నిజామాబాద్

పంట నష్టాన్ని పరిశీలించిన కరవు బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 14: గత సెప్టెంబర్ చివరి వారంలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేంద్ర కరవు బృందం ఆది, సోమవారాలలో పై రెండు జిల్లాలను సందర్శించి భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టాన్ని పరిశీలించింది. కేంద్ర రహదారులు, రవాణా ప్రాంతీయ శాఖాధికారి ఎ.కృష్ణప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ అధికారి ఎస్‌కె.కొలాద్‌కర్, ఐఎఎస్ అధికారి జగన్‌మోహన్‌లతో కూడిన కేంద్ర బృందం స్థానిక అధికారులతో కలిసి పరిశీలన జరిపింది. తొలిరోజున పిట్లం, బిచ్కుంద తదితర మండలాల్లో పర్యటించిన కరవు బృందం, సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో జిల్లా స్థాయి అధికారులతో భేటీ అయ్యింది. ఆయా శాఖల వారీగా వాటిల్లిన నష్టం గురించి సంబంధిత అధికారులు కరవు బృందానికి నివేదించారు. అతివృష్టితో ఆయా ప్రాంతాలు ఏ రీతిన అతలాకుతలం అయ్యాయనేది ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ దృశ్యాలను చూసి కేంద్ర కరవు బృందం సభ్యులు ఒకింత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు లక్షా 50వేల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లగా, అత్యధికంగా లక్ష ఎకరాల పైచిలుకు సోయా పంటను రైతులు పూర్తిగా కోల్పోవడం జరిగిందని అధికారులు కరవు బృందం దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉద్ధృతంగా ప్రవహించిన వరదల ధాటికి ఒకే రోజున 10మంది మృత్యువాతపడడం, అంతకుముందు మరో నాలుగు నిండు ప్రాణాలను భారీ వర్షాలు బలిగొన్న సంఘటనల గురించి పూర్తి వివరాలు అందించారు. ప్రగతిభవన్‌లో సమీక్ష సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి స్వయంగా దృశ్య రూపకంలో జిల్లాలో జరిగిన నష్టాన్ని తెలియజేశారు. వరుసగా రెండేళ్ల పాటు తీవ్ర వర్షాభావం నెలకొనడంతో రైతులు పంటలు సాగు చేయలేక ఆర్థికంగా చితికిపోయారని, అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభం నుండి సమృద్ధిగా వర్షాలు కురియడంతో రైతులు పెద్ద ఎత్తున ఖరీఫ్ పంటల సాగు చేపట్టారని ఇంచార్జ్ కలెక్టర్ వివరించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 20 నుండి 26వ తేదీ వరకు ఏకబిగిన కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని, ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయని, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయని, చెరువుల కట్టలు తెగిపోయాయని కరవు బృందం దృష్టికి తెచ్చారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి 33 చెరువులు, కుంటలు తెగిపోగా, వాటి తాత్కాలిక మరమ్మతుల కోసం 43.64లక్షల రూపాయలను వెచ్చించామని అన్నారు. వీటికి శాశ్వత మరమ్మతులు జరిపించాలంటే సుమారు 3.19కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేశామన్నారు. వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 4లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని, 2095 వరకు నివాస గృహాలు దెబ్బతిన్నాయని, 31పశువులు మృత్యువాత పడ్డాయని అన్నారు. జిల్లాలో 37వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో సోయా పంటకు నష్టం చేకూరగా, ఐదు వేల హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, మొత్తంగా 43,687హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వివిధ రకాల పంటలను రైతులు నష్టపోయారని అన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ శాఖకు సుమారు కోటీ 9లక్షల రూపాయల నష్టం జరిగిందని, అనేక గ్రామాలు జలదిగ్బంధంలో రోజుల తరబడి చిక్కుకుని రోడ్లు ధ్వంసమవగా, వాటి తాత్కాలిక మరమ్మతుల కోసం 38.20లక్షల రూపాయలను ఖర్చు చేశామన్నారు. పంచాయతీరాజ్ రోడ్ల శాశ్వత మరమ్మతుల కోసం 638.85లక్షల రూపాయల నిధులు అవసరమని అంచనా వేశామన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి రోడ్లకు తాత్కాలికంగా 4.33కోట్ల రూపాయలతో మరమ్మతులు జరిపించామని, శాశ్వత మరమ్మతుల కోసం 92కోట్ల రూపాయల వరకు నిధులు అవసరమవుతాయని కరవు బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర కరవు బృందం సభ్యులు కృష్ణప్రసాద్, కొలాద్‌కర్, జగన్‌మోహన్‌లు మాట్లాడుతూ, జిల్లాలో తాము పరిశీలన జరిపిన అంశాలతో సమగ్ర నివేదికను రూపొందించి కేంద్రానికి సమర్పిస్తామని, విరివిగా సహాయం అందించేలా సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, ఇతర రైతు సంఘాల ప్రతినిధులు ప్రగతిభవన్‌లో కేంద్ర కరవు బృందాన్ని కలిసి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని, వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేలా చూడాలని విజ్ఞాపనలు అందించారు. అనంతరం కేంద్ర కరవు బృందం నవీపేట మండలం బినోల గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకుంది.