AADIVAVRAM - Others

కిటికీ ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమండీ... వింటున్నారా?’’
ఏదో ఆలోచిస్తున్నవాడల్లా శ్రీమతి పద్మజ కేకతో ఈ లోకంలోకి వచ్చాడు విరాజ్
‘‘ఆ... వింటున్నా... చెప్పు’’
‘‘మీకు మరీ మొబైలు పిచ్చి ఎక్కువై ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవట్లేదు’’
‘‘వాట్సప్‌లో ఆఫీసువాళ్లులే... ఇంతకీ ఏమైందో చెప్పు’’ విసుగ్గా అడిగాడు.
‘‘మీరేమో వాడ్ని ఆ బోర్డింగ్ స్కూలులో చేర్చారు, నేను వద్దన్నా వినకుండా’’
‘‘ఓ అదా విషయం... నువ్వెప్పుడు అనేదేగా... ఇంతకీ విషయం ఏంటి?’’ అడిగాడు విరాజ్.
‘‘మీకు అలానే ఉంటుంది. వాడు అక్కడ ఎలా ఉన్నాడో... ఒక్కడే కొడుకు. అయినా అంత దూరంలో ఉంచకపోతే ఏమైందట?’’
మొబైలు పక్కనపెట్టి పద్మజకు దగ్గరగా వచ్చాడు.
‘‘నీకూ తెలుసు. ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎలా ఉందో. నాలాగా చిన్న స్కూల్లో లోకల్ లాంగ్వేజ్‌లో చదివితే పైకి రారే... ఏ చిన్న గుమస్తాగానో చేయాల్సిందే...’’
‘‘మరీ అంత దూరంలో వుంచి అంత కష్టం ఎందుకూ అంటా... మనకు తెలిసిన ఎంతోమంది వాళ్ల పిల్లలను ఇక్కడిక్కడి స్కూళ్లల్లోనే చేర్పించారు కదా. పైగా వాడికి అక్కడి భోజనం బాగోట్లేదని చెప్పాడుగా...’’ చెప్పింది పద్మజ.
‘‘మొదట్లో అలానే వుంటుంది. అదే అలవాటు అవుతుంది. అయినా నార్త్‌సైడ్ ఫుడ్ కూడా అలవాటయితే మంచిదే కదా... రేపు ఎక్కడైనా సర్దుకోగలడు’’
‘‘అది సరే... అమ్మా, నాన్న ఈ బంధాలు కూడా కాస్త గట్టిగా ఉండాలి కదా...’’ తన మాటగా చెప్పింది పద్మజ.
‘‘సరే! అసలు విషయం చెప్పు... ఈ టాపిక్ మనమధ్య ఎప్పుడూ ఉండేదేగా’’
‘‘నిన్న బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి కాల్ వచ్చింది కదా... దాని గూర్చి ఏమి ఆలోచించారు?’’ ప్రశ్నించింది పద్మజ.
‘‘నన్ను ఓసారి వచ్చి కలవమన్నారు కదా, వచ్చేవారం ఓ మూడు రోజులు సెలవు తీసుకుని వెళ్తా...’’
‘‘మీతో నేనూ వస్తాను. వాడిని చూసి రెండు నెలలయింది. నాకూ టికెట్ బుక్ చేయండిక’’
‘‘ఓకే’’ అంటూ రిజర్వేషన్ చేయడానికి ఆయత్తమయ్యాడు విరాజ్...
***
‘‘మీవాడు ఈమధ్య సరిగా చదవడం లేదు. ఏకాగ్రత ఉండట్లేదు. తరచూ మిగతా పిల్లలతో తగవులు ఎక్కువగా పెట్టుకుంటున్నాడు. మార్కులు తక్కువగా రావడం మొదలయ్యాయి’’ వరుసగా ఏకరువు పెట్టాడు తెలుగువాడే అయిన డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీరంగం.
కౌనె్సలింగ్ కోసం ఆంధ్ర నుంచి డెహ్రాడూన్ స్కూలుకు చేరిన విరాజ్, పద్మజలు నమ్మలేకపోతున్నారు.
కేర్‌టేకర్ డైలీ డయిరీ చూపించాడు. ఎన్నో నెగటివ్ రిమార్కులు ఉన్నాయి.
‘‘ఇలానే ఉంటే మిగతా పిల్లలూ మీవాణ్ణి చూసి చెడిపోతారు. మేము అన్నివిధాలా ప్రయత్నించాము. కానీ, ఇక మీరు చెప్పి చూడండి. లేకపోతే అడ్మిషన్ రద్దుచేయాల్సి వస్తుంది’’ అని హెచ్చరికగా చెప్పాడు స్ట్రిక్ట్‌గా ఉండే ప్రిన్సిపాల్.
పద్మజ కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
‘‘మేమూ ఓసారి నచ్చచెప్పి చూస్తాం...’’ చెప్పాడు విరాజ్.
‘‘అందుకే కదా మిమ్మల్ని పిలిచింది...’’ కటువుగా చెప్పాడు ప్రిన్సిపాల్.
***
ఏడవ తరగతి చదువుతున్న కొడుకు అభయ్‌తో మాట్లాడుతున్నారు విరాజ్, పద్మజ.
‘‘అభీ... ఎలావుంది ఇక్కడ...’’
‘‘నాకు నచ్చలేదు’’ సీరియస్‌గా సమాధానం అభయ్ నుంచి.
‘‘అందుకే అడుగుతున్నా... ఏమి నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు’’ కొంచెం పెద్ద స్వరంతో అడిగాడు విరాజ్.
‘‘ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగు. చపాతీలు తినలేకపోతున్నా’’
పద్మజకు జాలి కలిగింది. ‘‘అన్నీ రుచిగానే ఉన్నాయిగా. నేనూ టేస్ట్ చేశాను’’ చెప్పింది.
‘‘అది కానేకాదు కారణం. నువ్వు సరిగా చెపితే మాకు ఏంచేయాలో పాలుపోతుంది’’ కొంచెం కోపంతోనే అన్నాడు విరాజ్.
‘‘చెప్పు అభీ...’’ మళ్లీమళ్లీ అడుగుతోంది పద్మజ. కానీ వౌనమే సమాధానం అభయ్‌నుంచి.
అభయ్ రూంమేట్ గౌరవ్. వాడిని అడిగితే ఏమన్నా వివరాలు దొరుకుతాయేమోనని వాడ్ని పక్కకు పిలిచి అడిగాడు విరాజ్.
‘‘అంకుల్... అభి నాకు మంచి స్నేహితుడు. మంచివాడు. కానీ... ’’ అంటూ ఓ విషయాన్ని తరచూ గుర్తించినట్లుగా చెప్పాడు గౌరవ్.
అభీ సెలవు రోజుల్లో కిటికీ తెరిచి చూస్తూ అక్కడే ఉంటాడని... ఏ ఆటలు ఆడటానికి కూడా రాడని...
అర్థంకాలేదు విరాజ్‌కి. ఇందులోనే ఏదో మర్మం ఉందని ఆ రూము కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూస్తూ నిల్చున్నాడు ఓ గంటసేపు.
అక్కడ చూస్తూ చూస్తూ విషయం అర్థమయ్యింది విరాజ్‌కు... వెంటనే పద్మజని పిలిచి చెప్పాడు తన నిర్ణయాన్ని.
***
బోర్డింగ్ స్కూల్ మాన్పించి ఇంటికి తీసుకువచ్చారు అభీని. అక్కడ లోకల్ స్కూల్‌లో చేర్పించి మూడు నెలలు దాటింది.
ఇప్పుడు బాగా చదువుతున్నాడు. మంచి రిపోర్టుకార్డ్ కూడా వచ్చింది.
విరాజ్ స్నేహితుడు అమర్ తన కొడుకుని వేరే వూళ్ళోని కార్పొరేట్ స్కూల్‌లో చేర్చుదామని విరాజ్ సలహా కోసం కలిసినప్పుడు అభీని ఇక్కడే మార్చారని తెలిసి అడిగాడు. అసలు ఏమైందని.
అప్పుడు చెప్పాడు విరాజ్.
‘‘నేను స్కూల్‌లో చూసిన కిటికీ నాకు జ్ఞానోదయాన్ని ఇచ్చింది...’’
‘‘కిటికీనా?!’’ ఆశ్చర్యంగా అడిగాడు అమర్.
‘‘అవును కిటికీనే...’’ అంటూ...
‘‘ఆ కిటికీనుంచి చూస్తే స్కూలు బయట ఉన్న ఓ చిన్న ఇల్లు కనపడుతోంది. ఆందులో ఓ బాబు... అభికంటే నాలుగేళ్ల చిన్న కాబోలు... ఎంతో ప్రేమగా చూసుకునే వాడి అమ్మానాన్న, ఓ అక్క ఆ ఇంట్లో వున్నారు. వాడితో ఆడుకుంటూ, అన్నం ముద్దలు తినిపిస్తూ పాఠాలు చెప్తూ... ఎంతో సరదాగా ఉంటున్నారందరూ... చక్కగా అక్కడినుండి కనబడుతోంది. ఇదే అభి కిటికీనుంచి తరచూ చూసేది! ఇవన్నీ చూస్తూ అభి తనవన్నీ పొగొట్టుకున్నవాడిలా తనను ఒంటరివాడిగా అనుకున్నాడు. ఆ భావన తీవ్రమై ఈ బోర్డింగ్ స్కూల్ వాతావరణం నచ్చనంతగా ముద్రవేసింది. ఆ పిల్లాడిలా తనూ అమ్మానాన్న దగ్గరగా ఉండాలని, వాళ్లతో ఆటలాడాలని, ముచ్చట్లు చెప్పాలని అనుకుంటున్నాడు. అలా తనకి జరగకపోవడంతో వాడ్ని కృంగదీసింది. అందుకే విభిన్నంగా అలా ప్రవర్తించాడు’’ అంటూ విషయం వివరించాడు విరాజ్.
విషయం గ్రహించి తను అభిని అక్కడ మాన్పించి ఇంటికి తీసుకువచ్చాడు. పిల్లలు ఇలానే వుంటారని, వాళ్లకు తగినట్లుగా తల్లిదండ్రులు చూసుకోవాలని గ్రహించాడు. ఎక్కడ చదివినా ఒక కుటుంబ వాతావరణం ఉంటే మనసు వికసిస్తుందని అర్థమైంది విరాజ్‌కు. అదే విషయం చెప్పాడు అమర్‌కు.
సరైన సమయానికి తనకు ఓ మంచి సలహా దొరికిందని ఆనందపడ్డాడు అమర్.
అదేరోజు పేపర్లోని వార్త... ముగ్గురు అన్నదమ్ములు... లోకల్ మీడియంలోనే చదివి స్వయంకృషితో చాలా పేరున్న కంపెనీల్లో పెద్ద ఉద్యోగాలు పొంది ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని. ఆ వార్త చదువుతున్నారు పద్మజ, విరాట్ ఎంతో ఇష్టంగా...

-డి.ఎన్.వి.రామశర్మ, 9663526008