నిజామాబాద్

పోటెత్తిన ఖాతాదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 13: మూడు రోజులు వరుస సెలవులు ముగిసిన అనంతరం బ్యాంకులు మంగళవారం తెరుచుకోగా, ఖాతాదారులు ఒక్కసారిగా పోటెత్తారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ఎదుట చాంతాండంత క్యూలైనే్ల దర్శనమిచ్చాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా జనాలు బారులుతీరి నిలబడడం పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కరెన్సీ కష్టాల తీవ్రతను కళ్లకు కట్టింది. గడిచిన మూడు రోజుల నుండి బ్యాంకులన్నీ మూతబడి ఉండడం, ఎటిఎంలు నగదును అందించకపోవడంతో డబ్బుల కొరతతో సతమతమైన సగటు జీవులంతా మంగళవారం ఒక్కసారిగా తమతమ ఖాతాలు ఉన్న బ్యాంకులకు తరలివచ్చారు. బ్యాంకులు తెరువకముందే క్యూ లైన్లు కనిపించాయి. దాదాపుగా నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజైన నవంబర్ 9వ తేదీ నాటి పరిస్థితే కనిపించింది. ఆ సమయంలో పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు బారులుతీరగా, ప్రస్తుతం తమ ఖాతాలలో ఉన్న సొమ్మును దైనందిన అవసరాల నిమిత్తం విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన వారి సంఖ్యే దాదాపుగా 90శాతం వరకు కనిపించింది. అయితే మూకుమ్మడిగా తరలివచ్చిన జన సమూహాన్ని చూసి బ్యాంకు సిబ్బంది కూడా ఒకింత బెంబేలెత్తిపోయారు. అరకొర కరెన్సీ నిల్వలు ఉండడంతో అందరికీ పరిమితి మేరకు నగదును అందించే పరిస్థితి లేకపోవడంతో మెజార్టీ బ్యాంకుల్లో కేవలం 4వేల రూపాయల వరకే విత్‌డ్రాలకు అనుమతించారు. దీంతో చేసేదేమీ ఖాతాదారులు అత్తెసరు నగదు కోసం కూడా గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. మరికొన్ని బ్యాంకుల్లోనైతే మధ్యాహ్నం సమయం నాటికే నగదు నిల్వలు నిండుకోవడంతో నో క్యాష్ బోర్డులను తగిలించి, కేవలం పాత నోట్ల డిపాజిట్లను మాత్రమే స్వీకరించారు. ఇక ఎటిఎంల పరిస్థితిలోనైతే నెల రోజులు గడిచినా కించిత్తు మార్పు కూడా రాలేకపోతోంది. సగానికి పైగా ఎటిఎంలు అన్ని వేళల్లోనూ మూతబడి కనిపిస్తుండగా, అరకొర ఎటిఎంలలో నామమాత్రంగానే నగదు ఉంచడంతో గంటల వ్యవధిలోనే క్యాష్ ఛెస్ట్‌లు ఖాళీ అవుతూ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చి ఐదు వారాలు పూర్తి కావస్తున్నా, కరెన్సీ కొరత సమస్య దూరం కాలేకపోతోందని సగటు జీవులు ఎంతో భారమైన వదనాలతో వాపోతున్నారు. తమ ఖాతాల్లో ఉన్న నగదును ఆర్‌బిఐ పరిమితి మేరకు డ్రా చేసుకునేందుకు కూడా వీలు లేకుండాపోతోందని ఆవేదన వెలిబుచ్చారు. మూడు రోజుల పాటు చేతిలో చిల్లిగవ్వ లేక బయట అప్పులు చేశామని, తీరా ప్రస్తుతం 4వేల రూపాయల వరకే నగదును అందిస్తే తాము అప్పులు ఎలా చెల్లించాలి, ఇతర దైనందిన కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో అర్ధం కావడం లేదని సగటు జీవులు వాపోయారు. రోజువారీగా చిరు వ్యాపారాలు నిర్వహించే వారి పరిస్థితి మరింత దైన్యంగా మారింది. తాము డబ్బులు చెల్లించి సరుకు తెచ్చుకుని కొంత కమీషన్‌పై విక్రయించుకుంటేనే తమకు పూట గడుస్తుందని, అలాంటిది తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను చేతికందించకపోతే తమ వ్యాపారాలు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. కాగా, ప్రతీ చోట బ్యాంకుల వద్ద వందల సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో వారికి వెంటదివెంట సేవలందించేందుకు బ్యాంకు సిబ్బంది కూడా చెమటోడ్చాల్సి వచ్చింది. ఎటిఎంలు పని చేయకపోవడం బ్యాంకులపై మరింత భారం పడేలా చేస్తోంది. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి శ్రేణులకు చెందిన వారే బ్యాంకుల వద్ద అపసోపాలు పడుతుండడం కనిపించింది. రోజువారీ కూలీ పని చేసుకుని పొట్టపోసుకునే వారు మొదలుకుని కిందిస్థాయి ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ పనులను వదులుకుని బ్యాంకుల వద్దే క్యూ లైన్లతో కుస్తీలు పడుతున్నారు. నల్లధనం అరికట్టడం మాటేమో కానీ పెద్ద నోట్ల రద్దు తమ సహనానికి పరీక్ష పెడుతోందని పలువురు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.