నిజామాబాద్

నగర రహిత లావాదేవీల్లో ఆదర్శంగా ఇందూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 15: నగదు రహిత లావాదేవీలను నూటికి నూరు శాతం ప్రోత్సహిస్తూ నిజామాబాద్ జిల్లాను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు అన్ని వర్గాల వారు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో డీలర్లకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిమతం మేరకు అన్ని స్థాయిలలోనూ నగదు రహిత లావాదేవీలు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో డీలర్లు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. నగదు రహిత లావాదేవీల్లో నాలుగు అంశాలు ఇమిడి ఉన్నాయని, వాటిలో ఎటిఎం కార్డు, స్మార్ట్ ఫోన్, ఆన్‌లైన్, వేలిముద్రలు తీసుకుని ఆధార్ కార్డు నెంబర్‌ను అకౌంట్లతో అనుసంధానం చేసి డిజిటల్ లావాదేవీలు జరుపవచ్చని అన్నారు. ఈ విధానాలను అవలంభించే విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా, వెంటనే నివృత్తి చేసుకుని నగదు రహితం దిశగా అడుగులు ముందుకు వేయాలని సూచించారు. మీ సేవా సెంటర్లలోనూ డిజిటల్ లావాదేవీల పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. డీలర్లు తప్పనిసరిగా డెబిట్ కార్డులు తీసుకుని నగదు రహిత లావాదేవీలే నిర్వహించాలన్నారు. పన్నులను ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాలని, తద్వారా చెల్లింపులన్నీ పారదర్శకంగా జరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. నగదు రహితం ద్వారా నల్లధనం, తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం వంటివి వాటికి కూడా ఆస్కారం ఉండదని అన్నారు. ఈ విధానానికి అలవాటుపడడం మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. సమయం వృధా కాకుండా తామున్న చోటు నుండే అన్ని కార్యకలాపాలను నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని, నిర్ణీత రుసుము మినహా ఎవరికీ ఒక్క నయా పైసా కూడా ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఉందని, అవినీతి పూర్తిగా తగ్గిపోతుందని కలెక్టర్ వివరించారు. డిజిటల్ విధానంతో పేదలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని, వారికి దక్కాల్సిన లబ్ధి పూర్తిస్థాయిలో చేకూరుతుందని చెప్పారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలన్నారు. తమ ఖాతాలలో డబ్బు నిల్వలు లేకపోయినా, ఎటిఎం కార్డు, డెబిట్ కార్డుల ద్వారా నిర్ణీత పరిమితి మేరకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. డీలర్లు, దుకాణాదారులు కూడా వినియోగదారులను ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు జరిపేలా ప్రోత్సహించాలని, ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ డిజిటల్ లావాదేవీల వైపు దృష్టిని మళ్లించాలని సూచించారు. అవినీతి రహిత సమాజాన్ని కోరుకోవడంతోనే సరిపెట్టుకోరాదని, అది ఆచరణలో సాధ్యపడాలంటే నగదు రహిత లావాదేవీలు నూటికి నూరు శాతం జరిగేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హితవు పలికారు. క్యాష్‌లెస్ విధానం వల్ల ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన పన్నులు పూర్తిస్థాయిలో ఖజానాకు సమకూరుతాయని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగి ఆ మొత్తాన్ని ప్రజల అవసరాల కోసం పెద్దఎత్తున వెచ్చించి వౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి లావణ్య, సహాయ కమిషన్‌లు లక్ష్మయ్య, నయ్యర్‌తో పాటు డీలర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.

పుష్కరాలకే పరిమితం ‘త్రివేణి’ సంగమం

పర్యాటక ప్రగతికి నోచుకోని కందకుర్తి
సంసద్ ఆదర్శ యోజనతోనూ మొక్కుబడిగానే అభివృద్ధి

నిజామాబాద్, డిసెంబర్ 15: పవిత్ర పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి ప్రాంతం త్రివేణి సంగమంగా బాసిల్లుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నప్పటికీ, పర్యాటకంగా మాత్రం ఎలాంటి అభివృద్ధిని సంతరించుకోలేకపోతోంది. పనె్నండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల సమయంలో లక్షలాదిగా పోటెత్తే భక్తజన సమూహానికి తాత్కాలిక సదుపాయాలు కల్పించడం, మినహా ఎన్నో విశిష్టతల కలయికగా ఉన్న ఈ ప్రాంత ప్రగతికి ప్రత్యేక చర్యలు చేపట్టాలనే ధ్యాస ఏ కోశానా కనిపించడం లేదు. గ్రామీణ సంసద్ యోజన పథకం కింద ఎంపి కల్వకుంట్ల కవిత కందకుర్తిని దత్తత తీసుకోవడంతో అభివృద్ధి పనుల కోసం ఒక మోస్తారుగానైనా నిధులు మంజూరవడం కాస్తంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే దత్తత గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపర్చి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి త్రివేణి సంగమ ప్రాంతం ఇంకనూ ఎంతో దూరంలోనే ఉండిపోతోంది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం 12హెచ్.పి, 5హెచ్.పి మోటార్లు, మినీ ట్యాంక్, ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా గ్రామంలోని 1170 కుటుంబాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. బాల వికాస సేవా సంస్థ వారిచే మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. ఇ-పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పాటు రైతుల సౌకర్యార్థం వ్యవసాయ గిడ్డంగిని, గ్రామీణ గ్రంథాలయం, బస్టాండ్‌లను మంజూరు చేయించి వాటి భవనాల నిర్మాణం పనులను జరిపిస్తున్నారు. సంసద్ యోజనతో ఇవి మినహా ఇతరాత్రా ప్రయోజనాలేవీ చేకూరలేదు. కందకుర్తిలో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలతో పాటు తెలుగు మీడియంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, ఉపాధ్యాయుల ఖాళీల సమస్య వెంటాడుతూనే ఉంది. అన్నింటికి మించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దితే మరింత ప్రాచుర్యం పొందేందుకు ఆస్కారం ఉంటుందని స్థానికులు పదేపదే కోరుతున్నప్పటికీ, ఆ దిశగా చర్యలు చేపడుతున్న దాఖలాలు మచ్చుకైనా కానరావడం లేదు.
గోదావరి, మంజీరా, హరిద్ర నదుల విశిష్ట కలయికతో త్రివేణి క్షేత్రంగా భాసిల్లుతూ, రాష్ట్ర సరిహద్దు గ్రామంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కేవలం పుష్కరాల సమయంలోనే కాకుండా అనునిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. చిన్నారుల కేశ ఖండనాలు ఇతర వేడుకలు జరుపుతూ మొక్కులు తీర్చుకుంటారు. వర్షాకాలం చివరి సమయంలోనైతే పరవళ్లు తొక్కి ప్రవహించే గోదావరి నది అందాలను వీక్షిస్తూ, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భారీగా జనాలు తరలివస్తారు. త్రివేణి సంగమ ప్రాంతానికి ఉన్న విశిష్టత సైతం భక్తులను తరలివచ్చేలా చేస్తోంది. కందకుర్తి గ్రామానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. తమిళుల ఆరాధ్య దైవమైన స్కంధుడు (కార్తికేయుడు) ఈ ప్రాంతంలో సంచరించినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో పూర్వీకులు ఈ గ్రామాన్ని స్కంధకూడలి అని పిలిచేవారు. కాలక్రమంలో స్కంధ పదం ‘కంద’గా మారింది. ‘కుడతి’ అనగా నివాసము కావడంతో ప్రస్తుతం కందకుర్తిగా మారింది. తెలంగాణలోని పురాతన ఆలయాలుగా పేర్కొనబడే వాటిలో ఇక్కడ కూడా ఒక ఆలయం తన విశిష్టతను చాటుకుంటోంది. 1042 సంవత్సరంలో కందకుర్తి సమీపంలోని త్రివేణి సంగమ స్థలంలో కళ్యాణి చాళుక్యులు స్కంధ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డేవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి కావడంతో ఈ గ్రామానికి దేశ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. వివిధ రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి స్వయం సేవకులు, ప్రముఖులుగా ఎదిగిన నాయకులు నేటికీ ఈ గ్రామాన్ని సందర్శించటానికి తరుచూ వస్తుంటారు. బిజెపి నేతలు ఎల్‌కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు బాలసాహెబ్ దేవరాజ్, మోహన్ భగవత్ వంటి ఎందరో ప్రముఖులు కందకుర్తిని సందర్శించిన వారిలో ఉన్నారు. ఛత్రపతి శివాజీ సందర్శించిన గడ్డగా ఈ ప్రాంతం పేరొందింది. 2003తో పాటు ఇటీవలే ఏడాదిన్నర క్రితం 2015లో జరిగిన గోదావరి పుష్కరాలతో త్రివేణి సంగమంగా విలసిల్లుతున్న కందకుర్తి పవిత్ర క్షేత్రం జిల్లాకు ఎంతో వనె్న తెచ్చింది. త్రివేణి సంగమం, రామాలయం, హెగ్డేవార్ కేశవాస్మృతి మందిరం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేకపోతోంది. ఇప్పటికీ మొక్కులను తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి హాజరవుతుంటారు. ఇక్కడ సౌకర్యాలను మెరుగుపరిస్తే కందకుర్తి టూరిజం స్పాట్‌గా విలసిల్లే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదనే అసంతృప్తి స్థానికుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కందకుర్తికి సౌకర్యాలు కల్పించి త్రివేణి సంగమ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత దక్కేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.