AADIVAVRAM - Others

విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డాడీ!.. నాకు ఇవాళే క్రికెట్ కిట్ కావాలి’ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్‌కి కూడా వెళ్లి వచ్చాక అడిగాడు ఏడవ తరగతి చదివే బన్నీ.
‘పోయిన వారమే కదరా ఆన్‌లైన్ షాపింగ్‌లో నువ్వు సెలెక్ట్ చేసుకుని మరీ స్మార్ట్ వాచ్ కొనుక్కున్నావ్? దానికో అయిదు వేలయ్యింది తెలుసా?’ అప్పటికి సాయంత్రం ఆరవుతుండటంతో ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయి తనకు భర్తకు కాఫీ, బన్నీకి పాలు వున్న ట్రేతో హాల్లోకి వచ్చిన బన్నీ తల్లి సుప్రజ.

బుక్స్ బ్యాక్ తన గదిలో పెట్టి ముఖం కడుక్కొచ్చి పాలగ్లాస్ అందుకుంటూ ‘అది బర్త్‌డే గిఫ్ట్ కదా మమీ’ అన్నాడు.
‘ఏదైతే ఏముంది. నెలకో అయిదు వేల చొప్పున మేమెలా కొనివ్వగలం నాన్నా. కాస్త చదువు మీద మనసు పెట్టు. మంచి జాబ్, మనీ, హోదా అన్నీ అవే వస్తాయ్’ అంది.
‘అది కాదు సుప్రజా. వాడికి క్రికెట్ అంటే ఇష్టం కదా పైగా మనం ఇద్దరం ఉద్యోగస్తులం. వాడి హాలిడేస్‌లో ఆడుకుంటాడ్లే’ అన్నాడు తండ్రి సురేష్.
‘డాడీ మంచివాడు. నువ్వు పీనాసి మమీవి. మా క్లాస్‌లో స్వరూప్ కయితే అప్పుడే టెన్ థౌసండ్ పెట్టి వాళ్ల డాడీ ఫోన్ కూడా కొనిపెట్టాడు. రేవంత్ కయితే వాళ్ల మామయ్య అమెరికా నించీ ఐ పాడ్ పంపాడు’ అన్నాడు బన్నీ వాళ్లకున్న వాటి ముందు మీరు కొనిచ్చేవి ఏ పాటి అన్నట్టు.
‘బన్నీ.. ఏమిటా మాటలు? మమీని పట్టుకుని పీనాసి అంటూ ఎంత పడితే అంత మాటంటావా?’ కోప్పడ్డాడు తండ్రి సురేష్.
దాంతో అలిగి వెళ్లిపోయాడు బన్నీ తన గదిలోకి.
* * *
‘బన్నీ... మీ పేరెంట్స్‌కి చెప్పు. రేపటితో ఫైన్‌తో కూడా ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ అని’ చెప్పింది క్లాస్ టీచర్.
క్లాస్‌లో పిల్లలంతా బన్నీ వైపు జాలిగా చూశారు. బన్నీకి తలకొట్టేసినట్లయింది.
సాయంత్రం ఇంటికి వెళ్లాడు స్కూల్ ఆటోలో. అప్పటికి ఇంకా ఆఫీస్ నుంచి సుప్రజ, సురేష్‌లు రాలేదు కనుక తనే ఫ్రెష్ అయి స్నాక్స్ తిని మళ్లీ తాళం పెట్టుకుని తమ వీధిలోనే వున్న ట్యూషన్‌కి వెళ్లిపోయాడు.
ట్యూషన్ అయిపోయాక మాస్టర్ కూడా ఫీజు తీసుకుని రేపు రమ్మని గట్టిగా చెప్పాడు.
ఇంట్లోకి అడుగు పెట్టగానే పేరెంట్స్ మీద ఎగిరాడు బన్నీ ‘ఇంకా ఎందుకు ఫీజ్ కట్టలేదనీ, తనకు ఇన్సల్ట్‌గా ఉందని’
‘సారీ నాన్నా... కానీ, ఏం చేస్తాం. మమీ వాళ్ల ఆఫీస్‌లో లాస్ వచ్చిందని అమ్మని జాబ్‌లోంచి తీసేశారు. ఇపుడు నా ఒక్కడి జీతంతోనే ఇల్లు గడవాలి. అందుకే కట్టలేక పోయాం’ విచారంగా చెప్పాడు బన్నీ తండ్రి సురేష్.
అప్పటికే బన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసిన క్రికెట్ కిట్, షూస్, హెడ్‌ఫోన్స్, డ్రెస్ లాంటి వస్తువులన్నీ ఓ పదిహేను వేల వరకు ఉన్నాయి.
ఒక్కో దాని ధర, షిప్పింగ్ ఛార్జ్‌లు కలిపి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి సురేష్ సెల్‌ఫోన్‌కి రెండు మూడు రోజుల్లో వస్తాయని.
కానీ అప్పటికే వారం రోజులు స్కూల్లో, ట్యూషన్‌లో బన్నీ రేపు కడతారు మా పేరెంట్స్ ఫీజు కట్టేస్తారని రోజూ చెప్పుకొస్తున్నాడు. ఆ రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ప్రిన్సిపాల్. క్లాస్‌లోకే రానీకుండా రేపు బయట నిలబెడతామంది. అప్పటికీ కట్టకుంటే టీసీ ఇచ్చేస్తామంది. వాలిపోయిన ముఖంతో ఇల్లు చేరాడు బన్నీ.
‘సుప్రజా.. మీరు షాపింగ్ చేసిన వస్తువులన్నీ వచ్చేశాయిట. ఇంటికి ఎప్పుడు రావాలని అడుగుతున్నారు కొరియర్ వాళ్లు’ అన్నాడు సురేష్.
‘సరే ఏం చేస్తాం.. మీరెళ్లి బన్నీ చదువు కోసం బ్యాంక్‌లో వేసిన మనీ తెచ్చేయండి’ అంది సుప్రజ.
ఇది విన్న బన్నీ వెంటనే ‘నాకవేం వద్దు డాడీ. ఆర్డర్ కేన్సిల్ చేసేద్దాం. దానికంటే ముందు నా స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు కట్టండి ప్లీజ్’ అన్నాడు.
‘కానీ నీ ఫ్రెండ్స్ అవన్నీ పెట్టుకొస్తే, నీకు లేకుంటే ఇన్సల్ట్ కాదా?’ అంది తల్లి.
‘ఏం కాదు. దానికంటే క్లాస్‌లో ఫీజు అడుగుతుంటే తోటిపిల్లలు చూసే జాలి చూపులే పెద్ద ఇన్సల్ట్. బాగా చదువుకుంటే ఫస్ట్‌క్లాస్ వస్తే అంతకంటే ఎక్కువ గొప్పగా వాళ్లే చూస్తారు. అప్పుడు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్న వాళ్లనయినా పట్టించుకోరు’ చెప్పాడు బన్నీ.
* * *
మర్నాడు లంచ్ అవర్‌లో బన్నీ క్లాస్ టీచర్‌కి, ట్యూషన్ టీచర్‌కి ఫోన్ చేసి తమకు సహకరించి బన్నీకి డబ్బు విలువ, చదువు విలువ తెలిసేలా చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది సుప్రజ.

-డేగల అనితాసూరి