నిజామాబాద్

ఎటిఎం థొంగలపై పోలీసుల కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 16: ఎటిఎం సెంటర్లను లక్ష్యంగా ఎంచుకుని చోరీలకు తెగబడిన దొంగల ముఠా తృటిలో పోలీసు కాల్పుల నుండి తప్పించుకోగలిగింది. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలంలోని మెంగారం శివారులో బొలెరో వాహనంలో వస్తూ పోలీసులకు తారసపడ్డ దొంగలపై లింగంపేట ఎస్‌ఐ పల్లె రాకేష్‌గౌడ్ ఒక రౌండ్ కాల్పులు జరుపగా, తప్పించుకుని పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున కోటగిరి, వర్ని మండలాల్లోని నాలుగు ఎటిఎం సెంటర్లలో దొంగలు చొరబడి సుమారు 43లక్షల రూపాయల నగదును అపహరించుకుని పారిపోయిన విషయం విదితమే. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ జిల్లా పోలీసులు ఓ వైపు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న తరుణంలోనే, ఎటిఎం దొంగలు మరోమారు రెచ్చిపోయారు. నిజామాబాద్‌కు ఆనుకుని పొరుగునే ఉన్న మెదక్‌లో ఎటిఎం చోరీకి విఫలయత్నం చేశారు. నిజామాబాద్ తరహాలోనే మెదక్‌లోని ఆటోనగర్ ప్రాంతంలో గల ఎస్‌బిఐ ఎటిఎం సెంటర్‌లో చొరబడి గ్యాస్ కట్టర్‌లతో ఎటిఎం మెషీన్‌ను ధ్వంసం చేస్తుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దొంగల చోరీ యత్నం ఫలించలేదు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మెదక్ పోలీసులు దొంగలను గమనించి పట్టుకునే లోపే వారు నిజామాబాద్ జిల్లా వైపు పారిపోయారు. దీంతో మెదక్ పోలీసులు నిజామాబాద్ జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, నిజాంసాగర్ తదితర మండలాల ఎస్‌ఐలందరూ తమతమ సిబ్బందితో తెల్లవారుజాము 4గంటల సమయం నుండే విస్తృత కూంబింగ్ చేపట్టారు. ఎటిఎం దొంగలు బొలెరో వాహనంలో వస్తున్నారని మెదక్ జిల్లా పోలీసుల నుండి సమాచారం అందడంతో సదరు వాహనం కోసం గట్టి నిఘా కొనసాగించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో లింగంపేట మండలం మెండోరా గ్రామ సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం కనిపించింది. ఎస్‌ఐ రాకేష్ తన నలుగురు సిబ్బందితో దానిని ఆపే ప్రయత్నం చేయగా, దొంగలు వాహనాన్ని నిలుపకుండా పారిపోయారు. దీంతో సదరు వాహనంలో దొంగలే ప్రయాణిస్తున్నారని నిర్ధారణకు వచ్చిన ఎస్‌ఐ ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అప్పటికే పోలీసుల దృష్టి నుండి బొలెరో వాహనంలో దొంగలు తప్పించుకుని పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలతో ఎటిఎం దొంగల కోసం వేటను ముమ్మరం చేశారు.
అన్ని మండలాల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ గాలింపులు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ రేంజ్ ఐ.జి నవీన్‌చంద్ హుటాహుటిన జిల్లాకు చేరుకుని ఎస్పీతో కలిసి పోలీసులు కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. లింగంపేట పోలీస్ స్టేషన్‌లో స్థానిక పోలీసు అధికారులతో భేటీ అయి ఎటిఎం దొంగలను పట్టుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలపై చర్చించి పలు సూచనలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ గాలింపులు చేపడుతున్న క్రమంలోనే గాంధారి మండల పోలీసులు బొలెరో వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం మహారాష్ట్ర పాసింగ్ నెంబర్ కలిగి ఉండడం, సదరు వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారే ఎటిఎం సెంటర్లలో చోరీకి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు బలంగా విశ్వసిస్తూ తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఐజి నవీన్‌చంద్ ధ్రువీకరిస్తూ, ముగ్గురు అనుమానితులు తమ అదుపులోనే ఉన్నారని, ఎటిఎం చోరీలతో వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఎటిఎం చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని ఐజి పేర్కొన్నారు. దొంగలు ముసుగులు ధరించి, గ్యాస్ కట్టర్ల సహాయంతో ఎటిఎంల చోరీలకు పాల్పడుతున్నారని, నిందితులను గుర్తించేందుకు సి.సి టివిల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

త్వరలోనే పట్టుకుంటాం
ఐజి నవీన్‌చంద్
కామారెడ్డి/లింగంపేట్, డిసెంబర్ 16: ఎటిఎం దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఐజి నవీన్‌చంద్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలోని లింగంపేట్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎటిఎంలను ధ్వంసం చేసి బొలెరా వాహనంలో పరారీ అవుతుండగా కామారెడ్డి డివిజన్ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారన్నారు. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, లింగంపేట్‌కు చెందిన పోలీస్ అధికారులు రోడ్లపై దొంగలను పట్టుకోవడానికి దృష్టి సారించారన్నారు. ఈ విషయాన్ని గమనించిన దొంగలు ప్రత్యేక దారుల గుండా పరారీ అయ్యారు. లింగంపేట్ పోలీసులపైకి వాహనాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ రాకేశ్‌గౌడ్ దొంగల వాహనంపై కాల్పులు జరిపారన్నారు. ముసుగులు ధరించిన దొంగలు ఎటిఎంలను ధ్వంసం చేయడానికి గ్యాస్ కట్టర్లను వినియోగించడం జరిగిందన్నారు. మెదక్ పట్టణంలోని ఎస్‌బిఐ ఎటిఎంలోని చోరీకి ప్రయత్నిస్తుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు దొంగలను గుర్తించి వెంబడించడంతో వారు నిజామాబాద్ జిల్లాలోకి వచ్చినట్లు తెలిపారు. నాగిరెడ్డిపేట్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ దొంగల వాహనాన్ని అడ్డగించడంతో లింగంపేట్ వైపు వచ్చినట్లు నాగిరెడ్డిపేట్ పోలీసులు సమాచారం అందించారు. జిల్లాలోని బఢపహాడ్, మంచిప్ప, గాంధారి, బాన్సువాడ, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసులు గాలింపులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో దొంగలు లేరని నిర్ధారించుకునే వరకు ఈ గాలింపులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం కాల్పులు జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, కామారెడ్డి డిఎస్పీ భాస్కర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
లింగంపేట్ మండలంలోని శెట్పల్లి గ్రామ రహదారి వద్ద దొంగలు పోలీసులకు చిక్కకుండా బుధవారం తెల్లవారుజామున 4.30గంటలకు చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులను గుర్తించి దొంగలు తమ వాహనాన్ని అతి వేగంగా పోలీసుల పైకి తీసుకురావడంతో స్థానిక ఎస్‌ఐ పల్లె రాకేశ్‌గౌడ్ వారిపై కాల్పులు జరిపారు. అయినప్పటికీ దొంగలు తప్పించుకున్నారు. మెదక్ జిల్లా పోలీసులు నాగిరెడ్డిపేట్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. దొంగలు నాగిరెడ్డిపేట్ వైపు కాకుండా మాల్తుమ్మెద నుండి శెట్పల్లి సంగారెడ్డి గ్రామం మీదుగా లింగంపేట్ వైపు వచ్చినట్లు తెలిపారు. దొంగలు ఇటువైపు వస్తున్నట్లు సమచారం రావడంతో ఎస్‌ఐ రాకేశ్‌గౌడ్ తన సిబ్బందితో కలిసి కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై శెట్పల్లి గ్రామ రహదారి వద్ద కాపు కాశారు. ఇటువైపుగా వచ్చిన దొంగలు పోలీసుల వాహనాన్ని గమనించి తమ వాహన వేగాన్ని పెంచి పోలీసుల పైకి దూసుకువచ్చినట్లు తెలిపారు. శెట్పల్లి సంగారెడ్డి గ్రామం మీదుగా లింగంపేట్‌కు వచ్చిన దొంగలు వారి వాహనాన్ని గుర్తు పట్టకుండా లైట్లు ఆప్ చేసుకొని అతి వేగంగా వాహనంతో పారిపోయినట్లు తెలిపారు.

ఎలా చెబితే పనిచేస్తారు..
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై కలెక్టర్ ఆగ్రహం
బోధన్, డిసెంబర్ 16:గ్రామాలలో ఖాళీగా ఉన్న కూలీలకు ఉపాధి కల్పించకుంటే వారు ఏమి తిని కడుపు నింపుకుంటారని జిల్లా కలెక్టర్ యోగితారాణా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై మండి పడ్డారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఉపాధి హామీ పథకంపై సమీక్ష జరిపారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం అడుగడుగునా బయట పడటంతో కలెక్టర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధి హామీ పథకమనేది సిబ్బంది కోసమా....కూలీల కోసమా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. నిరుపేద కూలీలకు పనులు కల్పించకుండా టైంపాస్ డ్యూటీలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాలలో సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్నారు. ఎన్ని సార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ఎలా చెబితే మీరు పనిచేస్తారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని ప్రభుత్వం సూచిస్తుంటే క్షేత్ర స్థాయిలోని సిబ్బంది మాకేంటీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఇక నుండి పనితీరులో మార్పు రాకుంటే విధులలో నుండి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బోధన్, మద్నూర్, రెంజల్, వర్ని, జుక్కల్, కోటగిరి మండలాల ఉపాధి హామీ ఏపివోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల పై జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. ఒక నెల వేతనంలో సగం వేతనాన్ని నిలిపివేయాలని అక్కడే ఉన్న జిల్లా అధికారులను ఆదేశించారు. వందశాతం పనులు కల్పించకుంటే వచ్చే నెలలో విధులలో నుండి తొలగాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం రూరల్ వాటర్ సప్లయ్, రోడ్లు భవనాల శాఖ, వైద్య శాఖలపై సమీక్షలు జరిపారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనేక గ్రామాలలో గర్భిణి మహిళలు కాన్పుల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పులు జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో వసతులు మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఎటిఎంల దోపిడీతో పోలీసుల కలవరం
డివిజన్‌లో విస్తృత తనిఖీలు
లింగంపేట్‌లో కాల్పుల ఘటన
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఐజి నవీన్‌చంద్

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, డిసెంబర్ 16: నిజామాబాద్, మెదక్ జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఎటిఎంలను ధ్వంసం చేస్తు డబ్బులను దోచుకెళ్లి పోలీసులకు సవాల్ విసిరారు. మంగళవారం వేకువజామున జిల్లాలోని కోటగిరి, వర్ని మండలాల్లో పలు బ్యాంకులకు చెందిన ఎటిఎంలను ధ్వంసం చేసి 40లక్షలకు పైగా డబ్బులను లూటీ చేశారు. తాజాగా బుధవారం వేకువజామున మెదక్ పట్టణంలోని ఆటోనగర్, కౌడిపల్లిలో దొంగలు ఎటిఎంలను ధ్వంసం చేసి పోలీసుల అలజడిని గుర్తించి బొలెరా వాహనంలో నిజామాబాద్ జిల్లా కేంద్రం వైపు పారిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన మెదక్ డిఎస్పీ రాజారత్నం కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌కు సమాచారం అందించారు. దీంతో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బంది అలర్టు అయ్యారు. బుధవారం వేకువజామున 5గంటల నుండి 9గంటల వరకు అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, సిఐలు రోడ్లపై వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రత్యేకంగా బొలెరా వాహనంపై దృష్టి సారించారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని దొంగలు ప్రవేశించారు. రోడ్లపై విధులు నిర్వహిస్తున్న లింగంపేట్ ఎస్‌ఐ పల్లె రాకేశ్ మెంగారం గ్రామం వద్ద దొంగలు ప్రయాణిస్తున్న బొలెరా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా పారిపోయారు. దీంతో ఎస్‌ఐ రాకేశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపినప్పటికీ దొంగలు పారిపోయారు. దీంతో డిఎస్పీ భాస్కర్ నేతృత్వంలో సిఐలు, ఎస్‌ఐలు, సిసిఎస్, ప్రత్యేక సిబ్బంది లింగంపేట్, గాంధారి, సదాశివనగర్, ఎల్లారెడ్డి అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. దొంగలు అటవీ ప్రాంతం వైపు పారిపోవడంతో పోలీసులు భారీ బలగాలను రప్పించారు. ఈ సంఘటనతో కామారెడ్డి డివిజన్‌లో పెద్ద ఎత్తున పోలీస్ తనిఖీలు చేపట్టారు. డివిజన్‌లోని జాతీయ రహదారులతో పాటు ఎల్లారెడ్డి-నిజాంసాగర్ రూట్, బాన్సువాడ రూట్లతో పాటు నిజాంసాగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్, దేవునిపల్లి, టేక్రియాల్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు వ్యుహరచన చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వరుసగా ఎటిఎం దోపిడీలతో పాటు జిల్లాలో దొంగతనాలు చేస్తు పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాగిరెడ్డిపేట్: మెదక్ పట్టణంలో మంగళవారం రాత్రి ఎటిఎంలో దొంగతనానికి పాల్పడిన దొంగలను నాగిరెడ్డిపేట్ పోలీసులు స్టేషన్ వద్ద కాపు కాసి పోలీస్‌స్టేషన్ నుండి లింగంపేట్ మండలం వరకు వెంబడించిన సంఘటన నాగిరెడ్డిపేట్ మండలంలో చోటు చేసుకుంది. ఎఎస్‌ఐ కిష్టయ్య తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలో దొంగల ముఠా ఎటిఎంలో చోరీకి పాల్పడి బొలెరో వాహనంపై నాగిరెడ్డిపేట్ మండలం వైపు వస్తున్నట్లు మెదక్ పోలీసులు బుధవారం వేకువజామున సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే తాము అప్రమత్తమై పోలీస్‌స్టేషన్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీని నిలిపామన్నారు. బొలెరా వాహనంలో దొంగల ముఠా పోలీస్‌స్టేషన్ సమీపం వరకు రాగానే పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా రోడ్డుపై ఉంచిన లారీని చూసి పోలీసులు అప్రమత్తం అయ్యారని గ్రహించిన దొంగలు వాహనాన్ని వెనక్కి మళ్లించి వెనుదిరిగారు. స్థానిక పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. మాల్తుమ్మెద గేటు వద్ద లింగంపేట్ మండలంలోని మెంగారం రోడ్డువైపు దొంగల ముఠా వాహనాన్ని మళ్లించారు. వెను వెంటనే లింగంపేట్, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అంతంటా అప్రమత్తం అయ్యారు. ఎస్‌ఐ పల్లె రాకేశ్ తన సిబ్బందితో వాహనంపై వచ్చారు. అక్కడి నుండి దొంగల ముఠా వాహనం కన్పించకుండా తప్పించుకోని పోయిందని తెలిపారు.

పోలీసుల ముమ్మర గాలింపు
గాంధారి, డిసెంబర్ 16: కోటగిరి, వర్ని మండలాల్లో గత రాత్రి ఎటిఎంలను ధ్వంసం చేసి దాదాపు 43 లక్షల రూపాయలు చోరీకి పాల్పడిన దొంగలు గాంధారి మండలంలో సంచరించారనే సమాచారం మేరకు వారికోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి డీఎస్పీ భాస్కర్, ఎల్లారెడ్డి సిఐ అనిల్‌కుమార్, లింగంపేట్ ఎస్‌ఐ పల్లె రాకేష్ తదితరలు గాంధారి మండలంలోని చద్మల్, యాచారం, సీతాయిపల్లి, గండీవేట్ తదితర గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
గత రాత్రి చోరీకి పాల్పడిన దొంగలు బొలేరో వాహనంలో మెదక్‌లో మరో ఎటిఎం వద్ద కనిపించగా అక్కడ రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని గమనించగా వారు అక్కడి నుండి తప్పించుకుని లింగంపేట్ మండలంలోని శట్పల్లి సంగారెడ్డి మీదుగా లింగపేట్ వైపు వస్తున్నారన్న సమాచారం అందుకున్న లింగంపేట్ ఎస్‌ఐ పల్లె రాకేష్, గాంధారి ఎస్‌ఐ రవికుమార్‌లు గస్తీ నిర్వహించారు. అనంతరం దొంగలు వాహనంలో లింగంపేట్ మండలంలోని మెంగారం వద్ద ఉన్న ఎస్‌ఐ రాకేష్‌ను తప్పించుకుని అదే మండలంలోని భవానీపేట్ మీదుగా గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామం వైపు వచ్చారని, అక్కడి నుండి గండీవేట్, గండీవేట్ తండా వరకు వెళ్లారని, ఈ విషయాన్ని ఆయా గ్రామాల ప్రజలు వివరించారు. తెల్లవారు జామున పై గ్రామాల్లో వాహనం రావడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులు వచ్చారని, కాదు ఎక్సైజ్ అధికారులు వచ్చారని అనుకున్నట్లు తెలిపారు. కాగా దొంగలు గండీవేట్ తండా మీదుగా చెరువు కట్టమీదకు వెళ్లారని, అక్కడి నుండి దారిలేకపోవడంతో వెనుదిరిగి ఎటు వెళ్లారో తెలియదని గ్రామస్థులు తెలిపారు. కట్టమీదకు వెళ్లిన దొంగలకు దారిలేకపోవడంతో తిరిగి వాహనాన్ని రివర్స్ తీస్తుండగా వాహనం లైటు దెబ్బతిందని, వారు ప్రయాణిస్తున్న వాహనానికి ఒకే లైటు ఉందని తెలిపారు. దొంగలు గాంధారి మండలంలోని తలదాచుకుని ఉంటారనే అనుమానంతో మండలంలో చద్మల్, సీతాయిపల్లి, గండీవేట్ తదితర గ్రామాల్లోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించారు. చద్మల్, యాచారం గ్రామాలకు వెళ్లిన అనంతరం గాంధారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశామని, వారిని తప్పకుండా పట్టుకుంటామని వివరించారు.
పోలీసుల అదుపులో ఐదుగురు
అనుమానితులు..?
గాంధారి పోలీసులు ఐదుగురిని అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పై ఐదుగురిలో ముగ్గురు బొలెరో వాహనంలో గాంధారికి వచ్చి హోటల్ టిఫిన్ చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మరో ఇద్దరిని చద్మల్ శివారులో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారితో పాటు బొలెరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం. కాగా పై ముగ్గురు గాంధారి మండలంలోని బోరు బండి వాహనం వద్ద పని చేస్తారని, వారికి సంబంధించిన వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారి వివరాలు తెలియజేసినట్లు తెలిసింది.

ఆహార కల్తీపై అవగాహన కల్పించాలి
జె.సి రవీందర్‌రెడ్డి
కంఠేశ్వర్, డిసెంబర్ 16: వినియోగదారుల వారోత్సవాల్లో ఆరోగ్య ఆహారం - ఆహార కల్తీపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి సూచించారు. బుధవారం జె.సి తన చాంబర్‌లో వినియోగదారుల వారోత్సవాలు, జాతీయ వినియోగదారుల దినోత్సవ ఏర్పాట్లపై అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 24న ఉన్నందున 17 నుండి 23వ తేదీ వరకు వారోత్సవాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం నినాదం ‘సురక్షిత, ఆరోగ్యకమరమైన ఆహారం - ఆహార కల్తీని ఎదుర్కోవడం’ అనే అంశంపై పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలను తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించాలన్నారు. ఈ పోటీల్లో గెలుపొంది మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు పారితోషికాలు అందించాలన్నారు. అదేవిధంగా మూడు భాషల్లోని కళాశాల, పాఠశాల స్థాయిలో మొదటి బహుమతి పొందిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.
ఈ వారోత్సవాల్లో వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు క్యాంపులు, సెమినార్లు, సమావేశాలు, ర్యాలీలు, వినియోగదారుల రక్షణ, సంక్షేమంపై కార్యఅకమాలు నిర్వహించాలన్నారు. లీగల్ మెట్రాలజీ, వాటర్ వర్క్స్, పురపాలక సంఘాలు, విద్యుత్ శాఖ, వాణిజ్య పన్నులు, పరిశ్రమలు, వైద్యారోగ్యం, రవాణా, వినియోగదారుల సంఘాలను భాగస్వామ్యం చేసి విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.