Others

ఆ నటులకేరీ.. సాటి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్నింగ్ షిఫ్ట్‌లో హీరోయిన్. మిడిల్ షిఫ్ట్‌లో అక్క లేక వదిన. ఈవినింగ్ షిఫ్ట్‌లో -అమ్మ. ఒకరే నటి. పోషించే పాత్రలు.. వాటి వయసుల్లో వైవిధ్యం. ఒకప్పటి నటుడూ అంతే! ఫస్ట్ షిఫ్ట్‌లో -హీరో. మిడిల్ షిఫ్ట్‌లో కొడుకు. చివరి షిఫ్ట్‌లో తండ్రి పాత్ర. ఒకే నటుడు ఒకే రోజు అనేక -పాత్రలు పోషించటం, వాటిని రక్తికట్టించటం
సాధ్యమేనా? అంటే.. సాధ్యమేనని నిరూపించారు. ఇప్పుడు కనీసం -అలాంటి సాహసాన్ని ఊహించడానిక్కూడా
భయపడుతున్నారు. ఎందుకుంటే -ఒక పాత్ర పోషించి మెప్పిస్తే -తరువాతి సినిమాల్లోనూ అలాంటి పాత్రలకే పరిమితం
కావాలేమోనన్న భయం. నిజానికి అంతకుమించిన పాత్ర ఒక్కటీ పడదు. అదీ పరిస్థితి.
**
పాత్రను అర్ధం చేసుకుని.. తగిన విధంగా ఆహార్యాన్ని ప్రదర్శించి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగేవారే నటులు. ఇది -ఒకప్పటి తరం చెప్పిన డెఫినిషన్. నిజమైన నటన తెరపై ప్రదర్శించి, ప్రేక్షకులను సమ్మోహితులను చేయాలంటే ఆమాత్రం కసరత్తు, జాగ్రత్త తప్పదు మరి. పాత్రను అర్ధం చేసుకోవడం ఒక ఎత్తయితే, హావభావ విన్యాసంతో సన్నివేశం పండించడం మరో ఎత్తు. అయితే నటులు ఏ పాత్ర పోషిస్తున్నా -ఆ పాత్ర మూలాలు తెలుసుకుని ఉండాలి. ఆహార్యం, మేకప్ అన్నీ కుదిరినా -ప్రియురాలి పాత్ర వేస్తూ అక్కలా డైలాగ్ చెపితే సన్నివేశం రసాభాస తప్పదు. తాను హీరోకు అక్కగా నటిస్తున్నానా? చెల్లిగా నటిస్తున్నానా? లేక భార్యగా నటిస్తున్నానా? అనే క్లారిటీ సదరు నటికి తప్పనిసరే! ఈ థియరీ -నటుడికీ వర్తిస్తుంది.
అక్కాచెల్లెలు, భార్య పాత్రల గోలేంటి? అనుకోవచ్చు. ఒకప్పటికి వెళ్తే -తెలుగు సినిమా బలపడుతున్న రోజుల్లో ఇప్పుడున్నంత నటీనటవర్గం ఉండేది కాదు. ఏ కొద్దిమందో మాత్రమే -పరిశ్రమకు వచ్చేవారు. ఆ ఉన్నవాళ్లలోంచే -పాత్రకు తగిన వ్యక్తిని ఎంపిక చేసుకుని సినిమాను పండించాల్సి వచ్చేది. ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి రమాప్రభ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే -‘ఎక్కడైనా మేమే! కాకపోతే సినిమా పేరు, దర్శకుడు మారేవారు. ఓ చిత్రంలో ప్రియురాలిగా, మరో చిత్రంలో కూతురిగా, ఇంకో చిత్రంలో అమ్మగా.. ఇలా ఎక్కడైనా ఉన్నవాళ్లమే కనిపించేవాళ్లం. అయినా, ఏ పాత్ర చేస్తున్నా ఆ పాత్రకు వనె్న తెచ్చేవాళ్లం’ అన్న ఆమె మాటలు అక్షరసత్యం. ఒక రోజు -మొదటి షిఫ్టులో ఓ హీరోకు ఓ నటి తల్లిగా నటిస్తుంది. మరో షిఫ్టులో అదే హీరో పక్కన నటించే హీరోయిన్‌కు చెల్లెలిగా, మరో షిఫ్టులో మరో హీరో పాత్రకు తల్లిగా.. ఇలా వైవిధ్యంగా నటించిన సందర్భాలు అప్పట్లో ఉండేవి. ఆ నటులు ఏ వయసు పాత్రలు వేసినా ప్రేక్షకులు స్వాగతించేవారు. కారణం -ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోవడం వారి ప్రత్యేకత. అది పదహారేళ్ల చెల్లిగానైనా, అరవై ఏళ్ల తల్లిగానైనా!
ఇలా తెలుగు చిత్రాల్లో వయసును జయించిన నటులు చాలామందే ఉన్నారు. వారు ఏ వయసు పాత్రలు వేసినా ప్రేక్షకులు వారి నటనను ఆస్వాదించారు. ఈ పాత్రకు ఫలాన నటుడు నప్పలేదు అన్న మాట ఒక్కటీ వినిపించేది కాదు. ఇది నటీమణులకేగాదు, హీరోలకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకూ అన్వయించేదే.
ఏ పాత్ర చేసినా వైవిధ్యాన్ని ప్రదిర్శంచగలిగే దిగ్గజ నటుడు యస్వీ రంగారావు -ఎన్నో చిత్రాల్లో తండ్రి పాత్రలు పోషించారు. అలాంటిది సూర్యకాంతం కుమారుడిగా మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడి పాత్ర పోషించిన తీరు -ఎలా వర్ణించగలుగుతాం. అదే ఎస్వీఆర్ -అనేక చిత్రాల్లో నటి సూర్యాకాంతానికి భర్తగానూ నటించి మెప్పించారు. అంతేకాదు, ఎస్వీఆర్ కుమార్తెగా సూర్యకాంతం ‘ఆత్మబంధువు’ చిత్రంలో కనిపిస్తారు. వాళ్లిద్దరే -తల్లీకొడుకులుగా, తండ్రీకూతుళ్లుగా, భార్యాభర్తలుగా నటించి మెప్పించడాన్ని ఆలోచిస్తే ఇప్పటి నటులకు సాధ్యమయ్యే పనేనా? అనిపిస్తుంది. ప్రేక్షకులు శెభాష్ అనేలా చేశారు. ఇలా తెలుగు చిత్రాల్లో వాళ్లకు వాళ్లే సాటి అనిపించుకున్న వాళ్లెందరో. ఇప్పుడు కెమెరా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి.
***
రేలంగి, గిరిజ నవ్వులు పూయించిన హాస్య జంట. అలాంటిది వాళ్లిద్దరూ తండ్రీకూతుళ్లుగానూ పలు చిత్రాల్లో కనిపించారు. యన్టీరామారావు, సావిత్రి ద్వయం ఎన్ని ప్రయోగాలు చేసారో? వారిరువురూ భార్యాభర్తలుగా, అన్నాచెల్లెళ్లుగా, వదినా, మరిదులుగా అనేక చిత్రాల్లో నటించినా -ప్రేక్షకులు ఆయా పాత్రలనే చూశారు తప్ప పాత్రధారులను కాదు. అదీ వాళ్ల ఘనత. రామారావు, యస్వీఆర్‌లు తాతామనవళ్లుగా, తండ్రీ కొడుకులుగా, సమఉజ్జీలైన శత్రువులుగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. మంగమ్మ శపథం చిత్రంలో జమునకు జంటగా, కొడుకుగా రామారావు నటించారు. అలా అనేక చిత్రాల్లో హీరోయిన్‌కు కొడుకుగా, భర్తగా (ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రాల్లో) మెప్పించారు. బంగారుతల్లి చిత్రంలో జమున శోభన్‌బాబు, కృష్ణంరాజులకు అమ్మగా నటించారు. ఆ తర్వాత ఆయా హీరోలకు పెయిర్‌గా నటించి మెప్పించారు. బడిపంతులు చిత్రంలో మనవరాలిగా నటించిన శ్రీదేవి -ఆ తర్వాత యన్టీఆర్‌తో జోడీకట్టి మెప్పించింది. అంజలీదేవి, నాగేశ్వరరావులు అనేక చిత్రాల్లో జంటగా నటించారు. మళ్లీ వారివురూ వదిన, మరిదిగా, తల్లీకొడుకులుగా అనేక చిత్రాల్లో జీవించారు. మహామంత్రి తిమ్మరుసులో గుమ్మడి, రామారావుకు తండ్రి సమానుడిగా, అనేక చిత్రాల్లో తండ్రిగానూ నటించారు. తొలుత వారివురూ స్నేహితులుగా నటించిన చిత్రాలూ ఉన్నాయి. శ్రీకృష్ణార్జున యుద్ధంలో రామారావు చెల్లెలుగా నటించిన బి సరోజాదేవి, అనేక చిత్రాల్లో ఆయనకు హీరోయిన్ అయ్యింది. శోభన్‌బాబుకు ఓ చిత్రంలో భార్యగా చేసిన సావిత్రి అనేక చిత్రాల్లో తల్లిగా నటించారు. శోభన్‌బాబు, రామారావులు తండ్రి కొడుకులు, స్నేహితులుగా నటించి మెప్పించారు. -ఇప్పటి నటుల గూర్చి చెప్పుకోవాల్సి వస్తే ఇలాంటి ట్రాక్ రికార్డులు ‘అస్సలు’ కనిపించవు. ఓ నటికానీ, నటుడుగానీ ఓ పాత్రలో ఒకసారి కనిపిస్తే, ఇక అలాంటి పాత్రల్లో కనిపిస్తునే ఉంటారు. ప్రతి టైపు పాత్రకు ఓ నటుడున్నాడు. కాకపోతే అతడు ఫామ్‌లో ఉన్నాడా? మార్కెట్ ఉందా? అనేదే చూస్తున్నారు ఇప్పటి దర్శక నిర్మాతలు. తండ్రి పాత్రలకు ఎవరు? అంటే డజనుమంది కనిపిస్తారు. వారిలో ఎవరైతే తమకు సానుకూలమో చూసుకొని ఎంపిక జేసుకోవాలంతే! హాస్య నటులైతే.. బ్రహ్మానందం తర్వాత వచ్చిన జబర్దస్త్ బృందం తమ హవా కొనసాగిస్తోంది. చెల్లెళ్ల పాత్రలకు ఓ టీమ్ ఉంది. విలన్ల చేతిలో నానా బాధలుపడే పాత్రల్లో ఈ చెల్లెళ్ల పాత్రలు వేసే నటీమణులూ చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి ప్రాధాన్యత ఉండదు. ఆయా పాత్రలు వేసే వారికి తర్వాతి చిత్రాల్లో హీరోయిన్ వేషాలు దొరకవు. చెల్లెలు అంటే చెల్లెలే! అన్నపూర్ణమ్మ మొదటి హీరోయిన్‌గా వచ్చినా, ఆమెను తల్లి పాత్రలకే పరిమితం చేశారు. అమ్మ అంటే అన్నపూర్ణమ్మ అన్నట్టు ఆమె కెరీర్ మారిపోయంది. ఇప్పుడు అమ్మ పాత్రలంటే అందమైన హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నారు. అయితే హీరోయిన్‌గా కెరీర్ ముగిసిన వారికే ఛాన్సులు. ఇక తమ్ముడు, అన్న, బావ, బావమరిది, మామ, అత్తలాంటి పాత్రలకు ఎప్పుడు కనిపించే నటులే ఉంటున్నా, నటనలో, పాత్రను తీర్చిదిద్దే విధానంలో కొత్తదనం శూన్యంగా మారింది.
ఇలా చెప్పుకుంటూపోతే తేలేదేమంటే -ఇప్పటి నటులు వయసును జయించలేకపోతున్నారు. వారు ప్రస్తుతం ఏ వయసులో ఉన్నారో.. అలాంటి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. ఒకేసారి ఓ హీరోతో తండ్రిగా, కుమారునిగా, తాతగా నటించే పాత్రలూ రావడం లేదూ.. వచ్చినా నటించే సత్తా కనిపించడం లేదు. అందుకే ఎవరు ఎలా నటించగలరో చూసుకుని అలాంటి పాత్రలే ఇస్తుంది ప్రస్తుత పరిశ్రమ. దానికితోడు ఏ రోజుకారోజు పేమెంట్ ఇలాంటి నటులకు ఇస్తుండటంతో, ఆ రోజుకెలాగైనా షూటింగ్ పూర్తిచేయాలన్న ఆలోచనే తప్ప మరేం ఉండటం లేదు. అక్కడే ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. పాత్రల ధోరణులు సినిమాలకే పరిమితం అవుతున్నాయి. అవి ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. కళ ప్రజల్లో మార్పుకోసమే అన్న మాట.. మాటగానే మిగిలిపోతుంది.

చిత్రాలు..మాయాబజార్ చిత్రంలో హిడింబి (సూర్యకాంతం) కొడుకుగా ఘటోత్కచుడు (ఎస్వీఆర్)

ఏఎన్నాఆర్‌తో అంజలీదేవి (తల్లి పాత్రలో)
ఏఎన్నాఆర్‌తో అంజలీదేవి (తల్లి పాత్రలో)

-సరయు