Others

ఆయనో.. ‘పెద్ద’బాలశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడెప్పుడు క్రాంతదర్శకుడై ఉండాలని సినీ పెద్దలు చెబుతారు. భవిష్యత్ తరాలకు అందించే సినిమాలలో వారికి అన్వయించే కథ, కథనాలు కూడా ఉండాలి. అలాగని ఇప్పుడు జరుగుతున్న విషయాలను పట్టించుకోకుండా ఉండరాదు. ప్రస్తుతం జరుగుతున్న కథ, కథనాలను తీసుకొని భవిష్యత్తులో జరగబోయేవాటిని అంచనా వేసుకుంటూ వైవిధ్యంగా తీర్చిదిద్దితేనే ఆ చిత్రానికి విజయమే కాదు పరమార్థమూ దక్కుతుంది. అటువంటి సర్కస్ ఫీట్ చేయడంలో దర్శకుడు దాసరి నారాయణరావుది అందెవేసిన చేయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ తన కథ, కథనాలలో ఆయా సమస్యలను ఎత్తిచూపుతూ వాటికి పరిష్కారాలను కూడా ఆయన తన సినిమాలలో చిత్రీకరించేవారు. అందుకే దాసరి మార్క్ సినిమా అన్న పేరు వచ్చింది. తొలి సినిమా ‘తాతా- మనవడు’ నుండి ఈ ప్రస్థానం అజేయంగా సాగింది. కష్టపడి సంపాదించి పిల్లలను ప్రయోజకులను చేస్తే, తమ తల్లిదండ్రులు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడే పుత్రరత్నాల గురించి ఆ కాలంలోనే కథలు వార్తాపత్రికలు ప్రచురించాయి. ఇదేం విడ్డూరం అని చదివిన పాఠకులు బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తరువాతే తాతా- మనవడు సినిమాలో చూసి బాధపడ్డారు, ఆనందించారు. ఒకవైపు ఎన్టీఆర్ రంగుల చిత్రం, మరోవైపు ఏఎన్నార్ భారీ సినిమా విడుదలైనా తాతా- మనవడులో చర్చించిన సామాజిక అంశమే హైలెట్ అయింది. అగ్ర హీరోల చిత్రాలను త్రోసిరాజని ఓ కమెడియన్ హీరోగా తీసిన సినిమా ఇంత విజయవంతం అయిందీ అంటే అదే కారణం.
సామాజిక నేపథ్యంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకునేవారు దాసరి. అది వార్తాపత్రికలనుంచైనా సరే తనకు తెలిసినవారు చెప్పిన సమాచారమైనా సరే దాన్ని ఒడిసిపట్టి అద్భుతమైన కథలను అల్లడంలో ఆయనకు ఆయనే సాటి. సంసారం-సాగరం చిత్రంలో భార్యాభర్తల మధ్య వచ్చే ఒడిదుడుకులు, సంసారం అనే నావ సాగరంలో పడిలేచే కెరటంలా సాగడాలు లాంటి విషయాలన్నీ బలమైన సన్నివేశాలతో చిత్రీకరించారు. సామాజిక సమస్యలలో ప్రధానమైనది డబ్బు. అదే లేకపోతే ఏ సంసారమైనా ఒడిదుడుకులపాలు కావాల్సిందే. ఆ విషయానే్న వైవిధ్యమైన పలు సందర్భాలను ఎంచుకుని ప్రేక్షకుడి మనసులో నాటుకుపోయే విధంగా చిత్రీకరణ ఉండేది. బంట్రోతు భార్య సినిమాలో ఇద్దరు స్ర్తిలమధ్య ఈగో సమస్య ఏ స్థాయికి వెళ్లింది అనే కథనం అద్భుతంగా సాగుతుంది. ఇక రాధమ్మ పెళ్లి జరగడానికి ఎన్ని అగచాట్లు ఉంటాయో చూపిస్తూ, ఓ నిరుపేద అమ్మాయి పెళ్లిచేయాలంటే ఎన్ని బాధలు ఎదుర్కోవాలో ఆయన తన చిత్రం ద్వారా చూపారు. ఎవరికివారే యమునా తీరే సినిమా కూడా అదే స్థాయిలో సాగుతుంది. ఓ అంధురాలైన హీరోయిన్, ఓ అర్భకుడైన కథానాయకుడు మధ్య ప్రేమను వైవిధ్యంగా చిగురింపజేశారు. బలిపీఠం చిత్రంలో కులాలమధ్య వున్న కురుక్షేత్రాలను మహిళా ప్రేక్షకులకు హత్తుకునేలా రూపొందించారు. అందులో శోభన్‌బాబు, శారద జంటగా ఉండడంతో ఆ చిత్రాన్ని మరింత వనె్న వచ్చింది. దేవుడే దిగివస్తే చిత్రం ఓ సామాజిక అంశాన్ని ముడిపెడుతూ సోషియో ఫాంటసీ తరహాలో రూపొందించారు. పాపం చేసేవాడు ఎప్పటికైనా ఆ పాపానికి పరిహారం పొందాలనే పాయింట్ ఈ చిత్రంలో చర్చించారు. స్వర్గం-నరకం చిత్రం ఇప్పటికీ కూడా కొత్తగా పెళ్లైన దంపతులకు సరిపోతుంది. ఆ చిత్రంలో కాపురం ఆనందంగా సాగితే అది స్వర్గమని, అనవసరమైన ఆశలకుపోయి అందుకోలేని ఆకాశాలకోసం వెంపర్లాడితే అదే నరకమని చెప్పే ప్రయత్నం జరిగింది. ఈ సినిమాలో ఆచారిగా దాసరి నారాయణరావు నటన ‘్ఫనిష్’ అనే ఊతపదంతో సాగింది. ‘యవ్వనం కాటేసింది’ సినిమాలో పరువంలోకి వచ్చిన యువతీ యువకులు ఒక్కసారి తమ జీవితంలో తప్పటడుగు వేసారా అది జీవితమంతా వెంటాడుతూనే వుంటుంది అన్న అంశంతో ముడిపడి వుంటుంది. మనుషులంతా ఒక్కటే చిత్రంలో పేద-్ధనికస్వామ్యం ఎన్ని కథలకు ఆలవాలం అవుతుందో చెబుతూ చిత్రీకరించారు. ఇందులో చర్చించిన అంశం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటుంది. పాడవోయి భారతీయుడా చిత్రంలో కుల మతాలకతీతంగా పెరిగిన మనసుల సంగమం ఎలా వుంటుందో చర్చించారు. కన్య కుమారిలో అమ్మాయిలు తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో వేస్తున్న తప్పటడుగులు వారి ఆలోచనా విధానాలను దాసరి చిత్రీకరించిన తీరు ఇప్పటికీ కూడా సాగుతుంది అనిపిస్తుంది. ఇదెక్కడి న్యాయంలో జరిగే కథనం నేటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటుంది. కాపురంలో మగాడికి ఓ న్యాయం, ఆడదానికి ఓ న్యాయమా అంటూ నాయిక ప్రశ్నిస్తుంది. స్ర్తికి సహజంగా మాతృత్వం అంటే ఎనలేని గౌరవం. ఆ మాతృత్వానికే దూరంగా ఉండమనే భర్త ఆజ్ఞను భార్య ఏ విధంగా ఆమోదించాలి? ఇది న్యాయమా అని ప్రశ్నించే ధీరనాయిక కనిపిస్తుంది. చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, కళ్యాణి, ఏడంతస్థులమేడ, సీతారాములు, బండోడు-గుండమ్మ, శ్రీవారిముచ్చట్లు, దీపారాధన, రాగదీపం, స్వయంవరం, మేఘసందేశం, ఓ ఆడది ఓ మగాడు, బ్రహ్మముడి, ఆదిదంపతులు, పెళ్లి మీకు అక్షింతలు నాకు, ఏడడుగుల బంధం, కాంచనసీత, ఆత్మబంధువులు, ఒసే రాములమ్మా తదితర చిత్రాలన్నీ స్ర్తి మూర్తుల గొప్పదనాన్ని చాటే విధంగా ఆయన పాత్రలు సాగుతాయి.
కోరికలే గుర్రాలైతే? రావణుడే రాముడైతే? ఓ మనిషీ తిరిగిచూడు, పాలునీళ్లు, ప్రేమమందిరం, అద్దాలమేడ, బొబ్బిలిపులి, గోల్కొండ డబ్బులు, ఎమ్మెల్యే ఏడుకొండలు, పోలీసు వెంకటస్వామి, బోళాశంకరుడు, తిరుగుబాటు, నేనే రాజు నేనే మంత్రి, ఒరేయ్ రిక్షా లాంటి చిత్రాలలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, వాటికి సరైన ముగింపులను కూడా తన కలం ద్వారా అందించారు.
రాజకీయంగా ఎమ్మెల్యేలు ప్రజలకు సేవకులా? లేక వారి కుటుంబాలకు, మిత్రులకు, అనుయాయులకు అనుంగు సేవకులా అని ప్రశ్నిస్తూ నేటి కుళ్లిన రాజకీయ వ్యవస్థకు అద్దంపట్టారు. ఆయా చిత్రాల్లో ఆయన చెప్పిన ప్రతి విషయమూ ఇప్పటికీ రాజకీయ రంగంలో కనిపిస్తూనే ఉంటుంది. ధర్మపీఠం దద్దరిల్లింది చిత్రంలో తల్లిదండ్రులను పట్టించుకోని కుమారరత్నాల గొప్పతనాలను తూర్పారపట్టారు. అలాంటి కొడుకులను చంపినా తప్పులేదని ముగింపులో చూపించారు. ఇప్పటికీ కూడా పలు వార్తాపత్రికలలో తల్లిదండ్రులను స్మశానంలో వదిలేసిన కుమారుల కథనాలను చదువుతూనే ఉన్నాం. అమ్మ రాజీనామా చిత్రం మహిళా ప్రేక్షకుల ఆదరణతో అద్భుతమైన విజయం సాధించింది. అమ్మకు నిరంతరం ఇంట్లో పనే. ఒక్క రోజు కూడా ఆమెకు సెలవు లేదు. అలాంటి అమ్మ తానే పని చేయనంటూ అమ్మ అనే ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఆ ఇంట్లో వుండే భర్త, పిల్లల పరిస్థితి ఎలా వుంటుంది? అన్న కథనంతో దాసరి రూపొందించిన చిత్రానికి అద్భుతమైన ప్రజాదరణ లభించింది. ఇప్పటికి కూడా ఈ చిత్రాన్ని అభిమానించేవారికి ఆనందాన్నిస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఇందులో చూపిన కథనం ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటుంది కనుక! కంటే కూతుర్నే కను చిత్రానికి జాతీయ బహుమతి లభించిందంటే, అందులో వున్న కంటెంటే ప్రధానమైనది. ఆడపిల్లను ఉదాసీనంగా చూడవలసిన అవసరం లేదని, ఆమెకు కూడా సరైన ప్రోత్సాహమిస్తే ఎలాంటి విజయాలైనా అందుకుంటూ తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తుందని చెప్పిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా ‘సన్నివేశ సత్యం’గా నిలుస్తుంది. యంగ్ ఇండియాలో నేటి యువత మనోభావాలను ఆవిష్కరించారు.
ఇలా ఓ వైపు కమర్షియల్ చిత్రాల జోరులో కొట్టుకుపోతూ, మరోవైపు సంఘంలో జరుగుతున్న అన్యాయాలకు చెంపపెట్టుగా ఆయన అందించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. కమర్షియల్ చిత్రాలు ఎంత విజయాన్ని సాధించాయో, సమాజంలో ఉన్న పలు సమస్యలపై చిత్రీకరించిన సమాంతర చిత్రాలను కూడా ప్రేక్షకులు అంతే గొప్పగా ఆదరించడంలోనే అర్థమవుతోంది దర్శకుడు దాసరి దర్శకత్వ ప్రతిభ.

చిత్రాలు.. బలిపీఠం చిత్రంలో శోభన్‌బాబు, శారద
*సర్దార్ పాపారాయుడు చిత్రం షూటింగ్ సమయంలో దర్శకుడు దాసరి

-సరయు శేఖర్