Others

నిర్దోషి (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాదామిరాసి
సంగీతం: ఘంటసాల
మాటలు: డివి నరసరాజు
ఎడిటింగ్: కందస్వామి
కళ: తోట
కెమెరా: బిఎస్ జాగీర్ధార్
నృత్యం: వెంపటి సత్యం
నిర్మాత: నర్రా రామబ్రహ్మం
**
విజయవాడలో చిత్ర పంపిణీదారు అయన నర్రా రామబ్రహ్మం, అట్లూరి పుండరీకాక్షయ్యను భాగస్వామిగా చేసుకుని గౌతమి పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌పై మొదట నిర్మించిన చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’ (1962). తరువాత 1967లో వీరు స్వతంత్రంగా నిర్మించిన చిత్రమే ‘నిర్ధోషి’. మహారాష్టక్రు చెందిన నటుడు, దర్శకుడైన దాదామిరాసి తమిళంలో పుదియపరవైకు దర్శకత్వం వహించారు. అది తెలుగులో ‘సింగపూర్ సిఐడి’గా అనువాదమైంది. తరువాత తొమ్మిది తమిళ చిత్రాలకు దర్శకత్వం నెరిపిన అనుభవంతో తెలుగులో దర్శకత్వం వహించిన చిత్రం ‘నిర్దోషి’. ‘నిర్దోషి’ పేరుతో హెచ్‌ఎం రెడ్డి నిర్మాత దర్శకునిగా, ముక్కామల, అంజలిదేవిలతో అప్పటికే ఒక చిత్రం రూపొందించబడింది.
ఆనందరావు, సుందరం (ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం) కవల పిల్లలు. సుందరం అన్నగారికి దూరంగా జీవిస్తుంటాడు. ఆనందరావు సంఘంలో గౌరవనీయుడిగా మన్నన పొందుతూ, స్నేహితుడు గంగాధరం (సత్యనారాయణ)తో కలిసి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తుంటాడు. ఆ క్రమంలో ఒక బ్యాంక్ దోపిడీకి పాల్పడి, ఆ నేరాన్ని తమ్ముడు సుందరంపైకి నెట్టేస్తాడు. ఆ సంగతి తెలియని సుందరం జైలునుంచి తప్పించుకొని అన్నగారి ఆశ్రయంకోరి వచ్చి, అక్కడ అసలు నిజం తెలుసుకుంటాడు. ఆనందరావు, సుందరంల పెనుగులాటలో గుండెపోటుతో ఆనందరావు మరణిస్తాడు. సుందరం ఆనందరావులా మారి సుందరం మరణించాడని పోలీసులకు తెలియచేస్తాడు. రామేశం (మిక్కిలినేని)ను బ్లాక్‌మెయిల్ చేసి ఆనందరావు, గంగాధరం అతని వద్ద డబ్బు గుంజేవారు. రామేశం కుమార్తె కమల (సావిత్రి)కు ఆనందరావుకు అంతకుముందు పెళ్లి నిశ్చయమవుతుంది. సుందరం ఆనందరావుగా మారిన విషయం కమలకు తెలీదు. ఆనందరావు తన తండ్రిని బాధిస్తున్నాడని తెలిసికొని ద్వేషంతోనే అతనిని పెళ్లి చేసుకుంటుంది. వివాహమయ్యాక సుందరం ఆమె కోరిన కాగితాలు తెచ్చి ఇస్తాడు. ఇదిలావుంటే, ఆనందరావు తొలుత లక్ష్మి (అంజలి) అనే స్ర్తిని మోసంచేయగా ఆమెకొక బాబు పుడతాడు. లక్ష్మిని ఆమె అన్న సిహెచ్ కృష్ణమూర్తి తీసుకొచ్చి ఆనందరావు (సుందరం)కి అప్పగిస్తాడు. మరోసారి కమల ఈ విషయంగా అతన్ని ద్వేషిస్తుంది. ఇంతలో రామేశం ఆత్మహత్య చేసుకుంటాడు. విషయం తెలిసి ఆవేశంతో కారులో వస్తున్న కమలకు యాక్సిడెంట్ అయి పక్షవాతం వస్తుంది. ఆ స్థితిలో ఆమెకు సుందరం జరిగిన సంగతి చెప్పి, తాను ఆనందరావును కానని ఋజువులు చూపిస్తాడు. ఇంతలో లక్ష్మి తండ్రి, ఆ ఇంటి నౌకరు (ముక్కామల) కమలను అంతం చేయబోయి విసిరిన కత్తి, పొరబాటున లక్ష్మికి తగిలి ఆమె మరణిస్తుంది. ఒకవైపు హత్యానేరం, మరోవైపు అక్రమ వ్యాపారాల గుట్టు తెలిసికొన్న పోలీసులు సుందరాన్ని బంధించి కోర్టులో ఆనందరావుగా అతనికి శిక్ష వేయబోగా, ఇంతలో ఆరోగ్యవంతురాలైన కమల తగు సాక్ష్యాలతో అతను ఆనందరావు కాదని నిరూపించటంతో సుందరం నిర్దోషిగా విడుదలవుతాడు. కమల, సుందరం, చిన్నబాబులు ఆనందంగా ఉండటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో శంభుగా పద్మనాభం, ఆఫీసు సెక్రటరీ మంజులగా గీతాంజలి, రామేశం నౌకరుగా మల్లాది, డాక్టరుగా రావికొండలరావు, ఇన్‌స్పెక్టరుగా జగ్గారావు నటించారు.
చిత్రంలో తొలుత వ్యసనపరుడు, సర్వరోగ బాధితుడు, నిర్దయుడు అయిన ఆనందరావుగా ఒకతరహా నటన, అమాయకుడు, నీతివంతుడైన సుందరంగా సౌమ్యత, నిగ్రహం, వేదన, పరిస్థితులకు తగిన బింకం, సంయమనం.. ఇలా పలు భావాలను నిండుతనంతో ప్రదర్శించి పరిపూర్ణత చూపారు ఎన్టీ రామారావు. కమలగా సావిత్రి పాత్రకు తగిన హూందాతనాన్ని, సమయస్ఫూర్తిని, ఆవేశకావేషాలను, చివరికి వ్యాధిగ్రస్తురాలిగా మంచంలో అశక్తత, నౌకరుచేత విషప్రయోగం, దాన్నించి కోలుకోవటంలాంటి సన్నివేశాల్లో ఎంతో భావోద్వేగాన్ని నటనలో ఆవిష్కరించారు. లక్ష్మిగా అంజలిదేవి పాత్రకు తగిన భావుకత, స్ర్తి ధర్మం, ఔన్నత్యాన్ని ప్రతిబింబచేశారు.
దర్శకులు దాదామిరాసి సస్పెన్స్‌తో కూడిన కథను, దానికి అనుగుణంగా చక్కని సన్నివేశాలను పట్టుతో రూపొందించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కమల, సుందరాన్ని పెళ్లికి తొందరచేయటం, తొలి రాత్రి అతన్ని వేధించటం, తిరిగి ఆమె అంగీకరించినా సుందరం వద్దని వారించి ఒంటరిగా పాడుకునే గీతమే -మల్లియలారా మాలికలారా మా కథయే విన్నారా. మల్లెలతో కూడిన పాన్పు, ఆకాశంలో జాబిలి, ప్రక్కగది వరండాలో సావిత్రిని చూపిస్తూ ఎంతో అర్ధవంతంగా చిత్రీకరించి నేటికీ అలరించే గీతంగా నిలిపారు. సుందరం జైలునుంచి, పోలీసుల నుంచి తప్పించుకోవటం, గంగాధరం ఇంట్లోంచి సుందరం కాగితాలు తేవటం, కమలకు కారు యాక్సిడెంటు, చివర ఆమె ఆరోగ్యవంతురాలై కోర్టుకు రావటం. చిన్న చిన్న సన్నివేశాలను సైతం బిగువుతో నడిపారు.
బ్లాక్ అండ్ వైట్ షేడ్స్, నైట్ ఎఫెక్ట్స్, సుందరం జైలునుంచి తప్పించుకోవటం వంటి షాట్స్‌లో కెమెరా ప్రతిభ కనబర్చారు. అలాగే ఫైట్స్ కంపోజ్ చేసిన సాంబశివరావు పార్టీ, ఎన్టీఆర్‌కు, సత్యనారాయణకు మధ్య ఫైట్‌ను ఎంతో వైరుధ్యంతో రూపొందించారు. ఘంటసాల సంగీతం అందించిన చిత్ర గీతాలు పరిశీలిస్తే..
-మల్లియ లారా మాలిక లారా (ఘంటసాల- సినారె), ఎన్టీఆర్, సావిత్రిపై తోటలో చిత్రీకరించిన యుగళ గీతం -ఈ పాట నీకోసమే హాయి (ఘంటసాల, పి సుశీల -సినారె). చాటునుంచి మిక్కిలినేని గమనిస్తుండటం లాంటి మార్పులు చూపుతూ చిత్రీకరణలో వైవిధ్యాన్ని చూపించారు. మరో సినారే గీతం -చిన్నారి కృష్ణయ్య రారా నా కన్నుల (పి సుశీల) విషాదంగా అంజలీదేవిపైన, సంతోషంగా సావిత్రిపైనా రెండుసార్లు చిత్రీకరణ ఉంటుంది. క్లబ్బులో గీతాంజలిపై గీతం ‘సుకుసుకు కుమారి’ (యల్‌ఆర్ ఈశ్వరి -సినారె). సత్యనారాయణ ఇంట్లో ఒక నృత్య గీతం -సింగారి చెకుముకు రవ్వ ఏమంటున్నది (పి.సుశీల, ఘంటసాల బృందం- సినారె). పద్మనాభం, గీతాంజలిపై చిత్రీకరించిన కొసరాజు గీతం -అవునన్నా కాదన్నా నీ మొగుడ్నిలే (మాధవపెద్ది, ఎల్‌ఆర్ ఈశ్వరి)
‘నిర్దోషి’ చిత్రం సంఘర్షణలతో కూడిన వైవిధ్యమైన కుటుంబ చిత్రంగా ఆకట్టుకుంది. చిత్ర గీతాలు ‘మల్లియలారా’, ‘ఈ పాట నీ కోసమే’, ‘చిన్నారి కృష్ణయ్యా’ నేటికీ అలరిస్తుండటం విశేషం. నిర్దోషి టైటిల్‌తో 3వ సారి మురళీమోహన్ హీరోగా మరొక చిత్రం రూపొందింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి