మెయన్ ఫీచర్

అసలు సిసలైన అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను వాష్‌రూంలో వుండి మీ ఫోన్‌కాల్‌ను అందుకోలేదు. చెప్పండి సార్! ఏం కావాలి...?’ అంటూ ఓ చత్తీస్‌గఢ్ మంత్రివర్యునికి ప్రస్తుతం బలరాంపుర కలెక్టర్‌గావున్న పాల్ ఎలెక్స్ మీనన్ సంజాయిషిగా మాట్లాడిన మాటలివి. ‘మారుమూల గిరిజన ప్రాంతంలో అరవైవేల రూపాయల జీతానికి, కుటుంబ సభ్యుల్ని ఏడాదికోసారి కలుస్తూ, ప్రోత్సాహమేలేని ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేయడం ఓ పీడకల..’అంటూ ఈమధ్యన ఫేస్‌బుక్‌లో రాసుకుని వివాదాల్లోకి ఎక్కిన పాల్, 2012లో సుకుమా జిల్లా కలెక్టర్‌గా వున్నప్పుడు మావోయిస్టులు పట్టుకెళ్ళగా, ప్రభుత్వం బి.డి.శర్మను, హరగోపాల్‌ను మధ్యవర్తులుగా పంపించింది.
బిడి శర్మగా చిరపరిచితులైన డా.బ్రహ్మదేవ్‌శర్మ ఇదే చత్తీస్‌గఢ్‌లో దేశంలోనే అతిపెద్ద జిల్లాగా వున్న ఒకప్పటి బస్తర్‌కు కలెక్టర్‌గా పనిచేసిన కాలం, పాల్‌కు మాదిరి పీడకల మాత్రం కాదు. యావత్ దేశం సిగ్గుపడాల్సిన రోజులు. అపార ఖనిజ సంపదలకు ఆలవాలమైన దండకారణ్యం, ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి కంపెనీలచే కొల్లగొట్టబడుతుంటే, ఆదివాసి మహిళలు చేసిన తిరుగుబాటును ఓ మనసున్న మనిషిగా ‘బైలాదిల్లా మహిళలు’అనే పుస్తకం ద్వారా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసాడు. అలా ఆదివాసిలతో (ఆదివాసులు) గొంతు కలిపినందుకు ఆగ్రహించిన పెట్టుబడిదారి గూండాలు శర్మగారిని నిసిగ్గుగా, అర్ధనగ్నంగా, మెడలో చెప్పులు వేసి ఊరేగించినా, చలించక, ‘సిగ్గుపడాల్సింది నేనుకాదు, ప్రభుత్వమని...’ పలికిన ధైర్యవంతుడు.
ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు, ప్రభుత్వం చెప్పుచేతుల్లో వుంటూ, పాలకులకు అనుకూలంగా పనిచేయడమే భాగ్యంగా భావించే వ్యవస్థలో, ప్రజలకోసం ఉద్యోగంగా జీవితాంతం భావించిన వ్యక్తి, ఓ వ్యవస్థ శర్మ. దేశానికి మొదటి తరం కలెక్టర్‌గా 1956లో నియమితులైనప్పుడు, నిజాయితీ ఒక్కటే సరిపోదని, ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసులకు జరిగే అన్యాయాల్ని ఎదుర్కోవడం అనివార్యమని శర్మ భావించాడు. అందుకే ఉద్యోగాన్ని ఓ ఉద్యమంగా మలుచుకున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంట్లో నలుసుగా మారాడు. కలెక్టర్‌గా పనిచేసిన 25 సంవత్సరాలు తన కార్యాలయాన్ని ఆదివాసి గూడేలతో అనుసంధానం చేసాడు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూలును అమలుచేయడానికి కృషిచేయగా, ప్రభుత్వం సహకరించక, నీరు, అటవి, భూమిపై ఆదివాసులకు గల హక్కుల్ని కాలరాయడం, ఆదివాసుల పంచాయితీల అనుమతి లేకుండానే అనుమతి వున్నట్లు అధికారులు ధృవీకరించడంతో నిరసనగా ప్రభుత్వ సర్వీసుకు 1981లో రాజీనామాచేసి ప్రజాందోళనలో భాగస్వామిగా మారాడు. దీంతో శర్మను జనజీవస్రవంతితో దూరం చేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం, ఈశాన్య రాష్ట్రాల హిల్ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా పంపించింది. అక్కడ 1981-86 దాకా సేవలందించిన శర్మ రాజ్యాంగపరమైన హక్కులకోసం అనేక పథక రచనల్ని చేసాడు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌గా నియమిస్తే ఆదివాసులకు సంబంధించిన కీలకపత్రాలకు రూపకల్పన చేసాడు.
ఎస్సీ సబ్ ప్లాన్‌కు, పీసా చట్టం రూపొందించడానికి అశోక్‌మెహతా కమిటీకి నిర్మాణాత్మకమైన సూచనల్ని చేసాడు. 1993లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చట్టరూపం దాల్చినా నేటికీ అమలుకుమాత్రం నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 1/70 చట్టాన్ని సవరించి, గిరిజనేతరులు గిరిజనుల భూములు కొనవచ్చు అన్న ప్రతిపాదనకు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించి, రాజ్యం కూడా ఆదివాసుల భూముల్ని ఆక్రమించడానికి వీలులేదన్న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిబంధనల్ని ఎత్తిచూపాడు. ఇలా ప్రతి అవకాశాన్ని శర్మ వినియోగించుకుంటూ, తన శ్వాసను ఆదివాసుల శ్వాసగా మార్చుకొన్న శర్మ దోపిడీ, పీడనతో స్వతంత్య్రభారతం రెండుగా చీలిపోతుందని ఆవేదన చెందుతూ, భారత్‌ను ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ దేశంగా అభివర్ణిస్తూ ‘‘ది టేల్ ఆఫ్ టూనేషన్స్’’ అనే పుస్తకాన్ని రచించాడు. ఆదివాసుల హక్కుల గూర్చి ఏ ఒక్క పార్లమెంటేరియన్ మాట్లాడకపోవడంతో, వారికి జరుగుతున్న అన్యాయాలపై ఓ సమగ్ర నివేదికను, వారికి గల హక్కులతోపాటు రాసి భూరియా అనే ఓ గిరిజన పార్లమెంటేరియన్ ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చేసాడు. ఇదో సాహసోపేతమైన చర్యనే! ఇదే తర్వాతి కాలంలో భూరియా కమిటీ రిపోర్టుగా రూపుదిద్దుకున్నది.
1992లో ‘్భరత్ జన ఆందోళన’అనే సంస్థను బస్తర్ కేంద్రంగా ప్రారంభించి, ఢిల్లీలోకూడా ఓ శాఖను ఏర్పాటుచేసి స్వంత పెన్షన్ డబ్బులతో నడిపించాడు. ‘ఊఁ’అంటే స్వచ్ఛంద సంస్థలు విరివిగా విరాళాలు ఇచ్చే అవకాశంవున్నా, అటువైపుగా ఆలోచించని శర్మ, చూడడానికి గాంధీ అనుచరుడిగా, ఖద్దరు లాల్చీ, పైజామాతో, దోవతితో, భుజాన ఓ సంచితో దేశమంతా నడయాడిన ప్రజల మనిషి.
పేదలకోసం పనిచేసి, మాట్లాడిన వ్యక్తిగా శంకరన్ గుర్తుంటే, ఆదివాసులకోసం ఉద్యోగిగా పనిచేస్తూనే పోరాటం సాగించిన ఏకైక ఉన్నతస్థాయి అధికారిగా చరిత్ర పుటలలో మిగిలిన శర్మ గ్వాలియర్ వాసియే అయినా యావత్ దేశానికి చిరపరిచితుడు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాందోళనల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన సంబంధాలు పెట్టుకున్నారు. నర్మదాప్రాజెక్టు నిర్వాసితులనుంచి పోలవరం నిర్మాణం నిర్వాసితుల దాకా ఆయన అండగా నిలిచాడు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డితో సహా రాష్ట్రంలో జరిగిన అనేక సదస్సులకు ఆయన హాజరై సులభమైన ఆంగ్లంలో, హిందీలో ఓ ఉపాధ్యాయుడిలా మాట్లాడి సమస్యల మూలాల్ని విశదీకరించేవారు. పిలిచి, అన్ని సౌకర్యాలు కల్గిస్తేనే వస్తానని కాకుండా, పిలవకున్నా, తనవంతు బాధ్యతగా ఉద్యమాల్లో పాల్గొన్న శర్మ డిసెంబర్ 6నాటి మరణవార్త ఏ ప్రసార మాధ్యమాలకు పట్టలేదు.
చివరిదశలో ఆయనకు అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వచ్చినా, ఆదివాసుల గూడేలను చూడాలనే కోరిక తగ్గలేదు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడుకుల్ని తీసుకెళ్ళమని కోరడాన్నిబట్టి ఆయన కమిట్‌మెంటు తెలుస్తున్నది. ప్రజల పక్షాన నిలబడేవారు, పోరాడేవారు, త్యాగాలు చేసేవారు దేశంలో, ప్రపంచంలో లక్షల్లో వున్నారు. కాని, ఓ ఉన్నతస్థాయి అధికారిగా, సుఖంగా బతికే అవకాశం వున్నా, నిజమైన జీవితం ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసులకు సేవచేయడంలోనే వుందని భావించిన ఉదాత్తుడు బి.డి.శర్మ.
‘మన రాజ్యాంగ సూత్రాలు సరియైనవే! కాని, మనం సాధిస్తున్న ఫలితాలు శుద్ధతప్పు! ఇదో రోగగ్రస్త దేశం. ఈ రోగాన్ని సూక్ష్మదర్శినితో గుర్తించి శస్తచ్రికిత్స మొదలుపెట్టగానే, కొత్త పుండ్లు (రణాలు) కనిపిస్తాయి. మన లక్ష్యం కఠినమైనదేకాక, స్వచ్ఛమైనది కూడా కావచ్చు! నిజానికి ప్రజలు ప్రేమించడానికి బదులుగా మననువారు ద్వేషిస్తున్నారు...’అంటూ, దేశ ధిక్కారం నేరం కింద అరెస్టుఅయిన రష్యా దేశపు ఉన్నత అధికారి రుబశోవ్ జైల్లో రాసుకున్న వ్యాక్యాలు బి.డి.శర్మ ఆచరణకు అద్దంపట్టి వుంటాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి అధికారులు కొందరువుంటే వుండవచ్చు! ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న కుట్రల్ని, కుతంత్రాల్ని బహిర్గతం చేస్తున్నవారు ఈమధ్యన ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నారు. ఇలాంటివారు దేశ బహిష్కరణకు గురై ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. కాని, బి.డి.శర్మ ప్రభుత్వ ద్వంద్వ విధానాల్ని జీవితాంతం ఎదిరించి, ప్రజల పక్షాన నిలబడడం గర్వించాల్సిన విషయం.
శర్మకు అవార్డులు, రివార్డులు రాకపోవచ్చు! వాటికోసం అర్రులు చాచడం ఆయన నైజం కాదు. కాని, మొదటి తరం ప్రధానమంత్రులతో సహా, రాజీవ్‌గాంధీ దాకా బి.డి.శర్మను గౌరవించినవారే! శర్మను గుర్తెరగని ప్రధానమంత్రులు గాని దేశాధ్యక్షులు గాని లేరంటే అతిశయోక్తికాదు. ఆదివాసుల సమస్య ఏస్థాయిలో చర్చకువచ్చినా, ముందుగా వినిపించిన పేరు శర్మది. ఇలా ఆదివాసుల గుండెల్లోనే కాక, ప్రజాస్వామ్యవాదుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వ్యక్తికి ఏ స్థాయిలో నివాళులు అర్పించినా తక్కువే! ఆయన ఎంచుకున్న మార్గాన్ని అభిమానించినా, నిజమైన నివాళులు అర్పించినట్లే! ముఖ్యంగా ఉద్యోగులుగా, బ్యూరోక్రాట్లుగా బి.డి.శర్మ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతగానో వుంది. కనీస స్థాయిలో బి.డి.శర్మలా ఉద్యోగులు స్పందించినా, దేశ ప్రజల దశ, దిశ ఎప్పుడో మారిపోయేది. ఇప్పుడన్నా ఈ దిశగా ఆలోచిస్తే, ఈ సమాజానికి, ప్రజలకు, మొత్తంగా దేశానికి మేలు చేసినవారం అవుతాం! (చిత్రం) డా.బి.డి.శర్మ
(డిసెంబర్ 6, 2015న మరణించిన ఐఎఎస్ అధికారి, ప్రజాస్వామ్యవాది డా.బి.డి.శర్మకు నివాళిగా)

- డా.జి.లచ్చయ్య