నిజామాబాద్

వీసాల పేరిట మోసగించిన గల్ఫ్ ఏజెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, నవంబర్ 15: నిరుద్యోగ యువతకు గల్ఫ్ దేశాల్లోని కంపెనీల్లో కొలువులు ఇప్పిస్తానని నమ్మబలుకుతూ పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసి, గల్ఫ్ పంపించకుండా నకిలీ వీసాలతో మోసగించిన ఓ గల్ఫ్ ఏజెంట్‌ను ఎడపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం కాశిగూడ గ్రామానికి చెందిన శేక్ రఫీ అలియాస్ శేక్ రఫీక్ అనే గల్ఫ్ ఏజెంటు గత కొన్నాళ్ల క్రితం ఎడపల్లితో పాటు దూపల్లి, బోధన్, నాగేపూర్, మోపాల్ తదితర ప్రాంతాల నిరుద్యోగ యువకులను కలిసి తాను గల్ఫ్ ఏజెంట్‌నని పరిచయం చేసుకున్నాడు. తన వద్ద విదేశీ కంపెనీలకు చెందిన వీసాలు ఉన్నాయని, పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని ఆశ కల్పించాడు. దీంతో సుమారు 27మంది యువకులు సదురు ఏజెంట్‌కు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పగా, గల్ఫ్ పంపించడంలో సదరు ఏజెంట్ తాత్సారం చేస్తూ వచ్చాడు. ఇటీవల పలువురు యువకులను గల్ఫ్ పంపించేందుకు ముంబాయి పంపించిన ఏజెంట్, అక్కడ తన అసిస్టెంట్లు ఉంటారని, మీరు విదేశాలకు వెళ్లే వరకు అన్ని వసతులు కల్పిస్తారని నమ్మబలికినట్లు దూపల్లి గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు తెలిపారు. ముంబాయి వెళ్లిన తర్వాత అక్కడ తమను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయారని, దీంతో నాలుగైదు రోజుల పాటు ముంబాయిలో ఉండి స్వగ్రామానికి తిరిగి వచ్చినట్లు పలువురు బాధితులు తెలిపారు. అంతేకాకుండా రఫీక్ నకిలీ వీసాలు కట్టబెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడని బాధితులు వాపోయారు. దీనిని గమనించిన ఎడపల్లికి చెందిన వి.రవికాంత్‌గౌడ్ అనే బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించి గల్ఫ్ ఏజెంటు రఫీక్ మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపిన పోలీసులలకు సదరు ఏజెంటు ఇదే తరహాలో మరింత మందిని మోసగించినట్టు విచారణలో వెల్లడైంది. బోధన్, దూపల్లి, మోపాల్, నర్గేపూర్ తదితర ప్రాంతాల్లో సుమారు పాతిక మందిని మోసగించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతేకాకుండా అతని సొంత గ్రామానికి చెందిన శేఖర్, అవేజ్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, శేక్ అహ్మద్, సుమన్ అనే వ్యక్తుల వద్ద నుండి కూడా వీసాలు సమకూరుస్తానంటూ 30వేల చొప్పున డబ్బులు వసూలు చేసి, పాస్‌పోర్టులు తీసుకుని ఎలాంటి వీసాలు సమకూర్చలేదని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పరారీలో ఉన్న గల్ఫ్ ఏజెంటు శేక్ రఫీక్‌ను గాలించి మంగళవారం అరెస్టు చేశామని, అతనిపై ఐపిసి 420సెక్షన్ కింద కేసు నమోదు చేశామని మంగళవారం ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బోధన్ రూరల్ సిఐ ఎస్.శ్రీనివాసులు తెలిపారు. గల్ఫ్ ఉద్యోగాలు కల్పిస్తామంటూ నకిలీ ఏజెంట్లు ప్రలోభాలకు గురి చేసి మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నందున నిరుద్యోగ యువత అలాంటి వారిని నమ్మరాదని ఈ సందర్భంగా సిఐ హితవు పలికారు. ఒకవేళ ఎవరైనా వీసా సమకూరుస్తామని చెబితే సదరు వ్యక్తి గల్ఫ్ ఏజెంట్‌గా గుర్తింపు పొంది ఉన్నాడా? లేదా? అనే విషయాలను ధ్రువీకరించుకోవడంతో పాటు గల్ఫ్‌లోని కంపెనీల స్థితిగతులు, వీసా సక్రమమైనదే అందించారా తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.సమావేశంలో ఎడపల్లి ఎస్‌ఐ ఆసిఫ్, హెడ్‌కానిస్టేబుల్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.