Others

దౌడు మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముగింపు’ కథ చెప్పడానికి జక్కన్న సిద్ధమైపోయాడు. కమర్షియల్ పాయింట్‌లో బాహుబలి ఇమేజ్‌ను డబుల్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ పూర్తి చేశాడు. ప్రచారం ఫైనల్ ఎపిసోడ్‌కు చేరడంతో -అటు సాంకేతిక నిపుణులు, ఇటు ప్రధాన పాత్రలు పోషించిన పాత్రధారులు..
బాహుబలి క్రతువులో తమతమ అనుభవాలను ఊరించి ఊరించి
చెబుతున్నారు. మరో పక్షం రోజుల్లో బాహుబలిని చంపిన కట్టప్ప
-రాజతంత్రానికి తలొగ్గాడా? కుతంత్రంతో కత్తిదూశాడా? అన్న ప్రపంచవ్యాప్త ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది. అక్కడితో
-అందమైన చందమామ కథ సినిమా కంచికి చేరిపోయినట్టే.

తెలుగు సినిమా బలాన్ని చాటిచెప్పే బాహుబలి ప్రాజెక్టుమీద గౌరవంతో రేస్‌కు దూరంగావున్న స్టార్ హీరోలంతా -మళ్లీ గోదాలోకి దిగుతున్నారు. వచ్చే నాలుగైదు నెలల్లో ఆడియన్స్ మీదకు వరుసపెట్టి సినిమాలు వదిలేందుకు పెద్ద బ్యానర్లూ సిద్ధమవుతున్నాయి. నిజానికి తెలుగు సినిమాకు ఏడాదిలో మూడు సీజన్లు. సినిమా అభిమానులకు ఎరుకైన విషయమే ఇది. ఏడాది ఆరంభంలో వచ్చే సంక్రాంతి సీజన్‌కు ఇద్దరు సీనియర్ హీరోలు రికార్డు సినిమాలతో సంచలనం రేపారు. అలా ఆ సీజన్ ముగిసింది. తరువాతి సీజన్ సమ్మర్. ఎక్కువ సినిమాలతో ఆడియన్స్‌ని మురిపించేందుకు దర్శక, నిర్మాతలు, హీరోలు ఎక్కువ కసరత్తులు చేసేది -ఈ సీజన్‌లోనే. సమ్మర్ హాలిడేస్ దృష్టిలో పెట్టుకుని పెద్ద హీరోలంతా ‘యాక్షన్’ చేసి చూపించటం రివాజు. అయితే, ఈసారి సమ్మర్ సీజన్‌కు బాహుబలి అడ్డంపడ్డాడు. ఖండాలు దాటిన తెలుగు సినిమా ఖ్యాతి సంపాదించుకున్న బాహుబలి -కన్‌క్లూజన్ కథతో 28న థియేటర్లకు వస్తున్నాడు. పెద్ద సినిమా కనుక -బాహుబలికి దగ్గరలో తమ చిత్రాలను విడుదల చేయడానికి స్టార్ హీరోలు, స్టార్ నిర్మాతలు సాహసం చేయలేదు. దీంతో సమ్మర్ సీజన్ బాహుబలి పరమైంది. ఇక తరువాతి సీజన్ దసరా, దీపావళి. ఆ సీజన్ల కోసం ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రేస్‌లోకి దిగుతున్నారు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి సీజన్‌ను వెటరన్ హీరోలు, రెండో సీజన్‌ను బాహుబలి తన్నుకుపోవడంతో -ఫైనల్ సీజన్‌లో పవర్ చూపించేందుకు స్టార్ హీరోలు వాళ్లవాళ్ల ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. రేస్‌లో ఎవరు ఏస్థానంలో ఉంటారన్నది వెండితెరపైనే చూడాలి.
పవన్- త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్
జల్సా -హిట్టు. అత్తారింటికి దారేది -సెనే్సషన్ హిట్టు. సక్సెస్‌ను మిస్ చేసుకోని కాంబో వీళ్లది. అందుకే మూడో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్టింగ్‌లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల సీజన్‌లో పొలిటికల్ గోదాలోకి దిగాలన్న తలంపుతోవున్న పవన్ -ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడంపైనే దృష్టి పెడుతున్నాడు. ఆ ప్లాన్‌లో భాగంగానే -దర్శకుడు త్రివిక్రమ్ షూటింగ్‌లో స్పీడ్ పెంచాడు. ఒకటిరెండు సినిమాలతోనే భారీ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్లు. ‘దేవుడే దిగివచ్చినా’ హ్యాట్రిక్ హిట్టును ఆపలేడన్నంత కసితో షూటింగ్ సాగుతోంది. భావోద్వేగాల కథతో సెనే్సషన్ హిట్టందుకున్న అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్నీ సెప్టెంబర్ 29నే విడుదల చేయాలన్నది త్రివిక్రమ్ టీం ప్లాన్. ఈ చిత్రంతోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌నే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
స్పైడర్..
స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్న హీరో సూపర్‌స్టార్ మహేష్. కథనంలో వైవిధ్యాన్ని చూపగలిగే గొప్ప కథా దర్శకుడు మురగదాస్. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్నదే -స్పైడర్. టైటిల్, ఫస్ట్‌లుక్‌తో వైవిధ్యాన్ని చూపించిన మురుగదాస్, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాడు. మహేష్ ఇంటిలిజెన్స్ అధికారి పాత్ర పోషించడం ఒకటైతే, బైలింగ్వల్ సినిమా చేయడం మరొకటి. ‘స్పైడర్’ తుపాకీకి సీక్వెల్ అన్న కథనాలూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ ఎలిమెంట్‌ని కమర్షియల్ వేలో చెప్పడంలో మురుగదాస్ స్టైలే వేరు. ఇప్పటికే 80 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రంలో, మహేష్‌తో రకుల్ జోడీ కడుతుంది. దీంతో బిజినెస్‌పరంగా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి, అంచనాలు పెరిగాయి. వీలైతే హిందీలోనూ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రం తెరకెక్కుతోందని, బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్కెట్ క్రాస్ చేయొచ్చని విశే్లషకులు ఇప్పటినుంచే లెక్కలేస్తున్నారు.
జై లవకుశ..
‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో జై, లవకుమార్, కుశాల్ పాత్రల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్‌తో ఉంటుందని టాక్. దీంతో షూటింగ్ టైంలోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నివేదాథామస్ ఎంపికైంది. మరో హీరోయిన్ కోసం అనే్వషణ సాగుతోంది. టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మితమవుతోన్న సినిమా తప్పకుండా సంచలనం రేపుతుందన్న అంచనాలు లేకపోలేదు.
డిజె- దువ్వాడ జగన్నాథం
అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. టైటిల్‌లోనే కొత్తదనాన్ని చూపిస్తున్న సినిమాలో అల్లు అర్జున్ భిన్నమైన గెటప్‌లో ఫస్ట్‌లుక్ ఇచ్చాడు. అండర్ కరెంట్‌గా ఎమోషన్‌ను క్యారీ చేస్తూ పాత్ర సాగొచ్చన్న విషయం ‘లుక్కు’ను చూస్తేనే అర్థమవుతుంది. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సినిమాను జూలైలో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. భారీ అంచనాలు నెలకొల్పిన సినిమాతో బన్నీ మరో కమర్షియల్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఇండస్ట్రీ అంటోంది.
పల్లెటూరి మొనగాడు?
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతుంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా సమంత. అచ్చమైన పల్లెటూరి ప్రేమకథతో చిత్రం ఉంటుందని, చరణ్ గెటప్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. తొలిసారి రామ్‌చరణ్- సమంతల కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాపై భారీ అంచనాలు లేకపోలేదు. ముఖ్యంగా సుకుమార్ మేకింగ్ స్టైల్లో తెరకెక్కే సినిమాలో చరణ్, సమంతల పాత్రలు భిన్నంగా ఉంటాయన్న టాక్ వినిపించింది. చరణ్ చెవిటివాడిగా, సమంత అంధురాలిగా కన్పిస్తుందంటూ ప్రచారం సాగుతోంది. నిజానికి ఇందులో వాస్తవమెంత అనేది పక్కనపెడితే చరణ్ కెరీర్‌లో ఈ సినిమా భిన్నంగా ఉంటుందని సుకుమార్ అంటున్నాడు. ఈ చిత్రానికి ‘పల్లెటూరి మొనగాడు’ టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాలన్న ఆలోచనలో యూనిట్ ఉంది. మొత్తానికి ఐదు భారీ సినిమాలతో స్టార్ హీరోలు పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. మరి రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి!

-శ్రీనివాస్