AADIVAVRAM - Others

సమయస్ఫూర్తి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దండకారణ్యానికి రాజు హిరణ్య అనే మృగరాజు. ఆ అడవిలో అనేక జంతువులూ, పక్షులు నివసిస్తున్నాయి. మృగరాజు తనకు ఆకలి అయినపుడు విచక్షణా జ్ఞానం లేకుండా ఎదురుగా కనిపించిన జంతువును చంపి తినేస్తుంటాడు. అది తెలిసి జంతువులు మృగరాజు ఎదురు పడకుండా చాలా జాగ్రత్తగా సంచరిస్తూ ఉంటాయి.
ఆ అడవి చివర ఒక కుందేలు జంట నివాసం ఉంటోంది. అవి అడవికి దగ్గరగా ఉన్న పొలంలో రైతు పండిస్తున్న కేరెట్, బీట్‌రూట్, ముల్లంగి దుంపలు తెచ్చుకుని తింటూ హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. అడవిలో చివర ఉండటం వలన వాటికి మృగరాజు బెడద కూడా లేదు. ఆ జంటకు ఓ చిట్టి కుందేలు పుట్టింది. దాన్ని గారాబంగా పెంచుకుంటున్నాయి. అది కూడా తల్లిదండ్రుల మాట వింటూ చుట్టుపక్కలే ఆడుకునేది.
‘చూడు చిట్టీ.. మృగరాజు చాలా క్రూరుడు. ఆకలిగా ఉన్నప్పుడు కంట పడ్డావో అంతే.. చంపి తినేస్తాడు.. కనుక మేం ఆహారం తేడానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి’ అని చెప్పేవి.
ఒకనాడు మృగరాజు ఉదయానే్న వేటకి బయలుదేరింది. అది జ్యేష్ఠ మాసం. అడవిలో కూడా ఎండ వేడి తగులుతోంది. చాలా దూరం ప్రయాణించింది సింహం. ఒక్క జంతువూ దాని కంట పడలేదు. ఒకవైపు ఆకలి.. మరోవైపు దాహం. దగ్గరలో ఎక్కడ నీరు ఉందో తెలీని ప్రదేశం. మృగరాజు కోపంతో ఉడికిపోతోంది. దాహం వల్ల నీరసం వచ్చేస్తోంది. అలా అడవి చివరి దాకా వచ్చేసింది మృగరాజు. పెద్ద కుందేళ్లు రెండూ ఆహారం తేవడానికి వెళ్లటంతో ఇంటి దగ్గర మర్రిచెట్టు కింద ఆడుకుంటోంది చిట్టి కుందేలు. ముందుగా అలికిడి.. తరువాత దానికి ఎదురుపడింది మృగరాజు. సింహాన్ని చూడగానే హడలిపోయింది చిట్టి. చేసేది ఏమీ లేనపుడు ధైర్యంగా ఉండాలి అన్న నాన్న మాటలు గుర్తుకొచ్చాయి.
వెంటనే తేరుకుని ‘నమస్కారం మృగరాజా?’ అంది.
‘నీ నమస్కారాలు తర్వాత.. ముందు నా ఆకలి, దాహం తీరాలి కనుక నిన్ను చంపేస్తున్నాను’ అంది సింహం కోపంగా.
‘చిత్తం.. నన్ను ముందుగా చంపితే.. మీ ఆకలి తీరవచ్చు గాని, తరువాత మీకు సరస్సుకు దారి తెలియదు కనుక మీ దాహం తీరదు. అందుచేత మీరు నా వెనుక రండి... దగ్గర దారిలో సరస్సు చూపుతాను. మీ దాహం తీర్చుకుని.. పిదప నన్ను చంపి మీ ఆకలి తీర్చుకుందురు’ అంది.
‘అలాగా... సరే పద’ అంది మృగరాజు.
ముందు చిట్టి.. వెనుక మృగరాజు సరస్సుకు బయర్దేరాయి. సరస్సు చేరగానే తృప్తిగా నీరు తాగింది సింహం.
అపుడు దాని మనసు ప్రశాంతం అయ్యింది.
‘రాజా.. నీ దాహం తీరింది.. ఇక నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో.. కాని నేను చనిపోయే ముందు నా చివరి కోరిక తీర్చు’ అంది.
‘ఏమిటి నీ చివరి కోరిక?’ అంది మృగరాజు గంభీరంగా.
‘రాజా.. మన అడవిలో మా జాతి పూర్తిగా అంతరించింది. ఇక మిగిలింది.. మా అమ్మ.. నాన్న. నేను. నేను కూడా ఈ రోజు మరణిస్తాను. కనుక మిగిలిన మా తల్లిదండ్రులను స్వేచ్ఛగా జీవించేలా అంగీకరించు. లేకుంటే ముందు తరాలు మా జాతి అంతరించిపోవడానికి నీవే కారణం అని నిందిస్తాయి. ఆ చెడ్డ పేరు మీకు రాకూడదు’ అంది వినయంగా.
ఆ చిట్టి కుందేలు మాటలకు చలించిపోయింది మృగరాజు. ‘చిన్నదానివి అయినా.. నీ మాటలు ఎంతో పరిణితిగా ఉన్నాయి. నీ మాటలతో నా ఆకలి తీరిపోయింది. ఇక మీ జాతి జోలికి నేను రాను. నిన్ను కూడా స్వేచ్ఛగా వదిలి పెడుతున్నాను’ అంది. వాటి మాటలు దూరంగా ఉండి వింటున్న చిట్టి తల్లిదండ్రులు తమ కుమారుడి తెలివితేటలకు ఆశ్చర్యపోయాయి. చిట్టిని వదిలి అడవిలోకి వెళ్లిపోతున్న మృగరాజు వంక చూసి ఆనందపడ్డాయి.

-కూచిమంచి నాగేంద్ర