AADIVAVRAM - Others

తరగని నిధి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాము, సోము మంచి స్నేహితులు.
ఇద్దరూ తక్షశిలలో ఉన్నత విద్యనభ్యసించడానికి అక్కడికి ఎంతో దూరంలో ఉన్న కైవల్యపురం అనే రాజ్యం నుండి వచ్చారు.
రాము వాళ్లది అంత ఉన్న కుటుంబం కాదు. అయినప్పటికీ చదువే ఎంతటి వారినైనా ఉన్నతులుగా తీర్చిదిద్దుతుందని నమ్మే రాము తండ్రి ఆనందరామం కొడుకుని కష్టపడి చదివిస్తున్నాడు.
సోము వాళ్లది బాగా ఉన్న కుటుంబం. అతని తండ్రి సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ కోటానుకోట్లు గడిస్తున్నాడు.
అతను పెద్దగా చదువుకోకపోవడం వల్ల కొడుకునైనా ఉన్నత విద్యావంతుడిగా చూడాలని అభిలషిస్తూ తక్షశిలకు పంపాడు.
రాము బుద్ధిగా చదువుకుంటుండేవాడు. సోము మాత్రం అస్సలు చదివేవాడు కాదు.
‘ఇదేమిటి మనం బాగా చదువుకుంటామని మన పెద్దవాళ్లు కష్టపడి మనల్ని ఇంత దూరం పంపిస్తే నువ్వు చదువును నిర్లక్ష్యం చేయడం ఏం బాగాలేదు’ అని రాము సోముని మందిలించేవాడు.
దానికి సోము నవ్వి ‘‘చిన్నప్పటి నుండి నువ్వు అలాగే చెబుతూ వస్తున్నావు. నీ మాట, మా నాన్నగారి మాట కాదనలేక ఇప్పటి వరకు అంతగా ఆసక్తి లేకపోయినా చదువుతూ వచ్చాను. ఇక నా వల్ల కాదు. అందుకే స్నేహితులతో తక్షశిల అంతా కలియదిరుగుతూ నచ్చినది తింటూ, నచ్చిన చోటుకు స్నేహితులతో వెళుతూ కాలక్షేపం చేస్తున్నాను. ఇంకెంత మరో ఏడాది. పరీక్షలు అయిపోతాయి. నువ్వు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవు అవుతావు. నేను పరీక్ష తప్పుతాను. దాంతో మీ నాన్నగారు రాజుగారి కొలువులో నీకు ఉద్యోగం వేయిస్తారు. మా నాన్నగారు చేస్తున్న వ్యాపారం నుండి పక్కకి తప్పుకుని నాకు ఆ వ్యాపార బాధ్యతలు అప్పగిస్తారు. నేను వ్యాపారం చేస్తూ గడిస్తాను. ఇంక ఈ చదువు ఎందుకు దండగ’ అనేవాడు సోము.
రాము ఎంత పోరినా వినేవాడు కాదు.
మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది.
రాము ఆ కళాశాలకే మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడు అయ్యాడు. తర్కం, విజ్ఞానం, గణితం, లోహశాస్త్రం ఒకటేమిటి అన్నింటిలోను ఉత్తముడిగా ఉత్తీర్ణుడై కళాశాలలోని గురువులందరినీ అబ్బురపరిచాడు.
సోము మాత్రం అన్నట్లుగానే అన్నింట్లోను పరీక్ష తప్పాడు.
స్నేహితులు ఇద్దరూ తమ ఊరికి బయలుదేరారు.
ఊరికి వెళ్లగానే ఊర్లోని వారందరూ రాముకి స్వాగతం పలికారు.
అంతటి చదువు చదివిన వాడు చుట్టుపక్కల నాలుగైదు ఊళ్లలోను ఎవరూ లేరని కొనియాడారు.
రాము తండ్రి సంతోషించాడు.
సోము తండ్రి మాత్రం కొడుకు నిర్వాకానికి బాధపడ్డాడు.
‘‘అయిందేదో అయింది వ్యాపారంలోనైనా రాణిద్దువు గానీ. రోజూ నాతో వచ్చి వ్యాపారంలోని కిటుకులైనా తెలుసుకో’’ అన్నాడు.
తాను అనుకున్నట్లే అన్నీ జరుగుతుండడంతో సోము సంతోషించాడు.
సకల శాస్త్రాల్లోను ఉత్తీర్ణుడైన రాముకి తమ రాజ్యమైన కైవల్యపురం, అగర్తల, కుంతల, దేవకుద్రు వంటి రాజ్యాల నుండి వర్తమానం వచ్చింది. తమ రాజ్యంలోని కొలువులో చేరాలని ఆయా రాజ్యాల ముఖ్య కార్య నిర్వహణ అధికారులు వర్తమానాలు పంపారు.
భారీ జీతభత్యాలు ఇస్తామని కూడా ఆ వర్తమానంలో తెలిపారు.
రాము తల్లిదండ్రులు సంతోషించారు.
ఒక మంచి రోజు చూసి తమ రాజ్యమైన కైవల్యపురం రాజు గారి కొలువులో చేరాడు రాము.
సోము మాత్రం తండ్రితో కలసి వ్యాపారం చేయడం ప్రారంభించాడు.
అయితే రోజులన్ని ఒకేలా ఉండవన్నట్లు సోము తండ్రి వివిధ దేశాలకు నౌకల్లో తరలించిన ఖరీదైన సుగంధ ద్రవ్యాలు నౌకలు తుపానులో చిక్కుకుపోవడంతో పూర్తిగా నీటిపాలయ్యాయి.
ఆ దెబ్బకు సోము తండ్రి దివాళా తీశాడు.
కట్టుబట్టలు, ఉన్న ఇల్లు మాత్రమే మిగిలాయి.
ఆ దిగులుతో సోము తండ్రి గుండెపోటుతో మరణించాడు.
సోము తల్లి ఆ బాధకి పక్షవాతం వచ్చి మంచం పట్టింది.
సోము ఎప్పుడూ చూడని కష్టాలకు పూర్తిగా కుంగిపోయాడు.
ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది. తల్లికి కూడా సరైన వైద్యం చేయించలేకపోయాడు.
అటువంటి సమయంలో తన ప్రాణమిత్రుడు రాము గుర్తుకొచ్చాడు సోముకి.
ఒకరోజు ఉదయమే తల్లికి చెప్పి రాము దగ్గరకి వెళ్లాడు సోము.
సోము దీనావస్థ విని చలించిపోయాడు రాము.
స్నేహితుడిని ఎలాగైనా ఆదుకోవాలని భావించాడు.
దయామయుడైన రాజుగారి దర్శనం చేసుకుని జరిగింది అంతా అతనికి వివరించి తన స్నేహితుడికి సాయం చేయమని అర్థించాడు.
కొలువులో సమర్థుడైన ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న రాము మాటని ఏమాత్రం కొట్టివేయక రాజుగారు సోముకి చేయూతనిస్తామని అభయం ఇచ్చారు.
చదువు సంధ్యలని అశ్రద్ధ చేసిన సోముని మందలించారు.
‘‘చదువు మనిషికి వరం. చదువు సంస్కారాన్ని, సమాజంలో బతికే నైపుణ్యాన్ని కలగజేస్తుంది. డబ్బు ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. అశాశ్వతమైన డబ్బుని చూసుకుని ఎవరూ ధీమా పడరాదు. ఎవరూ కొల్లగొట్టలేని ఐశ్వర్యం చదువు. దానిని నిర్లక్ష్యం చేయలేదు కనుకనే నీ స్నేహితుడు రాము ఈనాడు ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అశాశ్వతమైన డబ్బుని నమ్ముకున్న నీవు నేడు అన్నీ పోగొట్టుకుని బికారిగా మిగిలావు. కనుక నువ్వే కాదు ఎవరైనా చదువు పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు. డబ్బు, ధనం వంటివి పోయినా చదువుంటే ఈనాడు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. మనిషికి తరిగిపోని నిధి బంగారమూ, వజ్రవైఢూర్యాలు కాదు చదువు’’ అంటూ హితవు పలికారు.
సోముకి అంత:పుర పద్దుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
అతని తల్లి వైద్యానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.
సోము స్నేహితుడు రాముని కౌగలించుకుని ఆనందబాష్పాలు రాల్చాడు.
*

-డి.ఎస్.