AADIVAVRAM - Others

వడదెబ్బకు విరుగుడు వాటర్ బాటిలే! ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: వేసవి కాలంలో వడదెబ్బ కొట్టకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
-ప్రసాద్ జెఎస్‌ఆర్‌కె (కర్నూలు)
జ:"There is no substitute for water' అనేది ప్రాచీన కాలంనాటి సామెత. నీటికి బదులుగా తీసుకోదగినది ఇంకొకటి లేదు. మనిషి సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగా ననుకోవచ్చు గానీ, నీటికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం సృష్టించలేక పోయాడు.
మనది ఉష్ణ మండలం. శరీరంలోంచి ఎంత నీరు బయటకు పోతోందో అంత నీటిని ఎప్పటికప్పుడు కడుపులోకి అందిస్తుంటే శరీరానికి నీటి కొరత ఏర్పడకుండా ఉంటుంది. నీటికి ప్రత్యామ్నాయం నీరే!
హైడ్రేషన్ అంటే శరీరానికి నీటిని అందించటం. డీ హైడ్రేషన్ (శోష) అంటే శరీరంలో నీరు తగ్గిపోవటం. శోష రాకుండా నీటి సమతుల్యతను పాటించటం మన బాధ్యతే! శరీరంలో 60% నీరు ఉంది. ఆ నీటి శాతాన్ని అంతే స్థితిలో ఉండేలా నడుపుకొని పోవాలి. పిట్యూటరీ గ్రంథి సహాయంతో శరీరంలోంచి ఎంత నీరు మూత్రం ద్వారా బయటకు పోవాలో, ఎంత నీరు నిల్వ ఉండాలో మెదడు నిర్ణయిస్తుంది. నీటి నిల్వలు తగ్గిపోతుంటే హెచ్చరికగా శరీరం దాహాన్ని ప్రేరేపిస్తుంది. అప్పటికీ మనం నీటిని అందించకపోతే కచ్చితంగా మూత్రపిండాల మీద, గుండె మీద ఇతర ప్రాణాధార అవయవాల మీదా దెబ్బ పడుతుంది.
నీటికి బదులుగా పళ్ల రసాలను ఐసుముక్కలు వేసుకోకుండా తాగటం మంచిది. ఐస్‌ని తయారుచేసిన నీరు శుద్ధమైనది కాకపోతే వాటిలో వుండే చెడ్డ బాక్టీరియా కొత్త సమస్యలను తెచ్చి పెట్టవచ్చు. అలాగే, నీటికి ప్రత్యామ్నాయంగా విషపు రసాయనాలు కలిపి తయారుచేసిన కూల్‌డ్రింకుల్ని తాగటం దేశానికీ, దేహానికీ రెంటికీ మంచిది కాదు. ఆల్కహాలు కూడా ద్రవమే కదా, నీళ్లు కలిపే తాగుతున్నాను కదా అని, మంచినీళ్లకు బదులు ‘మందు’ తాగితే, ఆల్కహాల్ శరీరంలోంచి ఎక్కువగా నీరు విసర్జన జరిగేలా చేస్తుంది. అందువలన త్వరగా శోష ఏర్పడుతుంది.
చెమట ద్వారా, మూత్రం ద్వారా, శ్వాస ద్వారా, విరేచనం ద్వారా ఎంత నీరు బయటకు పోయిందో అంత నీటిని ఎప్పటికప్పుడు శరీరానికి అందించటం అవసరం. లేకపోతే ముఖ్యంగా వేసవిలో మనకు తెలీకుండానే శోష ఏర్పడుతుంది. శోష వలన మూత్రపిండాల మీద వత్తిడి పెరుగుతుంది. అది చాలా వేగంగా కిడ్నీలు దెబ్బ తింటానికి కారణమవుతుంది.
ప్రొద్దున నిద్ర లేవగానే నీళ్లు తాగడం అనే అలవాటు శరీరంలో నీటి కొరతను నివారించే ఒక ఉపాయం. దీని గురించి భావప్రకాశ అనే ఆయుర్వేద గ్రంథం చక్కని వివరణ ఇచ్చింది. ‘సవితుః సముదయకాలే ప్రసృతీః సలిలస్య పిబేదష్టౌ/ రోగ జరా పరిముక్తో జీవేద్వత్సర శతం సాగ్రమ్’ అనే సూత్రంలో ఈ వివరణ కనిపిస్తుంది. ప్రొద్దునే్న ఎనిమిది దోసిళ్ల నీళ్లు తాగితే వంద ఏళ్లపాటు రోగాలు లేకుండా ముసలితనం రాకుండా జీవించవచ్చని దీని తాత్పర్యం. నీటిని చికిత్సాపరంగా ఇలా తీసుకోవటాన్ని ఆధునిక వైద్యులు హైడ్రో థెరపీ అంటారు.
సూర్యోదయ కాలంలో నీళ్లు తాగాలి. రాత్రి నాల్గవ ఝామున, తెల్లవారటానికన్నా కొద్ది ముందు 4-5 గంటల మధ్యన నీళ్లు తాగాలని భోజుడి చారుచర్య గ్రంథం చెప్తోంది. రాత్రి తెల్లవార్లూ నిల్వ వున్న నీళ్లయితే మంచిదని భోజుని అభిప్రాయం.
రాత్రి చివరి భాగంలో నీళ్లు తాగాలి. చాలామంది రాత్రి పడుకోబోయే ముందు, అంటే రాత్రి ప్రారంభంలో ఎక్కువ జలపానం చేస్తారు. దాని వలన ఉపయోగం లేకపోగా తెల్లవార్లూ మూత్రం కోసం లేవాల్సి వచ్చి నిద్రాభంగమే అవుతుంది.
మొలల వ్యాధి, శరీరానికి నీరు పట్టడం, పేగులలో వచ్చే అమీబియాసిస్ వ్యాధి, టైఫాయిడ్ లాంటి ఇతర జ్వరాలు, ముందుగానే ముంచుకొచ్చే ముసలితనం, ఎలర్జీ వ్యాధులు, స్థూలకాయం, రక్తంలో కొవ్వు పెరగటం, మూత్రం సరిగా నడవక పోవటం, బీపీ వ్యాధి, చెవి ముక్కూ గొంతు వ్యాధులు, తలనొప్పి, నడుం నొప్పి, కంటి రోగాలు, అనేక వాత వ్యాధులు, పైత్య వ్యాధులు, కఫ వ్యాధులూ రానీకుండా ఉదయాన్న నీళ్లు తాగే అలవాటు ఆపుతుందని భావప్రకాశ గ్రంథం పేర్కొంది.
‘అభ్యాస యోగాదపహరతి పయః పీతమంతే నిశాయాః’ ఈ నీళ్లు తాగే అలవాటుని అభ్యాసం చేయాలి. మొదటి రోజే ఎనిమిది దోసిళ్ల నీళ్లు తాగేయలేరు. అలా బాగా ప్రాక్టీసు చేసి రాత్రి ముగిసే ముందు లేదా పగలు ప్రారంభమయ్యే ముందు అధిక జలపానం చేయటాన్ని అలవాటు చేసుకోవాలన్నాడు శాస్తక్రారుడు. అందువలన రోగాలంటకుండా ఉంటాయంటాడు.
శరీర ఉష్ణోగ్రతని కాపాడుతూ, అధిక ఉష్ణోగ్రతను చల్లారుస్తూ సమస్థితిని నెలకొల్పేందుకు నీరు ఉపయోగపడుతుంది. అది తగుపాళ్లలో శరీరంలో ఎప్పుడూ నిల్వ ఉండాలి. నీరు పెరిగినా జబ్బే, నీరు తగ్గినా జబ్బే.
నీరు తగినంత తాగుతుంటే శరీరంలో విష దోషాలు త్వరగా, ఎక్కువగా శరీరంలోంచి బయటకు నెట్టివేయబడతాయి. భోజనానికన్నా ముందుగా నీళ్లు తాగి అప్పుడు అన్నం తింటే, స్థూలకాయం తగ్గుతుంది. భోజనం చేసిన తరువాత నీరు తాగితే స్థూలకాయం పెరుగుతుంది. ఈ గోలంతా ఎందుకని ఉదయానే్న నీటిని తాగితే రోజంతా విష దోషాలను అడ్డుకొంటుందని ఆయుర్వేద శాస్త్రం భావిస్తోంది.
కండరాల నొప్పులు, కీళ్లవాతం, ఎలర్జీ వ్యాధులు, మలబద్దత, షుగరు వ్యాధి, బీపీ వ్యాధులలో ఈ అలవాటు మేలు చేస్తుంది. మలమూత్రాలు ఎక్కువగా అయ్యేలా చేయటం ద్వారా పేగులూ, మూత్రపిండాలు, రక్తనాళాలు శుభ్రపడతాయని ఆధునిక వైద్య శాస్త్రం కూడా చెప్తోంది. అతి చల్లని నీరు, అతి వేడి నీరూ తాగటాన్ని ఆయుర్వేద శాస్త్రం అంగీకరించదు. రాగిచెంబులో నిల్వ వున్న నీరు ఎక్కువ మేలు చేస్తుంది. కేవలం నీటిని మాత్రమే తాగితే కలిగే ప్రయోజనం కన్నా మజ్జిగ మీద తేరుకొన్న నీటిని తాగితే ఇంకా మంచిది. పేగులకు శక్తినిచ్చేందుకు ఉపయోగపడే బాక్టీరియా అందుతుంది.
మజ్జిగ మీద తేటను గానీ, పలుచని మజ్జిగను కానీ తాగితే, శోషను కలిగించకుండా శరీరాన్ని కాపాడుతుంది. జీర్ణకోశ వ్యాధులతో బాధపడే వారికి, ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధి ఉన్నవారికి ఇది తిరుగులేని మేలు కలిగిస్తుంది.
ఒక గ్లాసు మజ్జిగలో నిమ్మరసం, పంచదార, ఉప్పు, తినే సోడా ఉప్పు, మిరియాల పొడి వీటిని తగు పాళ్లలో కలుపుకుని తాగితే శోష తక్షణం తగ్గుతుంది. ఎండలోకి వెళ్లాల్సి వస్తే, ఈ పానీయాన్ని తాగి వెళ్లటం మంచిది. నీటిని మాత్రమే శరీరానికి అందిస్తే సరిపోదు. శోష వస్తే, నీటి కొరతతోపాటు లవణాల కొరత కూడా ఏర్పడుతుంది. ఈ పానీయాన్ని తాగితే లవణాలు చక్కగా అందుతాయి. కేరెట్, ముల్లంగి, తరుబూజ/ యాపిల్ వీటిని సమభాగాలుగా తీసుకుని జ్యూస్ తాగిస్తే వేసవిలో పిల్లలకు ఆరోగ్యదాయకంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి త్వరగా వడకొడుతుంది. వేడి శరీర తత్వం ఉన్నవారు తేలికగా వడదెబ్బకు గురవుతారు. ఇలాంటి వాళ్లకు ఈ పానీయం మేలు చేస్తుంది.
వేసవిలో ఉదయంపూట టిఫిన్లు చేయటంకన్నా పెరుగన్నం లేదా మజ్జిగ అన్నం తినటం ఉత్తమం. మాంసాహారం కన్నా సాధ్యమైనంత ఎక్కువగా కూరగాయలు తినటం మంచిది. చింతపండు, మసాలాల వాడకాన్ని వేసవిలో తగ్గించటం అవసరం. సమాన గుణ ధర్మాలున్న పదార్థాలు సమాన గుణ ధర్మాలను పెంచుతాయి. వేడి చేసే స్వభావం వున్న పులుపు, కారం లాంటివి శరీరంలో వేడిని పెంచుతాయి. శరీరంలో వేడి పెరిగితే, దాన్ని తగ్గించటానికి చెమట ఎక్కువ పడుతుంది. అతిగా చెమట వలన శోష ఏర్పడుతుంది. చలవ చేసే ద్రవ్యాలకు ప్రాధాన్యత ఇవ్వటం, నీటిని సమానంగా తీసుకోవటం, ప్రయాణాల్లో తప్పనిసరిగా వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవటం ఇవన్నీ చేయదగిన సూచనలు. *
- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు