నిజామాబాద్

ముగ్గురిపై పి.డి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, సెప్టెంబర్ 9: తరుచూ నేరాలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న ముగ్గురు కరడు గట్టిన నేరస్థులపై జిల్లా యంత్రాంగం పి.డి(ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టును ప్రయోగించింది. ఎస్పీ పి.విశ్వప్రసాద్ అందించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దొంగతనాలు, ద్విచక్ర వాహనాల అపహరణకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్న ముగ్గురు నిందితులు సమాజంలో స్వేచ్ఛగా తిరిగితే ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని, వారిపై పి.డి యాక్టు ప్రయోగించాలని ఎస్పీ చేసిన సిఫార్సుకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. మహారాష్టల్రోని నాందేడ్ జిల్లా బెండేగాంకు చెందిన మాధవ్‌కిషన్(30), పర్భిణీ జిల్లా బోరీ గ్రామ నివాసి అయిన భరత్‌గోవింద్ షిండే(33)తో పాటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన సర్దార్ రంజిత్‌సింగ్ అలియాస్ గుర్‌మిత్‌సింగ్(43)లపై పి.డి యాక్టును ప్రయోగించారు. పై నేరస్థులకు సంబంధించిన వివరాలను ఎస్పీ విశ్వప్రసాద్ పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. మాధవ్‌కిషన్, భరత్‌గోవింద్‌లు కలిసి మహారాష్టల్రోని నాందేడ్, పర్భిణీ జిల్లాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అనేక చోట్ల తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని, వారిపై 44కేసులు నమోదై ఉన్నాయన్నారు. బాల్కొండ పోలీసులు ఇటీవలే వీరిని పట్టుకుని కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారని, మూడు కేసుల్లో వీరు నేరాలకు పాల్పడినట్టు రుజువు అయ్యిందని, మిగతా కేసుల విచారణ కొనసాగుతోందని వివరించారు. అదేవిధంగా తాడ్కోల్‌కు చెందిన రంజిత్‌సింగ్‌పై 11కేసులు నమోదై ఉన్నాయని, ఇళ్ల చోరీలతో పాటు ద్విచక్ర వాహనాలను అపహరించిన సంఘటనల్లో బాన్సువాడ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారని తెలిపారు. పై ముగ్గురు ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లి విడుదలైనప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోగా, మళ్లీమళ్లీ చోరీలకు పాల్పడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని గమనించి వారిపై పి.డి యాక్టు కోసం కలెక్టర్‌కు నివేదికలు పంపామన్నారు. వారి నేర ప్రవృత్తిని గమనించిన కలెక్టర్ పి.డి యాక్టు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. కాగా, ఇటీవలే దర్పల్లి మండలానికి చెందిన ఒడ్డె భాస్కర్‌తో పాటు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన పిట్లం మండలానికి చెందిన అరికల శ్రీనివాస్‌రెడ్డిలపై కూడా జిల్లా పోలీసు పి.డి యాక్టును ప్రయోగించింది. తాజాగా మరో ముగ్గురు కరడు గట్టిన నేరస్థులపై కూడా పి.డి యాక్టును ప్రయోగించడం ద్వారా అసాంఘిక, అరాచక శక్తులను ఉపేక్షించబోమనే సంకేతాలను వెలువరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారితో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, భూకబ్జాలకు పాల్పడే వారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని అన్నారు.