AADIVAVRAM - Others

జెన్ సన్యాసిని ( కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌లో ఒక జెన్ సన్యాసిని ఉండేది. ఆమె జెన్ మార్గంలో అత్యున్నత స్థాయిని అందుకున్న స్ర్తి. ధ్యాన మార్గంలో కొద్దిమంది స్ర్తిలు మాత్రమే అత్యున్నత స్థాయిని అందుకుని ఉంటారు. అట్లాంటి వారిలో ఆమె ప్రథమ స్థానంలో ఉంటుంది.
జెన్ మార్గాన్ని అందుకోవడమంటే ప్రాపంచిక పరిమితుల్ని అధిగమించడం. అంతేకాదు ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రపంచాన్ని దాటి వెళ్లగలగడం.
సాధారణ ప్రజలు ప్రవక్తల బోధనల దగ్గరే ఆగిపోతారు. ప్రవక్తనే పరమాత్మగా భావిస్తారు. బౌద్ధ మతస్థులందరూ బుద్ధుణ్ణి ఆరాధిస్తారు. బుద్ధుని విగ్రహాలను పూజిస్తారు.
జెన్ అనుయాయులు అలా కాదు. వాళ్లు ఆత్మపరిశీలనలో ఉంటారు. బుద్ధునికి సాధారణ వ్యక్తికి వాళ్లు తారతమ్యం చూడరు. బుద్ధుడు ‘అప్ప దీవోభవ’ అన్నాడు అంటే ‘నీకు నువ్వే దీపం’ అని అర్థం. ఆ స్థాయికి చేరుకోడానికి అన్ని అహంకారాల్ని వదులుకోవాలి.
ఆ జెన్ సన్యాసిని ఆ స్థాయిని అందుకుంది. ఆమె గ్రామాలు పర్యటించేది. భిక్ష స్వీకరించేది. ఆదరించిన వాళ్ల ఇంట్లో ఒక పూట గడిపేది. మళ్లీ మరో గ్రామం వెళ్లేది.
కానీ అందరూ ఆదరించేవాళ్లు కాదు. అర్థం చేసుకునేవాళ్లు కాదు. సమాజంలో ఎప్పుడూ సంప్రదాయానికి కట్టుబడిన వాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఆ కారణంగా ఆమె అనేక మార్లు నిరాదరణకు గురయ్యేది.
అట్లా చీకటి పడుతూండగా ఆమె ఒక గ్రామం చేరింది. ఆ గ్రామంలో ఆమె తత్వాన్ని అర్థం చేసుకునేవాళ్లు, ఆదరించే వాళ్లు ఎవరూ లేకపోయారు. పైగా ఆమెను ద్వేషించారు.
ఆమెకు బాగా ఆకలి వేస్తోంది. చలి విపరీతంగా ఉంది. ఎవరూ పట్టెడన్నం కూడా పెట్టలేదు. కనీసం రాత్రికి పడుకోవడానికి కూడా ఎవరూ అనుమతించలేదు.
అంత నిర్దయను కూడా ఆమె చిరునవ్వుతో స్వీకరించింది. చీకటి పడింది. చల్లగాలి వీస్తోంది. చంద్రుడు కొండల మీద నించీ వచ్చాడు. నక్షత్రాలు ఆకాశమంతా వెలిగిపోతున్నాయి.
ఆమె ఊరు దాటి ఒక చెట్టు కింద అరుగు మీద కూచుంది. ఆకాశంకేసి చూసింది. చంద్రుడు ఆమెను చూసి వెచ్చగా నవ్వాడు. నక్షత్రాలు చిరునవ్వు చిలకరించాయి. పక్కన పూపొదలో గుబురుగా పూలు విచ్చుకున్నాయి. వాటి మీద చంద్ర కిరణాలు పడి మెరుస్తున్నాయి. గాధే పరిమళం పరిసరమంతా వ్యాపించింది.
ఒక్కసారిగా ఆ సన్యాసిని కళ్ల నించీ ఆనందభాష్పాలు రాలాయి. ప్రకృతి సామ్రాజ్యం పరవశంగా ఆమెను పలకరించింది. తనను కాదని, తనకు ఆశ్రయమివ్వని గ్రామస్థుల పట్ల ఆమెకు ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. వాళ్లు తనకు ఆశ్రయమిస్తే తను ఎంత కోల్పోయేది, ఎంత పోగొట్టుకునేది. ఈ నిండు చంద్రుడు, నిర్మలాకాశం, నిగనిగలాడే నక్షత్రాలు, పులకరించే పూలు వీటన్నిట్నీ తను కోల్పోయేది కదా!
ఆ ఆలోచన రాగానే అనంత అస్తిత్వం తన పట్ల చూపిన అభిమానానికి అభివాదం చేసింది. అదృష్టమంటే తనదే కదా! అని ఆనందంతో పులకించింది. ఆమె ఆకలి మాయమయింది. చలి పారిపోయింది. ఆమె సమస్త శరీరం ఒక సంగీత తరంగంలో తన్మయించింది.

- సౌభాగ్య, 9848157909