నిజామాబాద్

పంటరుణాల పంపిణీలో నిర్లిప్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 21: రైతాంగ సంక్షేమమే ప్రధాన ధ్యేయమంటూ పాలకులు గొప్పలు చెబుతున్నప్పటికీ, పంటల సాగు కోసం అన్నదాత అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాల్లో నీటి నిల్వలు చేరుకుని ప్రకృతి అనుకూలించడంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు పెద్దఎత్తున పంటలు సాగు చేశారు. అయితే వారికి పెట్టుబడుల రూపంలో రుణాలు సమకూర్చాల్సిన బ్యాంకర్లు ఉదాసీన వైఖరిని అవలంభించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ స్పందించకపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల వద్ద కూడా అప్పు పుట్టకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. జిల్లా యంత్రాంగం బ్యాంకర్లతో పదేపదే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని, రైతులకు సకాలంలో రుణాలు అందించాలంటూ సూచనలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 3250కోట్ల రూపాయల పంట రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో ఖరీఫ్ సీజన్‌లో 1950కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందించాల్సి ఉండగా, అతికష్టం మీద 74.07శాతం మేర 1444.43కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. అది కూడా సీజన్ చివరి సమయంలో ఆదరాబాదరాగా రుణాలు అందించడం, వాటిలో అత్యధిక శాతం రుణాలను రీషెడ్యూల్ చేస్తూ కొత్తగా అప్పులు ఇచ్చినట్టు పద్దుల్లో చూపించడం ద్వారా ఆ మేరకైనా లక్ష్యాన్ని సాధించినట్టు రికార్డుల్లో చూపుతున్నారు.
వాస్తవానికి రీషెడ్యూల్ అయిన వాటిని మినహాయిస్తే రైతులకు బ్యాంకుల నుండి చేతికందిన రుణం 40శాతానికి లోబడే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు పంట రుణాల పంపిణీపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, మెజార్టీ బ్యాంకులు కొర్రీలు పెడుతుండడం వల్ల రుణ పంపిణీ లక్ష్యానికి విఘాతం ఏర్పడుతోంది. బంగారు ఆభరణాలపై పంట రుణాలు వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినా డిసిసిబి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందించలేకపోయారు. ఇక ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన కౌలు రైతుల చట్టాన్ని అయితే బ్యాంకర్లు పరిహసించేలా చేస్తున్నారు. పట్టా రైతులతో పాటు కౌలు పద్ధతిన సాగుబడి కొనసాగించే వ్యవసాయ కూలీల కుటుంబాలను సైతం ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం వారికి రుణ అర్హత కార్డులను అందించగా, కనీసం పది శాతం మందికి కూడా బ్యాంకర్లు రుణాలు అందించని దుస్థితి నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రబీ సీజన్‌లోనైనా లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాల పంపిణీ జరగకపోవడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ప్రస్తుత రబీలో 1300కోట్ల రూపాయల పంట రుణాలు పంపిణీ చేయాలని వార్షిక ప్రణాళికలో పొందుపర్చారు. అయితే ఇప్పటివరకు కనీసం 7శాతం కూడా రుణాల పంపిణీ జరుగలేదు.
సకాలంలో పంటలు విత్తుకుని మార్చి మాసాంతంలోగా దిగుబడులు చేతికందేలా చూసుకోవాలని, లేనిపక్షంలో ఏప్రిల్ మాసంలో కురిసే అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కానీ సకాలంలో పంట నాటేందుకు అవసరమైన పెట్టుబడులను మాత్రం బ్యాంకులు రుణాల రూపంలో సమకూర్చడం లేదు. ఈ తంతు ప్రతీఏటా షరామామూలుగానే ఉంటూ వస్తోంది. ఈసారి రైతులు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓ వైపు బ్యాంకుల నుండి రుణాలు అందక, మరోవైపు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కూడా పెద్ద నోట్ల రద్దుతో పైకం నిండుకోవడంతో రైతులకు అప్పు పుట్టడమే గగనంగా మారింది. ప్రకృతి కరుణించి పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడమే అసలు సమస్యగా మారిందని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఖరీఫ్‌లో సోయా పంట సాగు చేసిన రైతులు సుమారు లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో అతివృష్టి వల్ల పంటను కోల్పోవాల్సి రావడంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో రబీలో పంటల సాగు చేపట్టి నష్టాలను పూడ్చుకుందామని భావిస్తున్న రైతులకు పెట్టుబడుల రూపంలో ఆదిలోనే చుక్కెదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు విరివిగా రుణాలందిస్తేనే రబీలో ఏరువాక ముందుకు సాగే పరిస్థితి ఉందని, లేనిపక్షంలో పంటల సాగుకు స్వస్తి చెప్పి మిన్నకుండిపోవడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నందున బ్యాంకర్లు నిర్లక్ష్య ధోరణిని విడనాడి, విరివిగా పంట రుణాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సిపి కార్యాలయంలో
బయోమెట్రిక్
వినాయక్‌నగర్, నవంబర్ 21: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు సమయాలను తుచ తప్పకుండా పాటించేందుకు వీలుగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. సోమవారం ఓఎస్‌డి రాహుల్‌హెడ్గే లాంఛనంగా బయోమెట్రిక్ హాజరును ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి మొదలుకుని ఇతర సిబ్బంది అందరూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరిస్తూ విధులకు హాజరయ్యారు. సిబ్బంది విధులకు హాజరయ్యే సమయంలో, తిరిగి సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రెండు పర్యాయాలు వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్ సిస్టమ్‌లో వారి హాజరును తీసుకోవడం జరుగుతుందని, ఈ విధానం వల్ల ఉద్యోగులు సరైన వేళలకు విధులకు హాజరై పూర్తి సమయం పాటు పని చేసేందుకు ఆస్కారం ఏర్పడిందని ఓఎస్‌డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.ఓ గులాంగౌస్ మొహియుద్దీన్, సూపరింటెండెంట్ జనార్ధన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

డబ్బుల కోసం రైతుల ఇక్కట్లు
మోర్తాడ్, నవంబర్ 21: పండించిన పంటను అమ్మినా, చేతుల్లో డబ్బులు చేరకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లోని సొసైటీలకు అధిక సంఖ్యలో తరలివచ్చిన రైతులు కూలీలకు వేతనాలు సైతం అందించేందుకు ఆస్కారం లేకుండాపోతోందని బ్యాంకు సిబ్బందితో మొర పెట్టుకున్నారు. మోర్తాడ్, ఏర్గట్ల సొసైటీలలో ఇటీవలే మొక్కజొన్న అమ్మకాలు పూర్తవగా, ప్రస్తుతం వరి ధాన్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు 70శాతం మంది రైతులకు మొక్కజొన్నలకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ధాన్యం అమ్మకాలకు సంబంధించి కూడా కొంతమందికి వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు బ్యాంకులు సందేశాలు పంపించాయి. అయితే ఆ డబ్బులను ఏకమొత్తంలో తీసుకునే అవకాశాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహకార శాఖల్లో పాత కరెన్సీలు చెల్లవంటూ ఆర్‌బిఐ స్పష్టం చేయడంతో లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉండే రైతుల ఖాతాలన్నీ సొసైటీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఒక్క ఏర్గట్ల సహకార బ్యాంకే 4కోట్ల రూపాయల మేర డిపాజిట్లు నమోదు చేయగలిగింది. ఇలాంటి సమయంలో రిజర్వ్ బ్యాంకు పాత కరెన్సీ చెలామణి నుండి సహకార బ్యాంకులను తప్పించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం ఏర్గట్ల బ్యాంకు తనిఖీ కోసం వచ్చిన డిసిసిబి చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారితో పాటు బ్యాంకు సిఇఓ అనుపమలతో రైతులు ఈ విషయమై మొర పెట్టుకున్నారు. కనీసం కూలీలకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని, తమ వద్ద ఉన్న నగదు నిల్వలన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని, అయితే బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో తమకు డబ్బులు ఇవ్వడం లేదని వాపోయారు. ప్రతీరోజు బ్యాంకుకు వస్తున్నప్పటికీ, డబ్బులు లేకపోవడంతో వెనక్కి మళ్లిపోతున్నామని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు కోరారు. డిసిసిబి చైర్మెన్ పట్వారి గంగాధర్‌రావు స్పందిస్తూ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులకు ప్రతిరోజు అవసరమైన మేర నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.

యుజిసి నిధుల కోసం కృషి చేయాలి
తెయు వి.సి సాంబయ్య
డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 21: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు, ప్రాజెక్టులు, పరిశోధనలు విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తామని, ఈ దిశగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ వర్శిటీ వి.సి సాంబయ్య సూచించారు. సోమవారం తెలంగాణ వర్శిటీలో వివిధ విభాగాధిపతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.సి మాట్లాడుతూ, 12వ పంచవర్ష ప్రణాళిక త్వరలోనే ముగియనున్నందున ప్రాజెక్టులు ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విభాగాల వారీగా కూడా పరిశోధనా ప్రాజెక్టులు, స్పెషల్ అసిస్టెన్స్ ప్రొగ్రాం సాధించాలని కోరారు. పరిశోధనా ప్రాజెక్టులు అధ్యాపకుల కెరీర్ అభివృద్ధి కోసం కూడా ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కాగా, డిసెంబర్ 15వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా పి.జి సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక క్లాసులు తీసుకుని డిసెంబర్ 8వ తేదీ లోగా సిలబస్‌ను పూర్తి చేయాలని గడువు విధించారు. అధ్యాపకులు సిలబస్ పూర్తి చేయడాన్ని తమ విధిగా భావిస్తూ పరీక్షల కోసం విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు మెస్ బకాయిలు చెల్లించేలా చూడాలని, వర్శిటీ వాస్తవ పరిస్థితి గురించి వారికి వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వై.జయప్రకాశ్‌రావు, సిఇఓ కనకయ్య, అదనపు సిఇఓ పాత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న డిసిసిబి ఉద్యోగుల ఆందోళన
వినాయక్‌నగర్, నవంబర్ 21: నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం ఎదుట మూడవ రోజైన సోమవారం కూడా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టి నిరసన చాటారు. పాత నోట్లను సహకార బ్యాంకుల్లో స్వీకరించరాదని ఆర్‌బిఐ ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సహకార బ్యాంక్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, 500, 1000రూపాయల పాత నోట్ల చెల్లింపులను సహకార బ్యాంకుల్లో నిషేధించడం వల్ల రైతులతో పాటు బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఈ చర్య వల్ల సహకార బ్యాంకుల పట్ల ప్రజల్లో నమ్మకం సడలిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. వాణిజ్య బ్యాంకుల తరహాలోనే సహకార బ్యాంకుల్లో కూడా పాత నోట్లను స్వీకరించేలా అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిసిసిబి బ్యాంకుల్లో బంద్ పాటిస్తామని, ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు బోజన్న, బాగిరెడ్డి, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సరఫరా మెరుగుకు 98కోట్లు
నగర మేయర్ సుజాత
కంఠేశ్వర్, నవంబర్ 21: నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా హైదరాబాద్‌లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్-ఇన్-చీఫ్ ద్వారా 98కోట్ల రూపాయలకు సాంకేతిక ఆమోదం ఇచ్చి టెండర్లను పిలువడం జరిగిందని నగర మేయర్ ఆకుల సుజాత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ జీవోనెం.252ను ఈ ఏడాది అక్టోబర్ 14న విడుదల చేసిందని, దీని ద్వారా 35 పట్టణాల్లో మంచినీటి అభివృద్ధి పథకాలు, మిషన్ భగీరథ అర్బన్ కింద యాన్యుటీ పద్ధతిలో పనులు చేపట్టేందుకు పరిపాలనా ఆమోదం ఇచ్చారని అన్నారు. 35పట్టణాలను ప్యాకేజీలుగా విభజించారని, 2వ ప్యాకేజీలో ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్‌లకు కలిపి 709.50కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపారన్నారు. నిజామాబాద్ నగరానికి మంచినీటి అభివృద్ధి అంచనా విలువ 98కోట్లుగా ఇఎన్‌సి వారు టెండర్లు పిలిచారని మేయర్ వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకాన్ని మిషన్ భగీరథకు అనుసంధానం చేస్తున్నామని, భగీరథ నీటిని వినియోగించుకునేందుకు తిలక్‌గార్డెన్ వద్ద నిర్మించబోయే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి మళ్లించి ఆ నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు.

23న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ
కంఠేశ్వర్, నవంబర్ 21: జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా స్థాయి వాలీబాల్ (సీనియర్ పురుషులు, మహిళల విభాగం) టోర్నీని నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కార్యదర్శి మల్లేష్‌గౌడ్‌లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. జిల్లా టోర్నీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ టోర్నీ నల్గొండలో ఈ నెల 30 నుండి డిసెంబర్ 3వ తేదీ వరకు కొనసాగనుందని తెలిపారు. జిల్లా టోర్నీలో పోటీపడే జట్లు ఉదయం 9గంటల వరకు నిర్వహణ కార్యదర్శి పవన్‌కుమార్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.
25న బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
కాగా, జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ (సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికలు) ఎంపిక పోటీలను ఈ నెల 25న నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.గణేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మినీ స్టేడియంలో ఉదయం 10.30గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. జూనియర్స్ విభాగంలో ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు 1997 జనవరి 2వ తేదీలోపు జన్మించి ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ టోర్నీ మహబూబ్‌నగర్‌లో డిసెంబర్ 3, 4తేదీలలో జరుగుతాయని వివరించారు. అలాగే జూనియర్స్ రాష్ట్ర టోర్నీ 10, 11వ తేదీల్లో నిజామాబాద్‌లోనే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పిజి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు 26
డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 21: తెలంగాణ విశ్వవిద్యాలయం పి.జి రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 26వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ పి.కనకయ్య తెలిపారు. వంద రూపాయల అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చని అన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల ఫీజు చెల్లింపు చివరి తేదీ కూడా నవంబర్ 26న ముగుస్తుందని, వంద రూపాయల అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చని సూచించారు. బిసిఎ రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబర్ 28 చివరి తేదీ అని, వంద రూపాయల అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు.
డయల్ యువర్ సి.పికి 18 ఫిర్యాదులు
ఇందూర్, నవంబర్ 21: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10నుండి 11గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు వచ్చాయని ఓఎస్‌డి రాహుల్‌హెగ్డే తెలిపారు. కమిషనర్ కార్తికేయ వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో డయల్ యువర్ సిపి కార్యక్రమాన్ని ఓఎస్‌డి కొనసాగించారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ సబ్‌డివిజన్ల పరిధి నుండి వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేశారని ఆయన వెల్లడించారు.