నిజామాబాద్

కొత్త జిల్లాల్లో ఊపందుకోనున్న వలసలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 4: స్వరాష్ట్రం సాధన కల సాకారమై తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలోనూ ప్రతిపక్షాలు నిస్తేజం నుండి కోలుకోకపోగా, పాలకపక్షం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికీ తెరాసలోకి వలసల పర్వం నిరాఘాటంగా కొనసాగుతుండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడుతున్న క్రమంలో కొత్త జిల్లాలుగా ఏర్పాటవుతున్న ప్రాంతాల్లో వలసలు ఊపందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి సైతం ఆ పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఆధిపత్యాన్ని అడ్డుకుని కామారెడ్డి బల్దియాపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు మైనార్టీ ముఖ్య నాయకుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ తీవ్రంగా శ్రమించారు. దీంతో కామారెడ్డిలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుని చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులను దక్కించుకోగలిగింది. అయితే రెండేళ్లు గడువకముందే కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడింది. కాంగ్రెస్ పతాకంపై గెలిచిన వైస్ చైర్మెన్ మసూద్ కొన్నాళ్ల క్రితమే హస్తంను వీడి గులాబీ గూటికి చేరగా, తాజాగా మున్సిపల్ చైర్‌పర్సన్ పిప్పిరి సుష్మ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కారు. మరికొంత మంది కౌన్సిలర్లు కూడా వలస బాటలో పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుని తెరాస ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. గత ఏడాది కాలం క్రితం వరకు కూడా ఇదే రీతిలో తెరాసలో వలసల జోరు కొనసాగగా, ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రక్రియ తెరపైకి రావడంతో మరోమారు వలసలు ఊపందుకునే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పలు పర్యాయాలు పిసిసి చీఫ్‌గా వ్యవహరిస్తూ, ముఖ్యమంత్రి రేసులో కొనసాగిన కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ వంటి హేమాహేమీలే పార్టీని వీడారని, ప్రస్తుతం తాము వెళ్తే తప్పేమిటని వలసలు వెళ్తున్న వారు తమకుతాము సర్ది చెప్పుకుంటున్నారు. రాజకీయ భవితవ్యం విషయాన్ని పక్కనబెట్టినా, మరో రెండున్నరేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్న తరుణంలో పూర్తి ఆధిపత్యంతో ముందుకు సాగుతున్న అధికార పార్టీలో కలిస్తేనే తమకు ఎంతోకొంత ప్రయోజనం దక్కుతుందనే భావనతో స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపు యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం కాస్త పాలకపక్షంలో నూతనోత్తేజాన్ని నింపుతుండగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాత్రం నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన హేమాహేమీలుగా చెలామణి అయిన నేతలంతా పరిస్థితులు అనుకూలించక తెరచాటునే ఉండిపోయి స్తబ్ధంగా వ్యవహరిస్తుండగా, పాలకపక్షమైన తెరాస నేతలు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు నిజాం షుగర్స్ వంటి అంశాలపై అడపాదడపా తెరాస ప్రభుత్వ పాలనా తీరును ఎండగట్టేందుకు విమర్శల పర్వానికి దిగుతున్నప్పటికీ, పాలక పక్ష నేతలు వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను టిఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం ఆ పార్టీ ప్రజాప్రతినిధులదే పూర్తిస్థాయిలో ఆధిపత్యం కొనసాగుతోంది.
దాదాపు పుష్కరకాలం పాటు ఉద్యమ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా కొనసాగిన వారంతా ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన వారమనే హోదాతో ఎనలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వల్లెవేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నామంటూ తెరాస నేతలు ప్రజల నమ్మకాన్ని మరింతగా చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పంట రుణాల మాఫీ, పెన్షన్ల పంపిణీ, బీడీ కార్మికులకు జీవన భృతి, సన్నబియ్యం పంపిణీ, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, రోడ్ల నిర్మాణాలు వంటి కార్యక్రమాలను జిల్లాకు అన్వయించుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీటివల్ల జిల్లాకు ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనమంటూ ఏదీ లేదని ప్రతిపక్ష పార్టీలు ఆక్షేపిస్తున్నప్పటికీ, వారి విమర్శలను తిప్పికొడుతూ తెరాస నేతలు ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించిన తెరాస అధికారంలో కొనసాగుతుండడంతో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ముఖ్య నేతలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెదెపా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన విజి.గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగిన రాజేశ్వర్‌రావు, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, డిసిసిబి చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి సహా ఇతర అనేక మంది క్రియాశీలక నాయకులు, కార్యకర్తల చేరికతో జిల్లాలో తెరాస మరింత బలాన్ని పుంజుకోగలిగింది. తాజాగా, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కూడా తెరాసలోకి వలసలు జోరందుకునేందుకు దోహదపడుతోంది.