నిజామాబాద్

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకే గురుకుల పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 27: పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన బాలబాలికలకు మెరుగైన విద్యను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం మోపాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి పోచారం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలకు ప్రాథమిక స్థాయి నుండే ప్రామాణిక విద్యను అందించే బాధ్యతను తెరాస ప్రభుత్వం స్వీకరించిందన్నారు. గురుకులాల్లో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని, 8సంవత్సరాల పాటు మీ పిల్లలను ఈ గురుకులాల్లో చదివిస్తే, వారిని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలను పొందే విధంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఏర్పాటు చేయిస్తున్నామని, ఉన్నత విద్యార్హతలు, పూర్తిస్థాయి నైపుణ్యం కలిగిన వారిని శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులుగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో పూర్తిగా ప్రతిభ కలిగిన వారికే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు ఉండబోవని మంత్రి పోచారం స్పష్టం చేశారు. ప్రతి గురుకులానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఐదెకరాల సువిశాల విస్తీర్ణంలో 20కోట్ల రూపాయలతో భవన సముదాయాన్ని నిర్మించనున్నామని తెలిపారు. విద్యతో పాటు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడేలా నాణ్యమైన భోజన వసతులు కల్పిస్తామని అన్నారు.
దీనికోసం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు ఖర్చు చేయనుందని వివరించారు. మునుముందు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనే చదివేలా వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు. కాగా, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 75శాతం సీట్లను ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు, క్రిస్టియన్లకు కేటాయించామన్నారు. మిగతా 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇతర బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్టు మంత్రి పోచారం వివరించారు. తొలి విడతగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 71 మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తోందన్నారు. వీటితో పాటు మరో 25గిరిజన గురుకుల పాఠశాలలు, 100 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లను, మరో 30 డిగ్రీ గురుకులాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో గురుకులాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. జిల్లాకు మంజూరైన ఆరు మైనార్టీ గురుకులాల్లో మొట్టమొదటగా తన నియోజకవర్గంలోనే దీనిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రూరల్ సెగ్మెంట్‌కు మరో రెండు ఎస్టీ గురుకులాలు కూడా మంజూరయ్యాయని తెలిపారు.

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్, జూన్ 27: మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం భీమ్‌గల్ మండలంలోని సికింద్రాపూర్, బెజ్జోర, లింగాపూర్, భీమ్‌గల్ గ్రామాల్లో 5లక్షల రూపాయల చొప్పున నిర్మించే మహిళా మండలి భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఐకెపి ద్వారా స్ర్తినిధి రుణాలు పొందిన మహిళలు ఆ నిధులతో వ్యాపారులు చేపట్టాలన్నారు. ఒక కుటుంబం బాగుపడాలంటే మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా మహిళలంతా పయనించాలని కోరారు. ప్రభుత్వం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 60మహిళా మండలి భవనాలను మంజూరీ చేయడం జరిగిందని, అందులో 40్భవనాలకు శంకుస్థాపనలు సైతం చేయడం జరిగిందన్నారు. మరో ఇరవై భవనాలకు త్వరలో ప్రారంభించనున్నామని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాలకు కుళాయిలకు రక్షిత మంచినీటిని అందించి, మహిళల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని అన్నారు. గ్రామాల్లో ఉన్న సర్పంచ్‌లు సక్రమంగా పని చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, వాటిని అర్హులు సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ ఎంపిపి అధ్యక్షురాలు కొండ గోదావరి ప్రకాష్‌గౌడ్, జడ్పీటిసి సభ్యురాలు లక్ష్మిశర్మనాయక్, ఎంపిడిఓ గోవింద్‌నాయక్, డిప్యూటీ తహశీల్దార్ వినోద్‌కుమార్, ఇంచార్జ్ సర్పంచ్ మల్లెల లక్ష్మన్, వైఎస్ ఎంపిపి శివసారి నర్సయ్య, సికింద్రాపూర్ సర్పంచ్ జిన్ని ధరణిజ శోభన్, బెజ్జోర సర్పంచ్ కండె పోసాని, ఎంపిటిసి సభ్యుడు గణేష్, మూడెడ్ల అపర్ణతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అటవీ సిబ్బందిపై తాండా వాసుల దాడి
గాంధారి, జూన్ 27: అటవీప్రాంతంలో మొక్కలు నాటేందుకు వెల్లిన సిబ్బందిపై తాండావాసులు దాడి చేసి గాయపర్చారు. ఈ దాడిలో గాంధారి డిప్యూటీ రేంజ్ అధికారి శివజ్యోతి తలకు, చేతికి గాయాలైనాయి. ఆమెతో పాటు గుంతలు తీసేందుకు వెల్లిన కూలీలపైనా తాండా వాసులు దాడి చేయడంతో సావిత్రి అనే మహిళా కూలీకి తలకు గాయం కాగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి శివారులోని 767 కంపార్ట్‌మెంటులో మొక్కలు నాటేందుకు కొంత మంది కూలీలతో వెల్లారు. దీంతో ఇది వరకు అక్కడ తాము పంటలు సాగు చేసుకున్నామని, ఇప్పుడు మీరెందుకు మొక్కలు నాటుతున్నారని కంపార్ట్‌మెంటుకు సమీపంలోని నేరల్ తాండాకు చెందిన కొంతమంది అక్కడికి చేరుకుని శివజ్యోతితో వాగ్వివాదానికి దిగినట్లు తెలిపారు. తాము ఇక్కడ సాగు చేసుకుంటామని, మొక్కలు నాటనివ్వమని తాండా వాసులు పనులు చేస్తున్న వారికి అడ్డురావడంతో పాటుతమపై దాడి చేయడంతో గాయపడినట్లు శివజ్యోతి తెలిపారు. చేతికి గాయం కాగా, సావిత్రి అనే కూలీకి కన్ను భాగంలో గాయమైంది. దీంతో వెంటనే గాంధారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డిప్యూటీ రెంజ్ అధికారి తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కుటుంబ కలహాలతో
ఉరివేసుకుని ఆత్మహత్య
ఎల్లారెడ్డి, జూన్ 27: కుటుంబ కలహాలతోపట్టణంలోని ఒ హర్డ్‌వేర్ ఇంజనీరింగ్ షాప్‌లో పని చేస్తున్న సంజీవరావు(48) అనే వ్యక్తిఆదివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ప్రోబేషనరీ ఎస్‌ఐ అంబరియా సోమవారం తెలిపారు. పిఎస్‌ఐ తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోగల హర్డ్‌వేర్ ఇంజనీరింగ్ దుకాణంలోపని చేస్తున్న సంజీవ్‌రావు గత కొంత కాలంగా తాగుడుకు బానిసై, కుటుంబ కలహాల కారణంగా తరుచు భార్యతోగొడవ పడ్తుండేవాడని, ఆదివారం రాత్రి సైతం తాగి వచ్చి భార్యతోగొడవ పడి భార్యపై చేయి చేసుకున్నాడని, తాగిన మైకంలోఅర్థరాత్రి సమయంలోఇంట్లోనే ఫ్యాన్‌కు చీరతోఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పిఎస్‌ఐ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్‌వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి, దర్యాప్తుచేస్తున్నట్లు పిఎస్‌ఐ వివరించారు.
బీమా చెక్కు పంపిణీ
నిజాంసాగర్, జూన్ 27: మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో సోమవారం జనశ్రీ భీమా ఇన్స్‌రెన్స్ పథకం కింద మంజూరైన చెక్కును ఐకెపి ఎపిఎం రాంనారాయణ గౌడ్ పంపిణి చేశారు. మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన గూల పోచయ్య సంవత్సరం క్రితం సాదారణంగా మృతిచెందడంతో, జనశ్రీ భీమా ఇన్స్‌రెన్స్ కింద మంజూరైన 30 వేల రూపాయల చెక్కును భార్య రామవ్వకు అందజేశారు.

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
వేల్పూర్, జూన్ 27: పసుపు రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేల్పూర్ మండలం పడిగెల గ్రామ శివారులో సుమారు 30 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న పసుపు పార్క్ స్థలాన్ని, నూతనంగా 5 వేల మెట్రిక్ టన్నుల విలువ గల వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాం పనులను సోమవారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. భీమ్‌గల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే మధ్యలో ఆగి పనులను పరిశీలించారు. పసుపు పార్క్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఫుడ్ కార్పోరేషన్ ఎండి రాజేందర్‌రెడ్డితో మాట్లాడి తెలుసుకున్నారు.