AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి అనుమానం లేకుండా కైకేయి ఈ విధంగా ప్రేరేపించడంతో, ఇంద్రుడు ప్రయోగించిన పాశాన్ని ఓ రాక్షసుడు విడిపించుకోలేనట్లుగా దశరథుడు ఆ ఉచ్చులోంచి విడిపించుకోలేక పోయాడు. కాడికి, చక్రానికి మధ్య నలిగిపోయే ఎద్దులా దశరథుడి హృదయం నలిగిపోయింది. మొహం పాలిపోయింది. దుఃఖంగా ఉన్న కళ్లతో ఏమీ చూడలేక పోయాడు. ఆ స్థితిలో అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకుని కైకేయితో ఇలా చెప్పాడు.
‘ఓ పాపాత్మురాలా! అగ్నిసాక్షిగా మంత్రాలతో సంస్కరించబడ్డ నీ చేతిని పట్టుకున్నాను. ఆ చేతిని, నా ద్వారా నీకు పుట్టిన కొడుకుని, నిన్ను కూడా విడిచిపెట్టేస్తున్నాను. దేవీ! రాత్రి వెళ్లిపోయి సూర్యోదయం అవుతోంది. ఇంతకు మునుపే సిద్ధం చేసిన అభిషేక సామగ్రితో రాముడికి పట్ట్భాషేకం చేయమని గురువులు నన్ను తప్పక తొందర పెడతారు. చెడ్డ ప్రవర్తన గలదానా! రామాభిషేకానికి ఆటంకం కలిగిస్తే నువ్వు కాని, నీ కొడుకు కాని నాకు తర్పణాలు వదలద్దు. నేను మరణించిన తర్వాత రాముడే ఆ పని చేయాలి. పూర్వం అంత ఆనందంగా ఉన్న జనాన్ని చూసిన నేను ఇప్పుడు వారు సంతోషం లేకుండా తలలు వంచి దుఃఖించడం చూడలేను’
మహాత్ముడైన దశరథుడు ఆమెతో ఇలా మాట్లాడుతూండగానే చంద్రుడు, నక్షత్రాలు గల పవిత్రమైన రాత్రి తెల్లవారింది. పాప స్వభావం గల, మాటలు నేర్చిన కైకేయి కోపంతో రాజుతో ఇలా చెప్పింది.
‘రాజా! ఏమిటిది? బాధాకరమైన, తీవ్రమైన విషపు మాటలు మాట్లాడుతున్నావు. ఆలస్యం చేయకుండా నీ కొడుకు రాముడ్ని ఇక్కడికి పిలిపించు. నా కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చి, రాముడ్ని అడవికి పంపి నాకు శత్రువులు ఎవరూ లేకుండా చేసినట్లైతే పని పూర్తి చేసిన వాడివి అవుతావు’
కొరడాతో గట్టిగా కొట్టిన ఉత్తమ జాతి గుర్రంలా రాజు కైకేయి మాటలతో పొడవబడి ఇలా చెప్పాడు.
‘్ధర్మపాశానికి కట్టుబడి పోయాను. నా బుద్ధి కూడా నశించింది. ధర్మాత్ముడు, నాకు ఇష్టుడు, పెద్దకొడుకైన రాముడ్ని చూడాలని అనుకుంటున్నాను’
సూర్యోదయం అయింది. పుణ్య నక్షత్రంతో కూడిన శుభ ముహూర్తం సమీపిస్తోంది. అప్పుడు గుణవంతుడైన వశిష్ఠుడు తన శిష్యులతో అయోధ్యలోకి ప్రవేశించాడు. వీధులన్నీ ఊడ్చి నీళ్లు చల్లి, అనేక రంగుల పువ్వులు చల్లి ఉన్నాయి. అందమైన జెండాలు అలంకరించబడి ఉన్నాయి. అనేక రకాల మాలలు కట్టారు. మనుషులంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు. దుకాణాలు, వీధులు కూడా వివిధ వస్తువులతో సమృద్ధిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా సంబరాలు జరుగుతున్నాయి. ప్రజలంతా రాముడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతటా గంధం, అగరుబత్తి సువాసనలు వ్యాపిస్తున్నాయి. సాక్షాత్తు కుబేరుడి అమరావతిలా ఉన్న అయోధ్యా నగరంలోకి ప్రవేశించిన వశిష్ఠుడు గుమిగూడి ఉన్న బ్రాహ్మణులని, శ్రేష్ఠమైన అంతఃపురాన్ని కొంత దూరం నించి చూశాడు. పట్టణ ప్రజలు, గ్రామాల నించి వచ్చిన ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు. యజ్ఞవేత్తలు, చూడగానే ఆనందం కలిగించే మంత్రి, సారధి అయిన సుమంత్రుడు ఆయనకి కనిపించారు. తనకి స్వాగతం చెప్పిన బుద్ధిమంతుడైన సుమంత్రుడితో మహాతేజశ్శాలి ఐన వశిష్ఠుడు, ఇలా చెప్పాడు.
‘నేను వచ్చినట్లు రాజుతో వెంటనే చెప్పు. రాజ్యాభిషేకం కోసం సిద్ధంగా ఉన్న నలభై రెంటి గురించి చెప్తాను. శ్రద్ధగా విను. గంగాజలంతో, సముద్ర జలాలతో నింపిన బంగారు కలశాలు, మేడి కర్రతో చేసిన భద్రపీఠం, అభిషేకం కోసం వచ్చాయి. అన్ని ధాన్యాలు, గంధాలు, వివిధ రత్నాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు, అందమైన ఎనిమిది మంది కనె్నలు, మదించిన ఏనుగు, నాలుగు గుర్రాలు కట్టిన అందమైన రథం, కత్తి, ఉత్తమమైన ధనస్సు, పల్లకి, చంద్రుడి లాంటి తెల్లటి గొడుగు, తెల్లటి వింజామరలు, బంగారు పాత్ర, బంగారు పగ్గాలతో కట్టబడిన పెద్ద మూపురం కల తెల్లని ఎద్దు; అందమైన జూలు, నాలుగు పెద్ద దంతాలు, బలంగల మంచి గుర్రం, సింహాసనం, పులి చర్మం, జ్వలించే అగ్ని, సకల వాద్య సమూహాలు, వేశ్యలు, అలంకరించుకున్న స్ర్తిలు, గురువులు, బ్రాహ్మణులు, ఆవులు, పవిత్రమైన మృగాలు, పక్షులు, శ్రేష్ఠమైన నాగరికులు, గ్రామీణులు, వివిధ శిల్పులు, వ్యాపారస్థులు, ఇంకా ప్రేమగా మాట్లాడే ప్రజలు, రాజులు రామాభిషేకం కోసం వేచి ఉన్నారు. సూర్యోదయమైన వెంటనే శుభ నక్షత్రంలో రాముడికి పట్ట్భాషేకం చేయడానికి రాజుని తొందర చెయ్యి’
మహాత్ముడైన వశిష్ఠుడు చెప్పింది విని సుమంతుడు రాజుని పొగడుతూ అంతఃపురంలోకి వెళ్లాడు. వృద్ధుడు, రాజుకి ఇష్టుడు ఐన సుమంత్రుడ్ని ద్వారపాలకులు అడ్డు పెట్టలేదు.
రాజు దగ్గరికి వెళ్లిన సుమంత్రుడు ఆయన ఉన్న పరిస్థితి తెలీక ఆనందం కలిగించే స్థుతిని చేయసాగాడు. సారథి ఐన సుమంత్రుడు రాజాంతఃపురంలో రాజుకి నమస్కరిస్తూ ఇలా చెప్పాడు.
‘స్వతహాగా ఆనందంతో ఉండే నువ్వు సూర్యోదయ సమయంలో తేజశ్శాలి ఐన సముద్రుడు ఆనందించినట్లుగా సంతోషకరమైన మనసుతో ఆనందించు. ఇలాంటి సూర్యోదయ సమయంలోనే మాతలి దేవేంద్రుడ్ని స్తుతించాడు. ఇంద్రుడు అందరు రాక్షసుల్నీ జయించాడు. ఆ విధంగానే నిన్ను నేను నిద్ర లేపుతున్నాను. తనంతట తానే పుట్టినవాడు, ప్రభువు ఐన బ్రహ్మదేవుడ్ని వేదాంగ విద్యలు మేలుకొలిపినట్లుగా నేను నిన్ను లేపుతున్నాను. సమస్య ప్రాణులని ధరించేది, మంగళకరమైనదైన భూదేవిని సూర్యచంద్రులు మేలుకొలిపినట్లుగా నేను నిన్ను మేలుకొలుపుతున్నాను. మహారాజా! ప్రకాశించే శరీరంతో మేరు పర్వతం నించి సూర్యుడు లేచినట్లు వెంటనే నిద్ర లేచి, ఉత్సవానికి తగినట్లుగా శుభకరమైన అలంకరణతో రా. నీకు సూర్యచంద్రులు, శివ కుబేరులు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు విజయాన్ని ఇచ్చెదరు గాక! రాజశ్రేష్ఠా! పవిత్రమైన రాత్రి గడిచిపోయింది. ఇంతదాకా జరిగిన పనులని పర్యవేక్షించి ఇప్పుడు పౌరులు, గ్రామస్థులు, వ్యాపారులు నమస్కరిస్తూండగా జరగాల్సిన పనులని చెయ్యి. రామాభిషేకానికి అవసరమైనవన్నీ సిద్ధం అయ్యాయి. పూజ్యుడైన వశిష్ఠుడు బ్రాహ్మణులతో కలిసి ద్వారం దగ్గర వేచి ఉన్నాడు. రాజా! రామాభిషేకం గురించి వెంటనే ఆజ్ఞాపించు. రాజు లేని రాజ్యం పాలకుడు లేని పశువుల్లా, నాయకుడు లేని సేనలా, చంద్రుడు లేని రాత్రిలా, ఎద్దులేని ఆవులా అయిపోతుంది కదా!’ (14వ సర్గ - శ్లోకాలు 11 నించి 58 దాకా)
హరిదాసు ఆ రోజు కథని ముగించాక శ్రోతల్లోని ఓ వృద్ధుడు లేచి హరిదాసుతో చెప్పాడు. ‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు రాముడే తన కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఆరు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి’
ఆశే్లషకి మూడు తప్పులే తెలుసు.
ఆ ఆరు తప్పులు ఏమిటో కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
రామాయణంలో ఇది రెండో మేలుకొలుపు. గతంలో ఎవరు ఎవరికి ఇలా
మేలుకొలుపు పలికారు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
శ్రీరామ నామం ఎందుకు తారకమంత్రం అయింది?
రా శబ్దోచ్ఛార మాత్రేణ ముఖాన్నిర్యాతి పాతకమ్
పునః ప్రవేశ భీత్యా తు మకారస్తు కవాటవత్
భావం: ‘రా-మ’ అనే రెండక్షరాల్లోని ‘రా’ అనే అక్షరం ఉచ్ఛరించగానే పాపం నోటి నించి పోతుంది. ‘మ’ అక్షరం ఉచ్ఛరించగానే నోరు మూసుకుని తిరిగి ఆ పాపం లోపలకి ప్రవేశించలేదు. రామ ఉచ్ఛారణతో పాపం తిరిగి రాకుండా పోతుందని భావం. (అందువల్ల రామ మంత్రం తారకమంత్రమైంది.)
*
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.స్వర్గలోకం నించి భూమి మీదకి పడ్డ ‘యయాతి’లా అని వాల్మీకి చెప్పిన పేరుని హరిదాసు విస్మరించాడు.
2.‘లేదా ఓ రాత్రీ! త్వరగా వెళ్లిపో. ఇంత ఆపదకి కారణమైన, దయ లేని, క్రూరురాలైన కైకేయిని చూడటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’ అని కూడా దశరథుడు వాపోయిన సంగతి హరిదాసు చెప్పలేదు.
3.మూడుసార్లు చెప్తున్నాను. పంపించు. పంపించు’ అని 14వ సర్గలోని 10వ శ్లోకంలో చివరగా కైకేయి అన్న మాటలని హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి