నిజామాబాద్

నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన వీడియోకాన్పరెన్సులో హైద్రబాద్ నుండి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సులువుగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నగదు రహిత బ్యాంకు రూపొందించాలన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉండే విధంగా చూడాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బ్యాంకు క్రెడిట్ కార్డులు, పిఓఎస్ మిషన్ల ద్వారా జరిగే ఆన్‌లైన్‌ల లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కాన్పరెన్సులో మాట్లాడుతూ, ఇబ్బందులు కల్గకుండా బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఒక లక్ష 65వేల మంది రైతులకు బ్యాంకు అకౌంట్ల ద్వారా వరి ధాన్యం డబ్బులను చెల్లిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కూలీలకు ఆసరా పెన్షన్లు, తదితర వాటిని కూడా బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నామన్నారు. హరితహారం, తదితర అంశాలపై కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జెసి సత్తయ్య, పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఎస్‌ఓ రమేశ్, తదితరులున్నారు.

తెలంగాణ ఉద్యమం చరిత్రాత్మకమైంది
తెయు విసి సాంబయ్య
డిచ్‌పల్లి రూరల్, నవంబర్ 29: తెలంగాణ ఉద్యమం ఎంతో చారిత్రాత్మకమైనదని, తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప ఉద్యమమని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పి.సాంబయ్య అన్నారు. దీక్షా దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ వర్శిటీలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ముందు బిసి యువజన జెఎసి ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా వి.సి మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ, లక్ష్యాన్ని సాధించినది మాత్రం తెలంగాణ ఉద్యమమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్ష రాష్ట్ర సాధనలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. నెల్సన్ మండేలా ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాఫ్రికా ఉద్యమం ఒక్కదానినే తెలంగాణ ఉద్యమంతో సరిపోల్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కెసిఆర్ ఆమరణ దీక్ష చేపట్టడం ఉద్యమాన్ని ఉరకలెత్తించిందని అన్నారు. కోట్లాది ప్రజలు ఉద్యమంలో మమేకం అయ్యారని, ఈ ఉద్యమం ఫలించి తెలంగాణ కల సాకారమైందని వి.సి పేర్కొన్నారు. తాను కూడా తెలంగాణ ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించానని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.సి యూత్ జెఎసి రాష్ట్ర చైర్మెన్ యెండల ప్రదీప్, రాష్ట్ర సలహాదారు డాక్టర్ రాజారాం, విద్యార్థి నాయకులు రాజు, రవి, నవీన్, మధు తదితరులు పాల్గొన్నారు.
తెయు పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ విభాగం వివిధ పరీక్షల టైంటేబుల్‌ను మంగళవారం విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేషన్(డిగ్రీ) మోదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు డిసెంబర్ 13వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కనకయ్య తెలిపారు. అదేవిధంగా పి.జి సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే బిసిఎ 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు యూనివర్శిటీ కళాశాలలో నిర్వహిస్తారని అన్నారు.

వైద్య సిబ్బంది సామాజిక బాధ్యతతో
విధులు నిర్వహించాలి
కలెక్టర్ యోగితా రాణా
నవీపేట, నవంబర్ 29: ప్రభుత్వ సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది సామాజిక బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సూచించారు. మంగళవారం నవీపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు, సూపర్‌వైజర్లు, ల్యాబ్ టెక్నిషీయన్లు, ఎఎన్‌ఎంలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100శాతం కాన్పులు జరుగాలని, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్క గర్భిణీ స్ర్తి కూడా వెళ్లకుండా నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతినెలా ఇచ్చే ప్రసూతి టార్గెట్‌ను పూర్తి చేయాలని, ఎఎన్‌ఎంలు, హెల్త్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు ఇంటింటి సర్వే చేపట్టి గర్భిణీ స్ర్తిల సంఖ్య తెలుసుకోవడంతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకం గురించి అవగాహన కల్పించాలన్నారు. నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని, మాతాశిశు మరణాలు జరిగితే ఎఎన్‌ఎంలు, హెల్త్‌సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సైతం వెనుకాడే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. టి.బి, కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించి, సరైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, డాక్టర్ ఉమ, అనూష, తహశీల్దార్ అనిల్‌కుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వినియోగదారులకు చిల్లరే ఇస్తున్న బ్యాంకులు
మోర్తాడ్, నవంబర్ 29: బ్యాంకులకు చిన్ననోట్ల సరఫరా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వినియోగదారులకు చిల్లర నాణేలనే సరఫరా చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం విధితమే. 2000రూపాయల నోటు మినహా నూతనంగా ముద్రించిన 500రూపాయల నోట్లు ఇంకా గ్రామీణ బ్యాంకులకు సరఫరా కాలేదు. ఎటిఎంలలో కూడా కేవలం 100రూపాయల నోట్లే పెడుతున్నప్పటికీ, వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వచ్చే వినియోగదారులకు అధికారులు 10రూపాయల నాణేలను అందజేస్తున్నారు.

పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి
మోర్తాడ్, నవంబర్ 29: పేదింటి ఆడపిల్లల పెళ్లిల కోసం వారి కుటుంబాలు వేదన పడకూడదనే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో మండలానికి చెందిన 23మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అలాగే 2.2కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవన సముదాయానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చేపడుతున్న అనేక పథకాల్లో కల్యాణలక్ష్మి పథకం సిఎంకు మానసపుత్రిక లాంటిదని అన్నారు.
పేదవారి కష్టాలను దగ్గరుండి ప్రత్యేక్షంగా చూసిన సిఎం కెసిఆర్, ఈ పథకానికి అంకురార్పణ చేశారని ఆయన తెలిపారు. మైనార్టీ కుటుంబాలకు షాదీముబారక్ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకంతో ఒక్కో కుటుంబానికి 51వేల రూపాయలను అందిస్తున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల్లోని పేద కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధి చేకూరుస్తామని, తెలుపు రేషన్‌కార్డు ఉంటే చాలని ఆయన తెలిపారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇలాంటి పథకం అమలులో లేదని, ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో సిఎం కెసిఆర్ ముందుంటారని ఆయన తెలిపారు. కల్యాణలక్ష్మి పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం నుండి చెక్కులను అందించే వరకు ఎలాంటి అవకతవకలు తావులేదని, ఎవరికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకరావాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యా వ్యవ్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ కళాశాలకు అన్ని హంగులాలతో భవనాన్ని అందించేందుకు వీలుగానే నిధులు మంజూరీ చేయించడం జరిగిందన్నారు. అనంతరం మండలం కార్యాలయం వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ ఇంటెక్‌వెల్ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా ఇంటింటికి తాగునీరు అందించే ఈ పథకంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎంపిపి కల్లెడ చిన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పట్వారీ గంగాధర్‌రావు, జడ్పీటిసి అమిత, టిఆర్‌ఎస్ నాయకులు రాజాపూర్ణానందం, కల్లెడ ఏలియా, స్థానిక సర్పంచ్ దడివె నవీన్‌తో పాటు ఎంపిటిసిలు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

ప్రధానికి లేఖలతోనే
పసుపు సమస్యలకు పరిష్కారం
మోర్తాడ్, నవంబర్ 29: పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టినట్లు పసుపురైతు పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో మంగళవారం పోస్టుకార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల మోర్తాడ్‌లో జరిగిన పసుపురైతుల సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన మేరకు ప్రతి పసుపురైతు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు, క్వింటాలుకు 15000వేల రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించడంతో పాటు ఈ ప్రాంతంలో పసుపు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను కార్డులలో రాసి, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌లకు లేఖలు పంపుతున్నామని ఆయన తెలిపారు. పాలెం గ్రామంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఆర్మూర్ డివిజన్‌లో కొనసాగించి అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. పసుపు రైతులు కూడా ఎవరింటి నుండి వారే లేఖలు రాసి పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ముత్యాల మనోహర్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తీగల రమేష్‌రెడ్డి, పోరాట కమిటీ నేతలు బిజి.గంగారాం, ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్ జగనంపల్లి గణేష్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలి
కలెక్టర్ యోగితా రాణా
నవీపేట, నవంబర్ 29: ప్రతి గ్రామంలో 18మంది ప్రభుత్వ సిబ్బంది వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తారని, వారితో ప్రజలకు పనులు చేయించుకోవాల్సిన గ్రామస్థులపైనే ఉందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. మంగళవారం నవీపేట మండలం నారాయణపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాక్షర భారతి కేంద్రాల్లో వయోజన విద్య నేర్చుకోవాలని, రాత్రిపూట చదువుకోవాలని, ఎన్ని పనులు ఉన్నా అక్షర జ్ఞానం పెంపొందించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. గ్రామంలో 100మంది మహిళలకు కనీసం 40శాతం అక్షరాస్యత లేదని, సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామంలో ఎక్కువ మంది పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో అన్ని విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వం నియమిస్తుందని, ప్రైవేటు పాఠశాలల్లో ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా, ప్రచార ఆర్భాటాలకు ఆకర్షితులై ప్రజలు తమ పిల్లలను చేర్పిస్తుంటారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న మీ పిల్లలకు ఇంటి వద్ద పరీక్ష పెట్టి ఎలా చదువుతున్నారో తెలుసుకోవచ్చని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కూడా ఇంటి వద్ద పరీక్ష పెడితే తేడా తెలుస్తుందన్నారు. 14సంవత్సరాల నుండి అంగన్‌వాడీ కేంద్రం నడుస్తుందని, గ్రామంలో 6సంవత్సరాల లోపు పిల్లలు 130మంది అంగన్‌వాడీ కేంద్రాలకు రావడం లేదన్నారు. పిల్లలను అంగన్‌వాడి కేంద్రాలకు పంపిస్తే ఆరోగ్యంగా ఉంటారని, పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఒక్కపూట సంపూర్ణ భోజనం గర్భిణీ స్ర్తిలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ స్ర్తిలు రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి పథకం అమలును గ్రామ ప్రజలు పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి వేగవంతంగా జరుగాలంటే యువకులు, గ్రామస్థులు తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.