నిజామాబాద్

వెంటాడుతూనే ఉన్న కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాయి. పాత 500, 1000రూపాయల నోట్ల చెలామణిని రద్దుచేసి పక్షం రోజులు పూర్తయినప్పటికీ, పరిస్థితి కుదుటపడకపోవడంతో సామా న్య జనాలంతా బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే మొదటివారం పదిరోజులతో పోలిస్తే ప్రస్తుతం బ్యాంకుల వద్ద కాస్తంతగా క్యూ లైన్లు తగ్గడం స్వల్ప ఊరటనిస్తున్నప్పటికీ, ఏదో ఒక రకంగా కరెన్సీ కష్టాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయని సగటు జీవులు వాపోతున్నారు. చివరకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రైతులనూ కుంగదీస్తోంది. ఖరీఫ్‌లో పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తే, వారికి డబ్బు లు చెల్లించేందుకు వ్యాపారులు, దళారులు పక్షంరోజుల నుండి మూడు వారాలపాటు గడువు విధిస్తున్నారు. లేనిపక్షంలో పాత 500, 1000రూపాయల కరెన్సీని కట్టబెడతామని చెబుతున్నారు. దీంతో రైతులకు వేచి ఉండడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రబీ పంటల సాగుకు ఎరువులు, విత్తనాలను సమకూర్చుకుని నారుమళ్లు సిద్ధం చేసుకోవడం అన్నదాతకు తలకుమించినభారంలా పరిణమించింది. వ్యవసాయ కూలీలకు వేతనాలు చెల్లించేందుకు కూడా చేతుల్లో డబ్బులు లేక మిన్నకుండిపోతున్నామని పలువురు వాపోతున్నారు. టీకొట్టు, పాన్‌డబ్బా, కిరాణా షాపు మొదలుకుని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంస్థల్లో గిరాకీలు గణనీయంగా తగ్గిపోయాయి. యాభై శాతానికి పైగా లావాదేవీలు స్తంభించిపోవడంతో వ్యాపారాలు సాగక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. వంద రూపాయల సరుకు కొనుగోలు చేస్తే 2వేల రూపాయల చిల్లరను అందించాల్సిరావడంతో అంత మొత్తం నగదు లేక వ్యాపారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిల్లర కారణంగానే గిరాకీలను వదులుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. బడావ్యాపార, వాణిజ్య సంస్థలు, సూపర్ మార్కెట్‌లు, వస్త్ర షోరూమ్‌లలో షాపింగ్‌లు చేసే ఆర్థిక పలుకుబడి కలిగిన వారు డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నప్పటికీ, ఎటొచ్చీ చిన్నచిన్న వ్యాపారాలతో జీవనాలు వెళ్లదీస్తున్న వారి పరిస్థితే అగమ్యగోచరంగా తయారైనట్టు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలాఉండగా, ఓ వైపు సామాన్య ప్రజానీకం కరెన్సీ కష్టాలతో సతమతం అవుతుంటే, సందట్లో సడేమియా అన్న చందంగా కొందరు బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ కారణంగానే పక్షం రోజులు దాటినా బ్యాంకుల వద్ద ఇంకనూ రద్దీ నెలకొని ఉంటోందని పలువురు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలకు చెందిన కొందరు బడాబాబులు కూడా ఇందూరుకు వచ్చి పన్నులు చెల్లించకుండా పోగేసిన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునేందుకు స్థానిక కమీషన్ ఏజెంట్ల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇంటింటికీ తాగునీరు
* మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బీర్కూర్, నవంబర్ 23: రాష్ట్రంలోని ప్రతిఇంటికి రక్షిత నీటిని అందించడం తోపాటు, సమృద్ధిగా సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం ముందుకు సాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బీర్కూర్ మండలంలోని బరంగెడ్గి, కిష్టాపూర్, చించెల్లి గ్రామాల్లో బుధవారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొన్నారు. రాష్ట్రంలో 40వేల కోట్ల రూపాయల వ్యయంతో మిషన్ భగీరథ పథకం చేపట్టి, వచ్చే సంవత్సరంన్నర వ్యవధిలో ప్రతి ఇంటికి 100లీటర్ల శుద్ధి జలాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గుంటకు సాగునీటిని అందిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అహరహం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముందుగా బరంగెడ్గి గ్రామంలో బీర్కూర్-పోతంగల్ రోడ్డు వరకు 50లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభించారు. అలాగే 80లక్షల వ్యయంతో బరంగెడ్గి-కల్లూర్ గ్రామాలను అనుసంధానం చేసేందుకు నిర్మించిన వంతెనను, చించెల్లి గ్రామంలో 5లక్షలతో వ్యయంతో నిర్మించతలపెట్టిన మున్నూరు కాపు భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కిష్టాపూర్ గ్రామంలో 2.16కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడా రు. రూ.87వేలకోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ఆయకట్టు కింది రైతులకు రెండు పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వీటితో పాటు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆహార భద్రత పథకం, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ వంటి అర్హులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మల్లెల మీనా హన్మంతు, జడ్పీటిసి కిషన్‌నాయక్, కిష్టాపూర్ సర్పంచ్ గంగొండ, ఎఎంసి చైర్మన్ పెర్క శ్రీనివాస్, ఎంపిటిసి గంజాయి లక్ష్మి, ఇంచార్జ్ ఆర్డీఓ నగేష్, మాజీ జడ్పీటిసి సతీష్, కమ్మ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తహశీల్దార్ కిష్టానాయక్, ఎంపిడిఓ భరత్‌కుమార్, ఆర్‌డబ్ల్యుఎస్ డిప్యూటీ ఇఇ లక్ష్మినారాయణతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

పేద దళితులకు త్వరలో భూ పంపిణీ
* జాయింట్ కలెక్టర్ సత్తయ్య
నాగిరెడ్డిపేట్, నవంబర్ 23: భూమి లేని నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సత్త య్య అన్నారు. బుధవారం ఆయన మండలంలోని మాల్‌తుమ్మెద గ్రామం లో పేదలకు పంపిణీ చేసేందుకు భూములను పరిశీలించారు. అనంతరము ఆయన విలేఖరులతో మాట్లాడు తూనిరుపేద దళితులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. మాలుతుమ్మెద గ్రామంలోని 452,442,450సర్వే నంబర్‌లలో 23ఎకరాల 25గుంటల భూమి ని గతంలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ భూమిని గ్రామంలోని నిరుపేద దళితులైన 14మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ భూమి లబ్దిదారులందరు విధిగా మరుగుదొడ్లను నిర్మించుకుని ఉండాలని అన్నారు. 14మంది లబ్దిదారులతో ఎంపిక చేసిన భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. ఈ భూమి వారికి నచ్చితే వారికి పంపిణీ చేస్తామని అన్నారు. అనంతరము గ్రామంలోని ఎస్సీ కాలనీలో తిరిగి అక్కడి స్థితిగతులు తెల్సుకున్నారు. అంగన్‌వాడి, బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. బాలుర పాఠశాల ప్రధానోపాద్యాయులు సాయన్న విధులకు గైర్హాజర్ అవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జిల్లా విద్యాధికారి మధన్‌మోహన్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అంగన్‌వాడి కేంద్రంలో రికార్డులు తనిఖీ చేశారు. మేను ప్రకారం అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఊషమ్మ సంజీవులు, జడ్పీటిసీ కాశీనారాయణ, మాల్‌తుమ్మెద సర్పంచ్ పద్మ, నాగిరెడ్డిపేట్ సర్పంచ్ విఠల్‌రెడ్డి, తహశీల్దార్ మంత్రునాయక్, ఆర్‌ఐ. నవాజ్, విఆర్‌ఓ గణేష్ తదితరులు ఉన్నారు.

మాటల ప్రభుత్వంగా మారిన సర్కార్
* టిడిపి జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి
భిక్కనూరు, నవంబర్ 23: రాష్ట్రంలో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ది కేవలం మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదని టిడిపి నూతన జిల్లా అధ్యక్షుడు వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా అధ్యక్ష పదవని చేపట్టిన.. బుధవారం మొట్టమొదటిసారిగా భిక్కనూరు వచ్చిన సందర్భంగా స్థానిక సిద్దిరామేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దనే టిడిపి మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి జిల్లా అధ్యక్షున్ని శాలువ కప్పి సన్మానించారు. అనంతరము సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియాంబర్స్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక విద్యార్థులు చదువులు దూరం అయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. డబుల్‌బెడ్‌రూంలు కట్టిస్తామని వాగ్ధానం చేసి, ఇప్పుడు ఈ పథకానికి దూరంగా ఉంటు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 28బోధన్ డివిజన్ కేంద్రంలో టిడిపి ఆధ్వర్యంలో పోరుయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి హాజరు అవుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి కామారెడ్డి ఇన్‌చార్జీ ఉస్మాన్, కామారెడ్డి టిడిపి అధ్యక్షుడు నజీర్, సినయర్ నాయకులు శేర్లరాములు, చీల ప్రభాకర్, లింగాల గంగాగౌడ్, జెపి.రాధాకిషన్‌గౌడ్, శ్యాంరెడ్డి, దత్తుల లక్ష్మీనర్సింలు, శ్రీనివాస్, లింగం తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు మేయర్ శంకుస్థాపన
కంఠేశ్వర్, నవంబర్ 23: పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ ఆకుల సుజాత బుధవారం శంకుస్థాపన చేశారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించిన మేయర్, సిసి డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సుమారు 10లక్షల రూపాయల వ్యయంతో సిసి డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్‌గుప్తాలు ప్రత్యేక దృష్టి సారించి, నగరాభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేశ్వర్, కార్పొరేటర్లు, ఎఇలు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఫెయిలైతే టీచర్లే బాధ్యులు
* కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, నవంబర్ 23: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎవరైనా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైతే, సంబంధిత సబ్జెక్టుల ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. సర్కారీ బడులకు చెందిన ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా నాణ్యమైన విద్యను అందించాలని ఆమె ఉపాధ్యాయులకు హితవు పలికారు. మెరుగైన పద్ధతుల్లో పాఠ్యాంశాలను బోధిస్తూ, విద్యార్థుల ప్రగతిని నిశితంగా పరిశీలన జరిపిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బుధవారం రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ ఆవరణతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలోని లైబ్రరీలో సరైన సౌకర్యాలు లేకపోవడాన్ని గమనించి, తక్షణమే అన్ని బడుల్లోనూ గ్రంథాలయాల్లో వౌలిక సదుపాయాలు కల్పించాలని తన వెంట ఉన్న డిఇఓ రాజేష్‌ను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యి వారికి అందిస్తున్న బోధన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోకుండా చక్కగా చదువుకుంటే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని, సరైన ప్రణాళిక, పట్టుదల, అంకితభావంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం వార్షిక పరీక్షలు సమీపించినందున ఏమాత్రం సమయం వృధా కాకుండా చూసుకోవాలని, ఎంత ఎక్కువగా పుస్తకాలకు సమయం కేటాయిస్తే అంతే స్థాయిలో చక్కటి ఫలితాలు పొందవచ్చని ఉద్బోధించారు. ఏదైనా పాఠ్యాంశంలో అనుమానాలు ఉంటే ఏమాత్రం సందేహించకుండా ఉపాధ్యాయులను అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రతి విద్యార్థి పరిపూర్ణమైన అవగాహనను ఏర్పర్చుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, తరగతి గదుల్లో విద్యార్థుల గ్రేడింగ్, పొందుపర్చిన సిలబస్ వివరాలను ప్రదర్శించాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చూడాలని డిఇఓ రాజేష్‌ను ఆదేశించారు. చదువులో వెనుకజలో ఉంటూ సి గ్రేడ్‌లో కొనసాగుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయించాలని, ప్రతి పాఠశాలలోనూ విద్యా ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. క్రిస్టమస్, సంక్రాంతి సెలవుల్లో స్పెషల్ క్లాసులు నిర్వహించి ప్రతి విద్యార్థి సిలబస్‌కు అనుగుణంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా చూడాలని, ఏఒక్క విద్యార్థి కూడా ఎస్సెస్సీలో ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు బోధించాలని సూచించారు. మెరుగైన రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తూ విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తే వారు తప్పనిసరిగా అత్యుత్తమ గ్రేడుల్లో పాస్ అవుతారని అన్నారు. కాగా, స్థానికంగా గల అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం కలెక్టర్ తనిఖీ చేశారు. ఐసిడిఎస్ క్లస్టర్ కోఆర్డినేటర్ పనితీరు సక్రమంగా లేదని గమనించి, ఆమె వేతనం నిలిపివేయాలని ఎపిఎంను ఆదేశించారు. ప్రతి క్లస్టర్‌లో కోఆర్డినేటర్లు స్థానికంగానే ఉంటూ సేవలందించాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట డిఇఓ రాజేష్, తహశీల్దార్ వెంకటయ్య తదితరులు ఉన్నారు.

నిజాం సుగర్స్‌పై తొలగని నీలి నీడలు..!
* తీపి కబురు కోసం రైతుల ఎదురుచూపులు
* ఎంపి కవిత హామీ అమలుపైనే కార్మికుల ఆశలు
బోధన్, నవంబర్ 23: నిజాం చక్కెర కర్మాగారంకు సంబంధించి ప్రభుత్వం నుండి రావాల్సిన తీపి కబురు కోసం ఇక్కడి చెరకు రైతులు నిలువెల్లా ఎదిరి చూస్తున్నారు. మరోవైపు పదకొండు నెలల నుండి లేఆఫ్ కారణంగా వేతనాలు లేక అల్లాడుతున్న కార్మికులు సైతం ప్రభుత్వ తీపి కబురుపై అనేక రకాల ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ కవిత చెప్పిన విధంగా సర్కారు నుండి తీపి ప్రకటన రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు రాకపోవడంతో కర్మాగారంపై నీలినీడలు ఎప్పుడు తొలుగతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసుగర్స్ కర్మాగారాల విషయంలో మొదటి నుండీ గట్టి పట్టుదలతో ఉన్నటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితను ఇక్కడి చెరకు రైతులు గత పదిహేను రోజుల క్రితం కలిసి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కృషి చేయాలని కోరారు. దాంతోఎంపీ కవిత స్పందిస్తూ పక్షం రోజులలో చెరకు రైతులకు తీపి కబురు వస్తుందని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. ఎంపీ ప్రకటనతో కార్మికులు సైతం ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. ఈ కర్మాగారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో కార్మికులు సైతం సంతోషపడ్డారు. ఎంపీ చెప్పిన మాట ప్రకారం బుధవారం వరకు ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి తీపి కబురు రాలేక పోయింది. ఎంపీ గడువు ముగియడంతో ఒకటి, రెండు రోజులలో ఏదైనా ప్రకటన రావచ్చన్న ఆశతో కార్మిక, కర్షక వర్గాలు నిలువెల్లా ఎదిరి చూస్తున్నాయి. ఈ కర్మాగారాన్ని ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వం స్వాధఈనం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వలన ప్రభుత్వం ఈ కర్మాగారాలను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోలేక పోయింది. ఈ హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలంటూ కార్మికులు అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ సైతం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ వామపక్ష పార్టీల మద్ధతుతో పాదయాత్ర కార్యక్రమం, బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఈ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు రాష్ట్ర స్థాయి పోరాటానికైనా సిద్ధమేనని బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధినాయకులు ప్రకటించారు. ఈ లెక్కన నిజాం సుగర్స్‌పై కాంగ్రెస్ పోరాటాన్ని చేసేందుకు సన్నద్ధమవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా, గత పదిహేను రోజుల క్రితం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత చెరకు రైతులతో సమావేశమై ఈ కర్మాగారాల గురించి సుథీర్ఘ చర్చ జరిపారు. నిజాంచక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగా నడిపితే తమకు న్యాయం జరుగుతుందని ఈ సమావేశంలో రైతులు వెల్లడించారు. సహకార రంగంలో నడిపేందుకు రైతులు సిద్ధంగా లేరని కనీసం రెండేళ్లయినా ప్రభుత్వం కర్మాగారాలను నడిపితే ఆ తర్వాత పరిస్థితులను బట్టి రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందని రైతులు తమ అభిప్రాయాలు తెలిపారు. దాంతో ఖచ్చితంగా ప్రభుత్వం ఫ్యాక్టరీలు తెరిపించి రైతులు చెరకు పండించే విధంగా తీపి కబురునిస్తుందని ఎంపీ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సర్కారు నిర్ణయం కోసం ఎదిరి చూడటం మొదలు పెట్టారు. కానీ ఈ కర్మాగారాల వ్యవహారం పై ఇప్పటి వరకు నీలి నీడలు అలుముకునే ఉన్నాయి. అటు ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్‌ను ఎత్తివేయక పోవడం, మరోవైపు సర్కారు ఫ్యాక్టరీలు నడిపించే విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించక పోవడంతో ఏమి జరుగుతుందన్న ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం చెరకు పంట వేసే సమయం ఆసన్నం కావడంతో ఏమి చేయాలో తెలియక రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. వాస్తవానికి ప్రతీ అక్టోబర్ - నవంబర్ మాసాలలో ఇక్కడి కర్మాగారంలో చెరకు గానుగ మొదలయ్యేది. అలాగే రైతులు వచ్చే ఏడాదికి సంబంధించి చెరకు పంటను సాగు చేసేందుకు శ్రీకారం చుట్టేవారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు నిజాంసుగర్స్ వ్యవహారం ఎటూ తేలకుండా ఉండటంతో అటు కార్మికులు, ఇటు కర్షకులు ఆందోళన చెందాల్సి వస్తోంది. కనీసం లే ఆఫ్‌నైనా ఎత్తివేస్తే తమకు వేతనాలు వస్తాయని కార్మికులు భావిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది క్రషింగ్ నిర్వహించడం జరుగుతుందని సర్కారు స్పష్టం చేస్తే చెరకు సాగు చేసేందుకు తాము సిద్ధం కావచ్చని రైతులు పేర్కొంటున్నారు. మరీ ప్రభుత్వం నుండి తీపి ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
* బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక కౌంటర్‌లు
* కలెక్టర్ సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, నవంబర్ 23: రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, ఇంతే కాకుండా రైతులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తమ కార్యాలయంలో రైతుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాసేపు ఆయన రైతులతో ముచ్చటించి రైతుల అభిప్రాయాలు తెల్సుకుని వారి సమస్యలను తెల్సుకుని వారికి కొన్ని సలహాలు సూచనలు అందించారు. అనంతరము విలేఖరులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు తీసుకుని వస్తున్న ధాన్యానికి త్వరలోనే బిల్లులు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామని, ఆన్‌లైన్‌లో చెల్లింపులు త్వరగా జరిగేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటుచేయడం జరుగుతోందని వెల్లడించారు. జిల్లాలోని రైతులు తమ సందేహాలను తీర్చుకునేందుకు 08468-220069కు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు రైతులు ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేసి వారి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నసురుల్లాబాద్‌లో పర్యటించినప్పుడు కొంతమంది రైతులు తమకు బ్యాంకుఖాతాల్లో డబ్బులు రావడంలేదని చెప్పారని, కాబట్టి రైతులు ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, ధాన్యం అమ్మిన ప్రతి రైతు ఖాతాలో వారి డబ్బులు పడ్తాయని అన్నారు. రైతులకు సంబందించిన వరిధాన్యం కొనుగోలు తరువాత ఆన్‌లైన్‌లో నమోదు తప్పని సరి అని అన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు అయితేనే అకౌంట్స్‌లో డబ్బులు జమ అవుతాయన్న విషయాన్ని రైతులు మరిచిపోరాదని అన్నారు. రైతులకు వరి ధాన్యం కొనుగొళ్ల విషయంలో ఏలాంటి సందేహాలు ఉన్నా కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్‌తో పాటు సంబందిత తహశీల్దార్‌లను, విఆర్‌ఓలను సంప్రదించాల్సిందిగా సూచించారు. గన్ని బ్యాగు సంచుల కొరతను కూడా త్వరలోనే తీర్చడం జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 68వేల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోళు జరిగినట్లు వెల్లడించారు. వీటి కోసం 103కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 47కోట్ల రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లింపులకు సంబందించి నమోదు జరిగిందన్నారు. మిగతా రైతులకు కూడా త్వరలోనే డబ్బులు అకౌంట్స్‌లో వస్తాయని అన్నారు. కామారెడ్డి జిల్లాలో 33మంది రైతులకు వరి ధాన్యం కొనుగోలు జరిగిన తరువాత కూడా డబ్బులు రాలేదన్న ఫిర్యాదుపై విచారణ విచారణ జరపడం జరుగుతోందని అన్నారు. విచారణ అనంతరము నివేదిక రాగానే ఆ రైతులకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కామారెడ్డి మార్కెట్ యార్డుకు వరి ధాన్యం తీసుకుని వచ్చే రైతుల కోసం ఎక్కువ సంఖ్యలో తూకాలు ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలులో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా సంబందిత శాఖను ఆదేశించడంతో పాటు ఎప్పకప్పుడు పర్యవేక్షించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ జిల్లా అధికారి ముస్త్యాల విజయ్‌కుమార్, ఎడిఎ మహేశ్వరీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గౌరిశంకర్, వ్యవసాయ శాఖ సిబ్బంది గంగు, శ్రీనివాస్‌రావులు ఉన్నారు.