AADIVAVRAM - Others

చదువుకుంటే... ( సిసింద్రీ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండల మధ్య ఉన్న కుగ్రామం -రామతీర్థం. అక్కడ పాఠశాల లేదు. ఊళ్లో అక్షరాస్యత లేదు. ఉన్న రామాలయం పూజారి రామాచారికి మటుకు తెలుగు భాష రాయటం చదవటం వచ్చు. ఊళ్లో ఎవరికి ఏ అనుమానం వచ్చినా రామాలయం పూజారిని అడిగి తెలుసుకొనేవారు. ఆ ఊళ్లో అల్లరిచిల్లరిగా తిరుగుతున్న ఎనిమిదేళ్ల హరికి ఒకరోజు ఓ మర్రిచెట్టు కింద ఒక ఇత్తడి చెంబు దొరికింది. ఎవరిని అడిగినా మాది కాదంటే మాది కాదని చెప్పారు. ఆ చెంబు మీద ఏదో రాసి ఉంది. దొరికిన చెంబు కాబట్టి, అదీగాక ఇత్తడి చెంబు కాబట్టి హరి దానిని పూజారికి చూపించి దేవాలయానికి ఇచ్చి వేయాలని అనుకొన్నాడు.
వెంటనే రామాలయానికి వెళ్లి పూజారి రామాచారికి ఇత్తడి చెంబు చూపించి ‘స్వామీ! ఈ చెంబు నాకు దొరికింది. దీని మీద ఏదో రాసి ఉంది. ఊరిలో ఎవరిని అడిగినా ఎవరిదీ కాదన్నారు. అందుకే దేవుడికి ఇచ్చేస్తాను’ అని చెప్పాడు.
హరి మంచి మనసుకి పూజారి సంతోషించి, ఎలాగైనా వాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకొన్నాడు. వాడికి చదువు మీద ఆసక్తి కలిగించాలని ఈ విధంగా చెప్పాడు.
‘హరీ! ఈ చెంబు తెచ్చి మంచి పని చేసావు. దీని మీద ఏం రాసుందో తెలుసా? ఈ చెంబు దొరికిన వారికి బాగా చదువు వస్తుంది. అదీగాక భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుంది. అందుకే నీకు చదువు నేర్పిస్తాను. చక్కగా చదువుకో. నువ్వు పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుంది’ అని చెప్పాడు. హరి మనసు మీద ఆ మాటలు బాగా పని చేశాయి.
‘తప్పకుండా స్వామీ! మీరు చెప్పినట్లు చేస్తాను’ అని హరి చెప్పాడు.
ఆ రోజే పూజారి రామాచారి పక్క ఊరికి వెళ్లి పలక, బలపం, పెద్దబాలశిక్ష తెచ్చారు. హరికి కబురు పెట్టి, రోజూ దేవాలయంలో పూజలు అయ్యాక దేవాలయం మంటపంలోనే హరికి చదువు చెప్పసాగాడు. పెద్దబాలశిక్షలోని కథలు కూడా చెప్పసాగాడు. హరిలో చదువు మీద శ్రద్ధ ఏర్పడింది. చెప్పింది చెప్పినట్టు అక్షరాలు, పదాలు, గుణింతాలు, గణితం నేర్చుకోసాగాడు. హరికి చదువు మీద ఉన్న ఆసక్తిని చూచి రామాచారి ఎంతో సంతోషించాడు.
త్వరలోనే హరి పెద్దబాలశిక్షలోని కథలు చదివే స్థాయికి ఎదిగాడు. ఊళ్లోని తోటి పిల్లలకు ఆసక్తికరంగా కథలు చెప్పడమే కాకుండా వారిని కూడా చదువుకోమని ప్రోత్సహించాడు. హరి తెలివికి, అభివృద్ధికి తోటివారిని ప్రోత్సహించే విధానం చూసి ఊళ్లోని పెద్దలు సంతోషించారు.
అలా హరి యుక్తవయస్కుడైన తరువాత పక్క ఊరి గ్రామ కచేరీలో ఉద్యోగం సంపాదించాడు. గ్రామాధికారిని ఒప్పించి రామతీర్థంలో చిన్న పాఠశాలను కూడా మంజూరు చేయించాడు. హరి తను చదువుకోవడం వలన రామతీర్థం గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. పాఠశాల ప్రారంభోత్సవానికి పూజారి రామాచారిని ఆహ్వానించారు.
అప్పడు పూజారి ఈ విధంగా చెప్పారు. ‘ఈ ఊరికి హరి చేసిన మేలు మనం మరిచిపోకూడదు. తను బాగా చదువుకోవడమే కాకుండా ఊరికి పాఠశాలను తెచ్చి ఎందరో చదువుకొనేట్లు చేశాడు’ అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.
‘అసలు విషయం ఏమిటంటే - హరి చిన్నప్పుడు ఒక ఇత్తడి చెంబు తెచ్చి దేవాలయానికి ఇవ్వమని చెప్పాడు. దాని మీద ఏం రాసి ఉందని అడిగితే.. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాను. కానీ, దాని మీద అలా రాసి లేదు. నాకు కూడా తెలీని సంస్కృతం రాసి ఉంది. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని హరికి చదువు మీద ఆసక్తి కలిగించడానికి ఆ విధంగా చెప్పాను. హరి తన కృషితో పైకి వచ్చి, తన జీవితాన్ని బాగు చేసుకోవడమే కాక, మరి కొందరు బతుకుల్లో వెలుగులు నింపుతున్నాడు’ అని చెప్పాడు.
రామతీర్థం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని హరి నిశ్చయించుకొన్నాడు.
దేవాలయంలో సరస్వతీ దేవి విగ్రహం మరింత కళగా కనపడసాగింది.

- కంచనపల్లి వేంకట కృష్ణారావు