నిజామాబాద్

విద్యార్థులకు ’హరిత‘ సర్వే బాధ్యతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 23: హరితహారం అమలులో ముందంజలో ఉన్న నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టినట్టు రుజువు చేసేందుకు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సర్వే బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో మొత్తం 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 2.36కోట్ల వరకు మొక్కలు నాటడాన్ని పూర్తి చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యం విధించగా, 150గ్రామ పంచాయతీలు ఈ లక్ష్యాన్ని సాధించాయి. అయితే సదరు సచివాలయాల పరిధిలో వాస్తవంగానే లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టారా? లేదా? అన్నది నిశితంగా పరిశీలన జరిపించి ఆత్మవిమర్శ చేసుకునేందుకు వీలుగా విద్యార్థులచే సర్వే జరిపించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు చొప్పున విద్యార్థులు రెండు రోజుల పాటు పర్యటించి హరితహారం అమలు తీరును పరిశీలించి నివేదికలు సమర్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సర్వే కోసం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 300మంది విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. కలెక్టర్ డాక్టర్ యోగితారాణా శనివారం కళాశాలను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు.
సర్వే చేపట్టాల్సిన విధానం గురించి వారికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కింద జిల్లాలో ఇప్పటికే 150గ్రామ పంచాయతీలలో 40వేల చొప్పున మొక్కలు నాటించామన్నారు. ఈ కార్యక్రమం పక్కాగా జరిగిందా? లేదా? అన్నది నిర్ధారించుకుంటూ, ఎక్కడైనా అవాంతరాలు ఎదురైనట్టు తెలిస్తే వాటిని అధిగమించేందుకు చర్యలు చేపట్టవచ్చనే ఉద్దేశంతో విద్యార్థులచే ప్రయోగాత్మకంగా సర్వే జరిపించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను స్వయంగా పరిశీలించి, ఎన్ని మొక్కలు నాటారు, వాటి రక్షణకు కంచెలు ఏర్పాటు చేశారా? సంరక్షణ బాధ్యతలు ఎలా ఉన్నాయి తదితర వివరాలను సేకరించి నివేదిక అందించాలని కోరామన్నారు. సర్వేను ఆషామాషీగా తీసుకోకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ సర్వే చేయాలని విద్యార్థులకు సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మొక్కను తమ స్నేహితుడిగా భావిస్తూ వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉద్బోధించారు. మన కుటుంబం పట్ల ఎంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతతో వ్యవహరిస్తారో, మొక్కల సంరక్షణ విషయంలోనూ అదే తరహాలో శ్రద్ధాసక్తులు కనబర్చాలన్నారు. మొక్కలు నాటి, వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని భావించకుండా, మన భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమంగా హరితహారాన్ని భావించాలని హితవు పలికారు. నేటితరం యువతలో చాలామందికి ఈత రాదని, చెరువులు, వాగులలో నీరు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాలు కురియని కారణంగా పొరుగునే ఉన్న మహారాష్టల్రోని లాతూర్ జిల్లాకు రైల్వే ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేయాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితి స్థానికంగా ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన ముందు తరాల వారికి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా సమృద్ధిగా నీటి వనరులను అందుబాటులో ఉంచడం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్నదే హరితహారం ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరంలో అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఆమె వెంట నిజామాబాద్ డిఎస్పీ ఆనంద్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి, ఎన్‌సిఎల్‌పి పి.డి సుధాకర్ తదితరులు ఉన్నారు.

వాగులు, వంకలకు జలకళ
పోచారం ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
కామారెడ్డి, జూలై 23: డివిజన్‌లోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్ట్ నిండేందుకు ప్రధాన జలధార అయిన అయిన లింగంపేట్ పెద్దవాగు గత రెండు రోజులుగా జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు ఈ వాగులో చుక్కనీరు లేకుండా బోసి పోయి కన్పించింది. గత రెండు మూడు రోజులుగా ఎగువ భాగంలో కురుస్తున్న వర్షాలకు లింగంపేట్ వాగులో నీరు పారడం ప్రారంభం అయ్యింది. ఈవాగులో నీరు పారుతున్నాయంటే, ఇక వర్షాలు పడితే ఈ వాగుద్వారా నీరు పోచారం ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం అయినట్లే. ఎందుకంటే ఈ వాగులో ఉన్న గుంతలు ఎత్తుపల్లాల్లో నీరు నింపుతూ ఈ వాగు పారడం మొదలైందంటే రైతుల్లో ధైర్యం కూడా వస్తుంది. దీంతో ఆయకట్టు పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలం, అలాగే ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్న రైతులు నిన్న మొన్నటి వరకు వరినాట్లు వేయాలా వద్ద అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు లింగంపేట్ వాగులో నీరు పారడం మొదలు కావడంతో ఈసారి చిన్నపాటి వర్షాలు కురిసినప్పటికీ ప్రాజెక్ట్ నిండుతోందన్న ఆశలు రైతుల్లో కన్పిస్తున్నాయి. దీంతో బోర్‌బావుల్లో నీరు ఉన్న వారితో పాటు నిన్న మొన్న కురిసిన వర్షంతో పంటపొలాల్లో నీరు నిండటంతో, అంతకుముందే బోర్‌బావుల వద్ద వరినారు పోసిన రైతులు మాత్రం నాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వారం ఒక మోస్తారు వర్షాలు కురవడం ప్రారంభయ్యాయ దీంతో పోచారం ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే అవకాశాలుంటాయి.
దర్పల్లి ఊరచెరువు కట్టకు బీటలు
డిచ్‌పల్లి: దర్పల్లిలోని ఊర చెరువు కట్ట బీటలు వారింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో ఈ చెరువును చేర్చి, ఇటీవలే ఆధునీకరణ పనులు చేపట్టారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికే చెరువుకట్టకు కింద భాగంలో వేసిన మట్టి కొట్టుకుపోయి బీటలు వారినట్లు స్థానిక రైతులు తెలిపారు. చెరువుకట్టకు మరమ్మతులు చేపట్టిన సమయంలో అధికారులు పర్యవేక్షించకపోవడం, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేపట్టం వల్లే ఈ పరిస్థితి నెలకొందని గ్రామస్థులు, రైతులు ఆరోపిస్తున్నారు. పనులను నాసిరకంగా చేపడుతున్నారని గతంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, నాసిరకంగా చేపట్టిన చెరువుకట్టకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. అదే విధంగా చెరువుకట్టపై హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

తుగ్లక్ పాలన
వాస్తు పేరిట ప్రజాధనం దుర్వినియోగం
హామీలు బుట్టదాఖలు
కెసిఆర్‌పై పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జూలై 23: రాష్ట్రంలో కెసిఆర్ పరిపాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని టి.పిసిసి అధికార ప్రతినిధి బి.మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, వాస్తు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అసలేమాత్రం ఆర్థిక క్రమశిక్షణ లేని ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ను అభివర్ణించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను ధనిక రాష్ట్రంగా పేర్కొంటూనే, లక్షా 60వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని విమర్శించారు. తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల అప్పుల కోసం మంత్రి కెటిఆర్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు. అసలే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే, ప్రతీ అంశాన్ని వాస్తుతో ముడిపెడుతూ ప్రభుత్వ ఖజానాను మరింతగా దివాళా తీసేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తుకు అనుగుణంగా లేదనే సాకుతో తన నల్ల కారును తెల్ల కారుగా మార్చుకునేందుకు 2కోట్ల రూపాయలు వెచ్చించారని, కొత్త క్యాంప్ ఆఫీసు నిర్మాణం కోసం మరో 30 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందెంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించి ప్రజలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని తెరాసకు అధికారం కట్టబెడితే, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించకుండా అసంబద్ధంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదని, కెజి టు పిజి ఉచిత విద్య, రైతులకు పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం హామీలు అటకెక్కడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం పర్సంటేజీల కక్కుర్తి కోసమే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఈ రిజర్వాయర్ లేకుండానే లిఫ్టు ద్వారా సాగునీటిని అందించేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, బలవంతంగా భూములు లాక్కుంటుండడంతో బాధిత రైతులు, మహిళలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ, పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేవలం డబ్బు దందా కోసమే కెసిఆర్ సర్కార్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పిస్తోందని ఆయన ఆరోపించారు. తెరాస ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఎండగట్టే సమయం ఆసన్నమైందని, ఆ పార్టీకి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాగా, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సిఎం కుమార్తె, ఎంపి కల్వకుంట్ల కవిత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా విదేశాల చుట్టి రావడంతోనే సరిపెట్టుకుంటున్నారని విమర్శించారు. రెండున్నర మాసాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పగా, రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా అతీగతీ లేకుండాపోయిందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో గత కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారని, తీరా సదరు నాయకులను తెరాస పార్టీలో చేర్చుకున్నారని పరోక్షంగా డిఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టి.పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పేరిట పేద, మధ్య తరగతి ప్రజల్లో ఆశలు కల్పించిన తెరాస ప్రభుత్వం, జిల్లాలో కనీసం ఏ ఒక్క చోట కూడా నిర్మాణాలకు శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. పైపెచ్చు కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసిన వేలాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను నిలిపివేయించి వందల కోట్ల రూపాయల బిల్లులను మంజూరు చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ప్రజలను భాగస్వాములు చేసి స్వచ్ఛందంగా చేపట్టాల్సిన మొక్కలు నాటే కార్యక్రమానికి హరితహారం పేరు పెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దేశ వ్యాప్తంగా దళితులపై చిత్రవిచిత్రమైన రీతిలో దాడులు జరుగుతున్నాయని గడుగు ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవలి కాలంలో గుజరాత్, కేరళలో చోటుచేసుకున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బిజెపి ఏర్పాటు చేసిన గోసంరక్షణ కమిటీ ‘ఉగ్రవాద’ సంస్థలా మారి ఈ తరహా దాడులకు పాల్పడుతున్నందున తక్షణమే ఆ కమిటీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నగర కమిటీ అధ్యక్షుడు కేశ వేణు,రత్నాకర్, నగేష్‌రెడ్డి, శ్రీనివాస్, అరుణతార, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఐ జీపుజాత
వినాయక్‌నగర్, జూలై 23: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత కార్యక్రమంలో శనివారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం ఎస్‌ఎఫ్‌ఐ జీపుజాత నగరంలోని రాజరాజేంద్ర చౌరస్తాకు చేరుకోగా, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్నా, విద్యారంగ సమస్యల పరిష్కారంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో సిఎం కెసిఆర్ కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం ఆ హామీని పూర్తిగా విస్మరించడం సిగ్గుచేటన్నారు. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా, వాటిని పరిష్కరించడంలో సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ జీపుజాతలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నరేష్, సురేష్, భానుతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

కల్తీకల్లు నివారణకే ఈత వనాల పెంపు
మోర్తాడ్ పరిధిలో 1.43 లక్షల ఈత మొక్కలు
మోర్తాడ్, జూలై 23: గ్రామాల్లో కల్తీకల్లు నివారించి నాణ్యమైన కల్లునే అందించాలనే లక్ష్యంతో ఈత వనాల పెంపుదలపై దృష్టి సారించినట్లు మోర్తాడ్ ఎక్సైజ్ సిఐ సహదేవ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహరం కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, తాళ్లరాంపూర్ గ్రామాల్లో శనివారం గీత కార్మికులతో కలిసి 2000ఈత మొక్కలను నాటారు. ఆయా గ్రామాల్లో ఈత వనాల పెంపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోర్తాడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో శనివారం నాటికి 1,43,751ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో గీత కార్మికుల సంఘం భూముల్లోనూ, గీత కార్మికుల పంట పొలాల్లోనూ, చెరువులు, కుంటల కట్టలపైన ఈత మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఒక్క ట్యాంక్‌బండ్‌లపైనే 62,470ఈత మొక్కలు నాటామన్నారు. మోర్తాడ్ మండలంలో 65,360, వేల్పూర్ మండలంలో 57,545, కమ్మర్‌పల్లి మండలంలో 18,806చొప్పున ఈత మొక్కలను నాటడం జరిగిందని ఆయన తెలిపారు. వరదకాల్వ గట్లపై కూడా మొక్కలు నాటామని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను గీతకార్మిక సంఘాలకు అప్పగిస్తూనే, తాము కూడా పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్‌లు దడివె నవీన్, ఉగ్గెర భూమేశ్వర్, ఎంపిటిసిలు మురళీగౌడ్, పాపాయి పవన్, గీత కార్మిక సంఘం నాయకులు చరణ్‌గౌడ్, గంగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మొండివాగుకు వరదనీరు
మోర్తాడ్, జూలై 23: మూడు సంవత్సరాల తర్వాత మోర్తాడ్ మొండివాగుకు జలకళ వచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగుల్లోకి వరదజలాలు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో ఎల్లవేళలా నీటితో కనిపించే మొండివాగు, గడిచిన మూడు సంవత్సరాలుగా మూగబోయింది. గత సంవత్సరం జూన్‌లో కురిసిన వర్షాలకు వాగులో కొంతమేర వరద ప్రవాహం కనిపించినా ఎండల కారణంగా జలాలు అడుగంటాయి. ఈసారి వర్షాకాలం ప్రారంభం నుండి వర్షాలు కురుస్తున్నప్పటికీ, మొండివాగులో మాత్రం నీటి జాడలు కనిపించలేదు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు, పిల్లకాల్వల్లో నుండి వచ్చే జలాలు ప్రవహించడంతో ఆ జలాలన్నీ మొండివాగులోకి మళ్లాయి. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మొండివాగులో ఉన్న చెక్‌డ్యామ్ నిండి, మిగులు జలాలు కిందివైపు పరుగులు తీస్తున్నాయి. చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండటంతో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.