Others

నాకు నచ్చిన చిత్రం-- అప్పుచేసి పప్పుకూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1959లో విజయా సంస్థ నిర్మించిన అద్భుత చిత్రం -అప్పుచేసి పప్పుకూడు. చక్కటి మెలోడ్రామా, సునిశితమైన హాస్య సన్నివేశాలు, సంభాషణలతో రంజింపచేస్తుంది. చెల్లి కాపురాన్ని సరిదిద్దడానికి అన్న ఎన్టీఆర్ వేసే చిత్రమైన వేషాలు కడుపుబ్బ నవ్విస్తాయి. మరదలితో వివాహం కోసం స్నేహితుడికి సహాయం చేస్తూ రేలంగి ఆడే నాటకం, ఆస్తులు లేకున్నా ధనవంతుడినన్న బిల్డప్ ఇచ్చేందుకు పేద జమీందార్ పడే అప్పుల తిప్పలు.. సినిమా మొత్తం చక్కటి సన్నివేశాలతో, సన్నితమైన భావోద్వేగ సీన్లతో రక్తికట్టిస్తుంది. తన కుమారుడికి వివాహం జరిగినా కట్నం కోసం ధనవంతులైన ఎస్‌విఆర్ కూతురితో మళ్లీ పెళ్లి చేసి ఆస్తి కాజేయాలన్న జమిందార్ సిఎస్‌ఆర్ దురాశ, తండ్రి ధనాశ, భార్యకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేస్తానని తాతయ్య (ముక్కామల)కు మాటిచ్చిన మనవడు జగ్గయ్య తండ్రితో ఆడే ప్రతి నాటకం.. అప్పటి సామాజిక కాలమాన పరిస్థితులకు అద్దంపడతాయి. భర్త ఎదురుగావున్నా మూగదానిలా నటించే భార్య జమున నటన అద్భుతం. కోరుకున్న వాడిని వివాహం చేసుకోడానికి తండ్రిని ఒప్పించడానికి తాపత్రయపడే కుమార్తెగా సావిత్రి ఆడే నాటకాలతో ఎప్పటికప్పుడు విచిత్రమైన మలుపులు తిరుగుతూ ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సినిమా నడిపించిన దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ అభినందనీయుడు. చిత్రానికి సదాశివబ్రహ్మం రాసిన సంభాషణలు, ముఖ్యంగా అప్పులు చేసేవారి మనస్తత్వాలను తెలియచేసే సన్నివేశాలలో సిఎస్‌ఆర్, రేలంగి మధ్య రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. విజయా సంస్థ ఆస్థాన రచయిత పింగళి ఈ సినిమాలో పాటలు రాయగా, ఎస్ రాజేశ్వరరావు అందించిన బాణీలు అత్యద్భుతం. ‘అప్పుచేసి పప్పుకూడు’ టైటిల్ సాంగ్, ‘ఎచటి నుండి వీచెనో’ అంటూ హాయిగొలిపే గీతంతోపాటు పాటలు, పద్యాలు ఘంటశాల, లీల, స్వర్ణలత, జమునారాణి, ఎఎమ్ రాజా గాత్రాలలో మధురంగా జాలువారి నేటికీ అలరిస్తున్నాయి. ఎస్‌విఆర్, రమణారెడ్డి, సూర్యాకాంతం, గిరిజ, కస్తూరి శివరావు, పద్మనాభం, మిక్కిలినేని, ఆర్ నాగేశ్వరరావు తదితరులు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. నేటికీ బుల్లితెరపై నవ్వులు కురిపించే ఆపాతమధురం -అప్పుచేసి పప్పుకూడు.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం