AADIVAVRAM - Others

వంట చేసే తీరు మారాలి (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: మేము శాకాహారులం. కూరలు బాగానే తింటాం. మేము తీసుకునే ఆహారం ద్వారా మాకు తగిన శక్తి రావట్లేదనిపిస్తోంది. శక్తి వచ్చే పద్ధతిలో ఆహారాన్ని ఎలా తీసుకోవాలో మీ సూచనలు అందించగలరు.
జ: పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ల లాంటి బీన్సు, పప్పు్ధన్యాలు, జీడిపప్పు, వేరుశనగపప్పు, బాదంపప్పు లాంటి గింజధాన్యాలు, గోధుమ, రాగి, జొన్న లాంటి ధాన్యాలు ఎక్కువగా తినాలని అమెరికన్లకు ఆ దేశ ఆహార సంస్థ 2015లో మార్గదర్శక సూత్రాలను అందించింది. తక్కువ కొవ్వు కలిగిన పాలు, పెరుగును కూడా ఈ పట్టికలో చేర్చింది. ఏ దేశీయులకైనా కూర, పప్పు, పచ్చడి, పెరుగు లాంటి ఆహార పదార్థాలే శ్రేష్ఠమైనవని దీని భావం.
నిజానికి తెలుగువాళ్ల ప్రధాన ఆహారం ఇదే. ఆయుర్వేదం సూచించిన మార్గం కూడా ఇదే. కానీ మన అశ్రద్ధ వలన వాటి ప్రయోజనాలు తక్కువగానూ, అపకారాలు ఎక్కువగానూ ఉండేలా మనం వాటిని వండుకుంటున్నాం. అందువలన ఆహార సూత్రాలన్నీ ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.
ఈ రోజు మా ఇంట్లో సొరకాయ వండుకున్నాం అంటారు. కానీ ఈ సొరకాయని చింతపండు పులుసు పోసి వండారనుకోండి, గరిటెడు కూరలో రెండు చిన్న సొరకాయ ముక్కలు, మిగతాదంతా పులుసూ ఉంటుంది. ఆ పులుపుకి తగినంత ఉప్పు కారాలు కూడా అదనంగా చేరి ఉంటాయి. మనం సొరకాయే తిన్నానని చెప్తాం. కానీ అందులో సొరకాయ భాగం చాలా తక్కువ ఉంటుంది. పులుపు, ఉప్పు, కారం ఎక్కువ ఉంటుంది. అదే కేవలం సొరకాయ కూర వండుకున్నామనుకోండి - అందులో అర మిరపకాయ తాలింపు, చిటికెడంత ఉప్పు వేస్తే సరిపోతుంది. ఎక్కువ సొరకాయ తినాలంటే పులుసు లేకుండా వండుకోవాలన్నమాట.
బీర, పొట్ల, సొర, ముల్లంగి లాంటి బాగా ఫైబర్ ఉన్న కూరగాయలంటే పథ్యం కూరలనీ, మంచానపడ్డ వాళ్లు తినేవనే ఒక అపోహ మనలో ఎక్కువమందికి ఉంది. వాటిలోని ఫైబరుని పూర్తిస్థాయిలో మనం తీసుకోగలిగితే పేగులు దృఢంగా ఉంటాయి. అమెరికన్లకు మాంసాహారం మీద, తెలుగువాళ్లకి పులుసులు, మషాలాల మీద వ్యామోహం ఎక్కువ. ఇద్దరూ సమానంగానే ఫైబరుని కోల్పోతున్నారు. ఫలితంగా జీర్ణకోశ వ్యాధులు, మలబద్ధత, కొలెస్ట్రాల్ పెరగటం, షుగరు పెరగటం ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదు, ఆహార సూత్రాల ప్రయోజనం మనం పొందలేనట్లే లెక్క.
ఫైబరున్న కూరగాయలతో వండిన కూరలో సగం మాత్రమే అన్నం కలుపుకుని తినటం వలన కూరగాయల ప్రయోజనం ఒంటికి పడుతుంది. క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, సొర, బూడిదగుమ్మడి, ఉల్లి, టమోటా, కొత్తిమీర వగైరా కూరగాయల్ని ఉడికించకుండా చిన్న ముక్కలుగా తరిగి, పెరుగు కలిపి తాలింపు పెట్టుకుంటే కమ్మని పెరుగుపచ్చడి అవుతుంది. ఇందులో అన్నం లేకుండా విడిగా తినడానికి కూడా అనువుగా ఉంటుంది.
కప్పులో ఉన్న అన్నంతో మిగతా వాటిలో వున్న కూర, పప్పు, పెరుగు తినగలిగితే ఆహార సూత్రాలు పాటించినట్లు అవుతుంది. మొత్తం ఆహారంలో నాలుగో వంతు మాత్రమే అన్నం ఉండాలి. మనం ముప్పాతిక భాగం అన్నాన్ని తింటున్నాం. ఈ పద్ధతి మార్చుకుని, వరికి ప్రాధాన్యత తగ్గించే పద్ధతిలో వంటకాలను తయారుచేసుకోగలగాలి. వండే తీరులో పునర్మూల్యాంకనం అవసరం అని దీని భావం. అలా తినగలగాలంటే ఆ కూర లేదా పప్పులో అతి పులుపు, అతి కారం లేకుండా వండుకోవాల్సి వుంటుంది.
నలుగురున్న ఒక కుటుంబంలో మూడు లేక నాలుగు కట్టల తోటకూరతో పప్పు వండారనుకుందాం. దాన్ని ఆ నలుగురికీ, ఇంటికొచ్చిన చుట్టానికీ, పనమ్మాయికీ, అడుక్కునే ఆంటీకి... అందరికీ పంచగా ఒక్కొక్కరికి రెండు లేక మూడు ఆకుల చొప్పున దక్కుతాయి. రోజుకు రెండు ఆకుల కూర తింటే కావలసినన్ని పోషకాలు అందుతాయా? ఒక మనిషి రోజుకు మూడు లేక నాలుగు కట్టల ఆకుకూర తినేలా వండుకోగలిగితేనే ఆకుకూరలు తిన్న ఫలితం దక్కుతుంది. తక్కువ కూరిన ఎక్కువమందికి వండిపెట్టాలంటే ఆ కూరలో చింతపండు లేదా శనగపిండి, లేదా అతిగా అల్లం వెల్లుల్లి మషాలాలు కలపడం తప్పనిసరి అవుతుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోంచి అత్యంత పరిమిత కుటుంబ వ్యవస్థలోకి మనం మారిపోయాం. తక్కువమందికి ఎక్కువ కూర వండిపెట్టేందుకు అవకాశం ఉన్న రోజులివి. వంట చేసే విధానంలోనే మనం కొంత సంస్కరణ తేవలసి ఉంటుంది. మషాలాల మీద, పులుపుమీద వ్యామోహాన్ని తగ్గించుకోగలిగితేనే ఇలా తినగలుగుతాం.
కోడిగుడ్డులో 175-185 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుందని అంచనా. ఒక మనిషికి ఆహారం ద్వారా రోజుకు 300 మి.గ్రా. కొలెస్ట్రాల్ శరీరానికి అందాలి. రోజు మొత్తం మీద మనకు కావాల్సిన కొలెస్ట్రాల్‌లో సగానికి పైబడిన భాగాన్ని ఒక్క కోడిగుడ్డే ఇచ్చేస్తోంది. మిగిలిన ఆహారంలో నూనెలు వగైరా తక్కువగా ఉండేలా చూసుకోకపోతే కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
మన శరీరం మనుగడకు రోజూ రెండువేల కేలరీలు అవసరం అనుకుంటే రోజూ ఐదారుసార్లు తాగే కాఫీ, టీలలో కలిపి పంచదార ద్వారానే అవి వచ్చేస్తున్నాయి. ఇక తక్కిన ఆహార ద్రవ్యాలద్వారా శరీరంలోకి వెళ్లే కేలరీలన్నీ అదనమే అవుతాయి. అదనపు కేలరీలన్నీ అపకారం చేసేవే! తీపి తినాల్సిందే. తీపి ఒక్కటే కాదు, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అన్ని రుచులూ తినాల్సినవే. కానీ ఏదీ పరిమితి దాటకూడదు. కారం, మషాలాలు, చింతపండు వాడకాలకు పరిమితుల్ని మించిపోతున్నాం.
‘రెడీ టు ఈట్’ ఉత్పత్తుల వాడకాన్ని ఒక గొప్పగా భావించుకోవటం మనలో ప్రధానమైన లోపం. అంతా అరచేతిలో వైకుంఠంలాగా అమరి ఉండాలనే ఆలోచన ఆహారం విషయంలో మంచిది కానే కాదు. ‘తొక్క ఒలిచిన అరటిపండుని ఓ ప్లాస్టిక్ సంచీలో పెట్టి ఫారిన్ ముద్ర వేసి అమ్ముతుంటే, తొక్క ఒలిచే శ్రమ తప్పుతుందని ఎగబడి కొనే పరిస్థితి ఈ దేశంలో రాకూడదని కోరుకుంటున్నాను.
రోట్లో వేసి రుబ్బాల్సిన పని లేకుండా మిక్సీలు, గ్రైండర్లూ వచ్చాయి. కానీ, బజార్లో రెడీమేడ్ అట్లపిండి, గారెలపిండి, దోసెలపిండి కొంటున్నాం. ఆలూ దుంపల్ని సన్నగా చాపర్ మీద తిరిగి నూనెలో వేసి వేపుకోవడానికి బద్ధకించి బజార్లో అమ్మే చిప్స్ మీదకు ఎగబడుతున్నాం. పసుపుకొమ్ములు పిండి పట్టడానికే మిక్సీని తయారుచేశారు. కానీ మనం బజార్లో సీసం ఉన్న పసుపురంగుతో కల్తీ చేసిన పసుపును మాత్రమే కొంటున్నాం. కారం సంగతి చెప్పనే అక్కరలేదు. కల్తీ కారం అమ్మేవాళ్లని రోజుకొక్కరిని పట్టుకుంటున్నా మనం నిర్భయంగా కల్తీ సరుకుల్ని కొనేస్తున్నాం.
రంగులేసిన ఆహార పదార్థాలకు పిల్లలు ఆకర్షితులయ్యారంటే అర్థం చేసుకోగలం. పెద్దలు కూడా ఆకుపచ్చ రంగు వడియాలు, నీలంరంగు బూంది, ఆకుపచ్చరంగు కారప్పూస లాంటివి కోరుతున్నారంటే ఆశ్చర్యంగా వుంది.
ఆరోగ్యం మనకు వంటింట్లో దొరుకుతుంది. డబ్బులు పారేసి బజార్లో కొందాం అనే ఆలోచన మంచిది కాదు. ఏది కావాలన్నా ఇంట్లో చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. రెడీమేడ్ ఇన్‌స్టంట్ వంటకాలను కొనుక్కొని తినటానికి అలవాటు పడకండి. నకిలీలు, కల్తీలు ఉండే అవకాశం ఉన్న పదార్థాలను కొనటానికి తొందరపడకండి. ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వండటం, వేయించడం వలన చెడు జరుగుతుంది. ఆహార ద్రవ్యాల్లో కలిపే రంగులన్నీ విష పదార్థాలేనని గుర్తించండి. రంగు రంగుల కేకులు, బిస్కట్లు, డ్రింకులు ఇవన్నీ రంగు విషాలు కలిగినవే. మన చిన్నారులకు వాటిని మన వ్యామోహం కొద్దీ తినిపించడం అన్యాయమే. తెల్ల కేకులమీద ఉండే తెలుపు కూడా ఒక రంగేనని గమనించాలి.
మన ఆహారంలో మాంసం కన్నా కూరగాయలే ఎక్కువ పోషకాలను అందిస్తాయి. అపోహల్ని, వ్యామోహాల్ని, పట్టనితనాన్నీ వదిలేసి, కూర ఎక్కువ, అన్నం తక్కువగా తినగలిగేలా వండే తీరులో మార్పులు తెచ్చుకోవటం అవసరం.
*

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు