Others

అవునమ్మా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవునమ్మా!
నాకున్నధి నువ్విచ్చిన ఒకటే శరీరం!
దుఃఖానికి ఒకటి, ఆనందానికి ఒకటి చొప్పున
రెండు శరీరాలు ఇచ్చి వుంటే బావుండేది.
దుఃఖంతో శరీరం శుష్కించిపోయాక
అప్పుడప్పుడు దొరికిన కాసిన్ని ఆనంద క్షణాల్ని
దాచుకోవడానికైనా పనికివచ్చేది.. ఇపుడు చూడు
ఎన్ని రంగులద్దినా అతుకులబొంతగా తయారవుతోంది!

అవునమ్మా!
నాకున్నది నీవిచ్చిన తల ఒకటే..
స్వంతానికి ఒకటి, సమాజానికి మరొకటి చొప్పున
రెండు తలలు ఇచ్చి వుంటే బావుండేది..
స్వంతం సరిలేక సమాజం ముందు తలదించుకోకుండా
స్వప్రయోజనాలకోసం కాస్త లౌక్యాన్ని
ప్రదర్శించడానికి ఉపయోగపడేది.. ఇపుడు చూడు
ఉనికి లేని వట్టి మొండెం మాత్రమే పనిచేస్తోంది..
అవునమ్మా!
నేను పుట్టినపుడు నువ్విచ్చింది గుండె ఒకటే!
గెలుపుకొకటి, ఓటమికి ఒకటి చొప్పున
రెండు హృదయాలని ఇచ్చి వుంటే బావుండేది
నిజానికొకటి, అబద్ధానికి ఒకటి పంచుకుంటూ
లేని ప్రపంచాన్ని అవలీలగా సృష్టిచుకుని
బతికేందుకు పనికివచ్చేది.. ఇపుడు చూడు..
వాస్తవంలోంచి వచ్చిన సిసలైన స్వభావాన్ని
మార్చుకోలేకపోతోంది!
అవునమ్మా!
నన్ను కన్నది ఒకే ఒక్క అమ్మవు నీవే!
సంపాదనకొకటి, సంసారానికి కొకటి చొప్పున
ఇద్దరు అమ్మలు ఉండే బావుండేది అనలేను కానీ
నీకున్న ఒక్క సెలవు రోజైనా
నన్ను నీ చేతుల్లోకి తీసుకుని
నాకు అన్నం తినిపించి ఉంటే బావుండేది
అపుడు ఆయాలో అమ్మను వెదకలేక,
ఇపుడు నా మందున్న నిన్ను గుర్తించలేక
కీర్తి ముసుగులో నీ గొప్పదనాన్ని
చాటి చెబుతున్నాను కానీ
నా మెదడు ఆడపుట్టుక ఔన్నత్యాన్ని
తెలుసుకోలేకపోతోంది..!
అవునమ్మా!
నాకిపుడు నా శరీరాన్ని, మెదడును దేనికి
ఎలా, ఎపుడు వాడాలో అంతుపట్టక..
ఏది ఎపుడు పడితే అపుడు చెత్తబుట్టలా వాడేస్తున్నాను..
అమ్మాయి ఎవరో, అమ్మ ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో
నాకు నేను ఒక మరబొమ్మలా తయారయ్యాను..
రా అమ్మా..! రా..
ఒక్కసారైనా నా కోసం ‘కని’పెంచు..
నేనెవరో.. నాకు ఎవరేమవుతారో తెలియపరచు.

-శైలజామిత్ర