రాష్ట్రీయం

ఇప్పటికిప్పుడే కష్టం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ఏడాది గడువివ్వండి
చలో విజయవాడపై సిబ్బంది
పునరాలోచనలో ప్రభుత్వం
హైదరాబాద్, నవంబర్ 26 : హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లేందుకు ప్రభుత్వ ఉద్యోగులు మానసికంగా సిద్ధంగానే ఉన్నప్పటికీ, ఈ క్రమంలో తమకు ఎదురయ్యే సమస్యల కారణంగా ఇప్పటికిప్పుడే వెళ్లలేమని చెబుతున్నారు. ప్రభుత్వ పాలన విజయవాడ నుండి కొనసాగాలనుకుంటే రాష్ట్ర సచివాలయం, డిజిపి కార్యాలయంతో పాటు అన్ని శాఖలకు చెందిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌ను హైదరాబాద్ నుండి విజయవాడ తరలించాల్సి ఉంటుంది. 2016 జూన్ వరకైనా అన్ని శాఖలను తరలించాలని చంద్రబాబు అభిప్రాయంతో ఉద్యోగులు విభేదిస్తున్నారు. ఈ కాలాన్ని మరో ఏడాది పాటు పొడగించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలు అశోక్‌బాబు, కృష్ణయ్య, మురళీకృష్ణ తదితరులతో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చర్చించారు. విజయవాడలో మేధాటవర్స్‌ను సచివాలయం కోసం ఉపయోగించాలనుకున్నప్పటికీ, ఈ భవనం పూర్తిగా సరిపోదని, అలాగే డిజిపి కార్యాలయం, ఫారెస్ట్ రాష్ట్ర కార్యాలయం, ఇతర శాఖల కోసం విశాలమైన భవనాలు అవసరం అవుతాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 60 సంవత్సరాల నుండి రాష్ట్ర రాజధానిగా ఉంటూ వచ్చిన హైదరాబాద్‌లోనే ప్రభుత్వ కార్యాలయాలకు తీవ్రమైన కొరత ఉందని ఉద్యోగ సంఘాలనేతలు పేర్కొంటున్నారు.
సచివాలయంతో పాటు హెచ్‌ఓడిలలో దాదాపు 600 పైగా సెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని హెచ్‌ఓడిలకు సంబంధించి ఒకటి లేదా రెండు సెక్షన్లను విజయవాడ తరలించారు. అలా వెళ్లిన వారిలో ఎపికి చెందిన ఉద్యోగులతో పాటు తెలంగాణకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారు. అధికారికంగా ఉద్యోగుల విభజన జరిగితే తాము తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందని, అలాంటి తమను బలవంతంగా విజయవాడ పంపించారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు.
ప్రభుత్వ రాష్ట్ర కార్యాలయాల కోసం భవనాలను ఎంపిక చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకున్నప్పటికీ, ఉద్యోగులు నివసించేందుకు మాత్రం ఎవరికి వారే గృహాలను చూసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఈ అంశంపై జరిగిన సమావేశాల్లో ప్రభుత్వ విధానాన్ని స్పష్టంగా తెలియచేశారు. కార్యాలయాలకోసం భవనాలు చూసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఉద్యోగుల నివాసాల కోసం గృహవసతి ఎవరికి వారే చూసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పిల్లల చదువు, వారి ప్రాంతీయత, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న ఆస్తుల (ఇళ్లు తదితరాలు) విక్రయం, వైద్యం తదితర అంశాలను ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశాలు న్యాయసమ్మతమైవేనని ప్రభుత్వం అంగీకరిస్తోంది. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిల కోసం ఎంపిక చేసిన క్యాంపు కార్యాలయాలే వారికి సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. కీలకమైన వారి కార్యాలయాల పరిస్థితే ఇలా ఉంటే ఇతర శాఖలకు ఎలాంటి భవనాలు లభిస్తాయో అర్థమవుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపును 2017 జూన్ నాటికి పొడిగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తన విధానాన్ని పునరాలోచించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.