నిజామాబాద్

సమాజ సేవ అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 17: సమాజ సేవే ధ్వేయంగా రిటైర్డు ఉద్యోగులు ముందుకు సాగడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శనివారం జాతీయ పెన్షనర్స్ డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్రీడల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు తమ సంక్షేమంతో పాటు సమాజ సంక్షేమం కోసం ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమన్నారు. రిటైర్డు ఉద్యోగులు తమ అనుభవాలను సమాజంలో పంచుకోని అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా కృషి చేయాలన్నారు. షటీల్, క్యారం, చెస్, తదితర క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు ప్రతాప్‌రెడ్డి, వెంకట్, భద్రయ్య, విఠల్, విశ్వనాథం, డిటిఓ రవికుమార్, మురళి, శ్యాం, ఖుతుబోద్దీన్, సాయాగౌడ్, నారాగౌడ్, బాలాగౌడ్, తదితరులున్నారు. కాగా బహుమతులు, భోజన వసతి ఏర్పాటు చేసిన కె. వెంకటేశంను అభినందించారు.

శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యం
డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, డిసెంబర్ 17: శాంతిభద్రతల పరిరక్షణే ధ్వేయంగా పనిచేస్తామని కామారెడ్డి డిఎస్పీ కె. ప్రసన్న అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆమె పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడారు. 2012వ బ్యాచ్‌కు చెందిన ప్రసన్న హైద్రబాద్‌లోని సిసిఎస్‌లో పనిచేసింది. వైట్ కాలర్ నేరాలతో పాటు షీ టీం, ఉమెన్స్ పిఎస్ విభాగాల్లో పనిచేసింది. ప్రజలకు పెండ్లీ పోలీసింగ్ సేవలను అందిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన డిఎస్పీ ప్రసన్నను బదిలీపై వెళ్లిన డిఎస్పీ భాస్కర్, ఎల్లారెడ్డి డిఎస్పీ నర్సింహా, టౌన్ సిఐ శ్రీనివాస్‌రావు, రూరల్ సిఐ కోటేశ్వర్‌రావు, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పీ ప్రసన్న ఎస్పీ శే్వతను కలిశారు.

పెట్రో వడ్డనతో ప్రజలపై రోజుకు రూ.20లక్షలు
అదనపు భారం!

ఆందోళనలకు శ్రీకారం చుట్టిన వామపక్షాలు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 17: పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతూ, నిత్యవసర సరుకుల ధరలు నింగినంటిన తరుణంలో, చమురు కంపెనీలు తాజాగా మరోమారు పెట్రోలు ధరలు పెంచడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయనే సాకుతో చీటికిమాటికి పెట్రో బాదుడుకు దిగుతుండడంతో సగటు జీవులు అదనపు ఆర్థిక భారాన్ని తల్చుకుని విలవిల్లాడుతున్నారు. లీటరు పెట్రోలుకు 2.21రూపాయలు, డీజిల్‌పై 1.79పైసలు చొప్పున పెంచిన ధరలను బట్టి చూస్తే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో ప్రతిరోజు దాదాపు 20లక్షల రూపాయల వరకు వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుందని స్పష్టమవుతోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే పెట్రో వడ్డింపులను అమల్లోకి తేవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు డిచ్‌పల్లి తదితర ప్రాంతాల్లో సిపిఎం, న్యూడెమోక్రసీ, ఎఐకెఎంఎస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆటోరిక్షాలకు తాళ్లు కట్టి లాగుతూ నిరసనలు చాటారు. పెంచిన చమురు ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. వాస్తవంగానే తరుచూ పెట్రో ధరలు పెంచుతుండడం పట్ల అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడూ స్వల్పంగా ధరలు తగ్గిస్తున్నప్పటికీ, పెంచే సమయంలో మాత్రం భారీగా వడ్డింపులు విధిస్తున్నారని, ఇలా చీటికిమాటికి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఆర్థికంగా తాము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతున్నామని సగటు జీవులు వాపోతున్నారు. రెండు జిల్లాలలో సుమారు 120 వరకు పెట్రోల్ బంకులు ఉండగా, ప్రతిరోజు సగటున ఆరున్నర లక్షల లీటర్ల డీజిల్, రెండు నుండి రెండున్నర లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం అవుతోంది. జిల్లాలో లక్షా 80వేల వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, ఆటోరిక్షాలు, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు మరో 60వేల వరకు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు అదనంగా 2.21రూపాయలు, డీజిల్‌పై 1.79 పైసలు అదనంగా పెంచడంతో ఒక్క నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోనే వాహనచోధకులపై రోజుకు 20లక్షల పైచిలుకు భారం పడనుంది. అందనంత ఎత్తులో ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలతోనే సతమతం అవుతున్న ప్రజలు, పెట్రో మంటలతో మరింత చేతిచమురు విదిల్చాల్సిన పరిస్థితి ఏర్పడడంతో బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యక్షంగా ఈ అదనపు పోటుకు తోడు బడుగు జీవులు సైతం పెరిగిన పెట్రో ధరల కారణంగా ఛార్జీల రూపంలో వాతలను చవిచూడాల్సి వస్తోంది. చమురు ధరలు పెరగడాన్ని సాకుగా చూపిస్తూ ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను పెంచే అవకాశాలుండడం మధ్యతరగతి, సామాన్య, బడుగు జీవులపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ వాహన ఆపరేటర్లు కూడా ఇదే అదనుగా భావించి ఆర్టీసీ కంటే ఎక్కువ స్థాయిలో ధరలు పెంచడం జరుగుతుంది. ఈ పెట్రో మంటలను ఎలా తట్టుకోవాలన్న దానిపై బడ్జెట్ బాబులు తర్జనభర్జనలు పడుతున్నారు. పెట్రో ధరల పెరుగుదల ప్రభావం వల్ల నిత్యవసర సరుకుల ధరలు మరింతగా నింగినంటడం ఖాయమని సామాన్య ప్రజానీకం ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

సహనం సన్నగిల్లుతోంది...!

నగదు కొరతతో రోడ్డెక్కుతున్న కార్మికులు, కర్షకులు

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 17: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమలుతో తెరపైకి వచ్చిన నగదు కొరత సమస్య ప్రజలను ఆందోళనల వైపు పురిగొల్పుతోంది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన వారు సైతం ప్రభుత్వం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. గడిచిన ఐదు వారాలకు పైగా ఎంతో ఓపిక పట్టినప్పటికీ, కరెన్సీ కొరత వెంటాడుతూనే ఉండడంతో ప్రతి ఒక్కరిలోనూ సహనం సన్నగిల్లేలా చేస్తోంది. ఫలితంగా రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, సాటాపూర్ గేట్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, బీర్కూర్ తదితర ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేసి నిరసన వెళ్లగక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల అనుబంధ సంఘాలు, వామపక్షాలు కూడా నిరసనల్లో పాల్గొని మద్దతు తెలుపుతున్నాయి. నగదు కొరత సమస్య పరిష్కారానికి నోచుకోకపోగా, నానాటికీ మరింత జఠిలంగా మారుతుండడంతో మునుముందు ఆందోళనల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. బ్యాంకుల్లోని తమ ఖాతాలలో నిల్వ ఉన్న నగదును కోరిన మేరకు అందించేందుకు నిరాకరిస్తుండడం, ఎటిఎంలు 80శాతానికి పైగా పని చేయకుండా ఎప్పుడు చూసినా మూతబడి ఉండడం ప్రజల్లో అసహనం పెల్లుబికేలా చేస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం పట్ల ప్రధానంగా బీడీ కార్మికులు, రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తరువాత లక్షలాది కుటుంబాలకు బీడీ పరిశ్రమనే ఉపాధికి పెద్ద దిక్కుగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు పరిణామంతో బీడీ కార్మికులకు వేతనాలను(బట్వాడా) నగదు రూపంలో చెల్లించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు వారి ఖాతాల్లోనే జమ చేసేందుకు రంగం సిద్ధం చేశాయి. అయితే ఇప్పటికీ అనేక మందికి ఖాతాలు లేకపోవడం, బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునే విధానానికి అలవాటుపడకపోవడంతో, పిఎఫ్ పత్రాల్లో పేర్లు ఒకవిధంగా ఉండి, బ్యాంకు ఖాతాల్లో వేరే పేర్లు ఉండడం వంటి సమస్యలతో లక్షలాది మంది బీడీ కార్మికులు ఆన్‌లైన్ వేతనాల చెల్లింపు విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిపి, కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. ఇదివరకటి తరహాలోనే నగదు రూపంలో తమకు బట్వాడాలు చెల్లించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అయితే బ్యాంకుల నుండి పరిమితంగానే నగదును విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు అమల్లో ఉండడం, కనీసం ఆర్‌బిఐ పరిమితి మేరకు కూడా బ్యాంకులు నగదును అందించే పరిస్థితి లేకపోవడంతో బీడీ కార్మికులకు నగదు రూపకంగా బట్వాడాలు చేయడం అసాధ్యంగా మారిందని బీడీ కంపెనీల యాజమాన్యాలు నిస్సహాయతను వెలిబుచ్చుతున్నాయి. మరోవైపు రైతులు కూడా కరెన్సీ కష్టాలను తాళలేక రోడ్డెక్కి నిరసనలు చాటుతున్నారు. దాదాపు మూడొంతుల మంది రైతులు సహకార సంఘాల్లోనే సభ్యత్వాలు కలిగి ఉంటూ, డిసిసిబి శాఖల్లో ఖాతాలు కొనసాగిస్తున్నారు. అయితే సహకార బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేసే వ్యవహారం మొదలుకుని, ఇతరాత్ర అనేక ఆంక్షలు విధిస్తుండడం రైతులు నగదు కొరతతో మరింతగా సతమతం అయ్యేలా చేస్తోంది. అన్నింటికి మించి గత మూడునాలుగు రోజుల నుండి జిల్లాలోని మెజార్టీ సహకార బ్యాంకుల్లో నయా పైసా నగదును అందించకపోవడంతో అన్నదాతలను ఆగ్రహం తెప్పిస్తోంది. సర్వర్ పని చేయడం లేదని, నగదు నిల్వలు నిండుకున్నాయనే సాకుతో రైతులకు వారి ఖాతాల్లో దాచుకున్న నగదును అందించకపోవడంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో పంటల సాగు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం ఉండగా, పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత తీవ్రరూపం దాల్చి తమ సహనాన్ని పరీక్షిస్తోందని రైతులు వాపోతున్నారు. అదును దాటిపోతే తాము పంటలు సాగు చేసే పరిస్థితి ఉండదని, చేతిలో నగదు లేకపోతే సేద్యపు పనులు ఎలా చక్కబెట్టాలని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు కూడా నోట్ల రద్దు నిర్ణయాన్ని విభేదిస్తూ ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే తమ వ్యాపారాలు సగానికి పడిపోయాయని, పైపెచ్చు కొత్త 2000 నోటును మాత్రమే వినియోగదారులకు అందిస్తుండడంతో చిల్లర సమస్యతో తమ వ్యాపారాలు మరింత కుదేలవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతున్నారు

పెన్షనర్లను సన్మానించడం అభినందనీయం
* కలెక్టర్ యోగితారాణా
కంఠేశ్వర్, డిసెంబర్ 17: విధుల్లో ఉన్నప్పుడు ఉద్యోగులకు సత్కారాలు జరుగుతాయని, అయితే పదవి విరమణ తర్వాత కూడా పెన్షనర్లను సన్మానించుకోవడం అభినందనీయమని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. శనివారం నగరంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్‌లో ఆలిండియా పెన్షనర్స్ డేను పురస్కరించుకుని 20మందిని సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెన్షనర్లు మరిచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను వారి పిల్లలు ఇబ్బందులకు గురి చేసినా, ఎలాంటి వేధింపులకు పాల్పిడినా తమ దృష్టికి అలాంటిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రెండు మాసాలకు ఒకసారి కలెక్టరేట్‌లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు. డిటిఓ కార్యాలయాన్ని త్వరలో తహశీల్ కార్యాలయంలోకి మారుస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ సిటీజన్లను చూస్తే తన తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా 75నుండి 80సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రవీందర్, దయాకర్, జగత్‌రెడ్డి, పృధ్వీరాజ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

త్వరితగతిన ఇంటింటికి నల్లా కనెక్షన్లు
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, డిసెంబర్ 17: మిషన్ భగీరథలో చేపడుతున్న తాగునీటి పథకానికి సంబంధించిన నల్లా కనెక్షన్లను ఇంటింటికి త్వరగా బిగించాలని, ఈ విషయంలో పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు దగ్గరుండి పనులను చేయించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించారు. శనివారం ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆయన మున్సిపల్ కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఆర్మూర్‌కు వచ్చి తాగునీటి పథకాన్ని ప్రారంభించినందున పనులను త్వరగా పూర్తయ్యేట్లు చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మిషన్ భగీరథలో రాష్ట్రంలోనే మొదటి సారిగా ఆర్మూర్ పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుందామని, అందువల్ల ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేశారని ఆయన కౌన్సిలర్లకు చెప్పారు. ఈ ఆరు కోట్లతో ఆర్మూర్ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాలని ఆయన సూచించారు. కాగా ఆర్మూర్ పట్టణంతో పాటు పెర్కిట్ గ్రామంలో స్వయంగా లబ్దిదారుల ఇంటికే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్వయంగా వెళ్లి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐదుగురి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే లబ్దిదారులతో మాట్లాడి చెక్కులను అందజేశారు.
కాగాఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిర్వహించనున్న డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ సంబరాలకు హాజరుకావాలని కళాశాల ప్రిన్సిపాల్ సఫ్దర్ అస్కరి, అధ్యాపకులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహించనున్నామని అన్నారు.
కాగా ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న 85 సంవత్సరాల వయసు గల ఓ వృద్ధురాలు తన భూమిని కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే తహశీల్దార్‌తో మాట్లాడి వృద్ధురాలు భూమి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ఆ వృద్ధురాలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.

సమస్యల పరిష్కారానికి ఛేంజ్ ఏజెంట్లు కృషి
కలెక్టర్ డాక్టర్ యోగితారాణా
ఇందూర్, డిసెంబర్ 17: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఛేంజ్ ఏజెంట్లు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, మోడల్ గ్రామ పంచాయతీలపై ఛేంజ్ ఏజెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న మోడల్ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఛేంజ్ ఏజెంట్లదేనని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన ఉందా, పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. రేషన్ షాపుల ద్వారా ఎంతమంది వినియోగదారులు బియ్యంతో పాటు ఇతర సరుకులను తీసుకుంటున్నారనే విషయాలు తెలుసుకోవడంతో పాటు మిగతా గ్రామాలను సైతం మోడల్ విలేజ్‌లుగా తీర్చి దిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమన్వయపరుస్తూ ముందుకు వెళ్లాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే శనివారం నాటికి పూర్తి నివేదికలు సిద్ధం చేసుకుని సమావేశానికి హాజరు కావాలన్నారు. ప్రతి ఛేంజ్ ఏజెంట్ వారంలో 3రోజులు ఖచ్చితంగా గ్రామాల్లో పర్యటించాలని, వసతి గృహాలు, పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్లు, ఛేంజ్ ఏజెంట్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇష్టమైన వంట చేయలేదని యువకుడి ఆత్మహత్య
వినాయక్‌నగర్, డిసెంబర్ 17: నగరంలోని హమాల్‌వాడికి చెందిన శ్యామ్(32)అనే వ్యక్తి ఇంట్లో తనకు ఇష్టమైన వంట చేయలేదని మద్యం మత్తులో కత్తితో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించిన శ్యామ్, చికెన్ వండాలని తన తల్లికి చెప్పడం జరిగిందని, అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో తర్వాత వండుకుందామని తల్లి సమాదానం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో తాగిన మైకంలో ఉన్న శ్యామ్ క్షణికావేశంలో కత్తితో చేతిపై కోసుకోవడం జరిగిందని, తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందడం జరిగిందని, శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించడం జరిగిందన్నారు.

రేషన్ బియ్యం పట్టివేత
పిట్లం, డిసెంబర్ 17: మండల కేంద్రమైన పిట్లంలోని ఉప్పు మురళి, శ్రీనులకు చెందిన కిరాణా దుకాణాలు, ఇళ్లపై దాడి చేసిస విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 26క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇట్టి బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ నర్సింహారావుకు స్వాధీనం చేశారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ విజిలెన్స్ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ సాదత్‌అలీ, కానిస్టేబుల్ రాములు తదితరులు పాల్గొన్నారు.