స్ ద్విచక్ర వాహనంపై రుద్రూర్ నుండి తమ సొంత గ్రామమైన రాయ్‌కూర్ వెళ్తుండగా, పోతంగల్ నుండి బోధన్ వెళ్తున్న టాటా జెన్ వ్యాన్ రాణంపల్లి ఎక్స్‌రోడ్ వద్ద ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఎక్స్‌రోడ్ వద్ద కొంచెం మూల మలుపు ఉండటం, కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా అతివేగంగా వెళ్లి ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఐ తెలిపారు. దీంతో మెట్ల శ్రీనివాస్, కాంతం గంగారాంలు అక్కడికక్కడే మృతి చెందగా, ఘనీకి తీవ్ర గాయాలయ్యాయని అన్నారు. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. శవ పంచానామా నిర్వహించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బషీర్ అహ్మద్ తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరునా విలపించడంతో వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంత దద్ధరిల్లింది. ఇదిలా ఉండగా, ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాయ్‌కూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.