AADIVAVRAM - Others

మన స్పైడర్‌మ్యాన్ (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతల వల్ల వాళ్లు నలుగురి చేతా సెహభాష్ అనిపించుకుంటారు. తమకున్న నైపుణ్యంతో నలుగురినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంటారు. రికార్డులు సృష్టిస్తారు. తాము స్వయంగా కీర్తిప్రతిష్టలు సంపాదించడమే కాకుండా తమ ప్రాంతానికి కూడా ఎనలేని గుర్తింపు తెస్తుంటారు. సరిగ్గా అటువంటి కుర్రాడే తమిళనాడులో పుట్టి కర్ణాటకలో జీవిస్తున్న జ్యోతిరాజ్.
ఎలాంటి కట్టడాలనైనా ఇట్టే అధిరోహించే జ్యోతిరాజ్ విన్యాసాలు చూసే వారి గుండెలు గుబగుబలాడతాయి. ఎత్తయిన కట్టడాలు, నిట్ట నిలువు కొండలను జ్యోతిరాజ్ ఎలాంటి పరికరాలు లేకుండా ఒట్టి చేతులతోనే ఎక్కుతాడు.
అప్పటి వరకు బహుళ అంతస్తుల భవంతులు ఎక్కుతూ విన్యాసాలు చేసే జ్యోతిరాజ్ కర్ణాటకలోని చిత్రదుర్గ కోటను ఎలాంటి సాయం లేకుండా ఒట్టి చేతులతో అధిరోహించాడు. ఈ విన్యాసం కర్ణాటకలోని లోకల్ ఛానెల్స్‌లో ప్రసారం అయింది. వందలాది మంది దీనిని ప్రత్యక్షంగా తిలకించారు. అప్పటి నుండి జ్యోతిరాజ్ టాలెంట్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. యుట్యూబ్‌లో కూడా ఇది వైరల్ కావడంతో అతని పేరు దేశమంతా మార్మోగిపోయింది. అప్పటి నుండి అంతా అతన్ని జ్యోతిరాజ్ అని కాకుండా కోతిరాజు అని స్పైడర్‌మాన్ అని పిలవడం మొదలుపెట్టారు.
చిన్నప్పటి నుండి కొండలు, గుట్టలను అవలీలగా ఎక్కుతుండే జ్యోతిరాజ్ చేష్టలు చూసిన ఇంట్లో వాళ్లు అతన్ని మందలిస్తుండేవారు. అయితే ఏనాడూ జ్యోతిరాజ్ వారి మాటలను పట్టించుకోలేదు. పైగా రానురాను అతను ఎత్తులకు ఎగబాకడం అనే విద్యలో నైపుణ్యం పెంచుకుంటూ పెద్దపెద్ద బిల్డింగుల పైకి తాళ్లు, ఎటువంటి పరికరాలు లేకుండా ఎక్కడం అలవాటు చేసుకున్నాడు.
ఆ నైపుణ్యంతోనే అతను కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన 830 అడుగుల ఎత్తులో ఉండే జాగ్ జలపాతం కొండలను అధిరోహించాడు. ఆ సమయంలో కూడా అతను ఎలాంటి తాళ్లు గానీ, ఇతర సేఫ్టీ మెజర్‌మెంట్స్ గానీ వాడనేలేదు. పైగా ఈ ఫీట్ చేయడానికి అతను కష్టతరమైన విధానాన్ని అవలంబించా డు. పైనుండి హోరుమంటూ కిందకి దుమికే జలపాతంలో నుండి పైకి ఎలాంటి తాళ్లు లేకుండా ఎగబాకి చూసే వారి ఒళ్లు జలదరింపజేశాడు. అలాగే హుబ్లీలోని మూర్‌సావిర్ మఠ్ ప్రాంతంలో గల క్లాక్ టవర్‌ని కేవలం 15 నిముషాల్లో అధిరోహించాడు. ఈ విన్యాసాన్ని అతను 13 సెప్టెంబర్ 2013లో దిగ్విజయంగా పూర్తి చేశాడు.
ఎత్తులకు ఎగబాకే సమయంలో ఎలాంటి తాళ్లు గానీ, పరికరాలు గానీ ఉపయోగించని జ్యోతిరాజ్ పట్టు కోసం కేవలం మెగ్నీషియం కార్బొనేట్ పౌడర్‌ని మాత్రం కాళ్లు, చేతులకు రాసుకుంటాడు. దాని వల్ల సరైన గ్రిప్ దొరుకుతుందని అతనంటాడు. అలాగే తాను చేసే విన్యాసాలు కేవలం టూరిస్టులను ఆనందింపజేసేందుకే అని చెబుతాడు. 2014లో వచ్చిన జ్యోతీ అలియాస్ కోతిరాజా అనే కర్ణాటక చిత్రంలో కూడా అతను నటించాడు. ప్రతిరోజూ ఎత్తులకు ఎగబాకే విన్యాసాన్ని ప్రాక్టీస్ చేసే జ్యోతిరాజ్ ప్రపంచంలో ఎక్కడైనా తాను తన విన్యాసాలను చేయగలిగేలా ప్రాక్టీస్ తనని సన్నద్ధం చేస్తుందని అంటుంటాడు.
తాను చేసే విన్యాసాల్లో ఎలాంటి రహస్యం లేదని ఔత్సాహికులు ఎవరికైనా కిటుకులు చెబుతానని అంటున్నాడు. ఇప్పటికే చాలా మంది పిల్లలకు మెళకువలు బోధించాడు జ్యోతిరాజ్. ఎప్పటికైనా ప్రపంచంలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్‌ఖలీఫాని అధిరోహించడమే తన కల అని అతనంటున్నాడు. తన శిష్యులు ఆ పని చేసినా తాను సంతోషిస్తానని చెబుతున్నాడు. *

- దుర్గాప్రసాద్ సర్కార్