నిజామాబాద్

రైతుల ఆర్థిక ప్రగతికి తొలిమెట్టు సహకార సంఘాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 29: రైతులు అన్ని విధాలుగా నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే సహకార సంఘాలే వారికి తొలిమెట్టుగా ఉపయోగపడతాయని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అన్నారు. శనివారం నిజామాబాద్ మార్కెట్ యార్డులోని సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, రవాణా శాఖ అధికారులు, ఐకెపి సిబ్బంది, కమిషన్ ఏజెంట్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులతో ప్రాథమిక సహకార సంఘాలకు ఎంతో అనుబంధం ఉంటుందని, దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ రైతులను మార్కెట్‌కు చేరువ చేసేందుకు సొసైటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం రైతులకు వారు ఆరుగాలం శ్రమించిన పండించిన పంట ఉత్పత్తులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇ-నామ్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ధరల విషయంలో ఎలాంటి వ్యత్యాసానికి తావు లేకుండా రైతులు మోసపోకూడదనే ప్రధాన ఉద్దేశ్యంతో ఇ-నామ్‌ను నెలకొల్పారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70సంవత్సరాలు గడిచినప్పటికీ, రైతుకు మాత్రం తాను పండించిన పంటకు ధర నిర్ణయించే విషయంలో స్వాతంత్య్రం రాలేదని, ఈ పరిస్థితిలో మార్పు తేవాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం పలు నూతన విధానాలను అవలంభిస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, మార్కెటింగ్ శాఖా మంత్రి టి.హరీష్‌రావుల కృషితో నిజామాబాద్ మార్కెట్ యార్డు కూడా జాతీయ స్థాయిలో చోటు దక్కించుకుని ఇ-నామ్ పద్ధతిని ప్రవేశపెట్టారని అన్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 28 మార్కెట్‌లను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లుగా గుర్తించగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో ఐదు మార్కెట్‌లకు చోటు దక్కిందని, వాటిలో నిజామాబాద్ జిల్లాకు కూడా స్థానం కల్పించారని వివరించారు. ఈ సదస్సులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డిసిసిబి చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి, ఆర్డీఓ యాదిరెడ్డి, ఆంధ్రా బ్యాంకు ఎజిఎం సుధాకర్, డిసిఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేకాట ఆడితే కఠిన చర్యలు : కమిషనర్ కార్తికేయ
ఇందూర్, అక్టోబర్ 29: కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పేకాట జూదాన్ని ఆడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ హెచ్చరించారు. దీపావళి పండుగ ముసుగులో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి జూదరులను ఆకర్షించే వారితో పాటు పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పేకాటను నిషేధించడం జరిగిందని, దీపావళి పండుగను ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఎక్కడ పేకాట ఆడినా 9490618000కు లేదా, సమీప పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కమిషనర్ తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిపై హిస్టరీ షీట్లు ఓపెన్ చేసి, వారి ఫోటోలను పోలీస్ స్టేషన్లలో అతికించడం జరుగుతుందన్నారు.
వన్‌టౌన్‌ను తనిఖీ చేసిన కమిషనర్
ఇదిలా ఉండగా, నగరంలోని ఒకట టౌన్‌ను పోలీస్ కమిషనర్ కార్తికేయ శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఠాణాలో రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిపట్ల మర్యాదగా మెసులుకోవాలని సూచించారు. పోలీసు కమిషనర్ వెంట ఓఎస్‌డి రాహుల్‌హెగ్డే, సిఐ రవీందర్, ఎస్‌ఐలు రాఘవేందర్, సురేష్ తదితరులు ఉన్నారు.

ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, అక్టోబర్ 29: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారయణ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 7వ తేది నుండి జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించారు. ప్రమాదాలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్ష తప్పదని హెచ్చరించారు. జాతీయ రహదారులపై తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోని ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. కామారెడ్డి పట్టణంలో అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ చేస్తున్నారని, వాటిపై పోలీసులు దృష్టి సారించాలన్నారు.
సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తాం: ఎస్పీ శే్వత
రోడ్డు ప్రమాదాల నివారణకై సిసి కెమెరాలతో పాటు పలు చర్యలు చేపడుతామని జిల్లా శే్వత అన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన స్థలాలను గుర్తించి సంబంధిత నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. హైవే రహదారులపై సంబంధిత కంపెనీల ప్రతినిధులతో రోడ్డు ప్రమాదాలపై చర్చించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతామన్నారు.

నిబంధనలు నిబంధనలే.. పేకాట పేకాటే..!
దీపావళి సంప్రదాయంగా కొనసాగుతున్న జూదం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, అక్టోబర్ 29: పేకాట జూదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నిజామాబాద్ జిల్లాలో దీపావళి వేడుక మూడుముక్కలాటకు మరింత ఊపునందించనుంది. ఇక్కడ పేకాట మహమ్మారి వేళ్లూనుకుపోయిన విషయం గురించి రాజధాని వరకు కూడా చర్చ కొనసాగుతుందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ పర్యటనకు హాజరై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రత్యేకంగా ఇక్కడ పేకాట జూదం జోరు గురించి ప్రస్తావిస్తూ, దానిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారంటే మూడు ముక్కలాటలో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకత ఏపాటిదో ఊహించవచ్చు. ఇది ముమ్మాటికీ వాస్తవమేనని నిరూపించే తరహాలో ఇటీవలి కాలంలోనే పోలీసుల దాడుల సందర్భంగా పెద్ద ఎత్తున జూదరులు పట్టుబడి, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఉన్నతాధికారులంతా మకాం వేసే నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ప్రాంతంలో పలుకుబడి కలిగిన పెద్దలు పేకాట ఆడుతుండగా, పోలీసులు దాడి చేసిన సమయంలో భారీగా నగదు, కార్లు, సెల్‌ఫోన్లు పట్టుబడ్డాయి. అదేవిధంగా బోధన్ రూరల్ ఠాణా పరిధిలోనూ సుమారు 2లక్షల రూపాయల పై చిలుకు మొత్తాన్ని జూదరుల నుండి స్వాధీనం చేసుకోగలిగారు. బాన్సువాడ ఠాణా పరిధిలోనైతే పేకాట ఆడుతూ ఏకంగా మాజీ ఎమ్మెల్యే పట్టుబడ్డారు. ఇలా సాధారణ సమయాల్లోనే విచ్చలవిడిగా కొనసాగే పేకాట జూదం, దీపావళి పర్వదినాల సందర్భంగానైతే అడ్డూఅదుపూ లేకుండా సాగుతుంది. ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారుతాయి. పలు నివాస ప్రాంతాలు మొదలుకుని దుకాణాలు, లాడ్జిలు, ఫాంహౌస్‌లు ఇలా కాదేదీ జూదానికి అనర్హం అన్న చందంగా విలసిల్లుతాయి. ప్రతిఏటా వస్తున్న ఆనవాయితీని పురస్కరించుకుని ఈసారి కూడా జూదం నిర్వహకులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ నగరం, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి వంటి పట్టణాలతో పాటు రెండు జిల్లాల పరిధిలోనూ పేకాట స్థావరాలు ఏర్పాటయ్యాయని సమాచారం. రెండు రోజుల పాటు పగలు, రాత్రి తేడాలేకుండా పత్తాలాటలోనే జూదప్రియులు నిమగ్నమైపోతారు. సాధారణ సమయాల్లోనే పేకాట స్థావరాలపై అంతంతమాత్రంగా నిఘా కొనసాగిస్తున్న పోలీసులు, దీపావళి సందర్భంగా పేకాట జూదాన్ని నియంత్రిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగానే మారింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని జూదం నిర్వహకులు కేటీ రూపంలో పెద్దఎత్తున డబ్బులు సంపాదించేందుకు సన్నద్ధమయ్యారు. జూదరులకు తమతమ అడ్డాల వద్ద ఆకర్షించేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పలు నివాస ప్రాంతాలకు ప్రత్యేక హంగులు సమకూరుస్తూ అధునాతన పేకాట స్థావరాలుగా తీర్చిదిద్దినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మార్కెట్ యార్డు, ఫైనాన్స్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ ఎవరికివారు పేకాట జూదం ఆడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. గంజ్ ప్రాంతంలో బడా వ్యాపారులు పెద్దమొత్తంలో జూదం ఆడనుండగా, లక్షలాది రూపాయలు చేతులు మారనున్నాయి. దీపావళి సందర్భంగా పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిఏటా హెచ్చరిస్తున్నప్పటికీ, జూదం నిర్వహణను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. కొంతమంది పోలీసు అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్వహకుల నుండి పెద్దఎత్తున ముడుపులు పుచ్చుకుని పేకాట వైపు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ జోక్యం సైతం మితిమీరడంతో అధికారులు మిన్నకుండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పేకాట క్లబ్బులు, అడ్డాల వైపు వెళ్లకూడదంటూ రాజకీయ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. ఫలితంగా జూదాన్ని నియంత్రించే సాహసాన్ని పోలీసులు కనబర్చడం లేదు. పేకాట జూదంలో అదృష్టం కలిసివచ్చి రాత్రికి రాత్రే కొంతమంది లక్షాధికారులుగా మారుతుండగా, మరికొంత మంది బికారులవుతున్నారు. చేతిలో డబ్బులు లేని సమయంలో స్థిరాస్తుల దస్తావేజులను సైతం తాకట్టు పెట్టేందుకు వెనుకాడడం లేదు. జూదం మహమ్మారి వల్ల కొంతమంది తమ ప్రాణాలనే కోల్పోయిన సంఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకున్నాయి. పేకాటలో ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించడంతో మనస్థాపం చెంది పలువురు ఆత్మహత్య చేసుకోగా, మరికొంత మంది హత్య గావించబడ్డారు. జూదంలో పెద్ద మొత్తంలో సొమ్ము గెలిచిన వ్యక్తుల నుండి ఆ మొత్తాన్ని కాజేయాలన్న దురాశతో తోటి జూదరులే పలువురిని హతమార్చారు. దీంతో అనేక కుటుంబాలు దిక్కులేని అనాథలుగా మిగిలాయి. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా పేకాట జూదం నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేతనాలందక ఉపాధి హామీ కూలీలు విలవిల
మూడు నెలలుగా బకాయిల కోసం ఎదురుతెన్నులు
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, అక్టోబర్ 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలులో భాగస్వాములై వాటిని విజయవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన మూడు మాసాల నుండి వారికి వేతనాలను చెల్లించకపోవడంతో అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నారు. దసరా, దీపావళి వంటి పండుగ వేళల్లోనూ వేతనాలు చేతికందకపోవడంతో ఈ వేడుకలను కూడా ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోలేని దైన్య స్థితి నెలకొందని ఇజిఎస్ కూలీలు వాపోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఉపాధి హామీ కూలీలకు సుమారు 47కోట్ల రూపాయల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉండగా, పై నుండి నిధులు మంజూరు కావడం లేదంటూ అధికారులు నిస్సహాయతను వెలిబుచ్చుతున్నారు. ఈ విషయమై గత ఐదు రోజుల క్రితం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు ఉపాధి కూలీల వేతన బకాయిలను ప్రస్తావిస్తూ అధికారులను నిలదీయడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి పోచారం స్పందిస్తూ, పలు కారణాల వల్ల వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరగడం వాస్తవమేనని, త్వరలోనే బకాయిలు విడుదలవుతాయని పేర్కొనడం జరిగింది. విదేశాల్లో బతుకమ్మ సంబరాలు ముగించుకుని వచ్చిన మీదట ఇటీవల బాల్కొండ మండలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలోనూ నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితతో ఉపాధి హామీ కూలీలు మొర పెట్టుకున్నారు. మూడు మాసాలుగా వేతనాలు అందించడం లేదని, ఫలితంగా తమ కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రెండున్నర లక్షల పైచిలుకు మంది ఉపాధి హామీ కూలీలకు 47కోట్ల రూపాయల పైచిలుకు నిధులను వేతనాల రూపంలో పంపిణీ చేయాల్సి ఉంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాగా కొనసాగిన సమయంలోనే కలెక్టర్ యోగితారాణా ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఉపాధి పనులను ముమ్మరంగా చేపట్టడంతో జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు అవార్డు లభించి ప్రత్యేక గుర్తింపు దక్కింది. హరితహారం అమలులోనూ ఉపాధి హామీ కూలీలు క్రియాశీలక పాత్ర పోషించడంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలోనూ ఉపాధి హామీ కూలీలు భాగస్వాములవుతున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, భూమి అభివృద్ధి పనులు, చెరువులు, కుంటల్లో పూడికతీత వంటి పనులను చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 4.80లక్షల పైచిలుకు జాబ్‌కార్డులు ఉండగా, సుమారు 2.78లక్షల మందికి పనులు కల్పించారు. జిల్లాలో వరుసగా రెండేళ్ల పాటు వర్షాభావం వెంటాడడంతో కరవు తీవ్ర స్థాయిలో ఉండడంతో జిల్లా యంత్రాంగం సైతం ఎక్కడికక్కడ అధికారులను క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపించి ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున గుర్తించింది. హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలు కూడా జత కలవడంతో ఇజిఎస్ కూలీలకు విస్తృత స్థాయిలో ఉపాధి లభించింది. కూలీలు కూడా అంతే ఉత్సాహంతో పనుల్లో పాల్గొన్నారు. అయితే మూడు మాసాలుగా వారికి నయా పైసా చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇంటిల్లిపాది పొద్దంతా కష్టపడితే లభించే కూలీ వేతనంతోనే రోజు గడుస్తుందని, అలాంటిది మూడు మాసాల నుండి వేతనాలు చెల్లించకపోవడంతో తామెలా మనుగడ సాగించాలని వారు ప్రశ్నిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ అర్ధాకలితో ప్రాణాలను నిలబెట్టుకుంటున్నామని, తమ పరిస్థితిని గమనించి ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలను విడుదల చేయాలని ఉపాధి హామీ కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

బూటకపు సర్వేలు ఆపండి
పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్
కంఠేశ్వర్, అక్టోబర్ 29: ముఖ్యమంత్రి కెసిఆర్ బూటకపు సర్వేలను ఆపి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని టి.పిసిసి అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విడిఎస్ అనే సంస్థ దేశంలో సర్వే నిర్వహించిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన సర్వే నిర్వహించారు, అసలు ఆ సంస్థకు ఏమీ అనుభవం ఉంది, తెలంగాణలో ఏ ఒక్క జిల్లాలోనైనా పర్యటించారా, ఎవరు సర్వే చేయించారు, ఇప్పుడు సర్వే ఎందుకు అవసరమైందని ఆయన ప్రశ్నల వర్షం గుప్పించారు. 37లక్షల రైతుల పట్టాపాస్ పుస్తకాలు బ్యాంకులలో తాకట్టు పెట్టారని, 14లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని, బీడీ, గీత, లంబాడీలు, కార్మికులను కలిసి సర్వే చేసారా, వీరిని కలిసి సర్వే చేస్తే ఆ సర్వేను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిపని చేసిన పాపులారిటీ వస్తుందని, చెడ్డపని చేసినా పాపులారిటీ వస్తుందని, అయితే సిఎం కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 87శాతం ప్రజలు తనకే అనుకూలంగా ఉన్నారంటూ సిఎం కెసిఆర్ దొంగ సర్వే చేయించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రజావ్యతిరేక పాలనకు పాల్పడుతున్నందున, సిఎం కెసిఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలు అటకెక్కాయని, నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరందించే మల్లన్నసాగర్‌పై సర్వే చేయిస్తావా అంటూ సిఎం కెసిఆర్‌కు సవాల్ విసిరారు. ఇచ్చిన వాగ్ధానాల్లో కనీసం 10శాతం కూడా అమలు చేయని సిఎం కెసిఆర్‌పై, 87శాతం మంది ప్రజలు ఏ విధంగా అనుకూలంగా ఉంటాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే 100రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హామీల వర్షం గుప్పించిన సిఎం కెసిఆర్, ఆయన కూతురు ఎంపి కవిత ఇంతర వరకు ఎందుకు నెరవేర్చలేదని మహేష్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజావైద్యం అధ్వాన్నంగా తయారైందని, రాజధానిలోని గాంధీ ఆసుపత్రిలో కనీసం నీటి వసతి కూడా లేదని, ఇక నిజామాబాద్‌లో జనరల్ ఆసుపత్రి పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బూటకపు సర్వేలతో కాలం వెళ్లదీసేందుకు ప్రయత్నిస్తున్న సిఎం కెసిఆర్‌కు, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, కేశ వేణు, మీసాల సుధాకర్, సుమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.