Others

కంచుకోట (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నృత్యం: చిన్ని, సంపత్
కళ: కృష్ణారావు
కూర్పు: ఆర్ హనుమంతరావు
ఛాయాగ్రహణం: జికె రాము
సంగీతం: కెవి మహాదేవన్
**
మద్రాస్‌లో దర్శకుడు పి పుల్లయ్య వద్ద ‘కన్యాశుల్కం’, ‘జయభేరి’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన ఉప్పలపాటి విశే్వశ్వర రావు విశ్వశాంతి పతాకంపై నిర్మించిన తొలి తెలుగు చిత్రం ‘కంచుకోట’ (1967).
ఈ చిత్రానికి కథ, మాటలు అందించినది మహారథి. ఆయన అసలు పేరు బాలగంగాథరుడు. తెలుగు సాహిత్యంపట్ల మక్కువతో పనె్నండేళ్ల ప్రాయానికే రామాయణ, భారత గ్రంథాలు, అష్టాదశ పురాణాలపై అవగాహన పెంచుకున్నారు. 1954లో మద్రాస్ రేడియో స్టేషన్‌లో ఉద్యోగం చేస్తూ ఓ అనువాద చిత్రానికి (యోధానుయోధులు) ‘బాదల్’ పేరుతో రచయితగా పని చేశారు. తరువాత ‘బందిపోటు’ తెలుగు చిత్రానికి కథ, మాటలు అందించారు. తరువాత ‘మహారథి’గా కలం పేరు మార్చుకుని కథ, మాటలు అందించిన రసవత్తర జానపద చిత్రమే ‘కంచుకోట’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య కుమారుడు సిఎస్ రావు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. 1955లో ‘శ్రీకృష్ణతులాభారం’తో మొదలుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన విలక్షణ దర్శకుడు సిఎస్ రావు. ఇంతమంది ప్రముఖులు పనిచేసిన ‘కంచుకోట’ 22 మార్చి 1967లో విడుదలైంది.
**
భల్లాన సామ్రాజ్యానికి మహారాజు రాజేంద్ర భూపతి (నాగయ్య). మహారాణి శాంతకుమారి, కుమారుడు సురేంద్ర చక్రవర్తి. చక్రవర్తి సోదరుడు విజయేంద్ర భూపతి (ఉదయకుమార్), భార్య విజయేశ్వరి (టిజి కమలాదేవి), కుమారుడు నరేంద్ర. వ్యసనపరుడు, స్ర్తిలోలుడైన తమ్ముడిని మార్చటం కోసం రాజేంద్రభూపతి అతనికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. మహామంత్రి భైరవామాత్యుడు (్ధళిపాళ) తన అనుచరుడు మార్తాండునితో (ప్రభాకర్‌రెడ్డి) కుట్ర పన్ని మహారాజును హత్య చేయిస్తాడు. ఎదిరించిన విజయేంద్రుని కందకంలో పడేసి, తన సోదరి విజయేశ్వరిని ఖైదు చేస్తాడు. మహారాణి, సురేంద్రుడు తప్పించుకుంటారు. మార్తాండుని కుమారుని హత్యచేసి, తన మేనల్లుడు నరేంద్రకు, కూతురు మాధవికి సింహాసనం కట్టబెట్టాలని యోచిస్తాడు భైరవామాత్యుడు. మార్తాండునికి వేషం మార్చి విజయేంద్ర మహారాజుగా నిలబెడతాడు. ప్రచండుడి (రాజనాల) సాయంతో గ్రామాలను దోపిడి చేయించి, ఆ ధనాన్ని కంచుకోటలో భద్రపరుస్తుంటాడు. యుక్తవయస్కుడైన సురేంద్రుడు (ఎన్టీ రామారావు) ప్రచండుడి దాడులను ఎదిరించే సమయంలో యువరాజు నరేంద్రుని (కాంతారావు) స్నేహంతో కోటకు చేరుకొని ప్రజానాయకునిగా పదవి పొందుతాడు. మాధవి (సావిత్రి) తొలి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. కందకం నుంచి అవిటితనంతో బయటపడిన విజయేంద్రుడు, తన అనుచరుడు శౌర్యవర్మ (సత్యనారాయణ) కుమార్తె జయంతి (దేవిక)ని తన కూతురిగా అడవిలో పెంచుతుంటాడు. సురేంద్రుడు, జయంతి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సురేంద్రుడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్న భైరవుని కుట్ర వలన, సురేంద్రను అనుమానించటమేకాక అతడిని బందీ చేయిస్తాడు నరేంద్ర. ఆక్రమంలో సురేంద్రను మాధవి ప్రేమిస్తోందన్న నిజం తెలిసి అతనితో యుద్ధానికి సిద్ధమవుతాడు. వారిరువురి పోరాటాన్ని ఆపటానికి మాధవి తననుతాను పొడుచుకొని ఆత్మత్యాగం చేస్తుంది. ఈ సంఘటనతో నరేంద్ర, సురేంద్రలు ఏకమై కంచుకోటకు వచ్చి అక్కడ ప్రజలకు నిజాలు వెల్లడిస్తారు. అదే సమయంలో మార్తాండుడిని భైరవుడు చంపేస్తాడు. ప్రచండుడి బృందంతో రాకుమారులు ఇరువురూ పోరాడి దుష్టులను అంతం చేస్తారు. సురేంద్రుడు, జయంతి రాజ్యాభిషిక్తులవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో సురేంద్ర స్నేహితుడు భజగోవిందంగా పద్మనాభం, కంసాలి కోటి లింగాచారిగా చదలవాడ, మేనల్లుడు పుల్లయ్యగా రమణారెడ్డి, కూతురు బంగారిగా వాణిశ్రీ, సైనికులుగా బాలకృష్ణ, పొట్టిప్రసాద్, దొంగలుగా నెల్లూరి కాంతారావు, ఆనంద్, మోహన్, జగ్గారావు కనిపిస్తారు.
సురేంద్రుడిగా ఎన్టీ రామారావు, నరేంద్రుడిగా కాంతారావు సన్నివేశానుగుణమైన, భావయుక్తమైన, సమర్ధవంతమైన నటనతో సమ ఉజ్జీలుగా మెప్పించారు. మాధవి, జయంతిలుగా సావిత్రి, దేవిక అన్యోన్య మైత్రికి ఆనవాలుగా నిలవటం, ఒకే వ్యక్తిని ప్రేమించామని తెలిసి ఒకరికోసం ఒకరు త్యాగానికి సిద్ధపడటం లాంటి సన్నివేశాల్లో పరిపక్వత కలిగిన నటనను ప్రదర్శించారు. మహానటి సావిత్రి మాధవిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. తనను ప్రాణాధికంగా ప్రేమించిన బావను కాదనలేక, తాను వలచిన సురేంద్ర వలపు తన చెల్లిదని తెలియటం, మిత్రుల మధ్య వైరానికి తనే కారణమని భావించి ఆత్మత్యాగం చేయటంలాంటి సన్నివేశాల్లో చిరస్మరణీయ భావాలతో ఆకట్టుకున్నారు. ఇక భైరవామాత్యునిగా ధూళిపాళ, తాను పోషించిన విలనీ పాత్రల్లో (శకుని కాకుండా) ఎన్నదగిన, నట జీవితంలో చెప్పుకోదగ్గ స్థాయిలో క్రౌర్యం, ప్రేమ, అభిమానం.. ఇలా పలు భావాలను ప్రస్ఫుటింపచేశారు. తెలుసుకోదగిన విషయం ఏమిటంటే -కంచుకోట షూటింగ్ జరిగినన్ని రోజులూ నిర్మాత విశే్వశ్వరరావు ఇంటికెళ్లి రిహార్సల్స్ చేసేవారట.
దర్శకులు సిఎస్ రావు ఈ చిత్రాన్ని మంచి పట్టుతో నడిపారనడానికి సన్నివేశాలే ఉదాహరణ. ఎంతో ఉత్కంఠతో అర్ధవంతంగా సీన్లు తీర్చిదిద్దారు. కోటలోకి సురేంద్రుడు ప్రవేశించినపుడు తలుపులు వాటంతటవే తెరచి మూసుకుపోవటం, నరేంద్రతో వచ్చినపుడు మామూలుగా ఉండటం, కాత్యాయినిదేవి విగ్రహం నుంచి కోటలోపల నిధికి దారి, నిధి నుంచి మరో దారిగుండా రాజేంద్ర భూపతి విగ్రహం వద్దకు రావటం, నరేంద్రుడు ఎంతో సన్నిహితంగా సురేంద్రుడి ఇంటిలో భోజనం చేయటం లాంటి సన్నివేశాలను ఎంతో సహజంగా చిత్రీకరించారు. ఎంతో సన్నిహితులైన మిత్రుల మధ్య ద్వేషం, సురేంద్రుని చిత్రపటాన్ని ఒకసారి భైరవామాత్యుడు, మరోసారి నరేంద్రుడు చీల్చివేయటం లాంటి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. మాధవి ప్రేమ తెలిసికొన్న జయంతి, గతంలో వారి మాటలు గుర్తు చేసుకొని చెరొకప్రక్క ఫ్రేములో చూపటం, చివర మాధవి ఆత్మత్యాగం, సభలో నిజాలు వెల్లడయ్యాక భైరవుడు ప్రచండుని రెచ్చగొట్టడం, హీరోల పోరాట సన్నివేశాలు, చిత్రం చివర భైరవుడు తన కుమార్తె మృతదేహాన్ని తన సంపద గదిలో సకల భూషణాలతో అలంకరించటం లాంటి సన్నివేశాలు సిఎస్ రావు దర్శకత్వ ప్రతిభకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ వృత్తాంతాన్ని విజయేంద్ర భూపతి ద్వారా ఒకసారి, విజయేశ్వరి ద్వారా ఒకసారి చిత్రం మధ్యలో చూపటం విశేషం.
పాటల చిత్రీకరణలో చక్కని జలపాతం మధ్యన జయంతి, సురేంద్రలపై -లేదులేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు (ఘంటసాల, పి సుశీల- ఆత్రేయ) ఎంతో హుషారుగా చిత్రీకరించారు. మాధవి పుట్టినరోజున జయంతి పాడే గీతం -నీ పుట్టినరోజు నీ నోములు పండినరోజు (పి సుశీల బృందం- దాశరథి). ఈ పాట రచనకు తగ్గట్టు మిలమిలతార వేళని, అలలపై వూగే హంస కన్యలను, నెమలి నడకలను నృత్యాలతో చూపటం విశేషం. మరో అద్భుత గీతం సి నారాయణరెడ్డి రచనలో పి సుశీల, ఎస్ జానకి, ఘంటసాల గానంతో సాగుతుంది. యల్ విజయలక్ష్మి నృత్యంతో అంతఃపురంలో మరో భామ జయశ్రీపై చిత్రీకరించిన నృత్యగీతం ‘సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరా సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుధాకర’. పాట చివర ఘంటసాల సాకీ -ఎచటనోగల స్వర్గమ్ము చివర నీవే రక్ష అన్నపుడు అన్నగారు నాగయ్య పాదాలు ఉదయకుమార్ పట్టుకోవటం దర్శకుని స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. ఇంకా చిత్రంలో ప్రచండుడి బృందంముందు కాంచనపై చిత్రీకరించిన నృత్య గీతం -ఈడొచ్చిన పిల్లనోయి (ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం- ఆరుద్ర), -ఉలికి ఉలికి పడుతుంది గిలిగింత (పి సుశీల, సినారె), -సిగ్గిందుకే చెలీ సిగ్గిందుకే (పి సుశీల, బి వసంత -మహారథి), హాస్య గీతం పద్మనాభం, వాణిశ్రీపై -్భం భం భం పటపట (కె జమునారాణి, పిఠాపురం- కొసరాజు), ప్రముఖ హాస్య గీతం వాణిశ్రీ బృందంపై -అద్దరేతిరికాడ అత్తయ్య నాకు (ఎల్‌ఆర్ ఈశ్వరి, అప్పారావు -యు విశే్వశ్వరరావు) సంగీత, సాహిత్యాలపరంగా కంచుకోటను అలరించాయి.
చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది మహారథి సమకూర్చిన పదునైన సంభాషణలు. ప్రతి సన్నివేశాన్ని భావోద్వేగాలతో కూడిన శక్తివంతమైన మాటలతో అలరింపచేశారు. నరేంద్రుడు చెప్పే డైలాగుల్లో ‘ఒకరి హృదయాన్ని గాయం చేసినవారికి మరొకరి హృదయం గురించి మాట్లాడే అర్హత లేదు’, చిత్రం చివర భైరవునితో సురేంద్రుడు చేప్పే డైలాగుల్లో ‘ఏడు, ఈ భూనభోంతరాలు బ్రద్దలయ్యేలా ఏడు, ఏ కూతురి అభ్యున్నతికోసం నీ జీవిత సర్వస్వం, రక్తసంబంధం లేదని రాజవంశ నిర్మూలనకు పూనుకున్నావో, శిశుహత్యకు, దారుణ మారణకాండలకు ఒడిగట్టావో ఆమె ఈనాడు మృత్యుదేవత ముద్దుబిడ్డ’ లాంటివి మచ్చుతునకలే. ‘కంచుకోట’ చిత్రం విజయం సాధించింది. 1967 జూన్ 30న సుమారు 5 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకోవటమేకాక తిరిగి డిసెంబరు 1974లో రెండోసారి విడుదలైనపుడు కూడా ప్రతిరోజూ 3 ఆటలతో మరోసారి శత దినోత్సవం జరుపుకోవటం విశేషం. హైద్రాబాద్ బాలానగర్‌లోని ‘శోభనా’ థియేటర్‌లో ప్రదర్శింపబడింది. 1975లో జరిగిన అభినందన సభలో ప్రముఖులు పాల్గొని ఆనందించటం, ‘కంచుకోట’ సాధించిన మరో విజయంగా పరిగణించాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి