నిజామాబాద్

పునర్ వ్యవస్థీకరణ పూర్తయినా...వీడని చిక్కుముడులెన్నో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 13: జిల్లాల పునర్ వ్యవస్థీకరణను శరవేగంగా చేపట్టి నిర్ణీత ముహూర్తం నాటికే ఈ ప్రక్రియను తెరాస ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ, కొత్త జిల్లా, మండలాలు, ఆయా ప్రాంతాల విలీనాల విషయమై ఇంకనూ పేచీ కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామం కాస్త అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర ఇబ్బందికరంగా నిలుస్తోంది. నిజామాబాద్‌తో పాటు ఇటీవలే నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాల నుండి అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల నుండి అధికార తెరాస పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలు, ఎంపిలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో తమ అభీష్టానికి అనుగుణంగా అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోయారని ప్రజలు వారిపై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. దీంతో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు వల్ల ఒనగూరే ప్రయోజనం మాటేమో కానీ, అన్ని ప్రాంతాల వారిని సర్దిచెప్పడం, నిరసనల వేడిని చల్లార్చడం తలనొప్పి వ్యవహారంలా తయారైందని పలువురు నేతలు తమ అనుయాయుల ముందు వాపోయినట్టు తెలిసింది. బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లానని, ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ ఏర్పాటైన తరహాలో సమీప భవిష్యత్తులోనే బాన్సువాడకు జిల్లా హోదా కూడా సమకూరేందుకు అవకాశాలు లేకపోలేదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమాధానపర్చే ప్రయత్నాలు చేసినప్పటికీ, విపక్షాలన్నీ ఏకతాటిపై చేరి జిల్లా సాధనే లక్ష్యంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు మంత్రి పోచారం ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ సెగ్మెంట్ పరిధిలోని బీర్కూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో విలీనం చేయగా, తమ ప్రాంతాన్ని యథాతథంగా నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు పట్టుబడుతున్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలోని వర్ని మండలం మోస్రాను కొత్త మండలంగా ప్రకటించాలని నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ సెగ్మెంట్‌లోనూ ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. రెంజర్లను కొత్త మండలాల జాబితాలో చేర్చకపోవడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఏకంగా ఎమ్మెల్యే పేరుతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేసి, ఆయన ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటైన ఏర్గట్ల మండలంలో తొర్తిని కలుపవద్దని, యథాతథంగా మోర్తాడ్‌లోనే కొనసాగించాలని గ్రామస్థులంతా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి విజ్ఞాపనలు సమర్పించారు. తమ అభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకుని నిరసన కార్యక్రమాలకు సమాయత్తం అవుతున్నారు. ఇక ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోనూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆర్మూర్‌లోని ఆలూరు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ విషయమై ఆలూరు కేంద్రంగా ఆర్మూర్ రూరల్ మండలం ఏర్పాటు తథ్యమంటూ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా పలుమార్లు పేర్కొనడం జరిగింది. అయితే తుది జాబితాలో ఆలూరుకు కొత్త మండలాల జాబితాలో స్థానం దక్కకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. తమ డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన సమయంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విదేశీ పర్యటనల్లో నిమగ్నమయ్యారని అసంతృప్తి వెళ్లగక్కుతూ, ఎమ్మెల్యేను గ్రామానికి రానివ్వకూడదని, ఎవరూ సంప్రదించవద్దని కట్టుబాట్లు విధించుకున్నారు.
ఇదే రీతిలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై మాక్లూర్ మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు సైతం అసంతృప్తితో కనిపిస్తున్నారు. మాక్లూర్‌ను నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే యథాతథంగా కొనసాగించాలని మండల సమావేశంలో తెరాసకు చెందిన సభ్యులు సైతం అభిప్రాయపడుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేసినప్పటికీ, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తమ అభీష్టానికి విరుద్ధంగా తన మొండిపట్టుతో మాక్లూర్‌ను ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో చేర్చారని కినుకు వహిస్తున్నారు. ఇదే తరహాలో విలీనాల విషయమై మద్నూర్, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, సదాశివనగర్ తదితర మండలాల్లోనూ పేచీ కొనసాగుతోంది.