AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామలక్ష్మణుల చేత దశరథుడు గోదానం జరిపించిన రోజే భరతుడి మేనమామ, కేకయ రాకుమారుడు వచ్చాడు. దశరథుడితో ఇలా చెప్పాడు.
‘మా నాన్న నీ కుశలం అడిగారు. నువ్వు అక్కడ కుశలం కోరుకునే వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. మా నాన్నకి భరతుడ్ని చూడాలని ఉండటంతో అతన్ని తీసుకెళ్లాలని అయోధ్యకి వెళ్లాను. మీరంతా ఇక్కడికి పెళ్లికి వచ్చారని తెలిసి వెంటనే మిథిలకి భరతుడ్ని చూడటానికి వచ్చాను’
దశరథుడు అతనికి అతిథి మర్యాదలు చేశాడు. మర్నాడు ఉదయం ఋషులు ముందు నడవగా దశరథుడు యజ్ఞ వాటికకి చేరాడు. రాముడు విజయం అనే ముహూర్తంలో తోరణం కట్టడం లాంటి వివాహ క్రతువులని చేసి, తన సోదరులతో వశిష్ఠుడు మొదలైన మునులు ముందు నడవగా తన తండ్రి దగ్గరికి వెళ్లాడు.
తర్వాత వశిష్ఠుడు జనకుడి దగ్గరకి వెళ్లి చెప్పాడు.
‘మహారాజా! దశరథుడి కొడుకులు కౌతుక మంగళం పూర్తి చేసి కన్యాదాత అయిన మీ కోసం ఎదురుచూస్తున్నారు. దాత, ప్రతిగ్రహీత కలిసినప్పుడేగా పెళ్లి జరిగేది. వచ్చి దాన్ని పూర్తి చేయండి’
‘లోపలకి రావచ్చుగా? ఈ రాజ్యం కూడా మీ రాజ్యం లాంటిదే వశిష్ఠ మహర్షీ. అడ్డగించే ద్వారపాలకులు ఉన్నారా? మీరు ఎవరి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు? మీ స్వంత ఇంట్లో సంకోచం దేనికి? కౌతుక మంగళాలు పూర్తి చేసిన నా కూతుళ్లతోపాటు నేను దశరథ మహారాజు కోసం ఎదురుచూస్తున్నాను. ఆలస్యం చేయకుండా పెళ్లిని జరుపుదాం’
జనకుడి ఆ మాటలని విన్న దశరథుడు తన కొడుకులు, ఋషులతో కలిసి లోపలకి వెళ్లాడు. జనకుడు వశిష్ఠుడ్ని లోకాభి రాముడైన రాముడి పెళ్లిని జరిపించమని కోరాడు. ఆయన విశ్వామిత్ర, శతానందులతో శాస్త్ర ప్రకారం మండపం మధ్య అగ్ని వేదికని నిర్మించి, దాని చుట్టూ గంధం, పూలు, బంగారు పాలికలు, అంకురాలు గల కుండలు, మూకుళ్లు, ధూపపాత్రలు, శంఖాకారపు పాత్రలు, అర్ఘ్యానికి నీళ్ల పాత్రలు, పేలాల పాత్రలు, అక్షింతలు మొదలైనవి సిద్ధం చేశాడు. వేదిక చుట్టూ మంత్రపూర్వకంగా దర్భలని పరిచి, అగ్నిని ఉంచి అందులో హోమం చేశాడు.
వధువు దుస్తుల్లో అలంకరించబడ్డ సీతని జనక మహారాజు తీసుకువచ్చి రాముడి ఎదురుగా కూర్చోపెట్టి ఇలా చెప్తూ మంత్రపూర్వకంగా నీళ్లని వదిలాడు.
‘ఇదిగో. నా కూతురు సీత. ఈమె నీకు భార్య కాగలదు. సీతని స్వీకరించు. నీ చేత్తో ఈమె చేతిని పట్టుకో. ఈమె పతివ్రతగా సదా నీ నీడలా నిన్ను అనుసరించే ఉంటుంది’
వెంటనే దేవదుందుభులు మోగి పుష్ప వర్షం కురిసింది. తర్వాత జనకుడు రామ సోదరులతో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! రా. నేను ఇచ్చే ఊర్మిళని స్వీకరించు. ఈమె చేతిని నీ చేత్తో తీసుకో. భరతా! శ్రుతకీర్తి చేతిని పట్టుకో. శతృఘ్నా! మాండవి చేతిని పట్టుకో’
నలుగురు రాజకుమారులు ఆ కన్యల చేతులని పట్టుకుని వారిని తమ భార్యలుగా స్వీకరించాక, అగ్నికి, వేదికకి, జనక మహారాజుకి, ఋషులకి ప్రదక్షిణం చేసి యథావిధిగా పెళ్లి చేసుకున్నారు.
రామ, లక్ష్మణ, భరత శతృఘు్నలు, సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తుల పాణిగ్రహణం చేయగానే ఆకాశం నించి పూలవర్షం కురిసి, స్వర్గంలో దుందుభులు మోగి, మంగళ వాద్య ధ్వనులతో కూడిన పాటలకి అప్సరసలు నృత్యం చేశారు. గంధర్వులు చక్కగా పాడారు. రామలక్ష్మణ, భరత శతృఘు్నలు మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణం చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నూతన నలుగురు వరుళ్లు తమ భార్యలతో విడిదికి వెళ్లారు. వారి వెంట దశరథుడు, తన భార్యలు, బంధువులు, ఋషులతో వారి వెంట వెళ్లారు.
మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాజకుమారులని ఆశీర్వదించి, జనకుడు, దశరథుల దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. దశరథుడు కూడా అయోధ్యకి బయలుదేరాడు. జనకుడు తన కూతుళ్లకి చాలా ధనాన్ని, లక్షల కొద్దీ ఆవులని, కంబళ్లని, కోట్ల కొద్దీ పట్టువస్త్రాలని, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాలిబంటు గల చతురంగ సైన్యాన్ని, అందమైన దాసీదాసులని అరణంగా ఇచ్చి పంపాడు. ఇంకా వెండి, బంగారం, ముత్యాలు, పగడాలని కన్యాదానంగా ఇచ్చాడు. వారి వెంట కొంత దూరం వెళ్లి దశరథుడ్ని సాగనంపి, జనకుడు తిరిగి మిథిలకి చేరుకున్నాడు.
వారంతా ప్రయాణిస్తూండగా అక్కడక్కడా భయంకరంగా పక్షులు కూయసాగాయి. జంతువులు ప్రదక్షిణంగా వెళ్లాయి.
‘వశిష్ఠ మహర్షీ! పక్షులు అనుకూలంగా, మృగాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇదంతా ఏమిటి? నాకు భయంగా ఉంది’ దశరథుడు ప్రశ్నించాడు.
‘రాజా! అకస్మాత్తుగా ఘోరమైనదేదో దైవవశాత్తూ జరగబోతోందని పక్షులు సూచిస్తున్నాయి. మృగాలు ఆ ఘోరం తొలగుతుందని సూచిస్తున్నాయి. కాబట్టి భయపడకు’ వశిష్ఠుడు ధైర్యం చెప్పాడు.
కొద్దిసేపటికి భూమి కంపించి, చెట్లు పడిపోయేలా గాలి వీచింది. సూర్యకాంతి తగ్గి, అన్ని దిక్కుల్లో వెలుతురు తగ్గింది. దశరథుడి సైన్యాన్ని దుమ్ము కప్పగా, వారంతా మూర్ఛపోయినట్లుగా కనిపించారు. వశిష్ఠుడు, ఇతర మునులు, దశరథుడు, అతని కొడుకులు మాత్రమే స్పృహలో ఉన్నారు.
ఆ చీకట్లో భుజాన గండ్రగొడ్డలితో, గతంలో క్షత్రియులని చంపిన జటాధారి అయిన పరశురాముడు త్రిపుర సంహారం చేసే శివుడిలా కనిపించాడు. అతన్ని చూసి వశిష్ఠుడు, ఇతర ఋషులు తమలో తాము ఇలా అతని గురించి మాట్లాడుకున్నారు.
‘పూర్వం కార్తవీర్యార్జునుడు తన తల్లిని చంపడంతో ఇతను క్షత్రియులు అందర్నీ చంపాడు. కోపం తగ్గి శాంతించిన అతను మళ్లీ క్షత్రియ వినాశనాన్ని చేయాలని అనుకోవడం లేదు కదా?’
వారు తనని ప్రేమగా ‘రామా! రామా!’ అని పిలుస్తూ వారు ఇచ్చిన అర్ఘ్యాన్ని, పూజని స్వీకరించిన పరశురాముడు రాముడితో ఇలా చెప్పాడు.
‘ఏం చెప్పాడో రేపు విందాం. రేపటితో బాలకాండలోని 78 సర్గలు సమాప్తం అవుతాయి’ హరిదాసు చెప్పాడు.
(బాలకాండ సర్గ 73-74)
**
మీకో ప్రశ్న
**
మిథిలా నగరానికి గల
ఇంకో పేరు ఏమిటి?

**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
**
రామాయణ కాలంలో మంగళసూత్రం కట్టే ఆచారం ఉందా?
- లేదు. పాణిగ్రహణం మాత్రమే ఉంది.
(పాణినా పాణిం గృహ్ణీష్వ)
**
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
**
1.తన వంశ చరిత్రని జనకుడే చెప్పాడు. విశ్వామిత్రుడు చెప్పలేదు.
2.మొదటి జనకుడైన మిథిలి మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఈ సంగతి హరిదాసు చెప్పలేదు.
3.ముందు కబురు పంపలేదు. మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చి, శివధనస్సుని, సీతని తనకి ఇవ్వమని కబురు పంపాడు.
4.సీతని రాముడికి, నా రెండో కూతురు ఊర్మిళని లక్ష్మణుడికి ఇస్తానని ‘మూడు సార్లు’ చెప్తున్నాను అని జనకుడు చెప్పాడు. ఇది హరిదాసు చెప్పలేదు. (ఓ విషయాన్ని గట్టిగా చెప్పడానికి ఆ కాలంలో మూడుసార్లు చెప్పడం రివాజు)
5.దశరథ విశ్వామిత్రులు ‘నీ తమ్ముడు కుశధ్వజుడి ఇద్దరు కూతుళ్లని భరత, శతృఘు్నలకి ఇచ్చి పెళ్లి చేయించు’ అని జనకుడితో చెప్పిన సంగతి హరిదాసు చెప్పలేదు.
6.లక్ష చొప్పున నాలుగు లక్షల ఆవులని దానం చేశాడు. కాని హరిదాసు పదివేల ఆవులని తప్పు చెప్పాడు.
7.వాల్మీకి ఈ ఘట్టంలో జనకుడు ‘్భమిని, బంగారు ఆభరణాలని’ కూడా దానం చేసినట్లు చెప్పలేదు. హరిదాసు తప్పు చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి