నిజామాబాద్

ముదిరాజ్‌లను బిసి-ఎ గ్రూపులో చేర్చేందుకు కృషి చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, డిసెంబర్ 1: ముదిరాజ్ కులస్థులను బిసి-డి నుండి బిసి-ఎ గ్రూపులోకి మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని లింగాపూర్ గ్రామంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సింహగర్జన కార్యక్రమంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో ముదిరాజ్‌లతో పాటు తెలంగాణకు చెందిన అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో ముదిరాజ్‌లకు కేవలం 24కమ్యూనిటీ హాళ్లను మాత్రమే మంజూరు చేశారని అన్నారు. ప్రస్తుతం స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం ఇప్పటికే వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పారు. వంద శాతం సబ్సిడీపై చేప పిల్లల విత్తనాలను చెరువులు, జలాశయాల్లో వదులుతున్నారని, గంగపుత్రులు లేని చోట్ల ముదిరాజ్‌లకే వాటిని విక్రయించే హక్కు కల్పిస్తున్నామని అన్నారు. బంజరు భూముల్లో హరితహారం కింద పెద్దఎత్తున పండ్ల మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని, వాటి ఫలాలను కూడా ముదిరాజ్‌లు పొందేలా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి ఈటెల తెలిపారు. ముదిరాజ్ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం 10లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యేల చూస్తానని చెప్పారు. పెద్దమ్మగుడిని నిర్మించాలంటే ఇదివరకు గ్రామగ్రామాన తిరుగుతూ చందాలు పోగు చేసుకుని రూపాయి రూపాయి కూడబెడుతూ ఆలయాల నిర్మాణం చేపట్టాల్సి వచ్చేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం పెద్దమ్మ గుడి నిర్మాణాలకు పూర్తిస్థాయిలో 10లక్షల వరకు కూడా నిధులను మంజూరు చేస్తోందని చెప్పారు. ముదిరాజ్‌లను బిసి-డి నుండి బిసి-ఎలోకి మార్చాలని ఇదివరకు గత ముఖ్యమంత్రి వైఎస్ వరంగల్‌కు హాజరైన సమయంలో సభలో తాను విజ్ఞాపన అందించానని, దానికి స్పందిస్తూ కేవలం ఒక ఏడాది కాలం పాటే ముదిరాజ్‌లను బిసి-ఎ గ్రూపుగా పరిగణించారని అన్నారు. అనంతరం మళ్లీ బిసి-డిలోనే కొనసాగించారని, ఈ విషయమై తాను అదే సమయంలో ప్రశ్నించానని ఈటెల పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ముదిరాజ్ కులస్థులు 35లక్షల మంది వరకు ఉన్నారని, ఇందులో మూడు లక్షల మంది యువతీ, యువకులను సమర్ధవంతమైన నాయకులుగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో అధికంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముదిరాజ్ కులస్థులు ఎక్కువగా ఉన్నారని, నిజామాబాద్ జిల్లాలోనూ వీరి సంఖ్య గణనీయంగా ఉండడం విశేషమని అన్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. 2009 నవంబర్ 29న కానిస్టేబుల్ కిష్టయ్య సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణత్యాగం చేశారని, డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంతచారి అమరుడయ్యారని, వారి ఆకాంక్ష మేరకు సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి.గౌడ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి గోపి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నినాళ్లీ పడిగాపులు

కామారెడ్డి, డిసెంబర్ 1: కేంద్రంలోని మోడి సర్కార్ తీసుకున్న 500, 1000రూపాయల నోట్ల రద్దుతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు నిత్యం చిల్లర కోసం ఇబ్బందులు పడ్తూనే ఎటిఎమ్‌ల వద్ద క్యూలు కడ్తూనే ఉన్నారు. పాతపెద్దనోట్ల రద్దు తరువాత వచ్చిన కొత్త 2వేల రూపాయల నోట్లను ఎటిఎమ్‌లలో పెడ్తున్నారు. 2వేల నోటు వచ్చిన తరువాత చిల్లర కోసం పడరాని పాట్లు పడక తప్పడంలేదు. మార్కెట్‌లో 500, 1000రూపాయల నోట్లను పూర్తిగా ఎవ్వరు తీసుకోక పోవడం, రెండు వేల రూపాయల నోట్లకు చిల్లర కూడా దొరక్క ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. ఎక్కడైతే బ్యాంకుల్లో 100రూపాయల నోట్లు లభ్యం అవుతున్నట్లు తెలిస్తే ఉదయం సూర్యోదయం కంటే ముందుగానే ఎటిఎమ్‌ల వద్ద ఖాతాదారులు క్యూకట్టి మధ్యాహ్నం వరకు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడక తప్పడం లేదు. ఇప్పుడు రబీ పంటల సీజన్ కాబట్టి ముఖ్యంగా రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, కూలి కోసం చిల్లర డబ్బుల అవశ్యకత ఉంటుంది. రెండువేల నోట్లను తీసుకుని పోయి బయట చిల్లర కావాలంటే ఎవ్వరు కూడా ఇవ్వక పోవడంతో నిరుపేదల దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీని ప్రభావం ఎన్నికల సమయంలో కేంద్ర సర్కార్‌పై పడిన ఆశ్చర్య పోనవసరం లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రజలు ఎంతో ఓపిగ్గా ఉద్యమాన్ని నడిపించారు. కాని ఇప్పుడు తినే తిండికి డబ్బు కావాలి అలాంటి డబ్బు దొరక్క పోతే పేదల కడుపు మంట ప్రభుత్వంపై దుమ్మెతి పోసేలా చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దును ముందు సమర్థితిస్తున్నవారే ఇప్పటికి ఇంకా నోట్లు దొరక్క పోవడంతో ఆ ప్రజలే ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసే స్థాయికి చేరుకుంటుంది. అనేక చోట్ల బ్యాంకు సిబ్బందితో ఖాతాదారులు గొడవకు దిగుతున్నారు. రాత్రి 12గంటలు దాటిన తరువాత కూడా ఎటిఎమ్‌ల వద్ద నోట్లు లేవన్న బోర్డు ఉంటే జనాలు కన్పించడం లేదు. ఒక వేళ నోట్లు ఉంటే మాత్రం జనం క్యూకట్టి అర్థరాత్రి వరకు ఎటిఎమ్‌ల వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నారు. కేవలం రోజుకు నాల్గు వేల రూపాయలు మాత్రం ఎటిఎమ్‌లలో రావడం అది కూడా ఇబ్బందిగానే మారిందని అంటున్నారు. చాలా ఎటిఎమ్‌లు మాత్రం మూసి ఉంటున్నాయి. అసలే పెండ్లిళ్ల సీజన్ కాబట్టి నిరుపేదలకు మాత్రం వారు దాచుకున్న డబ్బుతోనే పెండ్లిళ్లు చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో నుండి దాచుకున్న డబ్బులు అంత కూడా తీసుకునే వీలు లేక పోవడంతో పెండ్లిళ్లు చేసే చాలా మంది బయట ఫైనాన్స్‌లను, వడ్డీవ్యాపారులను ఆశ్రయించి 3నుండి 5రూపాయల వరకు కూడా వడ్డీకి తెచ్చుకుని పెండ్లిళ్లులు చేస్తున్నావారు ఇక ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయకుంటే ఏం చేస్తారు. నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం 500రూపాయల కొత్తనోట్లు, అలాగే వంద, 50రూపాయల నోట్లను విరివిగా లభ్యం అయ్యేలా చేసిన తరువాతే నోట్లను రద్దు చేస్తే ప్రజలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా డబ్బున్న వారు హాయిగానే ఉన్నారని, కేవలం నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకే నోట్ల రద్దు పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన కేంద్రంలోని మోడి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు అవసరం ఉన్న నోట్లను విరివిగా లభ్యం అయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. మరో వారం రోజులు కూడా ఎటిఎమ్‌ల వద్ద ఇదే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో బిజెపికి ఇక గడ్డుకాలం తప్పదన్న వాదనలు విన్పిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో నిరుపేద ప్రజలు నోట్ల కోసం పడ్తున్న బాధలపై విచారణ జరిపిస్తే ప్రజలు పడ్తున్న బాధలు, వారి అనుభవిస్తున్న ఆవేదన కడుపుమండ అబద్ధమో, నిజమో ప్రభుత్వానికే అర్థం అవుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాల వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురైన పర్వలేదు కాని ఇలా కుటుంబాల ఆస్థితత్వంపై నోట్ల ప్రభావం చూపుతుంటే, ప్రభుత్వ మంచి పనులు ప్రజలకే చేరే లోపే ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవన్న విషయన్ని పాలకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేదావి వర్గాలు అంటున్నాయి.

సహకార చక్కెర కర్మాగారంపై ఆవిరవుతున్న ఆశలు
పునరుద్ధరణకు చొరవ చూపని తెరాస సర్కారు * భవిష్యత్ కార్యాచరణ కోసం నేడు పరిరక్షణ కమిటీ కీలక సమావేశం

నిజామాబాద్, డిసెంబర్ 1: ఒకప్పుడు ఆసియా ఖండంలోనే ప్రసిద్ధిగాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడగా, ఇదే కోవలో తెలంగాణలోని ఏకైక సహకార చక్కెర కర్మాగారమైన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ(ఎన్‌సిఎస్‌ఎఫ్) కూడా అవసాన దశకు చేరుకుని పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోవడంతో దాదాపుగా ప్రైవేటీకరణ అనివార్యంగా మారిందనే సంకేతాలు వెలువడుతుండడంతో అటు కార్మికులను, ఇటు చెరకు రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఫ్యాక్టరీలో పర్మినెంట్ ఉద్యోగులుగా ఉన్న 26మందిని ఈ నెలాఖరులోగా విఆర్‌ఎస్ తీసుకునేలా చూడాలంటూ ఇటీవలే షుగర్ కెన్ కమిషనర్ నుండి కార్మిక శాఖ అధికారులకు లేఖ అందడంతో ఎన్‌సిఎస్‌ఎఫ్ పునరుద్ధరణకు మంగళం పాడారనే సంకేతాలు స్పష్టంగా వెలువరించినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఎన్‌సిఎస్‌ఎఫ్ పరిరక్షణ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. కర్మాగారం మనుగడ కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని పరిరక్షణ కమిటీ చైర్మెన్ కె.సాయరెడ్డి పేర్కొన్నారు. కేవలం 20కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తే సహకార చక్కెర కర్మాగారం పూర్వవైభవం సంతరించుకునేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపకుండా పర్మినెంట్ ఉద్యోగులకు విఆర్‌ఎస్ ద్వారా సాగనంపి ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేయించేలా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ పర్మినెంట్ ఉద్యోగులను కూడా విఆర్‌ఎస్ ద్వారా విధుల నుండి తొలగిస్తే ఫ్యాక్టరీ పూర్తిగా ఉనికిని కోల్పోతుందని, ఇప్పటికే కర్మాగారానికి చెందిన ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయని, పర్మినెంట్ ఉద్యోగులు దూరమైతే వాటిని పరిరక్షించే వారే కరువవుతారని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వ 20 కోట్ల రూపాయలను కేటాయిస్తే వాటిలో 10కోట్లతో ఫ్యాక్టరీలోని యంత్రాలను మరమ్మతులు చేసేందుకు, మిగతా 5కోట్లను చెరకు నాటే రైతులకు విత్తనాల సబ్సిడీ కోసం, మరో 5కోట్లను ఉద్యోగుల వేతన బకాయిలు, ఇతరాత్రా వాటికి వినియోగిస్తూ ఎన్‌సిఎస్‌ఎఫ్‌ను మళ్లీ పునరుద్ధరించేందుకు వీలుంటుందన్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపకుండా పూర్తిగా కర్మాగారాన్ని మూలన పడవేసేలా వ్యవహరిస్తుండడం ఆక్షేపణీయమని అన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ఎన్‌సిఎస్‌ఎఫ్‌ను కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్‌సిఎస్‌ఎఫ్ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మొదలుకుని జిల్లాకు చెందిన మంత్రి పోచారం, ఎంపి కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులంతా ప్రభుత్వపరంగా నిధులను సమకూర్చి 2015 సీజన్‌లో చెరకును గానుగాడిస్తామని హామీలు ఇచ్చారు. అయితే ఈ దిశగా ప్రభుత్వం చొరవ చూపని కారణంగా అధికార పార్టీ నేతల హామీలు నీటి మీది రాతలుగానే మిగిలిపోయాయి. 2016లో కూడా క్రషింగ్ కొనసాగలేదు. నిజాం షుగర్స్ తరహాలోనే ఎన్‌సిఎస్‌ఎఫ్ విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసేలా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం కార్మికులను ఆందోళన కలిగిస్తోంది. ఏళ్ల తరబడి తెరుచుకోలేకపోతున్న ఈ ఫ్యాక్టరీని అదునుచూసి కబళించేందుకు పలువురు పలుకుబడి గల పెద్దలు తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇప్పటికే ఫ్యాక్టరీకి చెందిన భూములను పలువురు దర్జాగా కబ్జా చేసుకోవడం జరిగింది. కర్మాగారానికి ఆనుకుని ఉన్న సుమారు మూడున్నర ఎకరాల స్థలం అన్యాక్రాంతానికి గురైంది.
దీనిని గుర్తించిన పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఫ్యాక్టరీ స్థలాలు మాత్రం కబ్జా చెర నుండి విడిపించలేదు. గత పాలకవర్గాలు, ప్రభుత్వాలు అవలంభించిన అసంబద్ధ విధానాల వల్లే ఈ దుస్థితి దాపురించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రైతుల వాటాధనమే పెట్టుబడిగా 1964వ సంవత్సరంలో నగర శివారులోని సారంగపూర్ వద్ద నెలకొల్పబడిన ఎన్‌సిఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీ లక్షన్నర మెట్రిక్ టన్నులను గానుగాడించే సామర్థ్యం కలిగి ఉంది. దశాబ్దన్నర కాలం క్రితం వరకు కూడా ఎన్‌సిఎస్‌ఎఫ్ నిర్వహణ క్రమపద్ధతిలోనే కొనసాగుతూ అందరికీ లాభాలను మిగిల్చింది. అనంతర కాలంలో అప్పటి పాలకులు అనుసరించిన అసంబద్ధ విధానాల కారణంగా క్రమేణా నష్టాల ఊబిలోకి నెట్టివేయబడి ప్రస్తుతం మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. చెరకు రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర పంటల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రస్తుత తెరాస ప్రభుత్వ హయాంలోనైనా మేలు జరుగుతుందని ఆశించిన రైతులకు చేదు అనుభవమే ఎదురవుతోంది.

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
మంత్రి పోచారం
బాన్సువాడ, డిసెంబర్ 1: ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డిలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్సువాడ డివిజన్‌లోని తొమ్మిది మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా అన్ని కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకునేలా ఆయా గ్రామాల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో వంద శాతం ఈ లక్ష్యాన్ని సాధించిన ప్రజాప్రతినిధులకు సన్మానించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఉపాధి హామీ ఎపిఓలు, మండల ఎంపిడిఓలు, సర్పంచ్‌లు మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.
తిరిగి ఆరు మాసాల అనంతరం బాన్సువాడ మండలంలో డివిజన్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి పోచారం సూచించారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్, పోచారం, బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్, నిజాంసాగర్ మండలంలోని గున్కుల్, కోమలంచ, పిట్లం మండలంలోని బొల్లక్‌పల్లి, కుర్తి, బిచ్కుంద మండలంలోని రాజుల్లా, మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్, జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలుపుతూ, సంబంధిత గ్రామాల సర్పంచ్‌లను ఈ సందర్భంగా మంత్రి తన చేతుల మీదుగా సన్మానాలు చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా వేయి మంది వరకు జనాభా ఉన్న ప్రతి గ్రామంలో నివాస ప్రాంతాల నుండి చెత్తను సేకరించేందుకు వీలుగా ప్రత్యేకంగా చెత్త సేకరణ రిక్షాలను కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించడంతో పాటు అన్ని వర్గాల వారికి చేయూతను అందించేందుకు తెరాస ప్రభుత్వం అహరహం కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ చూపుతోందని, ఇందులో భాగంగానే 2018 నాటికి మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తవుతుందని, నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సమృద్ధిగా సాగు జలాలు అందిస్తామని మంత్రి పోచారం భరోసా కల్పించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి జలాలు సరఫరా చేసే పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సురభి సత్తయ్య, డిఆర్‌డిఎ పి.డి చంద్రమోహన్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, బాన్సువాడ ఎంపిపి రేష్మబేగం, తహశీల్దార్ గోపి, ఎంపిడిఓ నగేష్, తెరాస నాయకులు వై.కృష్ణారెడ్డి, ఎఎంసి చైర్మెన్ నార్ల సురేష్‌గుప్తా, డాక్టర్ అంజిరెడ్డి, మహ్మద్ ఎజాస్, మోహన్‌నాయక్, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత సేవలను
సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్ 1: నగదు రహిత సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక పార్శిరాములు కళ్యాణ మండపంలో నిర్వహించిన నగదు రహిత లావాదేవీలు - డిజిటల్ బ్యాకింగ్ సేవల అవగాహన సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ రద్దు చేసిన తర్వాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను బ్యాంకర్లు గుర్తించాలన్నారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల సేవలపై ఖాతాదారులకు అవగాహన కల్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 17లక్షల ఖాతాలు ఉన్నాయని, ఖాతాలు లేని వారు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేవిధంగా చూడాలన్నారు. పెద్ద వ్యాపారస్తులు, పెట్రోల్ బంక్‌లు, రేషన్ దుకాణాలు తదితర వాణిజ్య సంస్థలు స్వైప్ మిషన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అవగాహన కల్పించారు. మొబైల్, డిజిటల్, వ్యాలెట్ వినియోగం, యుపిఎ, యుఎస్‌ఎస్‌డి ద్వారా పొందే సేవలను వివరించారు. అనంతరం ఎస్‌బిహెచ్, ఎస్‌బిఐ, ఆంధ్రబ్యాంకు, తదితర బ్యాంకు మేనెజర్లు ఖాతాదారులకు వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదు రహిత అంశాలను వివరించారు. బ్యాంకులలో ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని బ్యాంకు మేనెజర్లు తెలిపారు. ఈ సమావేశంలో జెసి సత్తయ్య, జిల్లా సహకార శాఖ అధికారి గంగాధర్, పిడి చంద్రమోహన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మీ, ఆయా బ్యాంకుల మేనెజర్లు, తదితరులు పాల్గొన్నారు.