Others

మరువలేం.. మాయాబజార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ చరిత్రలో ‘మాయాబజార్’ది సువర్ణ్ధ్యాయం. 1957లో విడుదలైన ఈ చిత్రం 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. 60 ఏళ్లు పూర్తి చేసుకున్న చిత్రాలో ఈ ఏడాదిలో చాలానే ఉన్నా -ఈ ఏడాది మొత్తానికి మయాబజార్ హీరో అనుకోవాలి. మాయాబజార్ ఎన్నిసార్లు విడుదలైనా, ప్రతిసారీ ప్రేక్షకుల ఆదరణ దక్కుతూనే ఉంది. పాతికసార్లు చూశామని కొందరు, యాభైసార్లు చూసామని ఇంకొందరు గొప్పగా చెప్పుకోవడమే -మాయాబజార్ గొప్పతనాన్ని చెప్పకనే చెబుతుంది. ఈ సినిమా చూడని తెలుగువాడు ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. ఆబాల గోపాలాన్ని అంతగా ఆకట్టుకున్న ‘మాయాబజార్’ గొప్పతనం ఏమిటి? చక్కని సంభాషణలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, దర్శక ప్రతిభ, కనువిందు చేసే ఫోటోగ్రఫీ, అత్యున్నత సాంకేతిక విలువలు, మిక్కిలి దిగ్గజాలవంటి తారాగణం. ఇవన్నీ ఈ చిత్రానికి అమరత్వాన్ని సాధించాయి. సాధారణంగా ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరడం కష్టం. సినిమా విషయంలో మరీనూ. కానీ మాయాబజార్ విషయంలో మాత్రం ‘అద్భుతం’ అనే మాట తప్ప మరొకటి వినపడదు. పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన స్క్రీన్‌ప్లే చిత్రంగా మాయాబజార్‌నే ప్రస్తావించితీరాలి. అంత పెద్ద కథను ఏమాత్రం గందరగోళం లేకుండా ఆద్యంతం హాస్యరస భరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు కెవి రెడ్డి, రచయత పింగళి కనబరిచిన ప్రజ్ఞ ప్రశంసనీయం. మరో విషయమేమంటే కెవి రెడ్డిలో కవిహృదయం, సశాస్ర్తియంగా ఆలోచించే మేధాశక్తి, ప్రతి విషయాన్ని విశే్లషించగల సమర్ధత ఉన్నాయి. తన కవి హృదయాన్ని సశాస్ర్తియంగా విశే్లషిస్తూ చక్కని నాటకీయ సన్నివేశాలు సృష్టింగల ప్రతిభ ఆయన సొంతం. అందుకే ‘మాయాబజార్’ చిత్రంతో సహా ఆయన రూపొందించిన చిత్రాలన్నీ ఇప్పటికీ ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
నిజానికి ‘మాయాబజార్’ కథ భారతంలో లేదు. ఆంధ్ర దేశానికి ఇంకా నాటకం కూడా సరిగారాని కాలంలో ధార్వాడ బృందం కన్నడంలో ‘మాయాబజార్’ నాటకాన్ని మన రాష్ట్రంలో ప్రదర్శించేది. ఆ నాటకమే తెలుగులోకి వచ్చింది. భారతంలో కొన్ని పాత్రలను తీసుకుని దానిని రూపొందించారు. రంగస్థలం మీద ట్రిక్కులు ప్రదర్శించడానికి అవకాశం ఉండటంతో, ఆ నాటకం మంచి ప్రజాదరణ పొందింది. ఆ నాటకాన్ని 1936లో ‘మాయాబజార్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో వేల్ పిక్చర్స్ అధినేత పివి దాసు నిర్మించారు. యడవల్లి నాగేశ్వరరావు (శ్రీకృష్ణుడు), తుర్లపాటి ఆంజనేయులు (బలరాముడు), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (దుర్యోధనుడు), ఎస్‌పి లక్ష్మణస్వామి (అభిమన్యుడు), నెల్లూరుకు చెందిన రాజంరెడ్డి రామిరెడ్డి (ఘటోత్కచుడు), సంగీత దర్శకుడు మాస్టర్ రాజేశ్వరరావు (బాల చంద్రుడు), పొత్తూరి సత్యనారాయణ (శకుని), శ్రీరంజని (సుభద్ర), శాంతకుమారి (శశిరేఖ), ఎం సుబ్బులు (రేవతి) తదితరులు పాత్రధారులు. ఈ సినిమాలో శశిరేఖ పాత్రకు సుబ్బమ్మ అనే యువతిని ఎంపిక చేసి ఆమె పేరు శాంతకుమారిగా మార్చారు. సినిమాకి వెయ్యి నూట పదహార్లు పారితోషికంగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 1935లో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఆరు నెలల్లో పూర్తయింది. అయితే ఈ సినిమా తొలి కాపీ రాకముందే దర్శకుడు దాసు మరణించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని ట్రిక్ షాట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇంగ్లీషు చిత్రంలో కార్సన్ మిరాండో పాడిన పాట బాణీని సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు తీసుకుని ‘వివాహ భోజనంబు’ను రూపొందించారు. 81 ఏండ్లుదాటినా ఈ బాణీయే ప్రజల్లో నిత్య నూతనంగా ఉంది. తెలుగు బాణీయే అనేటట్టే ఉంటుంది.
దీనిని స్ఫూర్తిగా తీసుకుని విజయా సంస్థ ‘మాయాబజార్’ చిత్రాన్ని నిర్మించింది. కథా కల్పన, కథనం, పాత్రలలో పాత, కొత్త చిత్రాలకు వ్యత్యాసం కనిపిస్తుంది. చిత్రంలో ఘటోత్కచుడు పాడిన ‘వివాహ భోజనంబు’ పాట నాటకంలో ఉన్నదే. రంగస్థలం మీద పాపులరైన ట్యూన్‌నే సినిమాలోకి తీసుకున్నారు. చిత్రంలో ఒక్కో పాటా ఒక్కొ ఆణిముత్యం. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘నీ కోసమే నే జీవించునదీ’, ‘నీవేనా నను తలచినది’ పాటల్లోని సాహిత్యం, సంగీతం, పాడిన తీరు, చిత్రీకరించిన విధానం వల్ల ఈనాటికీ అవి శ్రోతలను అలరిస్తున్నాయి. అయితే ఆయా పాటల కంపోజింగ్ దాకా సంగీత దర్శకుడిగావున్న సాలూరి రాజేశ్వరరావు ఏవో కారణాల వల్ల తప్పుకోవడంతో ఘంటసాలని నియమించారు. కంపోజ్ మాత్రమే చేసిన ఆ పాటలను ఆర్కెస్ట్రేజేషన్, రికార్డింగ్ చేసింది ఘంటసాలే. స్క్రిప్ట్ అంతా సిద్ధమయ్యాక స్కెచ్ వేసి పాత్రధారులను ఎంపిక చేశారు. ‘మాయాబజార్’ ముందు కృష్ణుడు వేషమంటే అందరికీ ఈలపాట రఘురామయ్య గుర్తుకొచ్చేవారు. ఈ సినిమాకి కూడా మొదట ఆయననే అనుకున్నారు. రఘురామయ్య డేట్స్ కుదరక పోవడంతో ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడి పాత్ర వరించింది.
బడ్జెట్ పెరిగిపోతుందనే భయం ప్రధాన కారణంగా స్క్రిప్ట్ అంతా కెవి రెడ్డి సిద్ధం చేసి షూటింగ్ రెడీ అవుతుండగా ‘మాయాబజార్’ చిత్రం నిర్మాణం ఆపివేశారు విజయా అధినేతలు. ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఉత్సాహం తమిళ, తెలుగు నిర్మాతలకు కలగడంతో, మాయాబజార్‌ని తమకే చేసిపెట్టమని కొందరు (విజయావారి చిత్రం ఆగిపోయిన కారణంగా) నిర్మాతలు కెవి రెడ్డిని పదే పదే కోరారు. చిత్ర నిర్మాణాన్ని ఆపినందుకు బాధపడుతునే ‘విజయా’కి తప్ప మరెవరికీ చేయనని ఆయన నిక్కచ్చిగా చెప్పారు. ఈ కారణాలతో పునరాలోచన చేసి మాయాబజార్ ప్రాజెక్టును ప్రారంభించాలని నాగిరెడ్డి, చక్రపాణి భావించారు. తను వేసిన బడ్జెట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకుండా రూపొందిస్తానని, అలా పెరిగితే దానికి బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చి మరీ కెవి రెడ్డి రూపకల్పన ప్రారంభించారు. 1957 మార్చి 27న విడుదలయ్యాక తొలిరోజు విజయవాడనుంచి వచ్చిన ఫోన్‌కాల్ నిరాశపర్చింది. అంతకుముందే ఉచితంగా సినిమాని చూసిన కొందరు సినీ ప్రముఖులు పెదవి విరిచారు. కలెక్షన్ క్రమంగా కనెక్షన్లు పుంజుకున్నాయి. విజయవాడ దుర్గ కళామందిర్, హైదరాబాద్ ప్రభాత్ కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది.
కృష్ణుడుగా ఎన్టీఆర్ పనికిరాడు??
మాయాబజార్ చిత్రంలో ఆయా పాత్రలకు నటీనటులను ఎన్నుకుంటున్న సందర్భంలో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావును శ్రీకృష్ణుడు పాత్రకు బుక్ చేసారు దర్శకుడు కెవి రెడ్డి, నిర్మాత చక్రపాణిలు. దాంతో సినీ పరిశ్రమ మొత్తంనుంచి ఈ నిర్ణయానికి ప్రతిఘటన ఎదురైంది. అంతకుముందు ఘంటసాల నిర్మించిన ‘సొంత వూరు’ చిత్రంలో ఎన్టీఆర్ ఒక దృశ్యంలో శ్రీకృష్ణుడిగా నటించారు. చూడడానికి ఆ వేషం బాగోలేదు. దీంతో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా పనికారాడన్నారు. దాన్ని ప్రేక్షకులు వ్యతిరేకించి తెరను చించెయ్యడానికి కూడా సిద్ధపడ్డారు. చిత్రం ఘోర పరాజయం పొందింది. ఆ అనుభవంతో ఎన్టీఆర్ కూడా శ్రీకృష్ణుడి పాత్రకు దూరంగావుంటూ వచ్చారు. కెవి రెడ్డి, చక్రపాణి తనను ఆ పాత్రకు ఎన్నుకున్నపుడు కూడా ఆయన సందేహం వ్యక్తం చేసారు. ‘సొంత ఊరు’లో చిన్న పాత్రకే అంత అల్లరి చేసిన ప్రేక్షకులు, ఇందులో పూర్తి నిడివిగల కృష్ణుడి పాత్రను వ్యతిరేకిస్తారని చెప్పి చూశారు. అయినా దర్శక నిర్మాతలు ససేమిరా ఒప్పుకోక అలంకరణ, ఆహార్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీఆర్ చేత ఆ పాత్రని వేయించారు. అద్భుతంగా వచ్చింది. శ్రీకృష్ణుడి పాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. అప్పటినుంచి కృష్ణ పాత్ర వేయాలంటే ఎన్టీఆరే వెయ్యాలనడం మొదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే మాయాబజార్ విశేషాలెన్నో. ఎందుకంటే అది సినిమా మాత్రమేకాదు, సజీవ కళా స్వరూపం. మాయాబజార్‌లో ఎన్టీఆర్, అక్కినేని, రంగారావు, గుమ్మడి, సిఎస్‌రావు, రేలంగి, వంగర, సావిత్రి, రుష్యేంద్రమణి తదితరులు తారాగణం. ఈ చిత్రం నిర్మాతలకు ధనరాశులు చేకూర్చింది. రంగారావు ఘటోత్కచుడిగాను, సిఎస్‌రావు శకునిగాను అద్భుతంగా నటించి సరిరారు వీరి నటనలో మరెవ్వరు అనిపించారు.
రంగుల్లో మాయాబజార్ 2010లో విడుదల చేశాక అధిక వసూళ్లతో హైదరాబాదులో వంద రోజులు ఆడింది. పౌరాణిక అంశాలున్న కథ అయినా సాంఘిక చిత్రం తరహాలో పింగళి సంభాషణలు, మార్కస్ బారట్లే చాయాగ్రహణం, గోఖుల్ కళా దర్శకత్వం, కెవి రెడ్డి ఇంద్రజాల చిత్రీకరణ వగైరా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. రేలంగి, వంగర, రమణారెడ్డి, నల్లరామ్మూర్తి, చదలవాడ కుటుంబరావు చేసిన హాస్య విన్యాసాలు ఆహా అనిపిస్తాయి. పింగళి పాళీ పసందైన సంభాషణలు పలికించింది. చతుషష్టి కళలన్నీ సమన్వయపర్చుకుని అద్భుత దృశ్య కావ్యాన్ని అందించిన కెవి రెడ్డి తెలుగు చిత్ర అభిమానులకు చిరస్మరణీయుడు.
*

-కందేపు శ్రీనివాసరావు