నిజామాబాద్

22వరకు ఉద్యోగులకు సెలవులు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం పలు కఠిన నిర్ణయాలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎడపల్లి తహశీల్దార్ గఫార్‌తో పాటు పలువురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ మెమోలను జారీ చేయించడం ద్వారా హరితహారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు అందించారు. తాజాగా, సోమవారం ఆయన కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్ష జరుపుతూ, ఈ కార్యక్రమం ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పారు. ఈ నెల 22వ తేదీ వరకు హరితహారం కొనసాగనున్న దృష్ట్యా, అప్పటి వరకు ఉద్యోగులెవరికీ సెలవులు మంజూరు చేయబడవని ఈ సందర్భంగా మంత్రి పోచారం స్పష్టం చేశారు. ఉద్యోగులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులంతా స్థానికంగానే ఉంటూ హరితహారం విజయవంతానికి కృషి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. చివరకు 22వ తేదీ వరకు స్థానికంగా ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, విఐపిల పర్యటనలు కూడా ఉండవని పోచారం పేర్కొన్నారు. జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పచ్చదనం అంతరించడంతో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడం లేదని, ఫలితంగా కరవు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని అధిగమిస్తూ కరవు నుండి బయటపడాలంటే విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం ఒక్కటే ఏకైక మార్గమని ఆయన హితవు పలికారు. దీనిని గుర్తిస్తూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో భాగస్వాములై హరితహారంను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించామని, దీనిని పర్యవేక్షించేందుకు రెండు గ్రామ పంచాయతీలకు ఒక క్లస్టర్ ఆఫీసర్‌ను, ప్రతి సచివాలయానికి ఒక నోడల్ అధికారిని, మున్సిపల్ పట్టణాలకు కమిషనర్‌లను నియమించామని అన్నారు. ప్రణాళికకు అనుగుణంగా నిర్దేశిత సంఖ్యలో మొక్కలు నాటించాల్సిన బాధ్యత నోడల్, క్లస్టర్ అధికారులదేనని పేర్కొన్నారు. గుంతలు తవ్విన తరువాతే నర్సరీల నుండి మొక్కలు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఏయే ప్రాంతంలో ఏ రకానికి చెందిన ఎన్ని మొక్కలు నాటుతున్నారనే పూర్తి వివరాలను పక్కాగా నమోదు చేయాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏదో నామ్‌కేవాస్తేగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి కాకి లెక్కలు చూపిస్తే, ఎంతమాత్రం సహించేది లేదని, అలసత్వం కనబర్చే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పోచారం హెచ్చరించారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం అందజేసే నిధుల వివరాలను రైతులకు, ప్రజలకు తెలియజేస్తూ విస్తృత ప్రచారం కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. మూడేళ్ల కాల వ్యవధిలో జిల్లాలో 10కోట్ల మొక్కలను నాటి, వాటిని సంరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా వైశాల్యంలో 35శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో కోటి మొక్కలను, పొలం గట్లు, నివాస ప్రాంతాల్లో మరో 9కోట్ల మొక్కలను నాటాల్సి ఉందని వివరించారు. ప్రతి నివాస గృహంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఆవరణలు పండ్ల మొక్కలతో అలరారాలని మంత్రి పోచారం ఆకాంక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ విజి.గౌడ్, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్‌కె.గుప్తా, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, డిఎఫ్‌ఓలు పాల్గొన్నారు.