Others

శాపమిచ్చినా బంధమోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సనాతన వాఙ్మయం అద్భుతమైన ఉదంతాల సమాహారం. మానవుడు ఆచరించవలసిన ధర్మాన్ని, సమాజానికి చేయవలసిన సేవను, జ్ఞానానికి ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పింది. కాని నేడు జ్ఞానం, మేధస్సు అనే వాటికి నిర్వచనాలే మారిపోయాయి. కపటం, మోసం, అనైతికత అనేవి రాజ్యమేలుతున్నాయి. ఫలితం అశాంతి. మానవ మేధస్సుకు విలువనిచ్చి సమాజానికి వినియోగించే క్రమంలో ఎన్నో కఠిన నిబంధనలను ఎదుర్కొన్న మేధావుల ఉదంతాలను మనం పరిశీలించవచ్చు. అటువంటి వాటిలో అష్టావక్రుని చరిత్ర ఒకటి.
రామాయణ కాలానికి ముందు ఉద్దాలకుడనే గొప్ప ఋషి నిత్యాగ్నిహోత్రుడై వేదవేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు. నిత్యం వేదఘోషతో ఆ అరణ్యమంతా పులకించిపోయేది. సమస్త జీవజాలము సాధు ప్రవృత్తితో నియమిత మార్గంలో జీవనం కొనసాగించేవి. అతనికి కహోదుడనే ఒక ఏకసంతాగ్రాహియైన శిష్యుడు ఉండేవాడు. అతనిపట్ల ఉద్దాలకునికి ప్రత్యేకమన అభిమానం ఉండేది. కాలక్రమంలో యుక్తవయస్కురాలైన తన కుమార్తె సుజాతను కహోదునకు ఇచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు. వారి దాంపత్యం శీఘ్రమే పండగా సుజాత గర్భవతయినది. ఇంచుమించు అదే సమయంలో ఉద్దాలకునికి శే్వతకేతు అనే కుమారుడు జన్మించాడు.
ఉద్దాలకుడు హోమం చేసే సమయంలో కహోదుడు ఆశ్రమ విద్యార్థులచే వేదాలను వల్లె వేయించేవాడు. ఆ సమయంలో సుజాత గర్భంలోని శిశువు కహోదుడు పలికే అపస్వరాలను సవరించేది. స్వతహాగా ఓర్పు, సహనం తక్కువైన కహోదుడు తన సంతానమని కూడా చూడకుండా అష్టవంకరలతో జన్మించమని తన తప్పులను సవరించిన గర్భస్థ శిశువును శపిస్తాడు. తెలివైన వాడైనా సాత్విక గుణం లోపించిన కహోదుడు క్రోధాన్ని జయించలేకపోయాడు. కాలాంతరంలో ప్రసవ సమయం దగ్గరపడుతున్న సుజాతను చూసి తగిన సంబారాల కోసం జనకుని రాజ్యమైన విదేహకు బయలుదేరాడు కహోదుడు. జనకుని ఆస్థానంలో వంది అనే ప్రధాన పండితుడు ఉండేవాడు. అతను మహాగర్విష్ఠి. అతనిని ఓడించినవారికి అపారమైన బహుమతులను ప్రకటించాడు జనకుడు. అలాగే అతని చేతిలో అనగా, శాస్తవ్రాదంలో ఓడినవారికి జలదిగ్బంధనమనే శిక్ష వేసి బంధించేవారు.
కహోదుడు అతి నమ్మకంతో వందితో శాస్తవ్రాదనకు దిగి ఓడిపోయి శాశ్వత జలదిగ్బంధన శిక్షకు గురయ్యాడు. ఇక్కడ ఉద్దాలకుని ఆశ్రమంలో ఎనిమిది వంకరలతో అష్టావక్రునికి జన్మనిచ్చింది సుజాత. స్వతహాగా జ్ఞానియైన కహోదుడు అతి విశ్వాసం, క్రోధంతో వంది చేతిలో ఓడి బందీ అయినాడు. శాస్త్ర పాండిత్యము, వాదనా పటిమ, అపజయానికి కఠినమైన శిక్షలు, ఓటమినంగీకరించి శిక్షలను స్వీకరించే సత్యజ్ఞానులు మొదలైన వాటిని పరిశీలిస్తే మేధస్సుకు, మేధావులకు చక్రవర్తులు ఇచ్చే విలువ, ప్రాధాన్యత ఎంత ఉన్నతంగా ఉండేదో అర్థమవుతుంది.
కాని నేడు మేధకు విలువలేదు. గుర్తింపు లేక అనేకమంది సమాజానికి ఉపయోగపడకుండా అనామకులుగా మిగిలిపోవడం అత్యంత దురదృష్టకరం. అనేక అసంబద్ధ విధానాలు, అనైతిక పోకడలు, మోసపూరిత వైఖరులవల్ల అనేకమంది మేధావులు కుమిలి కుమిలి చీకటిలోనే బలైపోవడం సమాజానికి శ్రేయస్కరం కాదు అని గ్రహించాలి.
గర్భంలోనే వేదాలను విశే్లషించిన అష్టావక్రుడు తన తాతగారైన ఉద్దాలకుని వద్ద శే్వతకేతుతో కలిసి బాల్యాన్ని కొనసాగిస్తున్నాడు. తన తండ్రి కహోదుని వృత్తాంతం శే్వతకేతు ద్వారా తెలుసుకున్న అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి ఉద్దాలకుని ఆశీస్సులు అందుకొని శే్వతకేతుతో కలిసి జనకుని కొలువుకు బయలుదేరతాడు. జనకుని అనుమతితో తన అపారమైన శాస్త్ర పాండిత్యముతో శాస్తవ్రాదమున వందిని ఓడించి తన తండ్రితో సహా ఎంతోమందిని బంధ విముక్తులను చేస్తాడు అష్టావక్రుడు. శరీరం వక్రమైనా తన మేధస్సును ఋజుమార్గంలో పయనింపజేసి శాపమిచ్చిన తండ్రిని విడిపించిన అష్టావక్రుడు ధన్యుడు. జనకుని కొలువులోని జ్ఞానుల సూచన మేరకు హిమనీనదములలో స్నానమాచరించి తిరిగి క్రమమైన సుందర దేహాన్ని పొంది తండ్రితో సహా తల్లి సుజాతను చేరాడు అష్టావక్రుడు. ఈ మహాప్రస్థానంలో జనకునితో సనాతన దర్మాలపై చర్చించి మనకందించిన మహాగ్రంథ రాజమే శ్రీ అష్టావక్ర గీత.

- వారణాశి వెంకటసూర్య కామేశ్వరరావు