నిజామాబాద్

హరితహారంలో కానరాని ప్రతిపక్షాల భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 20: పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతిపక్షాల భాగస్వామ్యం మచ్చుకైనా కానరావడం లేదు. అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ హరితహారంను విజయవంతం చేయాలని ప్రభుత్వం తలపోస్తున్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారంతా ఈ కార్యక్రమానికి దూరంగానే ఉండిపోతున్నారు. ఆయా పార్టీల నాయకులను పక్కనబెడితే, కనీసం స్థానిక సంస్థలకు ప్రతిపక్ష పార్టీల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం సైతం కానరావడం లేదు. కేవలం తెరాస ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకుల హంగామానే కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం యావత్తు మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమవుతూనే, మహిళా సంఘాలు, గ్రామ కమిటీలు, యువజన సంఘాలు, విద్యార్థులను హరితహారంలో మమేకం అయ్యేలా చేస్తున్నారు. దీనికి ప్రతిపక్షాల తోడ్పాటు సైతం లభించి ఉంటే త్వరితగతిన లక్ష్య సాధనకు ఇది దోహదపడేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుని, ఈ నెల 8వ తేదీ నుండి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ స్థానికంగానే మకాం వేసి అనునిత్యం మొక్కలు నాటే కార్యంలో నిమగ్నమవుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే దాదాపుగా గడిచిన రెండు వారాల నుండి ఇతర అధికారిక కార్యక్రమాలన్నింటిని పక్కన పెట్టి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులందరూ హరితహారం కార్యక్రమం అమలుపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో బుధవారం నాటికి కోటీ 75లక్షల వరకు మొక్కలు నాటినట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇది నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం యాభై శాతానికే చేరువైనట్టు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీ వరకు హరితహారం కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా, మరో రెండు రోజుల వ్యవధిలో మిగతా సగం లక్ష్యాన్ని సాధించడం అసాధ్యంగా మారింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటుతూ, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం అధికారులతో క్లస్టర్ల వారీగా బృందాలను ఏర్పాటు చేసి, గ్రామాల్లోనే రాత్రి బస చేయిస్తోంది.
దీంతో పలు చోట్ల ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా 40వేల మొక్కలు నాటగా, మెజార్టీ గ్రామాల్లో మాత్రం ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న చోట హరితహారం అమలు ఒకింత నెమ్మదిగా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలాఉండగా, సగం లక్ష్యం సాధించిన మీదట అనేక చోట్ల మొక్కల కొరత నెలకొనడంతో వాటిని నాటే ప్రక్రియ కాస్తంత మందగిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున రెండున్నర కోట్ల మొక్కలు, జిల్లాలో 25లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, మొక్కల కొరత నెలకొనడంతో ఈ కార్యక్రమాన్ని 22వ తేదీ నాటికి వాయిదా వేయడం గమనార్హం. అంతేకాకుండా జిల్లాకు మరో కోటి వరకు టేకు, పండ్ల మొక్కలు కేటాయించాలని కోరుతూ కలెక్టర్ యోగితారాణా గత మూడు రోజుల క్రితమే ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరారు. అయితే స్థానికంగానే బహిరంగ వేలం పద్ధతిన మొక్కలు కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు సూచించడంతో ఈ ప్రక్రియను చేపట్టే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ అంశాలను బట్టి చూస్తే ఈ నెల 22వ తేదీ నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో మొక్కలు నాటే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టమవుతోంది. దీంతో ఈ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు కొనసాగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.