నిజామాబాద్

‘నిజాం షుగర్స్’పై ఆందోళనల షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 22: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరంగా నిర్వహించడం సాధ్యపడదంటూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కరాఖండీగా తేల్చి చెప్పడం కార్మిక, రైతు, ప్రజా సంఘాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్‌లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసనలు చాటారు. ధర్నాచౌక్ సమీపంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎఐకెఎంఎస్, ఐఎఫ్‌టియుల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐకెఎంఎస్ నాయకుడు ఆకుల పాపయ్య మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వ కుటిల నీతి మరోమారు బట్టబయలైందని దుయ్యబట్టారు. తెరాసను అధికారంలోకి తెస్తే వంద రోజుల్లోపే నిజాం షుగర్స్‌ను స్వాధీనం చేసుకుని పూర్వ వైభవం సంతరింపజేస్తామని తెరాస అధినేత కెసిఆర్ మొదలుకుని ఆ పార్టీ ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పదేపదే వాగ్దానాలు చేశారని అన్నారు. ఈ అంశాన్ని టిఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపర్చిందని గుర్తు చేశారు. తీరా ప్రస్తుతం చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయిందనే సాకును చూపుతూ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వపరంగా నిర్వహించడం వీలుపడదంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం శోచనీయమన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వం నిర్వహించేందుకు ముందుకు వస్తే చెరకు సాగు చేపట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్న విషయం కెసిఆర్ సర్కారుకు తెలిసినప్పటికీ, ఆ దిశగా చొరవ చూపకుండా సహకార రంగంలో నిర్వహించుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదంటూ అన్నదాతలపై నెపం నెట్టేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తక్షణమే నిజాంషుగర్స్‌తో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఎఐకెఎంఎస్, ఐఎఫ్‌టియుతో పాటు పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులు వేల్పూర్ భూమయ్య, జి.్భమన్న, జెల్ల మురళి, ఎల్‌బి.కుమార్, సరిత తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని టి.జెఎసి జిల్లా చైర్మెన్ గోపాల్‌శర్మ గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తూర్పారబట్టారు. నిజామాబాద్ జిల్లాకు తలమానికంలా నిలిచిన నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించి ప్రభుత్వపరంగా నిర్వహించే విషయంలో తెరాస సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎన్నికల హామీలకు తిలోదకాలిస్తూ కార్మికులు, కర్షకుల జీవితాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపని ప్రభుత్వం, కనీసం ఉన్న పరిశ్రమలను కూడా కాపాడలేని అసమర్థతను ప్రదర్శిస్తోందని ఆక్షేపించారు. కాగా, బోధన్‌లోని ఎన్‌డిఎస్‌ఎల్ కర్మాగారం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రైవేట్ కోరల్లో చిక్కుకున్న ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని నిరవధిక ఆందోళనలు కొనసాగిస్తున్న క్రమంలోనే తెరాస హయాంలో నిజాం చక్కెర కర్మాగారాలను లేఆఫ్ ప్రకటించి మూసివేశారని అన్నారు. వాటిని పునరుద్ధరించాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వం, ఫ్యాక్టరీలను నిర్వహించడం తమవల్ల కాదంటూ చేతులెత్తేయడంతో తాము రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. మునుముందు విపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనల తాకిడి మరింత తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎరువులను అందుబాటులో ఉంచాలి
రబీ సీజన్‌కు ఇబ్బందులు కల్గించవద్దు
కలెక్టర్ సత్యనారాయణ

కామారెడ్డి, డిసెంబర్ 22: రబీ సీజన్‌కు గాను రైతులకు ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్ పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా రైతులకు కావాల్సిన ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ బీమాకు సంబంధించి క్లెమ్‌లు, బీమా చెల్లింపులు రైతులకు జరిగేలా చూడాలని వ్యవసాయశాఖ జెడిని ఆదేశించారు. అదే విధంగా పంట బీమా కాకుండా రైతులకు వ్యక్తిగత బీమాకు సంబంధించిన క్లైమ్‌లను బాధిత రైతు కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరువు కింద వచ్చే ఇన్‌పూట్ సబ్సిడీ జిల్లాకు 69కోట్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 24కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు కింద 179 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 147కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో రైతులకు జమా చేయడం జరిగిందన్నారు. రబీ పంట కాలానికి సంబంధించి నిజాంసాగర్ నుండి నిర్దారించిన షెడ్యూల్ ప్రకారం నీరు విడులయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాల నుండి కందుల పంటకాలం పూర్తయింనందున మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాల్‌కు 5050 రూపాయలు కనీస మద్దతు చెల్లించి కొనుగోలు ప్రారంభించాలన్నారు. పద్మాజివాడిలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మరిన్ని రోజులు కొనసాగించేలా చూడాలన్నారు. ఉద్యానవన పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. రేషన్ సరుకులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెసి సత్తయ్య, జెడి విజయ్‌కుమార్, డిఎస్‌ఓ రమేశ్, పశు సంవర్ధక శాఖ జెడి గజారామ్, తదితరులున్నారు.