Others

లింగవివక్ష ఇంకానా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన సంప్రదాయాలకు నిలయమైన భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో లింగవివక్ష ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా, శాస్త్ర- సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించినా మహిళల పట్ల చిన్నచూపు పూర్తిగా తొలగిపోలేదు. ఆడపిల్ల పుట్టడమే కుటుంబానికి శాపంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. వయోభేదం లేకుండా బాలికలు, యువతులు, మహిళలు భారతీయ సమాజంలో అనునిత్యం వివక్షకు గురవుతున్నారు. ప్రగతి నిరోధక ఆచారాల వల్ల స్ర్తి, పురుష సమానత్వం నినాదాలకే పరిమితమవుతోంది. విద్య, ఉపాధి రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కొంత మేరకు పెరిగినా, సమాజ వ్యవస్థలో లింగవివక్ష అంతం కాలేదు. అనేక ఉపాధి రంగాల్లో మహిళలు పురుషుల కంటే 25 నుంచి 50 శాతం వరకూ తక్కువ వేతనం పొందుతున్నారు. అసంఘటిత రంగంలోనైతే మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ దుస్థితి అనేక దేశాల్లో కొనసాగుతోంది. దాదాపు నలభై శాతం మహిళా ప్రజాప్రతినిధులు బెదిరింపులకు, వేధింపులకు గురవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అతి తక్కువ దేశాల్లో మాత్రమే మహిళలకు ఆర్థిక సమానత్వం ఉంది. ఐస్‌లాండ్, ఫిన్‌లాండ్, నార్వే, స్వీడన్, రువాండా, ఐర్లాండ్, ఫిలిప్పీన్స్, స్లోవేనియా, న్యూజిలాండ్, నికరుగువా వంటి దేశాల్లో స్ర్తిలకు ఆర్థిక సమానత్వం కనిపిస్తోంది. విశ్వవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సమానత్వం దక్కాలంటే కనీసం 170 ఏళ్లు వేచి చూడాలని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. మొత్తం 144 దేశాల్లో ఇటీవల సర్వే నిర్వహించగా మహిళలకు ఆర్థిక సమానత్వం విషయంలో మన దేశం 87వ స్థానంలో నిలిచింది. మత ఛాందసవాదానికి మారుపేరైన పాకిస్తాన్ చివరి నుంచి రెండో ర్యాంకును సాధించింది.
నిజానికి కొన్ని చట్టాలే లింగవివక్షను చూపుతున్నాయి. దీంతో చాలా దేశాలు ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఆర్థిక రంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేనందున చాలా దేశాలు 20 నుంచి 30 శాతం వరకూ ఆదాయాన్ని కోల్పోతున్నాయని సర్వేలో తేలింది. ఆదాయం లేని పనుల్లోనే మహిళలు ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్నారు. ఉపాధి రంగంలో వారు వెనుకబడిపోవడమే ఇందుకు కారణం. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం మహిళలకు వర్తించడం లేదు. మహిళల ఆదాయ స్థాయి పెరిగితే బాలికల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. మన దేశంలో స్ర్తి, పురుష సమానత్వం సాధిస్తే జాతీయ ఆదాయం 4 శాతం పెరుగుతుందని ఓ అంచనా.
తాజా సర్వే ప్రకారం 150 దేశాల్లో లింగ వివక్ష చూపే చట్టం కనీసం ఒకటైనా ఉండడం గమనార్హం. 18 దేశాల్లో మాత్రం లింగవివక్షకు తావులేని చట్టాలు అమలులో ఉన్నాయి. చాలా దేశాల్లో ఏడాది మొత్తంలో పురుషుల కంటే మహిళలు 38 రోజులు ఎక్కువగా పనిచేస్తున్నారట. ఇది మన దేశంలో 50 రోజులుగా ఉన్నట్లు తేలింది. విద్య, ఆరోగ్య రంగాల్లో స్ర్తి, పురుష సమానత్వం కాస్త బాగున్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు వెనుకబడే ఉన్నారు. పేదరికం, అవిద్య ప్రభావంతో లింగవివక్ష తీరు ఆందోళనకరంగానే ఉంది. తల్లులు, ఆడపిల్లల్లో పౌష్టికాహార లోపానికి లింగవివక్ష ఓ కారణం కావడం గమనార్హం. ఇప్పటికీ పల్లెప్రాంతాల్లో పురుషులు, కుటుంబ పెద్దలు భోజనం చేశాకే మహిళలు కడుపు నింపుకుంటారు. ఇలాంటి ఆచారాలు మహిళల ఆరోగ్యానికి శాపంగా మారాయి. స్ర్తి, పురుష సమానత్వం సాధ్యమైన నాడు అతివలు వివక్షకు దూరమై, అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుకునేందుకు అవకాశం కలుగుతుంది.

- ఇమ్మానేని సత్యసుందరం