AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇవాళ మీకు అయోధ్యకాండలోని ఇరవైయ్యవ సర్గ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి’ హరిదాసు చెప్పి రామప్రార్థన చేసాక కథని ఇలా కొనసాగించాడు.
మరణ సమానమైన, అప్రియమైన ఆ మాటలు విని శత్రు సంహారకుడైన రాముడు ఏ మాత్రం బాధ పడకుండా కైకేయితో వశిష్ఠుడు వింటూండగా ఇలా చెప్పాడు.
‘నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. నేను రాజు మాటని మన్నించి అడవికి వెళ్లి జింక చర్మాన్ని ధరించి, జటలతో నివసిస్తాను. కాని శత్రు సంహారకుడు, ఎదిరించడానికి శక్యం కాని రాజు ఇదివరకటిలా ననె్నందుకు అభినందించడం లేదో తెలుసుకోవాలని ఉంది. దేవీ! నువ్వే మాత్రం విచారించకు. నీ ఎదుటే చెప్తున్నాను. నారచీరలు, జటలు ధరించి నేను అడవికి వెళ్తాను. సంతోషించు. నా మంచి కోరేవాడు, పూజింపతగ్గవాడు, కృతజ్ఞుడు, అన్నిటికీ మించి రాజు కూడా ఐన తండ్రి ఆజ్ఞాపిస్తే నేను ఆయనకి ఇష్టమైన పనిని చేయకుండా ఉంటానా? ననె్నవరూ ప్రేరేపించకుండానే నేనే స్వయంగా సోదరుడైన భరతుడికి సీతని, రాజ్యాన్ని, ప్రాణాన్ని, ఇష్టమైన వారిని, ధనాన్ని సంతోషంగా ఇచ్చేవాడిని. ఇక తండ్రైన దశరథుడు స్వయంగా కోరితే, నీకు ఇష్టమైన కోరికని తీర్చడానికి తండ్రి మాటని పాటించి నేను సర్వస్వాన్ని భరతుడికి ఇస్తానని ప్రత్యేకంగా చెప్పాలా? అందుచేత నువ్వు ఆయన్ని ఓదార్చు. ఇదేమిటి? మహారాజు నేల వైపు చూస్తూ మెల్లమెల్లగా కన్నీళ్లు కారుస్తున్నాడు! రాజాజ్ఞ ప్రకారం భరతుడ్ని మేనమామ ఇంటి నించి తీసుకురావడానికి వేగంగా ప్రయాణించే గుర్రాల మీద దూతలు ఇప్పుడే బయలుదేరి వెళ్లనీ! నేను మా నాన్న వరాల గురించి ఆలోచించకుండా పధ్నాలుగు సంవత్సరాలపాటు దండకారణ్యంలో నివసించడానికి వెంటనే వెళ్లిపోతాను’
రాముడి మాటలు విన్న కైకేయి అతను తప్పకుండా వెళ్తాడని నమ్మి, సంతోషించి అతన్ని తొందరపెట్టింది.
‘నువ్వు చెప్పినట్లే వినాలి. మేనమామ ఇంటి నించి భరతుడ్ని తీసుకు రావటానికి దూతలు బాగా వేగం గల గుర్రాల మీద వెళ్తారు. కాని అడవికి పోయే ఉత్సాహం గల నువ్వు ఆలస్యం చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. కాబట్టి వెంటనే అడవికి వెళ్లు. రాజు సిగ్గుతో నీతో స్వయంగా చెప్పలేకపోతున్నాడు. అది అంత ముఖ్యమైంది కాదు. ఓ రామా! దీనికి నువ్వు విచారించకు. నువ్వు ఈ పట్టణాన్ని విడిచి అడవికి పోనంత వరకూ మీ నాన్న స్నానం కాని, అగ్నికార్యం కాని, భోజనం కాని చేయడు’
ఆ మాటలు విన్న రాజు ‘్ఛ! ఎంత కష్టం వచ్చింది?’ అంటూ దుఃఖంతో మూర్ఛపోయి బంగారు ఆసనం మీద పడిపోయాడు. రాముడు ఆయన్ని లేవదీశాడు. కొరడాతో గుర్రాన్ని కొట్టినట్లు కైకేయి మళ్లీ తొందర చేయడంతో వెంటనే అడవికి వెళ్లాలని అనుకున్నాడు. భయంకరమైన ఫలితం గల ఆ దుష్టురాలి మాటలు విన్న రాముడు ఏ మాత్రం బాధ పడకుండా ఇలా చెప్పాడు.
‘దేవీ! నాకు డబ్బు ప్రధానం కాదు. లోక మర్యాదని పాటించాలని మాత్రమే కోరుతున్నాను. కేవలం ధర్మానే్న ఆచరించే నేను ఋషులతో సమానమని తెలుసుకో. పూజ్యుడైన మా నాన్నకి ఇష్టమైనది ఏదైనా చెయ్యాల్సి వస్తే అది నా ప్రాణాలు విడిచైనా చేయబడ్డట్లే అని తెలుసుకో. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞని పాలించడం మించిన ధర్మమైన పని ఇంకోటి లేదు కదా. పూజ్యుడైన నా తండ్రి చెప్పకపోయినా నీ మాట ప్రకారం పధ్నాలుగు సంవత్సరాలు నిర్మానుష్య అరణ్యంలో నివసిస్తాను. నా మీద అధికారం ఉండి కూడా నువ్వు భరతుడి రాజ్యాభిషేకం గురించి నాతో చెప్పకుండా రాజుతో చెప్పావు. దీన్నిబట్టి నీకు నా గుణాల మీద నమ్మకం లేదని గట్టిగా తెలుస్తోంది. నేను మా అమ్మకి వీడ్కోలు చెప్పి, సీతని ఊరడించి ఈ రోజే దండకారణ్యానికి వెళ్తాను. భరతుడు రాజ్యాన్ని పాలించినట్లే తండ్రికి సేవ చేసేట్లు నువ్వు చూసుకోవాలి. అది ప్రాచీన ధర్మం కదా’
రాముడి మాటలు విన్న దశరథుడు దుఃఖంతో ఏం మాట్లాడలేక పెద్దగా ఏడ్చాడు. మహా తేజశ్శాలి ఐన రాముడు మూర్ఛపోయిన తండ్రికి, దుష్టురాలైన కైకేయికి ప్రదక్షిణం చేసి వారి పాదాలకి నమస్కరించి అంతఃపురం నించి బయటకి వచ్చి తన మిత్రులని కలుసుకున్నాడు. సుమిత్ర కొడుకు లక్ష్మణుడు చాలా కోపంతో కన్నీళ్లు నిండిన కళ్లతో రాముడ్ని అనుసరించాడు.
రాముడు అభిషేక సామగ్రికి ప్రదక్షిణం చేసి, ఆ మంగళకరమైన వస్తువులని శ్రద్ధగా చూసి మెల్లగా నడిచాడు. చంద్రుడి కళని రాత్రి తగ్గించలేనట్లుగా రాజ్యవియోగం బాగా అందగాడైన రాముడి కళని తగ్గించలేక పోయింది. రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లబోతున్న రాముడి మనసులో ఎలాంటి విచారం కలగలేదు. గొప్ప మనోధైర్యం గల రాముడు ఛత్రచామరాలని వదిలి రధాన్ని, పౌరులని, మిత్రులని పంపేసి దుఃఖాన్ని మనసులోనే అణచుకుంటూ, ఇంద్రియ నిగ్రహంతో ఆ దుర్వార్త చెప్పడానికి తల్లి ఇంటికి వెళ్లాడు. పక్కన ఉన్న వాళ్లకి అందగాడు, సత్యవంతుడైన రాముడి మొహంలో ఎలాంటి మార్పూ కనపడలేదు. అధిక కాంతులు గల శరత్కాల చంద్రుడు తన సహజమైన కాంతిని ఎలా విడిచిపెట్టడో అలాగే రాముడు తనకి సహజంగా ఉండే సంతోషాన్ని విడిచిపెట్టలేదు.
ధైర్యంతో కూడిన మనసుగల, గొప్ప కీర్తివంతుడైన రాముడు అక్కడ ఉన్న జనాలని మధురమైన మాటలతో గౌరవిస్తూ తల్లి దగ్గరికి వెళ్లాడు. రాముడి గుణాల వంటి గుణాలుగల, మహా పరాక్రమశాలి, తమ్ముడు ఐన లక్ష్మణుడు మనసులోని దుఃఖాన్ని అణచుకుంటూ రాముడి వెంటే వెళ్లాడు. రాముడు వెళ్లే సమయానికి కౌసల్య భవనం అంతా గొప్ప ఆనందంతో నిండి ఉంది. అప్పుడు కూడా రాముడు వచ్చిన అడ్డంకి గురించి బాధపడలేదు. తనేమైనా బాధ పడితే అక్కడి తన వారికి ప్రాణ భయం కలగచ్చని సందేహించి ధైర్యంగా ఉన్నాడు.
(అయోధ్యకాండ సర్గ 19)
హరిదాసు ఆ రోజు చెప్పిన కథ విన్నాక ఐదుగురు శ్రోతలు ఐదు తప్పులని కనుక్కుని హరిదాసుకి చెప్పారు. ఆయన వెంటనే అయోధ్యకాండ పుస్తకం తెరిచి చదివి తన తప్పులని ఒప్పుకున్నాడు. మొదటి తప్పుని ఆశే్లష కనుక్కున్నాడు. వాటిని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
చిలుక ముందు రామ అనే పేరు ఎందుకు వచ్చింది?
*
గత వారం
‘మీకో ప్రశ్న’కి జవాబు:
భరతుడి భార్య పేరు ఏమిటి?
మాండవి
*
క్రిందటి వారం ప్రశ్నలకు సమాధానాలు:
1.దేవాలయ మార్గాలని, దేవాలయాలని రాముడు ప్రదక్షిణం చేస్తూ వెళ్లాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
2.రాముడు రెండు ప్రాకారాలని దాటడానికి మునుపు దాటింది మూడు ప్రాకారాలని. హరిదాసు ‘రెండు’ అని తప్పు చెప్పాడు.
3.రాముడు ముందు తండ్రి పాదాలకి నమస్కరించి, తర్వాత కైకేయి పాదాలకి కూడా నమస్కరించాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.రాముడు తన తండ్రిని ఏమైందని ప్రశ్నిస్తే దశరథుడు మిన్నకున్నాడు అని వాల్మీకి రాయలేదు. రాముడు కైకేయితో తప్ప విచారంలో ఉన్న తండ్రితో మాట్లాడలేదు.
5.కైకేయిని రాముడు ‘నువ్వు గర్వంతో, కోపంతో మా నాన్న మనసు బాధపడేలా ఏం అనలేదు కదా?’ అని ప్రశ్నించాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
6.‘రాముడు రెండు మాటలు చెప్పడు’ అని కైకేయితో రాముడు చెప్పాడు. హరిదాసు దీన్ని చెప్పడం మర్చిపోయాడు.
7.పనె్నండేళ్లు అరణ్యవాసం, రెండేళ్లు అజ్ఞాతవాసం చేయాలి అని కైకేయి చెప్పడం తప్పు. పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చేయాలి అని మాత్రమే చెప్పింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి